22, నవంబర్ 2015, ఆదివారం

నెహ్రూనే కారణం!

‘‘డాడీ నీకు పాకిస్తాన్ ఫోన్ నంబర్ తెలుసా?’’
‘‘ మా తల్లే మా బంగారమే! ఏమో య్! భార్యామణి చూశావా? ఇదీ నా పెంపకం ఇప్పుడేమంటావు. విదేశాల గురించి కూడా అడుగుతున్నది. ఈ వయసు పిల్లలు మహేశ్ బాబు కొత్త సినిమా విడుదల తేదీ గురించి, అతనిది విగ్గా ఒరిజినల్ జుట్టా అని తెగ మాట్లాడుకుంటారు. పెద్దయ్యాక విదేశీ రాయబారి అవుతుంది.’’


‘‘ ఇంతకూ మీ బిడ్డ ఏమడిగింది? అంతగా మురిసిపోతున్నారు. ’’
‘‘ ఏరా బంగారు తల్లి ఇంతకూ నీకు పాకిస్తాన్ ఫోన్ నంబర్ ఎందుకురా? ’’
‘‘పాకిస్తాన్ వారితో కాస్త పర్సనల్‌గా మాట్లాడాల్సిన మ్యాటర్ ఉంది డాడీ’’
‘‘చిట్టినా తల్లి బుర్రలో ఎన్ని ఆలోచనలో... ఈ రోజు ప్రపంచానికి తీవ్రవాద సమస్య ముప్పుగా మారింది. పాకిస్తాన్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తోంది. ఇంకా’’
‘‘ అబ్బా ఆగు డాడీ ఈ విషయం నేను నిన్ను అడిగానా? ఇవి రోజూ టీవిలో వినేవే.. దీని గురించి కాదు నేను మాట్లాడాల్సిన విషయం వేరుగా ఉంది’’
‘‘నీ తండ్రిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. వారం రోజుల నుంచి నీతో హోం వర్క్ చేయించేది నేనే అని మీ అమ్మా గ్రహించాలి. ఏ విషయం అయినా నేరుగా మాట్లాడి తెలుసుకోవాలనే నీ జిజ్ఞాస అద్భుతం.’’
‘‘ సరే ఇంతకూ ఫోన్ నంబర్ ఇస్తావా? నెట్‌లో చూసి వెతుక్కోమంటావా? ’’
‘‘ ఇంతకూ ఎందుకో చెప్పనే లేదు. ’’


‘‘ మా క్లాస్ టీచర్ బెదిరింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హోంవర్క్‌లో తప్పులుంటే తిడుతోంది. ఆకాశరామన్న పేర్లతో ప్రిన్సిపల్‌కు కంప్లయింట్ లేఖ రాస్తే. రైటింగ్ గుర్తు పట్టి అందరినీ చితగ్గొట్టింది. పాకిస్తాన్‌కు చెబితే కానీ క్లాస్ టీచర్‌ను మార్చరు. ’’
‘‘ ఇంత అద్భుతమైన ఆలోచన నీకెలా వచ్చింది తల్లి’’
‘‘ నువ్వు టీవిలో వార్తలు వింటూనే హోంవర్క్ చేయిస్తావు కదా? కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఏమన్నారు. మా ప్రధానమంత్రి మోదీని దించేయాలి మీరు మద్దతివ్వండి అని పాకిస్తాన్ వెళ్లి మద్దతు కోరాడా? లేడా? ఒక్కదాన్ని పాకిస్తాన్ వెళ్లి వాళ్ల మద్దతు కోరాలంటే కష్టం అని పించి ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నాను’’
‘‘చూశారా? చూశారా? అమ్మా యి ఇప్పుడే ఇలా అయిందంటే ఇక పెద్దయితే ఎలా ఉంటుందో? వామ్మో దీని కంతటికీ మీ అమ్మగారే కారణం.’’
‘‘దీంట్లో మా అమ్మేం చేసిందే. ఎప్పుడో ఏడాదికోసారి మనింటికి వస్తుంది. రెండు రోజులకే వెళ్లిపోతుంది. చిట్టితల్లిని క్లాస్ టీచర్ ఎంత వేదిస్తుందో అందుకే పాకిస్తాన్‌కు ఫిర్యాదు చేయాలనిపించింది. మనం ఎప్పుడూ సమస్య మూలాల్లోకి వెళ్లి చూడాలి. ’’


‘‘ అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజిస్తే పిల్లలు ఇలానే మాట్లాడతారు. ’’
‘‘ మరీ రాజకీయ నాయకుల్లా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావ్!
‘‘ దీనికీ దానికీ సంబంధం ఏంటోయ్ ’’
‘‘ నా మాటలు నీకు అడ్డదిడ్డంగా ఉన్నాయా? మొన్న నరేంద్ర మోదీ అమరావతి ప్రారంభోత్సవ సభలో ఇదే మాటంటే కోట్ల మంది ఉత్సాహంగా విన్నారు. ఇదే మాటన్న బాబుకు ఆంధ్ర ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. మోదీకీ జేజేలు పలికారు. అదే మాట నేనంటే పనికి మాలిన మాటలనిపించాయి. పెళ్లికి ముందు నేనేం మాట్లాడినా అచ్చం కోయిల కూసినట్టు , జానకి పాడినట్టుందనే వాళ్లు. పెళ్లయిన కొత్తలో నేను చిరాకు పడినా పాల్గుణి పాఠక్ దాండియా పాట పాడినట్టుందన్నారు గుర్తుందా? మీరు టీ తాగిన విధానం చూసి మా అమ్మ పెళ్లి చూపుల్లోనే అంది మీరిలా మారిలా మారుతారని ’’
‘‘ నేను టీ తాగడానికి, మీ అమ్మ మాటలకు ఏం సంబంధం ? ’’
‘‘ టీ తాగేవాడు ఇలానే ఉంటాడు. వద్దే దూరపు బందువు దుర్గేష్ ను చేసుకో వాడు చక్కగా కాఫీ తాగుతాడు అని అమ్మ చెప్పినట్టు వింటే ఇప్పుడు టీవి యాడ్‌లో అచ్చం సమంత ఆ హీరో ఎవడో ఉన్నాడు కదా అలా ఇద్దరం కాఫీ తాగుతూ ఒకరి కళ్లల్లో ఒకరం చూసుకుంటూ ఉండేవాళ్లం. నిన్ను చేసుకున్నాను నా జీవితం విశాఖా ఆస్బెస్టాస్ సిమెంట్ రేకుల ప్రకటనలోని ఇళ్లులా తయారైంది. ’’


‘‘ దుర్గేష్ అంటే వాడే కదా? దుర్గయ్య.... వాడో పనికి మాలిన వాడు. మున్సిపాలిటీలో చెత్త కాంట్రాక్టర్... రోడ్లు ఊడ్చేవాళ్ల దగ్గర కూడా డబ్బులు కొట్టేసే వాడితో నన్ను పోలుస్తావా? ’’
‘‘అంతే లేండి మా అమ్మ పేరెత్తినా మోదీ పేరెత్తినా మీకు ఇలానే కోపంగా ఉంటుంది. ఎంతైనా అడ్డదిడ్డంగా విభజించిన సోనియాగాంధీ అభిమానులు కదా? ’’
‘‘ సోనియాగాంధీ అడ్డదిడ్డంగా విభజిస్తే, మీ మోదీ దేవుడు సరి చేయవచ్చు కదా? కనీసం విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయడం లేదు. నాలుగు మాటలు మాట్లాడి వెళ్లడం తప్ప మీ మోదీ ఏం చేశాడని.. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి కూడా అడ్డదిడ్డంగా అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడడం ఏమిటి? ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటించిన ప్రత్యేక హోదానే ఇవ్వడం లేదు ’’
‘‘ అసలు తప్పు నెహ్రూది.. మధ్యలో మోదీనంటారేమిటి? ’’
‘‘ విజయవాడ దేవినేని నెహ్రూకు దీనికి సంబంధం ఏమిటి?’’
‘‘ నేన్ననది విజయవాడ నెహ్రూ గురించి కాదు. జవహర్ లాల్ నెహ్రూ గురించి’’
‘‘ ఆయనకేం సంబంధం’’


‘‘ ఇందిరాగాంధీ మతాంతర వివాహం చేసుకోవడం వల్లనే కదా? రాజీవ్ గాంధీ ఖండాంతర వివాహం చేసుకున్నారు. ఖండాంతర వివాహం చేసుకోవడం వల్లనే కదా సోనియాగాంధీ కాంగ్రెస్‌లో అధికారం చెలాయించారు. ఆమె వల్లనే కదా విభజన జరిగింది.’’
‘‘ అంటే తప్పంతా నెహ్రూదే కానీ మోదీ కేం బాధ్యత లేదంటావా? ’’
‘‘ నెహ్రూ చేసిన ఒక్కో తప్పును సరిదిద్దడానికి మోదీ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ముందు విదేశాల్లో తప్పులు దిద్ది, తరువాత స్వదేశంలో దిద్దుతారు.’’
‘‘ వామ్మో తల్లి మోదీ గ్రూపు, కూతరు మణిశంకర్ గ్రూప్, మధ్యలో నా పరిస్థితి సొంతింటిలో కాందీశీకుడిలా అయింది. కాశ్మీర్‌లో పండిట్స్‌లా’’

-బుద్దా మురళి (జనాంతికం 22.. 11. 2015)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం