7, డిసెంబర్ 2014, ఆదివారం

పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావును కటాక్షించని లక్ష్మీదేవివృత్తిలో నిబద్ధత ఉన్నవారు మాత్రమే తమ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మహనీయులు ఎంతో మంది తమ తమ రంగాల్లో పూర్తిగా లీనమై వ్యక్తిగత జీవితాన్ని, డబ్బును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమ కాలంలో అయ్యో పాపం అనుకునే జీవితాన్ని గడిపారు. వృత్తిపై నిబద్ధత ఉండాల్సిందే అదే సమయంలో లక్ష్మీదేవిపై ఎంతో కొంత శ్రద్ధ చూపాల్సిందే. జీవిత కాలమంతా ఆ దేవతను నిర్లక్ష్యం చేస్తే అంతిమ సమయంలో తానేంటో చూపిస్తుంది. తొలి తరంలో హేమాహేమీలైన సినీ ఉద్దండులందరి జీవితాలు ఈ సత్యాన్ని నిరూపిస్తున్నాయి.

మీ ఆలోచనా శక్తి ఆమోఘం కావచ్చు. ఎవరికీ తెలియని లోకాలు ఎలా ఉంటాయో క్షణాల్లో ఆలోచించి ఔను ఇలానే ఉంటాయి అని కోట్లాది మందితో అనిపించే సామర్థ్యం మీకు ఉండొచ్చు. లోకాల గురించి ఆలోచించే వారు డబ్బు గురించి, దాని శక్తి సామర్థ్యాల గురించి సరిగా అంచనా వేయకపోతే నరకం ఎలా ఉంటుందో అది నీకు జీవిత చరమాంకంలో చూపిస్తుంది. డబ్బు గురించి కచ్చితత్వం లేకపోతే చివరి రోజుల్లో నిరాశ తప్పదు అని చాటి చెబుతుంది.

ఆయనకు పౌరాణిక బ్రహ్మ అని పేరు. బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆయన సినిమా దేవుళ్లను సృష్టించి పౌరాణిక బ్రహ్మగా నీరాజనాలు అందుకున్నారు కమలాకర కామేశ్వరరావు. దేవుళ్లు అంటే వల్లమాలిన భక్తి. లక్ష్మీదేవి కూడా దేవతే. కరెన్సీ రూపంలో కళ్లెదుట కనిపించే ఆ దేవతపై ఆయన ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే జీవితానికి అండగా నిలిచే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఆయనపై లేకపోవడం వల్ల అంతిమ కాలంలో ఆర్థిక ఇబ్బందులతో కన్ను మూశారు. దర్శకత్వం వహించిన సినిమాలకు దర్శకునిగా పారితోషికంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం, కొందరు నిర్మాతలు దీన్ని అలుసుగా తీసుకోవడాన్ని కొందరు ప్రస్తావించినా పట్టించుకునే వారు కాదు. ఇచ్చినంత తీసుకునే వారు ఇవ్వకపోయినా పట్టించుకునే వారు కాదు. ఈ విషయంలో అంతా ఆయన్ని ధర్మరాజు అనేవారు.

దేవుళ్లు ఇలానే ఉంటారు అని ఆయన చూపించారు. హిందీ సినిమా వాళ్లు సైతం దేవుళ్లకు ఆయన గీసిన డిజైన్‌ను అంగీకరించారు. చివరకు ఇప్పుడెప్పుడైనా ఏ సినిమాలోనైనా దేవుడు కనిపిస్తే కమలాకర కామేశ్వరరావు ముద్ర అందులో తప్పకుండా ఉంటుంది. సినిమా దేవుళ్లపై ఆయన అంత బలమైన ముద్ర వేశారు.
***
ఔను నిజం! కైలాసం ఇలానే ఉంటుంది అని మన చేత అనిపించారు. సకల లోకాలను తన మనోనేత్రంతో చూసి మన కళ్ల ముందు కనిపించేట్టు చేశారు. మూడు లోకాలను మనకు చూపిన ఆయన తనకంటూ ఒక చిన్న ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయాడు. అద్దె ఇంటిలోనే కాలం వెళ్లదీశారు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరావు. తన సినిమాల ద్వారా దేవుళ్లను ప్రజల కళ్ల ముందుకు తెచ్చిన ఆయనపై చివరి రోజుల్లో ఆ దేవుళ్లు కరుణ చూపలేదు. నిర్మాతలకు కనకవర్షం కురిపించిన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన కారు కూడా లేకుండా సామాన్య జీవితమే గడిపారు. చివరకు నిరాశతోనే మద్రాస్ నుంచి మకాం నెల్లూరుకు మార్చి చివరి రోజులు కుమారుడి ఇంట్లో గడిపారు.
***
ఓ పెద్దాయన జీవితంలో ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ నిర్మాతగా ఫిల్మ్‌నగర్‌లో ఆయనకు కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు ప్లాట్లు కేటాయించారు. నర్తనశాల, గుండమ్మ కథ లాంటి కలకాలం గుర్తుండే సినిమాలకు దర్శకత్వం వహించిన కమలాకర కామేశ్వరరావు లాంటి వారికి కనులు మూసేనాటికి సొంత ఇల్ల్లు కూడా లేదు.
జీవితం చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక సమస్యలకు తోడు ఒంటరితనం, అయిన వారు దూరం కావడం వంటివి ఆయనను కృంగదీశాయి.
కెవిరెడ్డి, కమలాకర కామేశ్వరరావు మంచి స్నేహితులు. వాహిని సంస్థలో కలిసి పని చేశారు. దర్శకత్వం వహించేందుకు ఎవరికి ముందు అవకాశం వస్తే, వారు రెండవ వారికి సహాయ దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అలా కెవిరెడ్డికి మొదట అవకాశం వస్తే కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకునిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. కెవిరెడ్డి దర్శకత్వం వహించిన భక్త పోతన, యోగివేమన, గుణసుందరి కథ, పాతాళభైరవి సినిమాలకు సహాయ సహాయ దర్శకునిగా పని చేశారు. విజయ వారు తీసిన చంద్రహారం సినిమా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఇద్దరూ సినిమాల్లో అవకాశం కోసం నిరీక్షిస్తున్నప్పుడు మద్రాసులో ఇద్దరూ తెగ సినిమాలు చూస్తూ వాటి గురించి చర్చించుకునేవారు.
డ్రీమ్‌గర్ల్ హేమమాలిని సినిమాకు పనికి రాదన్నవారున్నారు. కామేశ్వరరావు మాత్రం ఆమెలోని నటిని గుర్తించి పాండవ వనవాసం (1965)లో నృత్యం చేసే అవకాశం కల్పించారు. ఆ తరువాత ఆమె హిందీ సినిమాల్లో డ్రీమ్‌గర్ల్‌గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనూ కమలాకర కామేశ్వరరావుపై గౌరవంతో శ్రీకృష్ణ విజయం సినిమాలో నాట్యం చేసింది.

చంద్రహారం (54), తమిళంలో గుణసుందరి కథ, పెంకిపెళ్లాం (56), పాండురంగ మహత్యం (57), శోభ (58), రేచుక్క పగటి చుక్క (59), మహాకవి కాళిదాసు (60), గులేబకావళికథ, గుండమ్మకథ (62), మహామంత్రి తిమ్మరుసు (62), నర్తనశాల (63) పాండవ వనవాసం (65) శకుంతల (66) శ్రీకృష్ణ తులాభారం (66), శ్రీకృష్ణావతారం, కాంభోజరాజు కథ (67) వీరాంజనేయ, కలసిన మనుషులు (68) మాయనిమమత (70) శ్రీకృష్ణ విజయం (71) బాల భారతం (72) ఇందులో రెండు మూడు సినిమాలు మినహాయిస్తే మిగిలినవన్నీ సూపర్ హిట్టయ్యాయి. నర్తనశాల అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎస్‌విఆర్‌కు ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించి పెట్టిన సినిమా ఇది. 78నాటి వినాయక విజయం తరువాత కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం వహించినా అవి నడవలేదు. పౌరాణిక సినిమాలకు ఆయనకు ఉన్న ఇమేజ్‌ను ఉపయోగించుకుందామనే ప్రయత్నమే తప్ప ఆర్థికంగా పెద్దగా ఖర్చు పెట్టే వారు కాకపోవడం వల్ల ఆ తరువాత వచ్చిన సినిమాలు కమలాకర కామేశ్వరరావు పేరును నిలబెట్టే స్థాయిలో లేవు. అదీ కాకుండా క్రమంగా ప్రేక్షకులు పౌరాణిక సినిమాలకు దూరం అవుతున్న కాలం అది. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ నిర్మిస్తే అదే సమయంలో కృష్ణ కురుక్షేత్రం నిర్మించారు. సాంకేతిక విలువల పరంగా కురుక్షేత్రం బాగున్నా, దానవీరశూరకర్ణ డైలాగుల ముందు నిలువలేకపోయింది.
ఆయన అద్భుతమైన సినిమాలు తీసిన కాలంలో దర్శకుడే సుప్రీం. ఆ స్థానాన్ని హీరో ఆక్రమించడాన్ని చూసి జీర్ణం చేసుకోలేకపోయారు. ఆ తరువాత పౌరాణికాలకు కాలం చెల్లింది, కమలాకర కామేశ్వరరావు కాలం చేశారు.

1911లో బందరులో జన్మించిన కమలాకర కామేశ్వరరావు విద్యాభ్యాసం అక్కడే సాగింది. బిఎ ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా సినిమాలపై ఆసక్తి పెంచుకుని సాంకేతిక అంశాల గురించి అధ్యయనం చేశారు. ముట్నూరు కృష్ణారావు కృష్ణాపత్రికలో సినీఫ్యాన్ పేరుతో సినిమా సమీక్షలు రాసే వారు. ఆ పరిచయాలతోనే సినిమా రంగంలో ప్రవేశించారు.
పౌరాణికాలు మాత్రమే తీయగలరు అనే మాటకు సమాధానంగా గుండమ్మకథను చూపించారు. ఎన్నో విజయవంతమైన పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా చరిత్రలో కలకాలం గుర్తుండే సినిమాలను అందించిన ఆయన సొంత ఇళ్లు కూడా సంపాదించుకోలేకపోయారు. 1999 జూన్ ఐదవ తేదీన నెల్లూరులో తన కుమారుడి ఇంట్లో తుది శ్వాస విడిచారు. చివరి కాలంలో మూడు సినిమాలకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని సినిమాలు తీయాలని ప్రయత్నించారు. ఆ కోరిక తీరకుండానే పోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం