30, ఆగస్టు 2026, ఆదివారం

సీఎం టీ తాగరు : జర్నలిస్ట్ కథలు 11

సీఎం టీ తాగరు “ఏం ఆచారి… ఇప్పటికైనా నన్ను జర్నలిస్టుగా ఒప్పుకుంటావా?” ముఖ్యమంత్రి సూర్యా రావు అలా ప్రశ్నించే సరికి ఆచారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నవ్వాడు. ముఖ్యమంత్రి తన ఛాంబర్‌లో ఠీవిగా కూర్చున్నాడు. అసలే డబ్బుతో వచ్చిన దర్పానికి తోడు పదవి వల్ల అది రెట్టింపైంది. జర్నలిస్టులు తమ గోడు చెప్పుకోవడానికి వస్తామంటే రమ్మని పిలిచారు. ముఖ్యమంత్రికి తమ గోడు ఎలా చెప్పాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అని జర్నలిస్టులు ఆలోచిస్తుండగా సూర్యా రావు కళ్లుమూసుకుని ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు. తమ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ముఖ్యమంత్రి కళ్లుమూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని జర్నలిస్టులు మురిసిపోయారు. సూర్యా రావు పెదవులపై సన్నని చిరునవ్వు. అది ఎంత దాచినా దాగలేదు. ****⸻ అశోక్‌నగర్ సందులోని జన జాగృతి పత్రిక కార్యాలయం. చిన్న ప్రెస్. ఓ డజను మంది పని చేస్తారు. వారపత్రిక కావడంతో పెద్దగా హడావుడి ఉండదు. ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. ఒక్కొక్కరుగా సిబ్బంది చేరుకుంటున్నారు. అందరికన్నా ముందే వచ్చిన ఆర్టిస్ట్ సూర్య టేబుల్ తుడుచుకుని పని మొదలుపెట్టాడు. ఒక్కొక్కరు వస్తుంటే అందరినీ విష్ చేస్తున్నాడు. గోడల మీద రాతలు రాయడం నుంచి జీవితాన్ని ప్రారంభించిన సూర్యకు జీవితంలో ఎదగాలనే పట్టుదల బలంగా ఉండేది. ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతున్నాడు. ఖద్దరు చొక్కాలు వేసుకునే నాయకులు, ఖాకీ దుస్తుల్లో పోలీసులు, తెల్ల దుస్తుల్లో అధికారులు… అందరూ జర్నలిస్టులను గౌరవించడాన్ని చూసిన సూర్య, తానూ జర్నలిస్టు కావాలని అనుకున్నాడు. చదువు అంతంత మాత్రమే. కానీ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నమ్మే సూర్య, తెలిసినవారి ద్వారా జన జాగృతి కార్యాలయానికి చేరుకున్నాడు. జర్నలిస్టు కావాలనే తన కోరిక గురించి చెబితే అనుభవం లేదని చెప్పి నిరాశ పరిచారు. గోడలపై అందంగా అక్షరాలు రాసే తన అనుభవం గురించి చెప్పడంతో జన జాగృతిలో ఆర్టిస్ట్‌గా అవకాశం ఇచ్చారు. పని చేసేది పత్రికా కార్యాలయంలోనే కాబట్టి, ఆర్టిస్టు అయినా జర్నలిస్టే అని సూర్య మురిసిపోయాడు. అయితే ఆ మురిపెం ఎక్కువ కాలం నిలవలేదు. ఆఫీసులోని సబ్ఎడిటర్లు, రిపోర్టర్లు తనను జర్నలిస్టుగా గుర్తించడం లేదని సూర్యకు తొందరగానే అర్థమైంది. “లక్ష్యం ముఖ్యం. చిన్నచిన్న అడ్డంకులను పట్టించుకోవద్దు” అని తనకు తానే ధైర్యం చెప్పుకుని నెట్టుకొచ్చాడు. మధ్యాహ్నం రిపోర్టర్లు, సబ్ఎడిటర్లు టీ తాగేందుకు బయటకు వెళ్తుంటే తనను పిలవకపోయినా సూర్య వాళ్లతో వెళ్లేవాడు. ఒక రోజు మాటల సందర్భంలో ఆచారితో అన్నాడు. “ఆచారి అన్నా… చూస్తూ చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేనూ మీలాగే జర్నలిస్టునవుతాను. వారపత్రికలో కాదు… దినపత్రికలో జర్నలిస్టుగా ఓ వెలుగు వెలిగిపోతా చూడు.” ఆచారి నవ్వి సూర్య ఆశలపై నీళ్లు చల్లాడు. “గోడ మీద అక్షరాలు రాయడం వేరు… పత్రికలో జర్నలిస్టుగా రాయడం వేరు. ముందు సొంతంగా అక్షరాలు రాయడం నేర్చుకో. తరువాత జర్నలిజం గురించి కలలు కందువులే.” ******⸻ సూర్యా రావు ఫ్లాష్‌బ్యాక్‌లో మునిగిపోయి జన జాగృతిలో పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటుంటే, ఆచారి కూడా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. జర్నలిస్టుగా గుర్తింపు కోసం తపించిన సూర్యకు అక్షరాలు పెద్దగా రాకపోయినా అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. పెళ్లితో దశ తిరిగింది. తొందరగా సంపన్నుడు కావాలంటే రియల్ ఎస్టేట్, రాజకీయం… ఈ రెండింటికి మించింది లేదనుకున్నాడు. రెండింటిలో ఒకదాన్నే ఎందుకు ఎంచుకోవాలి? రెండింటిలోకి ఎందుకు ప్రవేశించకూడదు అనుకున్నాడు. పట్టిందల్లా బంగారమైంది. రియల్ ఎస్టేట్‌లో ఇంత డబ్బు ఉందని అతడే ఊహించలేదు. తన జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలో ఏ సర్వే నంబర్‌లో ఏ మతలబు ఉందో ఔపోసన పట్టాడు. రియల్ ఎస్టేట్‌లో సంపద పోగుపడిన తరువాత రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కసాగాడు. కాలం కలిసి రావడం, మీడియా అండగా నిలవడంతో రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్లినట్టే రాజకీయాల్లోనూ దూసుకెళ్లాడు. ఒక్కొక్కరిని తొక్కుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ సూర్య కాస్తా సూర్యా రావుగా మారి ముఖ్యమంత్రి అయ్యాడు. తనతో కలిసి పని చేసిన సూర్య ముఖ్యమంత్రి అయితే, తెలివైన ఆచారి మాత్రం జర్నలిస్టు నుంచి సీనియర్ జర్నలిస్టయ్యాడు. జర్నలిస్టుల ఇంటి స్థలాల వివాదం ఇరవై ఏళ్లుగా నలుగుతోంది. ఒకప్పుడు “జర్నలిస్టు” అనే పిలుపు కోసం తపించిన సూర్య ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్య తీరినట్టేనని ఆచారి సంతోషానికి హద్దులేకుండా పోయింది. తనలాంటి బడుగు జర్నలిస్టులను కూడగట్టుకుని ఆచారి సీఎం సూర్యా రావు వద్దకు వెళ్లాడు. ******⸻ “ఏం ఆచారి… ఇప్పటికైనా నన్ను జర్నలిస్టుగా గుర్తిస్తావా?” సూర్యా రావు అలా ఎందుకు అన్నాడో మిగిలినవాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆచారికి అర్థమైంది. “మీరు జర్నలిస్టు మాత్రమే కాదు… పత్రికలను నడిపించే పాలకులు.” ఆచారి చమత్కరించాడు. పైకి చమత్కారమే అయినా అసలు వాస్తవం ఇదే కదా? అని ఆచారి తనలో తానే అనుకున్నాడు. ఒకప్పుడు మీడియా స్వతంత్రంగా పనిచేసేది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, పాలకులే మీడియాను నడిపిస్తున్నారు. పత్రికలకు అసలైన యజమానులు, ఎడిటర్లు రాజకీయ నాయకులే కదా? ఇలాంటి మాటలను పైకి చెప్పలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాం అని తనకు తానే సర్దిచెప్పుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం కలిసి పనిచేసినా ఆచారిని సీఎం మరిచిపోలేదని మిగిలిన జర్నలిస్టులు సూర్యా రావు స్నేహధర్మానికి సంబరపడ్డారు. “రెండు దశాబ్దాల క్రితం డబ్బు పెట్టి జర్నలిస్టులు ప్రభుత్వం వద్ద ఇళ్ల స్థలాలు కొంటే, వివాదాలు, కోర్టు కేసులతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మీరే న్యాయం చేయాలి.” ఆచారి అందరి తరఫున ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశాడు. “ఎంత మాట! నేను జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి మీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చినవాడిని. నేను సీఎం అంటే ప్రతి జర్నలిస్టు సీఎం అని గర్వంగా భావించాలి. మీ సమస్యను పరిష్కరించే భాగ్యం నాకు ఆ దేవుడు ప్రసాదించాడు. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని, నివేదిక రాగానే టీ తాగినంత సమయంలో మీ ఫైల్‌పై సంతకం చేస్తాను.” ముఖ్యమంత్రి భరోసా ఇచ్చాడు. ఆచారి కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. మాట తడబడింది. “మీ నుంచి ఇంత అద్భుతమైన స్పందన ఊహించలేదు.” అని మాటలు కూడబలుక్కొని కృతజ్ఞతలు తెలిపాడు. ఆచారిని అనుసరిస్తూ జర్నలిస్టులందరూ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ బయటకు వెళ్లారు. ******⸻ “ఆచారి గారు… మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి, మీరు కలిసి ఒకే పత్రికలో పనిచేశారని తెలిసి ఏదో అనుకున్నాం. కానీ నిజంగా ఇంత అద్భుతమైన సీఎంను జన్మలో చూడలేం. మూడు దశాబ్దాలైనా మిమ్మల్ని సీఎం మరువలేదు.” జర్నలిస్టు లోకేషం ఆచారిని అభినందనల్లో ముంచెత్తాడు. “ఔను. సీఎం గారు మీరు మాట్లాడుతుంటే, ఆయన మిమ్మల్ని ఆదరించిన తీరు చూస్తుంటే శ్రీకృష్ణుడు–కుచేలుడి కథ ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపించింది. జన్మ ధన్యం అయింది.” ఎప్పుడూ ఎవరినీ పొగడని సీనియర్ క్రైమ్ రిపోర్టర్ సత్యం ఆచారి భుజం తట్టి మెచ్చుకున్నాడు. “నేడో రేపో మన ఇంటి స్థలాలు మన చేతిలో ఉంటాయి. సీఎం గారికి మన స్థలంలోనే అభినందన సభ ఏర్పాటు చేయాలి.” అంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ******⸻ “ఉరక రారు మహానుభావులు… మంత్రి గారు ఇలా వచ్చారేం?” మంత్రి శీనన్నను చూడగానే సీఎం సూర్యా రావు స్వాగతం పలికాడు. “జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము. జర్నలిస్టులు మిమ్మల్ని కలిస్తే మీరూ హామీ ఇచ్చారట! మీతో మాట్లాడి ఫైల్ సిద్ధం చేద్దామని వచ్చాను.” శీనన్న బదులిచ్చాడు. సూర్యా రావు గట్టిగా నవ్వాడు. “నేను పుట్టక ముందు నుంచే కాలు గుర్తు పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్లందరినీ పక్కన పెట్టి, రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన నన్ను సీఎం ఎందుకు చేశారో మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి.” సూర్యా రావు నవ్వాడు. “మీరే కాదు… ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న నేను కూడా పార్టీలో చేరిన రెండేళ్లకే నంబర్ టూ అయ్యాను. నంబర్ వన్‌ను తప్పిస్తే క్యూ‌లో ఉన్నది నేనే.” శీనన్న నవ్వాడు. “నాది రియల్ ఎస్టేట్ బలం అయితే… మీది కాంట్రాక్టుల బలం.” సీఎం అనగానే ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. “ఆ ఇంటి స్థలాల గొడవ పక్కన పెట్టండి. మీడియాలో పని చేసినవాడిగా చెబుతున్నాను. వాళ్ల సమస్యను ఎంతకాలం అలా నానుస్తూ ఉంటే అంతకాలం వాళ్లు మన పాటకు డాన్స్ చేయమన్నా చేస్తారు. సమస్యను పరిష్కరించాం అంటే తోక జాడిస్తారు. ఎప్పుడు కలిసినా సానుకూలంగా స్పందించాలి. జర్నలిస్టులు చాలా మేధావులమని అనుకుంటారు. వాళ్లంత వెర్రివాళ్లు ఉండరు. అలా అని మీరు వాళ్లు వెర్రివాళ్లు అని అస్సలు అనకూడదు. ‘మీ అంత మేధావులు లేరు’ అనాలి. ఏం అడిగినా సానుకూలంగా స్పందించాలి.” సూర్యా రావు శీనన్నకు జ్ఞానబోధ చేశాడు. “మరి టీ తాగినంత సమయంలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కదా?” శీనన్న గుర్తు చేశాడు. “ఒక్క జర్నలిస్టుకేనా? రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇచ్చాం. అయినా… నేను టీ తాగను.” సీఎం నవ్వాడు. “అమ్మో! మీరు మామూలోళ్లు కాదు. గోడ మీద రాతల నుంచి ప్రజల తలరాతలు రాసే స్థాయికి వచ్చారంటే మీరు మహా ముదురు.” సూర్యా రావును శీనన్న మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. *******⸻ శీనన్న సీఎం‌ను కలిసి బయటకు రాగానే జర్నలిస్టులు ఆశగా ఆయన్ని చుట్టుముట్టారు. “మీ సమస్య పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారు. టీ తాగినంత టైంలో మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ రోజు నుంచి మీరు కోటీశ్వరులు. వెళ్లండి… పండగ చేసుకోండి!” అని చెప్పి శీనన్న కారు ఎక్కి వెళ్లిపోయాడు. ******⸻ ఆచారి ఇంటికి వెళ్లి విషయం చెప్పగానే భార్య భావోద్వేగానికి గురైంది. ఇరవై ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలం ఇక తమదేనని ఆమె నమ్మింది. ఆచారి కూడా ఆ రోజు జరిగినదంతా గుర్తు చేసుకుంటూ ఆనందించాడు. ముఖ్యమంత్రి చెప్పిన మాట మాత్రం అతని చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది— “టీ తాగినంత సమయంలో మీ ఫైల్‌పై సంతకం చేస్తాను.” సీఎం టీ తాగడని… తమ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని ఆ దంపతులకు తెలియదు. - బుద్దా మురళి

9, ఆగస్టు 2026, ఆదివారం

జర్నలిస్ట్ కథలు... సొంతిల్లు

జర్నలిస్ట్ కథలు సొంతిల్లు మంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ . ఎప్పుడూ లేనంతగా కిక్కిరిసి పోయి ఉంది . మంత్రి చైర్ లో కూర్చుంటూ "మీ అందరికీ శుభ వార్త" అని అనగానే " సార్ మీరు వారానికి ఓ సారి సభకు నమస్కారం అన్నట్టు మీ అందరికీ శుభవార్త అంటారు . మొన్నోసారి మీ అందరినీ కోటీశ్వరులను చేసేస్తున్నాం అని ప్రకటించారు . అది చదివి అంతా మా జర్నలిస్ట్ ల మీద కుళ్ళుకుంటున్నారు . ఈ శుభ వార్తలు 20 ఏళ్ళ నుంచి వింటున్నాం . అయ్యేది లేదు పోయేది లేదు " అని సీనియర్ జర్నలిస్ట్ కాసింత అసహనంగానే తన అసంతృప్తిని బయటపెట్టాడు . " పాత శుభవార్తలు మరిచిపోండి . ఇప్పటి నుంచి ఒక లెక్క జర్నలిస్ట్ లకు సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ముచ్చర్ల గ్రామం లో రెండు వందల గజాల ప్లాట్ ఇవ్వాలి అని నిర్ణయించింది . " అని మంత్రి ప్రకటించగానే అరవింద్ కు తన కాళ్ళ కింద భూమి చీలిపోయి , తాను అందులో పడిపోయినట్టు అనిపించింది . తల గిర్రున తిరుగుతోంది . అరెస్ట్ చేస్తారనే భయంతో ఆగిపోయాడు కానీ మంత్రి బట్టతల మీద వాయించాలి అని ఉంది . సీనియర్ ల అందరి పరిస్థితి నవ్వలేక , ఏడవ లేక అన్నట్టు ముఖం పాలిపోయింది . వారందరి కన్నా తనకు ఎక్కువ బాధగా ఉంది . ఎక్కువ సేపు అక్కడే ఉంటే చేయరానిది ఏదైనా చేస్తనేమొ అనుకోని అక్కడే బెంచ్ పై తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు . తన కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటి గురించి తనకే తెలుసు . ఎవరి జీవితంలో ఇంత క్రూయల్ జోక్ వేయవద్దు దేవుడా ! అని మనసులో అనుకున్నాడు . పక్క వాళ్ళు " ఏమైంది " అని పలకరిస్తే నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు . మాట్లాడితే దుఃఖం వస్తుందేమో అనుకోని "ఏమీ లేదు " అని బదులిచ్చి తల టేబుల్ పై వాల్చి ఆలోచనలో పడిపోయాడు . మూడు దశాబ్దాల జీవితం , రెండు దశాబ్దాల సొంతింటి కల కనుల ముందు కనిపిస్తుంది . ఒకదాని తరువాత ఒక దృశ్యం కనుల ముందు కనిపిస్తోంది **** **** *** డిగ్రీ పూర్తి చేసి అరవింద్ జర్నలిస్ట్ గా ఉద్యోగంలో చేరగానే న్యూస్ ఎడిటర్ కృష్ణయ్య పిలిచి " చూడు బాబూ !ఇప్పుడే డిగ్రీ పాస్ అయి వచ్చావు . జీవితం అంటే ఏమిటో తెలియదు . నువ్వు రిపోర్టర్ వు కాబట్టి ఎవరో ఒక నాయకుడు మందు తాగించడానికి ఆసక్తి చూపిస్తాడు . ఒక్క సారి ముందుకు లొంగావు అంటే ఇక నీ జీవితం అంతే . అలా అని నేనేమీ మందు ముట్టను అని చెప్పడం లేదు . నేను ముందుకు అలవాటు పడి జీవితాన్ని కోల్పోయాను . మనకు మందు తాగించిన వాడికి కూడా మన మీద గౌరవం ఉండదు . తాగుబోతులు కూడా తాగని వారికే విలువ ఇస్తారు . జీవితానుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను . వినడం వినక పోవడం నీ ఇష్టం . నువ్వు రిపోర్టర్ గా జిల్లాకు వెళ్ళగానే జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ లో చేరు . ఏ జిల్లా లో అయితేనేం ఒక ఇంటి వాడివి అయితే జీవితానికి ఓ భరోసా ఉంటుంది " అని జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పి పంపించాడు పెద్దాయన. ఏడాదికి ఓ జిల్లా బదిలీ కావడంతో ప్రతి చోట చివరి నిమిషంలో తప్పిపోయిన ట్రైన్ లా ఉండేది పరిస్థితి . అరవింద్ అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్ లో వచ్చి పడ్డాడు . హైదరాబాద్ కు వచ్చిన కొంత కాలానికి కొత్త ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం సబ్సిడీ ధరతో ఇవ్వాలి అని నిర్ణయించింది . తంతే బూరెల బుట్టలో పడ్డట్టు రాజధాని నగరంలో సొంత ఇల్లు ఆలోచిస్తేనే అరవింద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది . ఉచితం కాదు మార్కెట్ ధర కన్నా కొంత తక్కువ . మూడు లక్షలు చెల్లించాలి . మూడు లక్షలు అంటే మామూలు విషయం కాదు . వచ్చే జీతం ఏ నెలకు ఆ నెల అన్నట్టు ఉంటుంది . ఊరికి వెళ్లి అమ్మ నాన్న , అన్నలకు విషయం చెప్పాడు ." రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండలేదు . పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక మేమే ఇబ్బందుల్లో ఉన్నాం "అని చెప్పి కుటుంబం అంతా చేతులెత్తేసింది . హైదరాబాద్ లో సొంతింటి కల దూరం అవుతుందా ? అని భయం వేసింది . తాకట్టు పెడదాం అంటే బంగారం కూడా లేదు . ఎరువుల కోసం ఎప్పుడో తాకట్టు పెట్టారు . చివరకు " నా వాటా మూడు ఎకరాలు నాకిచ్చేస్తే అమ్మేసుకుని ప్లాట్ కోసం డబ్బు కడతాను "అని అరవింద్ ప్రతిపాదించాడు . అంతా మూకుమ్మడిగా ససేమిరా అన్నారు ." పస్తులైనా ఉంటాం కానీ పొలం అమ్మేది లేదు "అని అన్నలు అంటే , మేం బతికి ఉన్నంత వరకు పొలం అమ్మితే మా మీద ఒట్టు అని తల్లిదండ్రులు అడ్డుకున్నారు. "పొలం అమ్ముకున్నారు అంటే ఊర్లో పరువు ఉంటుందా?" అని నానమ్మ తన వంతు వ్యతిరేకత చూపించింది . కుటుంబం అంతా ఏకగ్రీవంగా వ్యతిరేకించడంతో అరవింద్ తన అత్తా మామలను తీసుకువచ్చి తనకు వాటా కింద వచ్చే మూడెకరాలు పంచి ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడు . ఏడ్చినా , నచ్చజెప్పినా వినకపోవడంతో చివరకు అరవింద్ వాటా మూడు ఎకరాలు పంచి ఇచ్చారు . అతి కష్టం మీద మూడు ఎకరాలు అమ్మితే రెండున్నర లక్షలు వచ్చాయి . మరో 50 వేలు అప్పు చేసి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి మూడు లక్షలు చెల్లించి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినంత సంబరంగా అరవింద్ ఇంటికి వెళ్లి " డార్లింగ్ ఈ మహానగరంలో ప్రైమ్ ఏరియాలో ఇక మనకూ ఓ సొంతిల్లు , పర్మనెంట్ అడ్రస్ ఉండబోతుంది " అని ప్రేమగా భార్యకు చెప్పాడు . రోజులు గడుస్తున్న కొద్దీ తాను కట్టబోయే సొంత ఇల్లు ఎలా ఉండబోతుందో అరవింద్ రంగురంగుల కలలు కంటున్నాడు . సొంత ఇంటి ఆవరణలో ఏయే రకం మొక్కలు పెంచాలో రోజుల తరబడి చర్చలు సాగాయి . ఇంటి ముందు పెంచే మల్లె చెట్టు మొగ్గలు ఎవరూ తుంచకుండా చూసుకునే బాధ్యత పుట్టబోయే బిడ్డకు అప్పగించాలి అనే నిర్ణయం అయిపొయింది . రోజూ ఇంట్లో పూజకు అవసరం అయిన పూల మొక్కల బాధ్యత మొత్తం అరవింద్కం తన భార్యకే అప్పగించాడు . చుట్టూ పక్కల వాళ్ళు పూలు తెంపుకు పోవడం ఓ పెద్ద సమస్య . కాలనీ అన్నప్పుడు ఇలాంటివి భరించక తప్పదు అనుకున్నారు ." మీ అమ్మానాన్న లు వచ్చినా , మా అమ్మానాన్నలు వచ్చినా ఉండేందుకు వారికో గాడి కూడా ఉండాలి కదా ?"అని అరవింద్ భార్య మనసు దోచాడు . . బెడ్ రూమ్ నుంచి వంటగది వరకు సొంతింటిని తమ ఊహల్లోనే నిర్మించారు . ప్లాట్ కేటాయింపు జరగడమే తరువాయి ముందస్తు తతంగం అంతా పూర్తి చేశారు . వ్యవహారం అనేక మలుపులు తిరిగింది . నాకు దక్కంది మీకెలా దక్కుతుందో చూస్తా అని సీనియారిటీ లేని జర్నలిస్ట్ కృష్ణ కోర్టుకు వెళ్ళాడు . ఇంత మంది పేదలు, ఇండ్లు లేకుండా బతుకుతుంటే జర్నలిస్ట్ లకు సబ్సిడీ తో ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని పెద్ద భవంతిలో విశ్రాంతి జీవితం గడుపుతున్న గుడిసెవాసుల సంఘం నాయకుడు కోర్ట్ కు వెళ్ళాడు . చిలికి చిలికి గాలి వాన అయినట్టు వ్యవహారం సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది . కాల చక్రం రెండు దశాబ్దాలు అలా గిర్రున తిరిగింది . భార్య మంగళసూత్రం అమ్మి డబ్బు కట్టిన వాళ్ళు , వడ్డీకి తెచ్చి కట్టిన వాళ్ళు రోడ్డున పడ్డారు . సగం మంది రిటైర్ అయ్యారు . వీరిలో సగం మందిలోకం విడిచి వెళ్లారు . మిగిలిన వాళ్ళు అటు చావలేక ఇటు బతక లేక చావు బతుకు మధ్య బతుకీడుస్తున్నారు . ఓ శుభ ముహూర్తం లో మంత్రి మీ అందరినీ కోటీశ్వరులను చేస్తున్నాను . మీ ల్యాండ్ మీకే ఇస్తున్నాం అని ప్రకటించారు . జర్నలిస్ట్ లు రెండు చేతులా సంపాదిస్తున్నది సరిపోలేదా ?, కోట్ల రూపాయల భూమి ఎవడి సొత్తు అని ఇస్తారు అని తిట్టుకున్న వాళ్ళు , ఈర్ష పడ్డ వాళ్ళ సంఖ్యకు లెక్క లేదు . కానీ ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం అప్పటి రేటుతో కొని ఇప్పటి వరకు చకోర పక్షుల్లా ఎదురు చేస్తున్నవాళ్లు అని జాలి చూపిన వారు లేరు . ససేమిరా ఆ భూమి ఇవ్వడానికి వీలులేదు , వాళ్ళు కట్టిన డబ్బు వడ్డీతో తిరిగి చెల్లించండి అని ధర్మ ప్రభువులు తీర్పు చెప్పారు . ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు . డబ్బుకు బదులు ఏదో ఒక చోట భూమి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది . ఈ నిర్ణయంలో భాగంగానే మంత్రి విలేకరుల సమావేశం . **** **** ముచ్చర్లలో సర్వే నంబర్ 988 లో మీకు రెండు వందల గజాల ఇంటి స్థలం ఇస్తున్నామని మంత్రి విలేకరుల సమావేశంలో ప్రకటించగానే అరవింద్ కు ఏడుపు ఆగలేదు . ప్రభుత్వం ఇచ్చిన జీవో లో తప్పు ఉంటే ప్రభుత్వాన్ని శిక్షించాలి కానీ , జర్నలిస్ట్ లను శిక్షించడం ఏం న్యాయమో అర్థం కాలేదు . మూడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైమ్ ఏరియా లోని జర్నలిస్ట్ ల ల్యాండ్ తీసుకుని, మహానగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఐదు వేలకు గజం దొరికే చోట రెండు వందల గజాలా ? అని అందరూ బాధపడుతుంటే . అరవింద్ బాధ వర్ణనాతీతం . ముచ్చర్ల ఎక్కడో కాదు తన బాల్యం అంతా గడిపిన తన సొంత ఊరు .మూడెకరాల వ్యవసాయ భూమి అమ్మి , రెండు దశాబ్దాలు నిరీక్షించి అదే గ్రామం లో రెండు వందల గజాలు పొందుతున్న తన దురదృష్టాన్ని చూసి అరవింద్ తట్టుకోలేక పోతున్నాడు . అన్నదమ్ములకు , తల్లితండ్రులకు ముఖం ఎలా చూపాలో అర్థం కావడం లేదు . నిజమే పెద్దలు చెప్పినట్టు పస్తులు ఉండాలి కానీ సొంత ఊరిలో పొలం అమ్ముకోవద్దు అనుకున్నాడు . మబ్బులను చూసి కుండలో నీటిని పారబోసిన తన అజ్ఞానానికి తనను తానే తిట్టుకున్నాడు . ముచ్చర్ల సర్వే నంబర్ 988 ని మరోసారి చూసి ఏడుపు ఆపుకోలేక పోయాడు . సర్వే నంబర్ 988 అంటే తమ భూమే . తాను అమ్మిన భూమి అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వం చేతికి వచ్చింది . తాను అమ్మిన మూడెకరాల భూమిలో 20 ఏళ్ళ తరువాత తనకు రెండు వందల గజాలు వస్తోంది . భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో . తన భూమిలో రెండు వందల గజాల కోసం మూడు ఎకరాలు అమ్మిన నన్ను నేను జీవితంలో క్షమించను అనుకున్నాడు . - బుద్దా మురళి

3, ఆగస్టు 2026, సోమవారం

జర్నలిస్ట్ కథలు .... సినిమాకో కథ

జర్నలిస్ట్ కథలు సినిమాకో కథ సినిమా నిర్మాత నరేష్ ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా నిశ్శబ్దం . ఈ రోజు కొత్త సినిమా కోసం కథ మీద చర్చించాలి . దర్శకుడు , కథా రచయిత చెప్పిన సమయం కన్నా గంట ముందే ఆఫీస్ లో ఉన్నారు .నరేష్ కథ ఒకే చేశాడు అంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే . ముందు డబ్బింగ్ సినిమాలతో మొదలు పెట్టి విజయం సాధించాక , తరువాత కథా బలం ఉన్న లోబడ్జెట్ సినిమాలతో విజయ యాత్ర సాగించాడు . సినిమా ప్రపంచం ఓ వైకుంఠ పాళి అనే విషయం నరేష్ కు బాగా తెలుసు . గండ పెండేరాలు తొడిగించుకున్న మహానటులు చివరి దశలో తిండికి కటకటలాడడం , విజయ వంతమైన సినిమాలు నిర్మించి ఒక్క సినిమా ప్లాప్ కాగానే రోడ్డున పడ్డ నిర్మాతల కథలు విన్నాడు . స్వయంగా చూశాడు . నటీనటులు , దర్శకులు , నిర్మాతలు ఎవరి జీవితానికి ఇక్కడ భరోసా లేదు . కథ నే సినిమాకు ప్రాణం అని బలంగా నమ్మినవాడు . ఆలస్యం అయినా పరవా లేదు . పెట్టుబడికి డోకా ఉండకూడదు అనేది నరేష్ సినిమా పాలసీ . కొంత సేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్న తరువాత విషయం లోకి వచ్చారు ." రచయిత గారు! మీ కథ వినిపించే ముందు సినిమా ప్రేక్షకులు ఎలాంటి కథలను ఇష్టపడుతున్నారని మీరు అనుకుంటున్నారు ? " అని నిర్మాత నరేష్ అడిగాడు . నరేష్ ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం . అని కథా రచయిత ఏకాంబరానికి తెలుసు . కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా " నిర్మాత గారు మీకు తెలియని విషయమా ? మీ లాంటి వారి చేతిలో పడితే ఎలాంటి కథ అయినా సూపర్ హిట్ కావలసిందే . మీ ఇంటి పేరే సూపర్ హిట్ " అంటూ పొగడ్తల మంత్రం వేశాడు . నిర్మాత మనసులోనే నవ్వుకుని 'హనుమంతుని ముందు కుప్పిగంతులా వీడెవడో నా గురించి తెలియనట్టుంది .పొగడ్తలతోనే ఇక్కడి దాకా వచ్చాను . నన్నే పొగడ్తలతో పడేయాలి అనుకుంటున్నాడు . ఇక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పాతాళంలో పడేసి తొక్కేస్తారు . కళ్ళ ముందే ఎందరి జీవితాలు పాతాళంలో పడిపోయింది చూడలేదు 'ఆ ని మనసులోనే అనుకోని "మీరు కథ చెప్పండి " అన్నాడు . ఏకాంబరం కథ చెప్పఁడం మొదలు పెట్టిన ఐదు నిమిషాలకే నరేష్ కు కథలో పస లేదు అనిపించింది . "మీ కథ నాకు అంతగా నచ్చలేదు . ఒక కొత్త రచయిత నాకో కథ పంపాడు . కథ చెబుతాను . ఇది సినిమాకు పనికి వస్తుందా ? లేదా చెప్పండి . కథను సినిమాకు అనుగుణంగా మార్చుకోవచ్చా చూడండి కథలో లీనం అయినట్టుగా కళ్ళు మూసుకుంటే కనుల ముందు కథ గుర్తు చేసుకున్నాడు . ఎక్కడి గోదావరి జిల్లా పల్లెటూరు , ఎక్కడి మహానగరం . . నరేష్ కథలో లీనమయ్యాడు . "మన కథలో హీరో పేరు విజయ్ . అమితాబ్ సూపర్ హిట్ సినిమాలన్నింటిలో హీరో పేరు విజయ్ . . పేరులో ఏముంది అంటారు కానీ విజయ్ పేరు కలిసి వస్తుంది అనుకుంటున్నాను . సరేనా " అని అందరి వైపు చూసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే నరేష్ కథ చెప్పడం మొదలు పెట్టాడు . *** ***** **** " నాన్నా నేను హైదరాబాద్ లో బాగానే ఉన్నాను . ఇక్కడి లోకల్ పత్రికలో జర్నలిస్ట్ గా చేరాను . జీతం తక్కువే కానీ ఎలాగోలా సరిపోతుంది . ఆఫీస్ లోనే వసతి కూడా ఉంది . నా గురించి కంగారు పడకండి . శ్రద్ధగా పని చేస్తే జీతం అదే పెరుగుతుంది " విజయ్ ఇంటికి ఫోన్ చేసి తండ్రికి ధైర్యం చెప్పాడు . ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రమే . విజయ్ ది వానాకాలం చదువు . ఇంట్లో అర్ధాకలితో గడపడం కన్నా హైదరాబాద్ వెళ్లి ఏ కూలి పనైనా చేసుకొని బతుకుతా అని చెప్పి వెళ్ళాడు . విజయ్ చేస్తున్న పనేమిటో తండ్రికి అర్థం కాలేదు కానీ ఊరిలో కన్నా అక్కడ బాగానే ఉన్నాడు అనుకున్నాడు . అది బయట ప్రపంచానికి తెలియని పత్రిక . నాలుగైదు దిన పత్రికలు మాత్రమే నలుగురు జనం చదివేవి . చాలా మందికి తెలియంది , చివరకు జర్నలిస్ట్ లకు కూడా తెలియంది కొన్ని వేల దినపత్రికలు రికార్డ్ ఉంటాయి . బయటికి రావు . పాఠకుల కోసం కాదు ప్రభుత్వ ప్రకటనల కోసమే ముద్రించే పత్రికలు ఇవి . రికార్డులు సమర్పించడం లేదు అని 80 వేల పత్రికల రిజిస్ట్రేషన్ లను సస్పెండ్ చేశారు అంటే ఈ పత్రికల సంఖ్య అర్థం అవుతుంది . ఇలా వెలుగులోకి రాని వందల , వేల పత్రికల్లో ఒక దానిలో విజయ్ కు ఆశ్రయం దొరికింది . అక్కడ విజయ్ అటెండర్ , నైట్ వాచ్ మెన్ , స్వీపర్ , సబ్ ఎడిటర్ , రిపోర్టర్ అన్నీను . అశోక్ నగర్ లోని గవర్న మెంట్ షాపింగ్ కాంప్లెక్స్ లో పేపర్ ఓనర్ ఓ రెండు షాప్స్ సంపాదించాడు . వాళ్ళ పత్రిక ఇక్కడి నుంచే వస్తుంది . వీరి కి కేటాయించిన షాప్స్ పక్కనే ఒక చికెన్ సెంటర్ ఉంది . చికిన్ సెంటర్ వెనుక ఉన్న చిన్న గది నరేష్ కు రాత్రి పడుకునే చోటు . హైదరాబాద్ మహానగరంలో ఇంత చోటు దొరకడమే కష్టం . ఓనర్ ఇచ్చే జీతం కన్నా రాత్రి అక్కడ పడుకోవడానికి ఆశ్రయం దొరకడం విజయ్ కు ఎక్కువ సంతోషం కలిగించింది . అక్కడ పని చేసేవాళ్ళు జీతం ఇవ్వక పోయినా ఎందుకు పని చేస్తారో విజయ్ కు అర్థం అయ్యేది కాదు . జీతం కూడా అడగకుండా విజయ్ ఎందుకు పని చేస్తున్నారో మిగిలిన వారికి అర్థం అయ్యేది కాదు . జీతం లా కాకుండా అప్పుడో ఐదు వందలు , ఇప్పుడో వెయ్యి అన్నట్టు యజమాని అందరికీ ఇచ్చేవాడు . మిగిలిన అందరి కన్నా విజయ్ కు స్పష్టమైన లక్ష్యం ఉంది . తన లక్ష్యం ఈ పత్రికలో జర్నలిస్ట్ గా పని చేయడం కాదు . ముందు హైదరాబాద్ లో కాలు పెట్టాలి , పడుకోవడానికి ఇంత చోటు సంపాదించాలి . సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్ లు చూసేందుకు వెళ్ళేవాడు . స్టూడియోల చుట్టూ తిరిగేవాడు . ఆల్ రౌండర్ గా అప్పటికే ఆఫీస్ లో కుండలో నీళ్లు నింపడం మొదలుకొని , వాచ్ మెన్ గా, జర్నలిస్ట్ గా అన్ని పనులు చేస్తున్న విజయ్ ఓ రోజు యజమానికి చెప్పి సినిమా వార్తలు రాసేందుకు అనుమతి సంపాదించాడు . ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ల చీదరింపులు వినాల్సిన అవసరం లేదు . నేరుగా స్టూడియోలకు వెళ్ళవచ్చు . మెల్లగా మిగిలిన సినిమా జర్నలిస్ట్ లతో , సినిమా వారితో వారితో పరిచయాలు పెరిగాయి . ఇప్పటి వరకు ఎవరూ చదవని పత్రికలో పని చేస్తూ ఇక్కడి వరకు చేరుకున్న విజయ్ పరిచయం ఉన్న సినిమా జర్నలిస్ట్ ద్వారా నలుగురు చదివే ప్రముఖ దిన పత్రికలో సినిమా వార్తల రిపోర్టర్ పోస్ట్ ఖాళీ అయింది అని తెలియగానే అక్కడ వాలిపోయాడు . ఇప్పుడు తాను పలానా పత్రిక రిపోర్టర్ ను అని గర్వంగా చెప్పుకుంటున్నాడు . తనలోని తెలివైన జర్నలిస్ట్ మేల్కొనడమే కాకుండా పురివిప్పాడు . కులం , జిల్లా ఏది అవసరం అనుకుంటే దాన్ని ఊతంగా మార్చుకొని ఒక్కో మెట్టు ఎక్కసాగాడు . కొంత పలుకుబడి , కొంత డబ్బు , కొన్ని పరిచయాలను ఒక చోట చేర్చి తమిళ సినిమా రైట్స్ కొని తెలుగులో డబ్బింగ్ చేశారు . చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లిన అనుభవం ఇక్కడ ఉపయోగ పడింది . మాస్ కు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో నాడి దొరికింది . కాలం కూడా కలిసొచ్చింది . డబ్బింగ్ సినిమా హిట్టయింది . సినిమా రంగం కాదు చిత్రమైనది కోటీశ్వరుడు సినిమా తీసిన నిర్మాతను బిక్షగాన్ని చేసింది . చాలా తక్కువ మొత్తంతో బిచ్చగాడు అని డబ్బింగ్ సినిమాను విడుదల చేసిన నిర్మాతకు కానక వర్షం కురిసి కోటీశ్వరుడు అయ్యాడు . విజయ్ డబ్బింగ్ సినిమా బాగానే లాభాలు తెచ్చిపెట్టింది . ఆ ఉత్సాహంతో మరిన్ని డబ్బింగ్ సినిమాలు విడుదల చేశాడు . బాగానే సంపాదించాడు . తరువాత డైరెక్ట్ తెలుగు సినిమాలు తీశాడు అక్కడా పట్టిందల్లా బంగారం అయింది . కేవలం హైదరాబాద్ మహానగరంలో ఆశ్రయం కోసం వాచ్ మెన్ మొదలుకొని జర్నలిస్ట్ వరకు అన్ని పనులు చేసిన విజయ్ కు ఇప్పుడు పట్టిందల్లా బంగారం ఇంటిపేరు సూపర్ హిట్ విజయ్ గా మారింది . వందల కోట్ల ఆస్తులు , విలాసవంతమైన భవనంలో నివాసం. ఒకప్పుడు స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే చీదరించుకునే వాచ్ మెన్ లు ఇప్పుడు లో అవకాశాల కోసం దర్శకులు , నటులతో తన ఆఫీస్ సందడిగా ఉంటుంది .-" ఇదీ మన హీరో విజయ్ కథ దీనిలో కొంత మసాలా , సెంటి మెంట్ కలిపి , అందమైన ఇద్దరు హీరోయిన్ లు , నాలుగు డబుల్ మీనింగ్ పాటలు కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుంది " అని నరేష్ అడగగానే అక్కడ ఉన్నవాళ్లు మౌనంగా ఉన్నారు . " మీకు కథ నచ్చలేదా " అని నరేష్ అడిగాడు . "నచ్చక పోవడం కాదు బాషా మొదలుకొని ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల మూల కథ ఇంతే కదా ? ప్రేక్షకులకు కథ కనెక్ట్ కాదేమో" అని కథా రచయిత ఏకాంబరం తన అనుమానాన్ని వ్యక్తం చేశారు . " ఇలాంటి కథలతో తెలుగులోనూ చాలా సినిమాలే వచ్చాయి " అని దర్శకుడు తన అభిప్రాయం చెప్పారు . " ఈ రోజుల్లో ప్రేక్షకులు వాస్తవ కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఇలాంటి ఆచరణకు సాధ్యం కానీ కథలను తిప్పి కొడుతున్నారు " అని ఏకాంబరం నిర్మోహ మాటంగా అభిప్రాయం చెప్పారు . " అందుకే మీరంటే నాకు చాలా గౌరవం . వాస్తవ విరుద్ధమైన కథ అని నిర్మొహమాటంగా చెప్పారు . మీరు వెళ్ళవచ్చు . ఏడాది విరామం తరువాత కథా చర్చలు మొదలు పెట్టాను . మనం తీసే సినిమా సూపర్ హిట్ కావాలి . మంచి కథల కోసం మీరూ ప్రయత్నించండి . నేనూ ప్రయత్నిస్తాను. భారీ సినిమా కాబట్టి నేను ఒక్కడినే కాకుండా ఇతరుల తో కలిసి తీస్తాను " అని చెప్పి నరేష్ ఇక వెళ్ళండి అన్నట్టు లేచాడు . *** *** *** నరేష్ తన గదిలోకి వెళ్లి గట్టిగా నవ్వుకున్నాడు ." వాస్తవ జీవితం లో సినిమా కథలను మించిన మిస్టరీ ఉంటుంది . విజయ్ ఎవరో కాదు నేనే . చికెన్ సెంటర్ లో పడుకోవడానికి ఆఫీసులో ఊడవడానికి , వాచ్ మెన్ గా ఉండడానికి నేనేమీ సిగ్గుపడలేదు . నా లక్ష్యం ఏమిటో నాకు స్పష్టత ఉంది . ప్రతి పనిని లక్ష్యానికి చేరుకోవడానికి ఒక మెట్టుగా భావించాను . లక్ష్యం చేరుకున్నాను . నేను అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి జర్నలిస్ట్ ఉద్యోగం నాకు ఉపయోగ పడింది . ఈ రోజుకు ఎవరో ఒకరు మందు తాగిస్తే చాలు , ఖర్చుకు ఎవరో ఒకరు ఇస్తే చాలు అనుకొనే లక్ష్యం ఉన్న జర్నలిస్ట్ లకు వారి లక్ష్యం నెరవేరుతుంది . కొంచం ముందో వెనకో అందరి లక్ష్యం నెరవేరుతుంది . నా లక్ష్యం పెద్దది . నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను . ఏ రంగంలో ఉన్నా నీ లక్ష్యం ఏమిటీ ? అనే స్పష్టత ఉండాలి . నాకా స్పష్టత ఉంది . లోకం గురించి అవగాహనా ఉంది" అని నరేష్ తనను తాను అభినందించుకున్నాడు . నా జీవిత కథ అయినా నా డబ్బుతో సినిమా తీసేంత పిచ్చి పని చేయను . ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే వెళ్లే పని చేయను . నా పలుకుబడి , పరిచయాలు ఉపయోగించి ఎవరైనా నిర్మాతను పట్టుకుంటాను అని బయలు దేరాడు బతక నేర్చిన నరేష్ . - బుద్దా మురళి buddha murali