2, జూన్ 2015, మంగళవారం

ఎగతాళిని ఎదిరించి... ...........నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

=================
తెలంగాణ తనను తాను పాలించుకోవడం మొదలు పెట్టి ఏడాది గడిచింది. 1948లో హైదరాబాద్ రాష్ట్రం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయి, ఆంధ్రప్రదేశ్‌లో విలీ నం తరువాత ఆరున్నర దశాబ్దాల తరువాత తనను తాను పాలించుకోవడం మొదలై ఏడాది గడుస్తోంది. ఏడాదిలో ఏం సాధించారు అని ప్రశ్నిస్తే, స్వేచ్ఛగా తనను తాను పాలించుకోవడమే అన్నింటి కన్నా గొప్ప విజయం. ఈ విజయాన్ని తెలంగాణ సొంతం చేసుకుంది. ‘మీకు పాలించడం చేతకాదు, మీకు అన్నం తినడం, చెప్పులు వేసుకోడం మేమే నేర్పించాం’ అంటూ గౌరవనీయ పార్లమెంటు సభ్యుల మాటలను వౌనంగా విన్న తెలంగాణ ఏడాది కాలంలో తలెత్తుకుని నిలిచేలా తనను తాను పాలించుకుంది. అల్లాటప్పా పాలన కాదు... దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో తలెత్తుకుని నిలిచేలా మాకు రాజకీయం తెలుసు, మమ్ములను మేం పాలించుకోవడం తెలుసు అని సగర్వంగా దేశానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ తనను తాను పాలించుకుంది.


తొలుత తెలంగాణ వద్దన్నారు, తెలంగాణ ఏర్పడితే చీకటి రోజులు తప్పవని, కరెంటు ఇవ్వలేరు, జీతాలివ్వలేరు, అసలు బతకలేరు, మూడు నెలలు గడిస్తే ఆంధ్రలో కలిపేయండి అని ఉద్యమాలు వస్తాయి అని ప్రకటించిన నాయకులు సిగ్గుపడేలా.. తెలంగాణ కోసం పోరాడిన వారు తలెత్తుకునేలా తెలంగాణ పాలించుకునే సరికి ఇప్పుడు ఈ వెలుగులకు, ఈ సంతోషాలకు మేమే కారణం అని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు.


తెలంగాణ కోట్లాది మందిని ఏకం చేసిన నినాదం. ఒకటిన్నర దశాబ్దాల కాలం నుంచి ఈ నినాదం రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంది. రాజకీయాల్లో ఈ నినాదం ఎంత శక్తివంతమైందో తెలంగాణ ఉద్యమం దేశానికి చాటి చెప్పింది. తెలంగాణ ఒక శక్తివంతమైన నినాదం. తెలంగాణ ఇప్పుడు ఒక శక్తివంతమైన రాష్ట్రం. తెలంగాణ ఎంత శక్తివంతమైన రాష్టమ్రో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ఏడాది పాలనలో దేశానికి చూపించారు.
1948లో పురుడు పోసుకున్న హైదరాబాద్ రాష్ట్రం తొలి సంవత్సరమే రెవెన్యూ మిగులు రాష్ట్రంగా నిలిచింది. ఆరున్నర దశాబ్దాల తరువాత తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడగానే తొలి సంవత్సరంలోనే మిగులు బడ్జెట్ గల రాష్ట్రంగా నిలిచింది. గుజరాత్ తరువాత రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఒక శక్తివంతమైన నాయకుడు ఉన్నప్పుడే ఆ రాష్ట్రం శక్తి సామర్ధ్యాలు ఏమిటో దేశానికి తెలిసొస్తాయ. కెసిఆర్ లాంటి శక్తివంతమైన నాయకుడి వల్లనే తెలంగాణ శక్తిసామర్ధ్యాలు ఇప్పుడు దేశానికి తెలిసొస్తున్నాయి.


రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే సీజన్‌లో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భారీ హోర్డింగ్‌లు కనిపించేవి. ఎసిలు వాడకండి.. విద్యుత్ పొదుపు పాటించండి... ప్రభుత్వానికి సహకరించండి అంటూ రకరకాల నినాదాలు కనిపించేవి. రాత్రుళ్లు ఫ్లడ్ లైట్ల కాంతిలో ఈ హోర్డింగ్‌లు వెలిగిపోయేవి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎసిలపై నిషేధం విధించిన కాలం అది. తెలంగాణ ఆవిర్భవించిన వెంటనే కొత్త ప్రభుత్వం సైతం ఈ సమస్యను ఎదుర్కొంది. తెలంగాణ ప్రత్యర్థులు ఎంతో మందికి ఈ పరిస్థితి ఎన్నో ఆశలు రేకెత్తించింది. విద్యుత్ సమస్య ద్వారా తెలంగాణను అదుపులో పెట్టుకోవాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడేట్టు చేయాలని, ఉద్యమించాలని ఎన్నో కలలు కన్నారు. ముందుంది ముసళ్ల పండుగ అంటూ 2015 వేసవి సీజన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వడానికి సైతం ఆంధ్ర ప్రభుత్వం అంగీకరించలేదు. పిపిఎలను ఏకపక్షంగా రద్దు చేసింది. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ కూడా అది ట్రయల్ రన్ మాత్రమే అంటూ తెలంగాణకు వాటా ఇవ్వడానికి నిరాకరించారు. తెలంగాణను విద్యుత్ అంశం ద్వారా అణిచివేసే ఎత్తుగడలన్నీ అమలు చేశారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తెలంగాణకు కాలం కలిసి వచ్చింది. పరిస్థితులు అనుకూలించి తెలంగాణ ఏర్పడినట్టుగానే విద్యుత్ అంశంలో కూడా తెలంగాణకు పరిస్థితులు కలిసి వచ్చాయి. దేశంలో 24 గంటల పాటు విద్యుత్ పంపిణీ చేసే రాష్ట్రాల్లో ఆంధ్రను కూడా కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అలాంటి రాష్ట్రంలో సైతం విద్యుత్ కోతలు విధిస్తుండగా, తెలంగాణలో మాత్రం తెలంగాణ వాదులు సైతం ఊహించని విధంగా వేసవిలోనూ కోతలు లేకుండా విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణను ఇరకాటంలో పెట్టాలనుకున్న విద్యుత్ అంశం ద్వారానే సమర్ధవంతమైన నాయకత్వం ఉంటే తెలంగాణ ఎంత శక్తివంతమైందో కెసిఆర్ నిరూపించారు. 

మీడియాను నమ్ముకున్న వాళ్లు బషీర్‌బాగ్‌లోని విద్యుత్ కాల్పుల్లో అసువులు బాసిన అమర వీరుల స్థూపం వద్ద కూడా ధైర్యంగా తెలంగాణలో మా పాలనలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసి తెలంగాణ రైతులను ఆదుకున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజల జ్ఞాపక శక్తి అంత బలహీనంగా ఏమీ లేదు. ఆనాటి కాల్పులను అంత సులభంగా మరిచిపోరు. అలా మరిచిపోకుండా ఉండేందుకే స్మారక స్థూపాలు నిర్మిస్తారు.
మీరూ వద్దు మీ విద్యుత్ వద్దు అంటూ కెసిఆర్ ప్రకటించడం ప్రత్యర్థులకు దిమ్మతిరిగినట్టు అయింది. కెసిఆర్ అధికారంలోకి రాగానే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి అంటూ ఏమీ జరగలేదు. కానీ తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా తాత్కాలిక వ్యూహం, దీర్ఘ కాలిక వ్యూహంతో కెసిఆర్ వ్యవహరించారు. తాత్కాలికంగా విద్యుత్ కొనుగోలు చేసినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 95వేల కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో విద్యుత్ ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శక్తి యుక్తులు, వ్యూహాలు, ఎత్తుగడలు ఎలాంటివో 14ఏళ్ల ఉద్యమం నిరూపించింది. పాలకుడిగా కెసిఆర్ సామర్ధ్యాలు ఏడాది కాలంలో బయటపడ్డాయి.


పాఠ్యపుస్తకాల్లోనే కాదు పాలనలో సైతం తెలంగాణ ముద్ర కనిపిస్తోంది. తెలంగాణ వైతాళికులను స్మరించుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొదటి నెలలోనే రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు కెసిఆర్ అభివృద్ధిలో తనతో పోటీ పడాలని చంద్రబాబు సవాల్ చేశారు. మరో ఆరేడు నెలలు గడిచిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ సంపన్న రాష్ట్రం, ఆర్టీసి ఉద్యోగుల వేతనాలు ఆ రాష్ట్రంలా పెంచలేమని ప్రకటించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.


మీడియా ప్రచారం ఎలా ఉన్నా ప్రత్యర్థుల రాజకీయ విమర్శలు ఎన్నున్నా ప్రాధాన్యతా అంశాలను ఎంపిక చేసుకోవడంలో కెసిఆర్ వ్యూహాత్మకంగా వెళుతున్నారు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌ను జాగ్రత్తగా చూసుకోవలసిన ఆవశ్యకతను బాగా గుర్తించారు. శాంతిభద్రతలు, పరిశుభ్రత, హైదరాబాద్ అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళికలు అమలు జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆరు దశాబ్దాలు పాలించిన ఇరు పార్టీలు ఏడాది పాలించిన పార్టీని ఏం చేశారని నిలదీస్తున్నాయ.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణ సాధన కోసం అనేక ప్రణాళికలు ప్రకటించారు. పోరాడి సాధించిన తెలంగాణ యోధునిగా ఈ ప్రణాళికలు అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. మీడియా, విపక్షాల విమర్శలు, అనుమానాలు ఎన్నున్నా ప్రజలకు కెసిఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంది.


కెసిఆర్ ప్రజల నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వాలి, తాను ప్రకటించిన పథకాల అమలుకు నడుం బిగించాలి కానీ రోజూ ఉదయం టీవిల్లో కనిపించే రిటైర్డ్ మేధావుల చర్చకో, మీడియాలో వార్తలకో కాదు. ఈ సామాన్యులు తమ అభిప్రాయం చెప్పడానికి టీవిల్లో కనిపించక పోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు మద్దతు ఇచ్చి చూపిస్తారు. రైట్ సోదరులు విమానాన్ని ఆవిష్కరించే ప్రయోగం గురించి ప్రకటించినప్పుడు ఇది అసాధ్యం, గాలి కన్నా బరువైన యంత్రం గాలిలో ఎగరడం అసాధ్యం అంటూ న్యూయార్క్ టైమ్స్ 1903లో సంపాదకీయం రాసింది. అది ప్రపంచ ప్రఖ్యాత పత్రిక. అంత గొప్ప పత్రిక రాసింది తప్పా ? రైట్ సోదరులది తప్పా? అంటే ఇద్దరిదీ రైటే. న్యూయార్క్ టైమ్స్ సంపాదకుడికి చక్కని భాషా నైపుణ్యం ఉంది. సంపాదకుడిగా అనుభవం ఉంది. సంపాదకీయం రాయడం ఆయన డ్యూటీ. ఆయన తన పని తాను చేశారు. రైట్ సోదరులకు సంపాదకీయం రాయడం రాదు, కానీ తాము చేసే విమాన ప్రయోగంపై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే సంపాదకీయం చదివిన తరువాత తమ పరిశోధనను ఆపలేదు. చివరకు విమానాన్ని కనుగొన్నారు. కెసిఆర్‌కు సైతం తన పథకాలపై అంతటి విశ్వాసం ఉంది, ఆయన్ని గెలిపించిన వారికీ ఆ విశ్వాసం ఉంది. కెసిఆర్ తాను ప్రకటించిన పథకాలను కార్యరూపంలోకి తీసుకు రావడంపైనే దృష్టిసారించాలి కానీ విమర్శలపై కాదు.


ఏడాది కాలంలో మిషన్ కాకతీయ, ఇంటింటికి తాగునీరు వంటి అద్భుత పథకాలకు రూపకల్పన చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రకటించిన ప్రణాళికలు అమలు చేయాలి. తెలంగాణలోని పరిశ్రమలన్నీ తరలిపోతాయని, మిగిలిన పరిశ్రమలు విద్యుత్ లేక మూతపడతాయని, 19లక్షల బోర్లు తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వలేరని, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోతుందని భయంకరమైన ప్రచారం చేశారు. తాము చేసిన ప్రచారం తప్పని ప్రచారం చేసిన వారే గ్రహించేందుకు ఏడాది కాలం పట్టింది. పరిశ్రమలు తరలిపోయే మాట అటుంచి చివరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సైతం ఆంధ్ర రాజధానికి తరలిపోవడానికి ఇష్టపడడం లేదు.
ఇక మాటలు చాలు చేతల్లో చూపిద్దాం అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అంతిమంగా ప్రజలు చూసేది ఏం చెప్పారు? ఏం చేశారు అనే చూస్తారు. ఎవరు ఎంత బాగా తిట్టారు, ఎవరు తిట్టించారు అనేది ప్రజలకు అవసరం లేదు. 


తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్లు అప్పటి నుంచే చివరకు కెసిఆర్ ఆరోగ్యంపై సైతం ప్రచారం మొదలు పెట్టారు. 14 ఏళ్ల ఉద్యమం ముగిశాక, అధికారంలోకి వచ్చాక తిరిగి అదే ప్రచారం. ఇలా ప్రచారం చేసిన వారు నిరాశా నిస్పృహలతో ఆరోగ్యం పాడు చేసుకుంటే అది వారిష్టం. కెసిఆర్ కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చడంపైనే దృష్టిసారించాలి. తప్పటడుగుల దశ దాటిపోయింది. ఇప్పుడు వేగంగా పరిగెత్తాలి. తన కోసం కాదు తనపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజల కోసం.-- 
 • - బుద్దా మురళి

 • 02/06/2015
 • 9 కామెంట్‌లు:

  1. "తెలంగాణము దక్షిణ పాకిస్తానము" అని పిచ్చి కూతలు రాసిన "కరుణశ్రీ" నుండి మొదలు పెడితే "ఎన్టీఆర్ రాక ముందు హైదరాబాదులో అందరూ పొద్దు కూకాక లేచేవారు" అని అవాకులు చెవాకులు పేలిన చంద్రబాబు నాయుడు వరకు ఎందరో ఎగతాళి చేసారు.

   తెలంగాణా రైతులకు వ్యయసాయం మేము నేర్పితేనే వచ్చిందని చంద్రలత అనే ఆమె రాసిన పుస్తకానికి అమెరికాలో ఉండే ఆవిడ కులస్తుల సంఘం తగుదునమ్మా అంటూ బహుమతి ఇచ్చింది. తెలంగాణా వస్తే మా వాళ్ళని తరిమేస్తారని నన్నపనేని మొసలి కన్నీళ్లు కాల్చింది.

   "జిల్లాకు ఒక రాష్ట్రం ఇవ్వాలా" అని రాయపాటి వెకిలి ప్రశ్నలకు, "తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను పో" అని బెదిరించిన కిరణ్ కుమార్ రెడ్డికి, తెలంగాణా లిఫ్టు ఇరిగేషన్ పథకాలకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందని దెప్పి పొడిచిన జోక్సత్తా స్వయం ప్రకటిత మేధావి తలతిక్క వాదనలకు, ఇంకా ఇలాంటి లక్షలాది చిల్లర వెధవల లత్కోర్ మాటలకు చెంపపెట్టు తెలంగాణా అవతరణ.

   Jai Telangana

   రిప్లయితొలగించు
   రిప్లయిలు
   1. జై గొట్టిముక్కల గారు స్పందిన్చినదుకు ధన్యవాదాలు .. కరుణ శ్రీ అలా అన్న మాటల గురించి వివరంగా ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా ?

    తొలగించు
   2. > "తెలంగాణము దక్షిణ పాకిస్తానము" అని పిచ్చి కూతలు రాసిన "కరుణశ్రీ" ........

    విద్వేషాలను రగుల్కొల్పేందుకూ రెచ్చగొట్టేందుకూ తప్ప ఈ మాటలన్నీ తవ్వుకోవటం వలన ప్రయోజనం ఉన్నదని అనుకోను.

    మాటవరసకు చెబుతున్నాను. డెబ్బదియవదశకం మొదట్లో వచ్చాను హైదరాబాదుకు ఉద్యోగకారణాల వలన. అప్పట్లో ఇక్కడ ఎవర్ని పలకరించినా హిందీయో ఉర్దూనో లేదా వీటి కలగలుపూ ఐన భాషలో తప్ప తెలుగులో జవాబిచ్చేవారు కనిపించటం అరుదుగానే ఉండేది. ఇప్పటికీ మనం తెలుగులో ప్రయత్నిస్తే హిందీలో జవాబిచ్చే వారి సంఖ్యయే హెచ్చుగా ఉన్న పరిస్థితి ఉన్నది -ఆటోవాలాలూ, పనివాళ్ళూ వగైరా అనేక వర్గాల్లో. కరుణశ్రీగారు ఏ కాలంలో ఏ సందర్భంలో అలాగు అన్నారో కాని ఆనాడు హైదరాబాదులో తెలుగు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అలాగు అన్నారేమో. ఇప్పుడు ఆ మాటలన్నీ 'పిచ్చికూతలు' అనటం అంత బాగా లేదు.

    మొన్ననే ఆంధ్రావాళ్ళు బిర్యానీ వండితే పేడలాగా ఉంటుందని వెక్కిరించింది సాక్షాత్తూ కేసీయార్ మహానుభావుడే. అసలు ఆంధ్రావాళ్ళకు బిర్యానీ వండే అవసరం ఏమిటీ హాయిగా పులిహోర చేసుకుంటారు కదా? అదటుంచి కేసీఆర్ అన్నది 'పిచ్చికూత' అని నేను అనవచ్చు కదా? పదే పదే ఆ మాట మననం చేసుకొని ఆయనను ద్వేషించవచును కదా?

    అందుకే చెబుతున్నది, తవ్వుకుని విద్వేషాలను ఇష్టపూర్వకంగా పెంచిపోషిద్దా మనుకుంటే తప్ప అటువంటి మాటలను పనిగట్టుకొని వల్లించుకోవటం వలన మరేమీ ప్రయోజనం లేదు. ఉభయపక్షాలవారూ ఈ సంగతి గుర్తుంచుకోవాలి. ఈ మాటలు చర్చ కోసం చెప్పలేదు. నచ్చకపోతే వదిలెయ్యండి.

    తొలగించు
   3. మీరు 70 లో వచ్చారేమో కాని నేను పుట్టిందే ఇక్కడ .. పైగా 70-80% ముస్లిములు ఉండే ప్రాంతం బోలక్ పూర్ లో బిసినెస్ ఉండేది .. ముస్లిం లతోనే ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చేది .. అక్కడే ఎక్కువ కాలం ఉన్నాను .. తెలుగు వారే కాదు అక్కడి ముస్లిములు కుడా చక్కగా తెలుగులో మాట్లాడతారు .. మిరెంతో మొదటి నుంచి తెలుసు ... మీతో వాదించే ఉద్దేశం లేదు కాని .. ఇటివల ఎదురైనా ఇలాంటి విమర్శనే ప్రస్తావిస్తా ?

    నేను ఇంటర్ చదువుకునేప్పుడు నేను చదివిన ఉపవాచకం రాసిన రచయిత ఒకరు ఈ మధ్య తెలంగాణ ఉర్దూకు ప్రాదాన్యత ఇస్తున్నారు అంటూ ఇంకా ఇలానే ఏవేవో రాశారు .. అయన ఏదో సందర్భం లో వ్యాసం గురంచి అభిప్రాయం అడిగితే
    3, 4 పాయింట్స్ చెప్పాను .. సహజంగా తెలంగాణా పై ఉండే వ్యతిరేకత వల్ల రాశారు తప్ప విషయం లేదు అన్నాను
    బాష కోసమే పోరాడి తెలుగు రాష్ట్రం సాధించుకొని 60 ఏళ్ళు అయింది తెలుగు అధికార బాషగా అమలు ఎంత బాగుందో మిరే చెప్పాలి
    ఇక తెలంగాణాలో తెలుగులో మాట్లాడితే 1945-6 లో అవహేళన చేశారు అని రాశారు
    45 సంగతి సరే సమైఖ్య రాష్ట్రం లో క్రితం మేం తెలుగులో మాట్లాడి తప్పు చేశాం క్షమించండి అని మేడలో మూర్చ రోగులకు వేసినట్టు బోర్డు తగిల్న్చి విద్యార్థులను ఎండలో నిలబెట్టిన ఫోటోలు పత్రికల్లో వచ్చాయి .. దినికేమంటారు అని అడిగాను
    ఇక తెలంగాణాలో ఉర్దూ వవెలిగి పోతుంది అని కంగారు పడుతున్నారు
    అడిగినంత జీతం ఇస్తాను అంటే ఉర్దూలో రాసే వాళ్ళు లేక చివరకు సియాసత్ లాంటి పత్రికలో తెలుగు వాళ్ళు పని చేస్తున్నారు వీళ్ళు తెలుగు లేదా ఇంగ్లిష్ లో రాస్తే అక్కడున్న సుబ ఎడిటర్ ఉర్డులోకి అనువాదం చేసుకుంటారు
    దాదాపు 15 సంవత్సరాల నుంచి గతం లో అసదుద్దీన్ , తరువాత అక్బరుద్దిన్ అసెంబ్లీ లో ఉర్దూ ట్రాన్స్ లెటర్ లేదు అని చెబుతూనే ఉంటారు
    ఏదో ఉర్దూకు ప్రాదాన్యం అని జివో ఇస్తారు దాన గురించి పట్టించుకోరు కంగారు పడకండి అని చెప్పాను .. బాబు గారు ఇదే విధంగా దాదాపు 15 ఏళ్ళ క్రితం ఉర్దూకు 12-14 జిల్లాల్లో ప్రాధాన్యత అని ఏదో జివో ఇచ్చారు ... ఇప్పటి వరకు కనీసం ఉర్దూ టైప్ మిషన్ లు కుడా కొనలేదు .. ( ఇది సభలో సభ్యులు చెప్పిందే ) ఈ లోపు చివరకు టైప్ మిషన్ ల తయారీ కుడా నిలిపి వేశారు
    నేను చెప్పొచ్చేదేమిటంటే ఏదో అయిపోతుందని కంగారు పడకండి

    తొలగించు
   4. పెద్దలు శ్యామలీయం మాస్టారు & మిత్రులు మురళి గారు ప్రస్తావించిన విషయాలలో అనేక కోణాలు ఉన్నాయి. వీటిని విడివిడిగా చూద్దాం.

    ముందు ఉర్దూ/హిందీ. హైదరాబాద్ నగరంలోనే కాదు దేశంలో అనేక ప్రాంతాలలో ఈ భాషకు పెద్ద పీట ఉన్న మాట వాస్తవం. అంతెందుకు కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం పెట్టాలని టీడీపీ నాయకులే డిమాండ్ చేస్తున్నారు.

    Ignoring the lingua franca or imposing the "state language" by force leads to disastrous consequences whether in Bombay, Hyderabad, Bangalore or Cuddappah.

    భాషా ప్రాయుక్తం పేరుతొ చెలరేగిన అరాచకంలో ఉర్దూ & ఇతర మైనారిటీ భాషల పరిస్తితి కడు దయనీయంగా మారింది. ఇంతకీ తెలంగాణాలో తెలుగు మాతృభాష అయిన వారి సంఖ్య 60% మించదు.

    ఇక కరుణశ్రీ. ఆయన "తెలంగాణము దక్షిణ పాకిస్తానము" అంటూ రాసిన పద్యం 1969 ఉద్యమానికి స్పందిస్తూ రాసిందే. దీన్ని ఖండిస్తూ కాళోజీ పద్యం కూడా రాసారు. లింకులు ఇంకా ఉన్నాయో లేవో వెతుకుతాను.

    ఇక నిజాం రాష్ట్రంలో తెలుగును అవహేళన చేసారన్న ఆరోపణకొస్తే దీంట్లో పెద్దగా పస లేదు. దీనికి సురవరం ప్రతాప్ రెడ్డి తదితురులు జవాబ్ ఇచ్చారు.

    "సమైక్యవాదులు" చూపించే ఒకేఒక్క ఆధారం వివేక్ వర్ధిని కాలేజీ సంఘటన. సమావేశం ఏర్పాటు చేసింది మరాఠీ పరిషద్ అన్న విషయాన్ని దాచిపెట్టి తెలుగుకు ఏమో జరిగిపోయిందని గగ్గోలు పెట్టే వారు నిజాం ఆంద్ర మహాసభకు సంఘీభావం తెలుపడానికి వచ్చిన ఇతర భాషీయులకు చేసిన అవమానాన్ని ఎందుకో ప్రస్తావించరు!

    మాస్టారు ఉటంకించిన కెసిఆర్ వ్యాఖ్యను నేను సమర్తించక పోయినా ఒకసారి కాంటెక్స్ట్ చూడాల్సిన అవసరం ఉంది కనుక ఆయన మాటలను కింద ఉంచుతున్నాను.

    ये आंध्रा वाले बोलते अपनेको तहजीब नहीं है. अपना तहजीब शेरवानी बिरयानी का है, दुनिया भर में मसहूर है. आंध्रा वालोंका बिरयानी कभी देखे, गोबर की तारा रहता.

    In other words, this is a retort to an alleged criticism of Telangana culture. The only objectionable part is गोबर, perhaps he should have said आंध्रा वालोंका बिरयानी कभी देखे, अपन खाईच नहीं सकते

    తొలగించు
   5. జైగారు, "కెసిఆర్ వ్యాఖ్యను నేను సమర్థించక పోయినా ఒకసారి కాంటెక్స్ట్ చూడాల్సిన అవసరం ఉంది" అన్నారు మీరు. చెడ్డమాట చెడ్డమాటే! మళ్ళా ఏదో contextలో అది సమంజసం ఎలా అవుతుందో అర్థం కాలేదు. నాకు నాగరిలిపి చదవటం అంతబాగా రాదు. అక్షరాలు కూడబలుక్కోవాలి - నా వల్లకాదు. పోనివ్వండి. దాని గురించి మాట్లాడుకోవలసిందీ మాట్లాడి నిర్థారణలు చేయవలసిందీ ఏమీ లేదు. అందరూ సంయమనంతో మాట్లాడితే ఇబ్బందులు ఉండవు. మన ప్రయత్నం మనం చేదాం.

    తొలగించు
  2. చక్కని విశ్లేషణతో వ్రాసిన మంచి వ్యాసం ! అభినందనలు !

   రిప్లయితొలగించు
  3. చాలా మంచి విశ్లేషణ .

   తప్పటడుగుల దశ దాటిపోయింది. ఇప్పుడు వేగంగా పరిగెత్తాలి. తన కోసం కాదు తనపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజల కోసం.--

   సరి ఐన మాట .

   జై తెలంగాణా !

   वक्त और मोका मिलने से दिखायेंगे हमारी ताकत! और दिखाया भी !

   జిలేబి

   రిప్లయితొలగించు

  మీ అభిప్రాయానికి స్వాగతం