31, మే 2015, ఆదివారం

కాలాన్ని జయించిన దైవాంశ సంభూతుడు

‘‘అదేదో టైమ్ మిషన్ అని ఇంగ్లీష్ నుంచి కాపీ కొట్టిన కానె్సప్ట్‌తో తెలుగులో వచ్చిన ఆదిత్య 369లో కాలాన్ని వెనక్కి మళ్లించి శ్రీకృష్ణదేవరాయలు కాలం లోకి తీసుకు వెళతారు కదా? అది నిజం కావాలని నాకు బలం గా ఉండేది. ఇన్నాళ్లకు నా కల ఫలించింది ’’
‘‘నీ పిచ్చి కాకపోతే ఎవరైనా కాలాన్ని వెనక్కి తీసుకు వెళతారా?’’


‘‘ టైమ్ మిషన్ సినిమా చూసి మాట్లాడు. అది అబద్ధం అయితే కోట్లాది మంది జనం ఎగబడి ఎందుకు చూశారు, అన్ని భాషల వాళ్లు ఎందుకు కాపీ కొట్టారు.’’
‘‘సినిమా అంటేనే  అందమైన అబద్ధం.. ఓ రెండు మూడు గంటల పాటు ప్రపంచాన్ని మరిచిపోయి హాయిగా ఊహాలోకంలో ఉండేట్టు చేసేదే సినిమా. నీ కల ఎలా నెరవేరిందో చెప్పనే లేదు. ’’
‘‘ రెండు మూడు గంటలు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు.. నువ్వు ఊహిస్తున్నది సినిమా గురించి నేను చెబుతున్నది మహానాడు గురించి’’
‘‘సినిమా సెట్టింగ్‌లా అలంకరించారని ఏకంగా సినిమా అనేస్తున్నావా?’’
‘‘పార్టీ పెట్టిందే సినిమా నటుడు అయినప్పుడు సెట్టింగ్‌ను నేనెందుకు తప్పు పడతాను...’’


‘‘నీ కల ఎలా నెరవేరిందో అది చెప్పు ముందు’’
‘‘చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్, కాంతారావుల జానపద, పౌరాణిక సినిమాలు చూసి పెరిగినోడిని. కత్తి యుద్ధాలే కాదు. యువరాజు పట్ట్భాషేకం, చదువు సంధ్యల కోసం యువరాజును గురువు వద్దకు పంపించడం వంటివి చూస్తే నా మనసు పులకించి పోతుంది. అలాంటి అపురూప దృశ్యాలు చూ శాకే రాజుల కాలంలో నేను పుట్టలేకపోతినే అని దిగులు ఉండేది. ఇన్నాళ్లకు నా కల ఫలించింది. ఆనాటి అపురూప దృశ్యాలను కనులారా తిలకించాను.’’
‘‘ఏం మాహాడుతున్నావ్! ఎంత సెట్టింగ్ అయితే మాత్రం ప్రజాస్వామ్యంలో రాజరికం కనిపించిందా? ఇలాంటి మాటలు సహించేది లేదు..’’
‘‘ముందు నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ప్రజాస్వామ్యంలో సైతం రాజరికం కనిపించినందుకు సంతోషించాను కానీ నేనేమన్నా విమర్శించానా?’’
‘‘మరేంటి ప్రపంచానికే ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించిన బాబుగారి మీటింగ్‌పై అంతేసి మాటలంటావా? నువ్వు, నేను, టోనీ బ్లేయర్ కలిసి కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దామని క్లింట న్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాబును వేడుకున్నారు తెలుసా? ’’


‘‘ఎందుకు తెలియదు. ఆ తరువాత క్లింటన్, బాబు ఇద్ద రూ మాజీలయ్యారు.. మాజీ నుంచి బాబు సగం రాజ్యానికి రాజుగా ప్రమోషన్ పొందారు. క్లింటన్‌కు ఆ భాగ్యం లేదు, కానీ ఆయనలో సగం లేడీ క్లింటన్ ఈసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతుందట కదా?’’


‘‘అపార్ధం చేసుకోకు. నేను నా అదృష్టానికి మురిసిపోతున్నాను కానీ ఎవరినీ విమర్శించడం లేదు. అజ్ఞాత వాసం నుంచి అర్భాటంగా పట్ట్భాషేకం కోసం బయటకు వచ్చిన జయలలితను చూశాక, రాజరికాన్ని చూడాలనుకున్న నా కోరిక ఫలించిందని సంతోషించాను. జలకాలాటలలో ఏమీ హాయి లే ప్రియా అంటూ యువరాణితో చెలికత్తెలు జలకాలాటలాడినట్టు జయలలిత స్నేహితురాళ్లను చూసినా, తెలుగు యువరాజును ప్రజలకు పరిచయం చేయడాన్ని చూస్తే అచ్చం మహారాజు తన దర్భారులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం గుర్తుకు రాకుండా ఉంటుందా? రెండవ తరం రాజుగారు మూడవ తరం యువరాజును పట్ట్భాషేకంతో పాటు తరువాత క్యూలో ఉన్న నాలుగవ తరం యువరాజుకు పేరు పెట్టిన తిరు నభూతో నభవిష్యత్ ..   రాజ్య ప్రజలకు  జాతి జనుల సమక్షం లో మహా సందడిగా మీ భవిష్యత్తు తరానికి కాబోయే రాజు అన్నట్టుగా అక్కడే దైవాన్ష్ అని పేరు పెట్టడం  రాజ్యంలోని సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం చూస్తే నా గుండె ఆనందంతో ఉప్పొంగింది.’’
‘‘???’’
‘‘ఏమనాలో తెలియడం లేదా? బాబుది ఐరెన్‌లెగ్ అధికారంలోకి వస్తే వర్షాలు పడవంటారు కానీ ఆయనది గోల్డెన్ హ్యాండ్ అని నా గట్టినమ్మకం’’
‘‘ తమిళం అంటావు, తెలుగు అంటావు? గోల్డెన్ హ్యాండ్ అంటావు ఏంటి నీ గోల?’’


‘‘ఎన్టీఆర్ తనను తాను దైవాంశ సంభూతునిగా భావించే వారు. అభిమానులు సైతం అలానే చూసేవారు. రాజు దైవాంశ సంభూతుడు అని హిందువుల నమ్మకం. రాజన్నాక నిర్ణీత వయసు రాగానే తన కుమారుడిని యువరాజుగా ప్రకటించడం ఆనవాయితీ. ఎన్టీఆర్ సైతం అలానే బాలకృష్ణ యువరాజు అని ప్రకటించగానే... అల్లుడు అలిగి, ఆ ప్రకటనను ఉపసంహరింపజేశారు. బాబు అదృష్టజాతకుడు కాకుంటే మరేంటి. దేవుడిచ్చిన సంతానాన్ని వద్దని ఎలా అడ్డుకుంటాం, ఏ సంఖ్యలో ఏ మహాత్ముడు పుడతాడో అని ఎన్టీఆర్ నమ్మడమే కాకుండా డజను మంది పిల్లలకు తండ్రయ్యారు. కానీ ఆ డజను మంది పిల్లలుండి అల్లుడు వారసుడైన రాజు కథ చరిత్రలో ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే బాబు అదృష్టజాతకుడు కాబట్టి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపికి, ఎన్టీఆర్ అభిష్టానికి వ్యతిరేకంగా అల్లుడు రెండో తరం వారసుడు. ఆ అల్లుడు అచ్చం రాజరికంలో యువరాజును జాతి జనులకు పరిచయం చేసినట్టు తన యువరాజ పట్ట్భాషేకం మహానాడులో జరిపించారు. అంతేనా తన మామ ఉదంతాన్ని చూసిన అల్లుడు తన కుమారుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కుమారుడి వారసుడ్ని కూడా పనిలో పనిగా మహానాడులో దేశ ప్రజలకు పరిచయం చేశాడు. నాలుగవ తరం యువరాజు దైవాంశ సంభూతుడు అని నమ్మడమే కాకుండా అదే పేరు పెట్టారు. దైవాంశ సంభూతుడు మాత్రమే రాజవుతాడు. జాతకంలో కాదు ఏకంగా పేరులోనే దైవాంశ ఉందంటే బాబుగారి విజన్‌కు తిరుగలేదని ఒప్పుకుంటావా? సినిమాలో యువరాణి వెంట చెలికత్తెలు, యువరాజు వెంటన అంజిగాడు లాంటి కామెడీ బృందం ఉన్నట్టు అచ్చం తెలుగు యువరాజుల వెంట ఎమ్మెల్యేల సంతాన బృందం తిరుగుతుంటే నాకైతే సినిమాల్లోని రాజరికాన్ని కనులారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్టుంది.’’


‘‘ చినబాబు బట్టీపట్టిన పాఠం అప్పజెప్పలేక ఇబ్బంది పడితేనేం, అదృష్టజాతకుడు తండ్రి అండ ఉండగా, యువరాజుకు, యువరాజు కుమారుడికి సైతం ఢోకా లేదనే నమ్మకం కలిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం