15, నవంబర్ 2015, ఆదివారం

ఎవరి సినిమా వాళ్లది!

‘‘పంచెకట్టుతో పవన్ తుఫాను సృష్టించనున్నారు. సమస్యల సుడిగుండంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల  ప్రజలను రక్షించే హీరో నాకు పవన్‌లో కనిపిస్తున్నాడు.’’
‘‘ నాకైతే తెగిపోయిన గాలిపటం గుర్తుకు వచ్చింది. తెగిన గాలి పటానికి గమ్యం ఉండదు . ’’
‘‘ నువ్వెప్పుడూ అంతే ఈ రాజకీయాలు ఎప్పుడూ ముసలి వారితోనే కంపు కొట్టాలా? యువ రక్తానికి అవకాశం ఇవ్వరా? ’’
‘‘ అలా అంటే సినిమాలు కూడా ముసలి కంపు కొడుతున్నాయి కదా’’
‘‘అవును అందుకే కదా అక్కినేని వంశం నుంచి 11వ వారసుడు హీరోగా వచ్చాడు ’’


‘‘ఆ సినిమా డమాల్ అంది లే.. అందమైన హీరోయిన్ల చుట్టూ తిరుగుతూ ప్రేమ కబుర్లు, మధ్యలో అలీ, బ్రహ్మానందం కామెడీ సీన్లతో లాగించేస్తే మినిమం గ్యారంటీ ఉండేది. అన్నప్రాసనాడే అవకాయ అన్నట్టు, అప్పుడే అఖిల ప్రపంచాన్ని రక్షించే బాధ్యత అతని భుజస్కంధాలపై వేస్తే సినిమా ఫట్ మనకుంటే ఇంకేమంటుంది. ఆ కాలంలో మహా మహా ఎన్టీఆర్, కాంతారావు, నాగేశ్వర్‌రావు,కృష్ణ, శోభన్‌బాబులే కుటుంబాన్ని, గ్రామాన్ని, రాజకుమారిని, మహా అయితే రెండు మూడు గ్రామాల సైజులో ఉండే రాజ్యాన్ని రక్షించే బాధ్యత తీసుకునే వారు. మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీర్, పవన్ కళ్యాణ్‌లు సైతం ఆ బాధ్యత తీసుకోలేదు. ఇంకా బొడ్డూడని హీరోలు ప్రమాదంలో పడిన ప్రపంచాన్ని రక్షించేందుకు బయలు దేరితే చూసేందుకు ప్రేక్షకులు మరీ అంత అమాయకులా? ’’


‘‘ నిజమే ప్రేక్షకులు తెలివి మీరి పోయారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల కావు. గుడిసెలో ఉన్న ముసలవ్వకు జర్వం వస్తే డాక్టర్ బ్యాగ్ పట్టుకొని మరీ పరిగెత్తుకొచ్చేవాడు. ఈ రోజుల్లో డాక్టర్ అపాయింట్‌మెంట్ కావాలంటే నెల రోజులు వేచి చూడాలి. పైగా మనకు పెద్ద భవనం ఉన్నా ఇంటికి రాడు మనమే వెళ్లి నంబర్ పిలిచినప్పుడు వెళ్లాలి.’’
‘‘నువ్వు చెబుతున్నది సినిమా రోజుల గురించా? బ్లాక్ అండ్ వైట్ నుంచి అప్పుడప్పుడే కలర్‌లోకి అడుగు పెట్టినప్పటి రోజులు ఇంకా ముచ్చటేసేవి నీకు గుర్తుందా? జమీందారు కూతురు అదే హీరోయిన్ హాచ్ అని తుమ్మగానే పాతిక మంది డాక్టర్లు వరుసగా వచ్చి నిలబడేవారు.జగన్నాధం గారూ మీ అమ్మాయికి ఏమీ కాలేదు. చల్లగాలి తాకడం వల్ల జలుబు చేసింది అంతే ఈ మందులు వాడండి అంటూ డాక్టర్ చీటి ఇచ్చి వెళ్లేవాడు. ఇంటి నిర్మాణానికి డజన్ల కొద్ది కూలీలు వచ్చినట్టు ఆ రోజుల్లో తుమ్మితే డాక్టర్లు వచ్చేవాళ్లు. ఆ కథలు ఎంత సహజంగా ఉండేవి.’’


‘‘కాలం మారింది కానీ కథలు మారలేదు. హీరో కంటి చూపుతూ చంపేస్తున్నాడు. తొడగొట్టగానే విలన్ల గుంపు గాలిలో ఎగురుతోంది. గుండె ఆగి చస్తున్నారు. ఒక హీరో తొడ కొడితే రైలు నిలిచిపోతుంది, మరో హీరో చేయ్యి అడ్డం పెట్టి రైలును వెనక్కి తోసేశాడు. ఇదంతా ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది ఒప్పుకుంటావా? ’’
‘‘ఆ విషయం దశాబ్దాల క్రితమే నిరూపితం అయింది. ’’
‘‘ కదా హీరో ఎంత బలవంతుడైనా ఎవరినైనా కొడితే వాడు భూమి మీద పడిపోవాలి కానీ గాలిలో ఎగరడం ఏమిటి? వాస్తవానికి భిన్నంగా కథలల్లుతున్నారు. కార్లు డివైడర్‌ను గుద్దుకుంటే నుజ్జ నుజ్జు అవుతాయి అంతే తప్ప హీరో కనె్నర్ర చేస్తే సుమోలు గాలిలో లేస్తాయా? ఎగురుతున్నాయి. హీరోలు ఆకాశంలో విమానాలను సైతం చిటికెన వేలితో అడ్డుకునేట్టున్నారు. ’’


‘‘ సినీ మ్యాక్సో, ఐ మ్యాక్సో ఏదో ఉంది కదా వీలున్నప్పుడు ఓ సారి అక్కడికెళ్లి చూడు. అంతా ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్లు ఎంతో కష్టపడి ఎంసెట్ రాసి సీటు పొందిన వీళ్లకు సైన్స్ గురిం తెలియదా? చూడోయ్ నువ్వు చెప్పిన వన్నీ నిజమే కానీ గట్టిగా తొడ కొడితే తొడ వాస్తుంది కానీ రైళ్లు ఆగవు అని భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని, సూర్యుడు వేడిగా ఉంటాడు అని ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఆపలేమని అన్నీ తెలుసు. సైన్స్ పాఠాలు వినీ వినీ విసుగనిపించే కదా వీళ్లు అబద్ధాలను తెరపై చూసేందుకు వచ్చేది. ఇక్కడ కూడా సైన్స్ పాఠాలే చెబితే క్లాస్ రూమ్‌లా సినిమా హాళ్లు కూడా బోసిపోతాయి. ఇదో మాయా ప్రపంచం. సినిమానే కాదు జీవితం కూడా మాయనే.
పంచె కట్టుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి బాబును కలిశారు. ఎందుకు కలిశావయ్యా అంటే రైతుల కోసం విజయవాడ వెళ్లి బాబును కలిశాను. సంక్షేమం కోసం ముచ్చటించాను అని చెప్పుకొచ్చారు. ఆ విషయం సెల్‌ఫోన్‌లో చెబితే పావలాతో అయిపోయేది కదా? ప్రత్యేక విమానం అవసరమా? దానికి డబ్బులు ఎవరిచ్చారు అదో సస్పెన్స్ స్టోరీ. ’’


‘‘ఇంతకూ పవన్ పర్యటన ఉద్దేశం ఏమిటి? రాజకీయ భవిష్యత్తు ఏమిటి?’’ ‘‘అదో సస్పెన్ థ్రిల్లర్. ఒక సినిమా నటుడు వస్తే ముఖ్యమంత్రి ఎదురేగి స్వాగతం పలకడం, అధికారులను పరిచయం చేయడం, మంత్రి ఎస్కార్ట్‌గా వెంట రావడం సస్పెన్స్ సినిమా కథలా లేదూ..!. పవన్ ఒక కథ రాసుకుని నటిస్తుంటే, బాబు తన మనసులో మరో కథకు డైరక్షన్ చేస్తున్నారు. ఇది రెండు గంటల్లో తేలే సినిమా కథ కాదని నడుస్తున్న సినిమా అని ప్రేక్షకులకూ తెలుసు.’’


‘‘ మరి నువ్వు చెప్పు ఇంతకూ పవన్ రాసుకున్న కథేమిటి? ’’
‘‘ కొన్ని సార్లు హీరో కాల్షిట్ లభించగానే షూటింగ్ మొదలు పెడతారు. కథ సెట్‌లో రాసుకుంటారు. పవన్ సినిమా కూడా అంతే ముందు షూటింగ్ ప్రారంభించి 2019 నాటికి అవసరం మేరకు కథ రాసుకుందామని పవన్ అనుకుంటున్నారు. ఎన్నో సినిమాలకు డైరెక్షన్ చేసి తల పండిన బాబు హీరో సినిమా కథకు ముగింపు ఎలా పలకాలో మనసులోనే అనుకుని డైరెక్షన్ చేస్తున్నారు. హీరో కథ హీరోదే, డైరెక్టర్ కథ డైరెక్టర్‌దే సినిమా ముగింపు కాలమే చెబుతుంది. ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే గాలిలో సుమో లేవడం సాధ్యమా? పవన్ రాజకీయాల్లో రాణిస్తాడా? అనే ఆలోచన మాని జరుగుతున్న సినిమాను చూసి ఏన్ జాయ్ చేద్దాం. ’’

బుద్ధా మురళి (జనాంతికం 15. 11.20 5)

2 కామెంట్‌లు:

  1. పంచెకట్టుతో పవన్ తుఫాను సృష్టించనున్నారు.

    సమస్యల సుడిగుండంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రక్షించే పవర్ ఆ పంచె కట్టు లో కనిపిస్తోంది :)

    జిలేబి

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం