9, డిసెంబర్ 2014, మంగళవారం

రాజకీయ భిక్ష

రాష్ట్రం ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు కానీ పార్లమెంటులో అయినా అసెంబ్లీల్లో అయినా వారి వారి భాషల్లో మేం పాండవులం మీరు కౌరవులు అని తిట్టని పార్టీ ఉండదు. చిత్రమేమంటే పాండవులు కౌరవులు ఇద్దరూ ఒకే వంశానికి చెందిన వారు అంటే అధికార పక్షం అయినా విపక్షం అయినా అన్ని పక్షాలు కౌరవ పక్షాలే అనేది నిజం. అత్యంత పురాతనమైన వృత్తుల్లో రాజకీయం- భిక్షక వృత్తి ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయాయి. మాతా కబళం తల్లి అన్నట్టుగా మాతా, పితా ఓట్లు తల్లి ఓట్లు బాబాయ్య అని అడుక్కుంటారు అదే తేడా. రాజకీయ ఎత్తుగడల్లో చిత్తయి అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు భిక్షకులుగానే జీవించాల్సి వచ్చింది. భిక్షం అంటే ఇప్పటిలా కాదు


మా రోజుల్లో అని పెద్దలు చెప్పినట్టుగా భిక్షకులు చెప్పుకోరు కానీ పూర్వ కాలంలో భిక్షకులు అంటే అల్లాటప్పా కాదు. ఉద్యోగులు బాస్ ముందు గజగజవణికిపోయినట్టుగా భిక్షకుల ముందు ఇంటి యజమాని వణికిపోవలిసిందే. క్షణం ఆలస్యం అయినా బాస్ క్షమించడు అలానే రెండు సార్లు భవతీ భిక్షాందేహి అని పిలిస్తే పరుగు పరుగున రాకపోతే మునులు శపించేస్తారు. కాళ్లా వేళ్లా పడితే శాప విమోచన మార్గం చెబుతారు. ఇలాంటి కథలు చిన్నప్పుడు ఎన్ని చదవలేదు. సీతను అపహరించే ముందు రావణుడు కూడా భిక్షగాడిగానే వచ్చి భవతీ భిక్షాందేహి అంటూ సీత గీత దాటేట్టు చేసి అపహరిస్తాడు. అన్ని వేషాల కన్నా భిక్షక వేషం సేఫ్ అని రావణుడు ఆ కాలంలోనే గ్రహించాడు.


మీవాడు ఏం చేస్తున్నాడు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం అని ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత గర్వంగా చెబుతారో బహుశా ఆ కాలంలో మా వాడు భిక్షానికి వెళ్లాడు అని గర్వంగా చెప్పుకునే వారేమో! అయినా ఈ రోజుల్లో ఎంత గొప్ప కంపెనీలో పని చేసినా వారికి నచ్చక పోతే అదేదో రంగు కాగితం చేతిలో పెట్టి పంపించేస్తారు కానీ ఆ కాలం నాటి వారిలా శపించేంత సీన్ ఈ కాలం వారికెక్కడుంది?


అప్పుడెప్పుడో అమెరికా అధ్యక్షుడిగా క్లింటన్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భిక్షకులు కనిపించకుండా రాత్రికి రాత్రి శివార్లకు తరలించారు. కాలాన్ని బట్టి భిక్షకులు కూడా మారిపోతున్నారు. మాతా కబళం తల్లి అనే మాట పురాణాల కాలం నుంచి వినిపించిన మాటే అయినా గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఆ మాట వినిపించడం లేదు. భాగ్యనగరంలో సైతం 70-80ల కాలం వరకు ఉదయమే ఇంటింటికి మాతా కబళం బ్యాచ్ వచ్చేది. ఇప్పుడు నగదు రూపంలో తప్ప మరో రూపంలో అంగీకరించడం లేదు. ధర్మం అంతా అన్ని మతాల ప్రార్థనాలయాల వద్ద హోల్‌సేల్‌గా అమ్మేసేట్టుగా కనిపిస్తారు భిక్షకులు. హర్ ఏఖ్ మాల్ 10 రూప్యా అని అరిచినట్టుగా వీళ్లు ఒక్క రూపాయికి ధర్మం అమ్ముతామన్నట్టు అరుస్తుంటారు. ఆలయాలకు వెళితే దైవదర్శనం కన్నా ఈ ధర్మం అమ్మేవారి గోల ఎక్కువ.


ఏవో నాలుగు రాజకీయ ముచ్చట్లు చెప్పకుండా ఆదివారం పూట ఏమిటో అడ్డుక్కునే వారి గోల అంటున్నారా? అక్కడికే వస్తున్నా..
తెలుగు నాట ఈ మధ్య భిక్ష పాపులర్ వర్డ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు రాజకీయ భిక్ష అంటూ మైకులను కొరికేస్తున్నారు.
కెసిఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ భిక్ష చరిత్ర తెరపైకి వచ్చేసింది. కెసిఆర్‌కు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెడితే, బాబుకు రాజకీయ భిక్ష పెట్టింది ఇందిరమ్మ కదా? భిక్ష పెట్టిన తల్లిని అల్లుడి పార్టీ వాళ్లు విమర్శించవచ్చునా? అని కొందరు నిలదీస్తున్నారు. రాజకీయాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం భిక్ష అవుతుందా? బీరువాల్లో ఎంత డబ్బునైనా దాచుకోవచ్చు. బీరువా సైజు సరిపోక పోతే స్విస్ బ్యాంకులో దాచుకోవచ్చు. దాచిపెట్టడానికి చోటు లేదని డబ్బును దానం చేసేవాళ్లు ఎవరూ ఉండరు. అదే రాజకీయాల్లో అయితే ఒక నాయకుడు ఒక స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించాలి. తానే అన్ని నియోజక వర్గాల నుంచి పోటీ చేసి తానే మెజారిటీ సీట్లలో గెలిచి తానే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ఉంటే మన నాయకులు ఆ పనే చేసేవారు. కానీ ప్రజల అదృష్టం కొద్ది రాజకీయాల్లో అలాంటి అవకాశం లేదు. దాంతో ఇష్టం ఉన్నా లేకున్నా, కాళ్లు మొక్కేవాళ్లయినా, కాళ్లు లాగేసే వాళ్లనే అనుమానం ఉన్నా టికెట్లు పంచక తప్పదు. అలా గెలిచిన వారితోనే ప్రభుత్వం ఏర్పడుంది. ఇలాంటి తప్పని సరి తతంగం ఉంది కాబట్టే కులాల వారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా టికెట్లు ఇస్తారు. వందలాది సినిమా హాళ్లను ఒకే కుటుంబం లీజుకు తీసుకుని తమ గుప్పిట్లో పెట్టుకున్నట్టు కొన్ని వందల సీట్లు తమ చేతుల్లో పెట్టుకునే చాన్స్ లేదు. అప్పారావో, సుబ్బారావో, కోన్ కిస్కానో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాల్సిందే. కావాలంటే వారిని బానిసలుగా చూసుకోవచ్చు కానీ ముందు ఇతరులకైతే టికెట్లు ఇవ్వక తప్పదు.


ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ అయినా 294 మందిని పోటీకి నిలబెడుతుంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టక ముందైనా, పెట్టిన తరువాతైనా పోటీలో ఉండేది 294 మందే. కానీ చిత్రంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే భిక్షం అనేది రాజకీయాల్లో ప్రవేశించినట్టుగా కొందరు ఎన్టీఆర్ ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారు అంటున్నారు. అలా అనే పార్టీ అధ్యక్షునికి సైతం 78లో ఇందిరాగాంధీ కొత్తగా పెట్టిన ఇందిరా కాంగ్రెస్ పేరుతో భిక్ష పెట్టారనే విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిందే భిక్ష కానీ అల్లుడిగారిది భిక్ష కాదు ఆయన సామర్ధ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రభువులు ఓటర్లే. ప్రభువు భిక్ష పెడతాడు. ఇందిరాగాంధీ , ఎన్టీఆర్, కెసిఆర్, బాబు, వైఎస్‌ఆర్, జగన్ ఎవరైనా కావచ్చు రాజకీయాల్లో వీరికి ఓట్ల భిక్ష వేసి రాజకీయ జీవితం ప్రసాదించేది ఓటర్లే. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాయకులకు ఓటర్లు భిక్ష పెడతారు కానీ, అధినాయకులు కాదు.