5, జులై 2015, ఆదివారం

నేరమేరా జీవితం!

‘‘బాస్ ఏం చేస్తున్నారు’’ సన్న గొంతుతో ఎంత మెల్లగా అడిగినా ఆ మాట అందరికీ వినిపించింది. చిన్న రాయి విసిరితే కొలనులోని నీళ్లలో అది కనిపించినట్టుగా నిశ్శబ్ధం ఆవహించిన ఆ గదిలో ఉన్న వాళ్లంతా అతని వైపు చూశారు. చీమే కాదు చివరకు దోమ రెక్కల చప్పుడు కూడా వినిపించేట్టుగా ఉందక్కడ.


బాస్ ఏదో కీలక బాధ్యత ముగించుకుని వచ్చి ‘నేరమేరా జీవితం, నేరమేరా శాశ్వతం’ అంటూ పాడుకుంటూ చేతికంటిన రక్తాన్ని కడుక్కుంటున్నాడు. రక్తంలో నీళ్లు కలిశాయో, నీళ్లలో రక్తం కలిసిందో చెప్పడం కష్టంగానే ఉంది. అతని చేతికి అంతగా అంటింది రక్తం. విజయవంతంగా మర్డర్ పూర్తి చేసినప్పుడు బాస్‌కు కొద్దిసేపు ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తానే పాటపాడుకోవడం అలవాటు.
ఏంటి అని అక్కడున్న వ్యక్తిని కనులతోనే బాస్ ప్రశ్నిస్తే, అతను ఏదో చెప్పబోయాడు. ఇదేమన్నా బహిరంగ సభ అనుకున్నావా? గంటల తరబడి మాట్లాడేందుకు సైగలతోనే చెప్పాలని, సాధ్యం కానప్పుడు విషయం అర్ధం అయ్యేట్టు రెండు మూడు మాటల్లో చెబితే చాలు. మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ.. విషయం మొత్తం నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్లవచ్చు అని ఆ వ్యక్తిని బాస్ పంపించి, ఏంటీ ఈ రోజు ముఖ్యమైన ప్రొగ్రాలు అని పిఎను అడిగాడు.
‘‘రాజకీయాల్లో విలువల గురించి అంతర్జాతీయ సదస్సులో మీరు కీలకోపన్యాసం చేయాలి. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. మహాత్మాగాంధీ, వివేకానందుని కొటేషన్స్‌తో, మహాభారతం,రామాయణం , భగవద్గీతలోని శ్లోకాలను ఉపదహరిస్తూ మీ ఉపన్యాసం తయారు చేయించాను. ఒకసారి చూసి ఒకే చెబితే’’ అని పిఎ అడిగాడు.
‘‘్భగవద్గీత, రామాయణ, మహాభారత శ్లోకాలతో ఎవరయ్యా ఇది రాసింది ఓ ఓసారి పిలువు’’ అని ఆదేశించాడు.
‘‘ సార్ నేనే సార్ ఆ ఉపన్యాసం రాసింది’’ అని
70 ఏళ్ల వృద్ధుడు వినయంగా చెప్పాడు.
‘‘సరే మీరిక వెళ్లవచ్చు’’ అని బాస్ అతన్ని పంపించి వేశాడు.
‘‘అతన్ని ఎందుకు పిలిచానో తెలుసా?’’ అని అక్కడున్న వారిని బాస్ అడిగాడు.


‘‘ఎందుకు తెలియదు సార్ అంత అద్భుతమైన శ్లోకాలతో ఉపన్యాసం తయారు చేసినందుకు సత్కరించాలనే పిలిచారు’’ అని అనుచరుడు వినయంగా చెప్పాడు.
‘‘మరదే ఓవర్ యాక్షన్ అంటే నేను మాట్లాడ మన్నాను కదా అని నోరు విప్పి మాట్లాడడమేనా? నేనూ మాట్లాడి నువ్వూ మాట్లాడితే ఇక మాటలకు విలువేముంది. నేను బాస్‌ను మీరు చెంచాలు నేను మాట్లాడితే మీరు వినాలి. వాడ్ని ఎందుకు పిలిచానో గ్రహించేంత తెలివి తేటలే మీకుంటే నా దగ్గరెందుకు పని చేస్తారు. నేనే మీ దగ్గర పని చేసేవాడ్ని.
నీతి, విలువలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం చదువుకుంటే ఎలా ఉంటారో మీకు చూపించేందుకు వాడ్ని పిలిపించాను. పాపం వాడు నీతులు నిజంగానే పాటించి 70 ఏళ్ల వయసులో కూడా మనలాంటి వాళ్లకు ఉపన్యాసాలు రాసిస్తే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను చెప్పొచ్చేదేమిటంటే ఏదో నాలుగు ఇంగ్లీష్ కొటేషన్లు చెపితే సరిపోతుంది కానీ నిజంగానే నీతి వాఖ్యలు చెబితే ఆ ప్రభావం మనపై కూడా ఉండి నీతిగా ఉండాల్సి వస్తుంది. మన వృత్తికి అంత కన్నా ప్రమాదం లేదు. ఈ ఉపన్యాసాన్ని ఆ చెత్తబుట్టలో పారేసి మరోటి రాయించు. ఆ ముసలోడిలా నన్నుకూడా అడుక్కుతింటూ బతికేట్టు చేస్తారా? ఏంటి? నైతిక విలువల గురించి ఎక్కువగా ఉపన్యసించాలి. అంతే కానీ ఎక్కువగా ఆలోచించ వద్దు, అలా చేస్తే ఆ ప్రభావం మన జీవితంపై పడి, అనవసరంగా నీతికి బతకాల్సి వస్తుంది. నీతికి బతకడం అంటే అడుక్కు తినడమే. ఈ ఉపన్యాసం రాసినాయన్ని చూశారు కదా? నీతిగా బతికేందుకు, నీతిగా బతకాలని ఉపన్యాసాలు ఇవ్వడానికి తేడా తెలియనోళ్లు నా వద్ద ఇంత కాలం ఎలా పని చేస్తున్నారు.? ’’ అంటూ బాస్ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అది కాదు సార్ మీ డైలాగులు చాలా కాలం నుంచి రొటీన్‌గా ఉన్నాయని, కాస్త స్పీచ్ చేంజ్ చేద్దామని ఈ ప్రయత్నం అంతే తప్ప మిమ్మల్ని మీ సహజ లక్షణం నుంచి బయటకు తీసుకు వచ్చే శక్తి ఎవరికీ లేదని మాకు తెలుసు సార్. మీరు కారణ జన్ములు మీకు మీరే సాటి ’’అంటూ ఆనుయాయులు బాస్‌ను ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఇంతలో ఫోన్ మ్రోగడంతో అంతా కంగారు పడ్డారు. ఒకరు ధైర్యం చేసి ఫోన్ ఎత్తి, సార్ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన మన నేతకు కొన్ని గంటల్లో బెయిల్ లభించబోతోంది అని గట్టిగా అరిచాడు. బాస్ ముఖం విప్పారింది.


తన గుట్టు మట్లు అన్ని అనుచరుడి గుప్పిట్లో ఉండడంతో బాస్ అనుచరుడికి ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేయమని అందరినీ పురమాయించాడు. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జైలు వద్ద స్వాగత ఏర్పాట్లు, ర్యాలీలకు ఏర్పాట్లు చేశారు. ఖర్చెంత అయిందని ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన దొంగకు అంతటి ఘన స్వాగతం లభించడంతో నేర ప్రపంచం ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ నేరస్తులకు సైతం ఒక్కసారన్నా జైలుకు వెళ్లి అలా ఘనంగా బయటకు రావాలని కోరిక కలిగింది.
***
‘‘బాస్.... బాస్...’’
‘‘ఊరకే అలా పిలవకండయ్యా..నేను మీ బాస్‌నని ప్రత్యేకంగా చెప్పాలా? నాకా విషయం తెలియదా? ’’
‘‘అలాగే బాస్ సార్ ... జైలు నుంచి బయటకు వచ్చిన మన నేతకు మనం ఘనంగా స్వాగతం పలకడం దేశ దేశాల్లో మారు మ్రోగిపోతోంది. దావూద్ ఇబ్రహీం ఆచూకీని కేంద్ర ప్రభుత్వమే కనిపెట్టలేకపోయింది. అలాంటి దావూద్ మన కోసం పడి చస్తున్నాడు. మనం ఉపయోగించిన న్యాయవాది సేవల కావాలని, ఎంతైనా భరిస్తామని దావూద్ అడుగుతున్నాడు. ఒప్పుకోండి బాస్ ఒప్పుకోండి దావూద్ కేసులో మనం విజయం సాధిస్తే,ఈ రంగంలో మనమే విశ్వవిజేతలం. ప్రపంచంలోని కీలక కేసులన్నీ మన చేతికి వస్తే, మనకే కాదు దేశానికీ బోలెడు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది’’ అని బాస్‌ను కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం