9, జులై 2015, గురువారం

తెలంగాణా ,ఆంధ్ర రాష్ట్రాల్లో రాజకీయ పునరేకీకరణ

 

రెండు రాష్ట్రాల్లో 2019 ఎన్నికలే లక్ష్యంగా వేగంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతోంది. ఆంధ్రలో అయినా తెలంగాణలో నైనా ప్రధాన పార్టీలు రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇష్టం ఉన్నా లేకున్నా నాయకులు రెండింటిలో ఏదో ఒక శిబిరంలో తలదాచుకోవడానికి తహతహలాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో ప్రారంభమయి, విభజన సమయంలో ఆంధ్రలో ఊపందుకుని ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తుల పునరేకీకరణ సాగుతోంది. నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించాల్సి వచ్చిందని 95లో చంద్రబాబు చెప్పినా, పదవుల కోసం పార్టీ మారలేదు, బంగారు తెలంగాణ కోసమే పార్టీ మారాను అని తాజాగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ చెప్పినా, తెలంగాణ కోసమే టిడిపి నుంచి బయటకు వచ్చాను అని కెసిఆర్ చెప్పినా వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు తెలుసు. నాయకులు తమ భవిష్యత్తు పట్ల తీవ్రంగా మదన పడుతున్నారు, కొత్త దారులు చూసుకుంటున్నారనేది మాత్రం వాస్తవం.
ఉభయ రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పక్షాల్లోని నాయకులందరిదీ అధికార రాజకీయాలే తప్ప సిద్ధాంతాలు అంటూ పెద్దగా ఏమీ ఉండవు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టిడిపి అని చెప్పుకుంటారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది నాయకులు హఠాత్తుగా టిడిపిలో చేరి పోయి మంత్రివర్గంలో, పార్లమెంటులో టిడిపి నాయకులుగా బ్రహ్మాండగా జీవించేస్తున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు మారిపోయాయా? లేక టిడిపి తన సిద్ధాంతాలు మార్చుకుందా? సిద్ధాంతాలే ప్రాణం అని నటించే నాయకులు అంత హఠాత్తుగా కొత్త పాత్రలో ఎలా లీనమయ్యారు. పార్టీ వారిని ఎలా స్వీకరించింది, ప్రజలు ఎలా అమోదించారు. సిద్ధాంతాల గురించి ప్రధాన రాజకీయ పక్షాలు ఎంత గొప్పగా చెప్పుకున్నా అధికారమే ఈ పార్టీల సిద్ధాంతం అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. గంటా శ్రీనివాస్ లాంటి టిడిపి నాయకులు ఒక వెలుగు వెలుగుతున్నారు. వైఎస్‌ఆర్ హయాంలో మంత్రి, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రి, ఆ తరువాత ఇప్పుడు మళ్లీ టిడిపిలో మంత్రి.
ఎన్నికలకు ముందు ఆంధ్రలో నాయకులు భవిష్యత్తు రాజకీయ చిత్రపటాన్ని సరిగానే ఊహించారు. దుస్తులు మార్చినంత ఈజీగా పార్టీ మార్చడానికి మొహమాటం అడ్డు వచ్చి ఉండిపోయారు. ఏడాది గడిచిన తరువాత క్రమంగా వారు మారిన రాజకీయాలకు అలవాటు పడ్డారు. భవిష్యత్తును చూసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి తరువాత అధికార కేంద్రం. పిసిసి అధ్యక్షులే పార్టీలు మారుతున్నారు అంటే మారిన రాజకీయాలను సరిగానే అర్ధం చేసుకున్నారు.
ఆంధ్రలో రాజకీయ ముఖ చిత్రం స్పష్టంగానే ఉంది. టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్. భవిష్యత్తు రాజకీయాలు సైతం ఈ రెండు పార్టీల మధ్యనే సాగుతాయి. ప్రస్తుత ఆంధ్ర శాసన సభలో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా లేదు. వచ్చే ఎన్నికలు మహా అయితే బలమైన నాయకులు కొందర గెలుస్తారేమో కానీ అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు అవకాశం మాత్రం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుత రాజకీయ పరిస్థితిని బట్టి చూస్తే మరో పదేళ్లవరకు టిఆర్‌ఎస్‌కు ఎదురులేదనే వాతావరణం నెలకొంది. అయితే ఆంధ్రలో టిడిపి వర్సెస్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంటే, తెలంగాణలో టిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే రాజకీయ ముఖ చిత్రం ఉంటుందా? ఎన్నికల నాటికి టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కొత్త పార్టీ రూపంలో ముందుకు వస్తాయా? అనేది కాలం తేల్చాలి.
ఆంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంటే, తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ మధ్య పోటీ ఉంటోంది. ప్రచారంలో టిడిపి హడావుడి కనిపిస్తున్నా, అది రోజు రోజుకు క్షీణించే పార్టీనే తప్ప టిఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. విభజన తరువాత ఆంధ్రలో బిజెపి విస్తరిస్తుందనే ఊహాగానాలు సాగాయి. బిజెపిపై అలా ఆశలు పెట్టుకున్న వారు ఏడాది పాలన తరువాత ఆశలను వదులుకున్నారు. అలాంటి వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. వట్టి వసంతకుమార్‌తో పాటు పలువురు నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలంటే అయితే టిడిపి లేదంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఆంధ్ర రాజకీయాలు ఉన్నాయి. విభజన తరువాత కొందరు కాంగ్రెస్ నాయకులు నిర్మొహమాటంగా టిడిపిలో చేరిపోగా, విభజన షాక్ నుంచి తేరుకోలేని వారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోనే కొనసాగినా అలాంటి వారు ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నాయకులంతా ఆంధ్రలో ఆ రెండు పార్టీల మధ్యనే సర్దుకోక తప్పదు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే టిడిపి ఎంత హడావుడి చేసినా తెలంగాణ ప్రజల దృష్టిలో అది ఆంధ్ర పార్టీనే. సెక్షన్8 అమలు చేయాలని ఆంధ్ర నాయకులతో సమానంగా తెలంగాణ టిడిపి నాయకులు డిమాండ్ చేయగలరు. రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తారు. ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఆంధ్ర యాజమాన్యంలోని ఒక కంపెనీగానే టిడిపిని నిర్వహిస్తారు. వ్యయాన్ని భరించే కంపెనీ యాజమాన్యం చెప్పినట్టుగానే సిబ్బంది వ్యవహరించాలి. అది అనివార్యం. టిటిడిపి నాయకులకు మరో గత్యంతరం లేదు. నిధుల కొరత లేదు. పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేయగలరు, కానీ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చేసే వ్యయంతో తెలంగాణలో పార్టీ పట్టుసాధించే అవకాశాలు లేవు. సొంతంగా వ్యయాన్ని భరించి, సొంతంగా పార్టీని నడిపించుకునే నాయకత్వం తెలుగుదేశం తెలంగాణ నాయకుల్లో లేదు. చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వరు.
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. గ్రామ స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన నాయకులున్నారు. పది జిల్లాల తెలంగాణలో కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి పీఠం చేపట్టే సామర్ధ్యం మాకుంది అని చెప్పుకొగల స్థాయి నాయకులు ఇరవై మందైనా ఉంటారు. అదే ఆ పార్టీ పాలిట శాపం. పెళ్లికెళ్లినా, చివరకు అయ్యప్ప దీక్షల్లోనైనా కాంగ్రెస్ నాయకులు కొట్టుకోకుండా ఉండలేరు. ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు, పిసిసి అధ్యక్షుడు, సిఎల్‌పి నాయకుడు ఎవరున్నా గొడవలు లేని కాంగ్రెస్ సమావేశాన్ని ఊహించలేం. ఒకవైపు టిఆర్‌ఎస్ దూసుకెళుతూ, గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ కీచులాటలతోనే కాలం గడుపుతోంది.
ఎన్నికల వ్యయాన్ని భరించడమే కాకుండా జనాకర్షణ గల నాయకుడిగా వైఎస్‌ఆర్‌కున్న గుర్తింపు వల్ల ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆయన నాయకత్వం వహించగలిగారు. ఆ తరువాత కాంగ్రెస్‌కు బలమైన జనాకర్షణ గల నాయకుడే కరువయ్యారు. కెసిఆర్ విపరీతమైన తప్పులు చేస్తూ పోతే తప్ప కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండదు. కెసిఆర్ కాంగ్రెస్‌కు అలాంటి చాన్స్ ఇవ్వరు. ఈ వాతావరణాన్ని చూసిన తరువాతనే సోనియాగాంధీకి సన్నిహితుడైన డి శ్రీనివాస్‌లాంటి వారు టిఆర్‌ఎస్ బాట పట్టారు. డి శ్రీనివాస్ వయసు 63 ఏళ్లు. ఇంకో పదేళ్ల వరకు టిఆర్‌ఎస్‌కు ఢోకా లేదు అనుకుంటే అప్పటికి ఆయన వయసు 73 అవుతుంది. ఆ వయసు వరకు ఆయనేం పోరాడతారు. పోరాడినా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? వచ్చినా? ఆయనకు కాంగ్రెస్‌లో అవకాశాలు ఉంటాయా? అన్నీ సందేహాలే. ఇవన్నీ ఆలోచించే ఆయన ఎంతో ఆదరించిన కాంగ్రెస్‌కు భారమైన మనస్సుతో గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కోణంలోనే పలువురు నాయకులు ఆలోచనలో పడ్డారు.
విభజనతో ఆంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయి, నాయకులు నిరుద్యోగులుగా మారినట్టే. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే తెలంగాణలో టిడిపి నాయకులు పలువురు నిరుద్యోగులుగా మారారు. ఆ కాలంలో కెసిఆర్ పార్టీలో మా కన్నా జూనియర్. మేం పార్టీ మారి జూనియర్ నాయకత్వంలో పని చేయాలా? అనుకున్న చాలా మంది నాయకులు ఎటూ తేల్చుకోలేక రాజకీయ జీవితానే్న ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. దేవేందర్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి లాంటి వారు ఇలాంటి సందేహాలతోనే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేక రాజకీయాల్లో బాగా వెనకబడి పోయారు. కాంగ్రెస్ మరింతగా బలహీనపడినా, కెసిఆర్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా, రెడ్ల నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరిగే అవకాశం ఉంది. ఓటుకు నోటులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన రేవంత్‌రెడ్డి తెలంగాణలో రెడ్డి కమ్మలు ఏకమవుతారని, తాను నాయకత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా కమ్మ, రెడ్ల మధ్య రాజకీయ పోరు సాగింది. ఈ పోటీ అమెరికా వరకు విస్తరించింది. కాంగ్రెస్ రెడ్లకు ప్రాతినిధ్యం వహిస్తే, టిడిపి కమ్మ వారికి ప్రాతినిధ్యం వహించింది. నాయకులు ఒప్పుకోరు కానీ ఇది వాస్తవం. ఆంధ్రలో రెడ్లకు ( వైఎస్‌ఆర్ కాంగ్రెస్) వ్యతిరేకంగా, కమ్మలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తెలంగాణకు వచ్చే సరికి రెడ్లు అధికారంలోకి రావడానికి ఎందుకు సహకరిస్తారు? బాబు సహకరించక పోతే వచ్చే ఎన్నికల నాటికి అన్ని పార్టీల్లోని రెడ్లు బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉండి ఉండవచ్చు. ముఖ్యమంత్రి పదవి నా లక్ష్యం. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి టిడిపి ఒక పని ముట్టు, నాకు నా లక్ష్యం ముఖ్యం. తప్ప పార్టీ కాదు అని రేవంత్‌రెడ్డి అసెంబ్లీ లాబీల్లో మీడియాతో అనేక సార్లు చెప్పారు. ఆంధ్రలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనేది స్పష్టంగానే ఉన్నా, తెలంగాణలో మాత్రం కొత్త రాజకీయ పార్టీ అవతరిస్తుందా? లేక కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? అనేది వేచి చూడాలి. 
 • - బుద్దా మురళి

 • 09/07/2015
 • .

  1 కామెంట్‌:

  1. I remember after Digamingina Neta accident Death all so called Medavulu said TDP is no more only YSR party in Andra to support they quoted by election results, Finally what happend in General elections everybody knows. Also I read some where recently TDP won MPTC elections in Telamgana Districts is true?

   రిప్లయితొలగించు

  మీ అభిప్రాయానికి స్వాగతం