31, జనవరి 2016, ఆదివారం

నేను హైదరాబాద్ ను ....

‘‘గందరోగళంగా కనిపిస్తున్నావ్ , నగరానికి కొత్తా?’’
‘‘కొత్త కాదు..  మీరంతా పుట్టక ముందు నుంచి ఉన్న పాత మీ అందరి కన్నా చాలా పాత.  నా సంగతి సరే ఇంతకూ నువ్వెవరివి? ’’
‘‘నేను పాదచారిని నడిచే బాట ఎక్కడైనా ఉందేమోనని వెతుకుతున్నాను. ఎక్కడ మాయమైందో తెలియడం లేదు. నువ్వేవరో? దేని కోసం నీ అనే్వషణో చెప్పనే లేదు. ’’
‘‘నేను హైదరాబాద్ నగరాన్ని. నా గురించి నేను తెలుసుకుందామని బయలు దేరాను’’
‘‘లోకేశ్ నువ్వేవరో నిన్ను వాళ్ల తాత ఎలా నిర్మించారో చక్కగా చెప్పారు కదా? ’’

‘‘ లోకేశెవరు? కులీకుతుబ్‌షా మనవడా? అలా ముఖం పెట్టావు ఈ హైదరాబాద్ నగరంలో నివసిస్తూ నగరాన్ని నిర్మించిన కులీ కుతూబ్‌షా తెలియదా? ఐదు వందల సంవత్సరాల క్రితం నన్ను నిర్మించి, దేవుని చల్లని చూపుతో అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివసించే విధంగా దీవించమని ప్రార్థించాడు. ఆయన కోరుకున్నట్టే ఇదో మినీ భారత్ అయింది. పుట్టిన పల్లెను ప్రేమించినంతగా హైదరాబాద్‌ను ప్రేమిస్తారు. నీకు కులీకుతూబ్‌షా తెలియదంటే నమ్మలేకపోతున్నాను’’
‘‘మొన్ననే లోకేశ్ బాబు కూడా చరిత్రను కళ్లకు కట్టినట్టు చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని వాళ్ల తాత నిర్మిస్తే, తండ్రి అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెడితే, ఆయన ఎక్కడికో తీసుకు వెళతానంటున్నారు. నువ్వు వినలేదా?’’
‘‘వినకపోవడం ఏమిటి? ఆ ఉపన్యాసాలు విన్న తరువాతే కదా నేనెవరో తెలుసుకోవాలని ఇలా బయలు దేరింది. ఇక్కడేవో ఎన్నికలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. వాళ్ల ఉపన్యాసాలు విన్నాను, బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి. అందుకే అయోమయంగా కనిపిస్తున్నాను. ‘మీరంటే గూగుల్ వెతుకు తారు. నేను కాస్త మనసు పెట్టి కళ్లు మూసుకుంటే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోతాను. నాకు కనిపిస్తున్న దానికి ఇక్కడ మైకుల్లో వాళ్లు చెబుతున్న దానికి ఏమాత్రం సంబంధం లేదు. తెలుగే సరిగా మాట్లాడలేని ఈ కుర్రాడు హిందీలో నా చరిత్ర చెబితే విని, వీళ్ల తాత గురించి వెతికాను. వీళ్ల తాత వైస్‌రాయ్ హోటల్ వద్ద బస్సుపై కనిపించాడు. మంచి నటుడు శ్రీరాముడు, రావణుడు, కర్ణుడు ఏ వేషం వేస్తే ఆ వేషంలో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. దేవుళ్ల పాత్రలో ఈయన నటించారా? దేవుళ్లు ఈయనలా నటించారా? అని సందేహించేంతగా పాత్రలో లీనమయ్యేవారు. పాపం అలాంటి పెద్దమనిషి వైఎస్‌రాయ్ హోటల్ వద్ద బస్సుపై నిలబడి తమ్ముళ్లూ భయపడకండి బయటకు రండి అంటూ వేడుకుంటుంటే, అభిమానులు చెప్పులు విసరడం చూశాక భూ కంపాలకు కూడా కదలని మహానగరాన్ని నేనే కదిలిపోయానంటే నా కళ్లల్లో నీళ్లు వచ్చాయంటే నమ్ము. వాళ్ల నాన్న, తాత, ముత్తాతల వంశం పుట్టక ముందే నేను ప్రపంచ పటంలో ఉన్నాను కదా వీళ్లు ననె్నప్పుడు ప్రపంచ పటంలో పెట్టారో?’’

‘‘అంత మాటంటున్నావ్ కానీ ఆయనే కనుక లేకపోతే నీ ముఖం ఎవరు చూసే వారు? ఆయన హైటెక్ సిటీ కట్టక పోతే హైదరాబాద్‌కున్న విలువేమిటి?’’
‘‘ నేను కనుక హైదరాబాద్‌ను 15నెలల్లో నిర్మించాను, మోదీ కూడా కట్టలేకపోయారు అంటూ ఆయన చెప్పుకుంటున్న మాటలు విన్నాను. నిజంగా అది నీ గొప్పతనం అయితే హైదరాబాద్‌లో 15నెలల్లో కట్టిన మొనగాడు, అమరావతిలో 19 నెలలైనా కనీసం ఓ టాయ్‌లెట్ కూడా కట్టలేకపోయారేమిటి? పోనీ ఇంకా మూడేళ్ల గడువు ఉంది కదా? అమరావతిలో మూడేళ్లలో ఓ హైటెక్ సిటీ కట్టించి చూపిస్తే బాగుంటుంది. నేదురుమళ్లి జనార్దన్‌రెడ్డి కాలంలో రూపకల్పన చేసిన హైటెక్ సిటీ అనే ఓ భవనం నాపై వీళ్ల నాన్న హయాంలో నిర్మించారు. అనేక మంది పాలకులు తమ తమ కాలంలో కొన్ని వందల భవనాలు నా పై నిర్మించారు. ఒక్క భవనం నిర్మించిన మెస్ర్తి ప్రపంచాన్ని తానే నిర్మించాను అనుకున్నట్టుంది. చంటి బాబు లోకల్ అంటూ నా చరిత్ర చెబుతుంటే బుర్ర తిరుగుతోంది. ’’
‘‘ ఐతే నువ్వు హైదరాబాద్ వన్నమాట? ’’
‘‘ అదే చెబుతున్నాను. నేను హైదరాబాద్‌నే కానీ నేనెవరినో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఆయనెవరో చక్కని ప్రాసలతో భలే మాట్లాడుతున్నారు. సినిమాల్లోకి వెళితే టాప్ డైలాగ్ రైటర్‌గా నిలుస్తారు. తరువాత డైరెక్షన్ చేయోచ్చు కూడా కానీ పాపం ఎండలో నిలబడి ప్రాసలతో జనాన్ని ఎంత నవ్విస్తున్నారో? ’’

‘‘నువ్వు చెబుతున్నది వెంకయ్య గురించా? ఆయన డైలాగ్ రైటర్ కాదు, గొప్ప రాజకీయ నాయకుడు. ’’
‘‘ అదే చెప్పబోతున్నా రైటర్ కాబోయి లీడర్ అయ్యారు. ఇంకో నాయుడితో కలిసి హైదరాబాద్‌ను మేమే సృష్టించామని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ తెరిచి చూస్తే హైదరాబాద్ పార్లమెంటుకు పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ వాళ్లే ఈయన్ని కింద పడేస్తే కర్నాటకలో తేలి పార్లమెంటులో ప్రత్యక్షం అయ్యారు. ’’
‘‘ కెసిఆర్‌ను కలువలేకపోయావా? చరిత్రను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా చెబుతారు’’
‘‘ గంగాజమునా తహజీబ్ అంటూ హైదరాబాద్ గురించి చెబుతున్నారు. హుస్సేన్‌సాగర్ తాగునీటి సరస్సుగా ఉన్నప్పటి కాలం నుంచి నగరాన్ని వర్ణించి చెబుతున్నారు. నిజమా? అనుకుని హుస్సేన్ సాగర్ నీళ్లు నోట్లో పోసుకున్నావనుకో చరిత్రలో కలిసిపోతాం అంతే’’

‘‘అయ్యో నీ గురించి నీకు ఆయనే చెప్పలేకపోయారంటే ఇంకెవరు చెబుతారు? ఆ అసదుద్దీన్ అని ఒకాయన ఉన్నారు. ఆయనకు తెలియని చరిత్ర లేదు. ’’
‘‘ ఆయన్ని  కలిశాకే మరింత గందరగోళం పెరిగింది. అందరూ హైదరాబాద్‌ను నిర్మించింది మేమే అంటే ఈయనేమో హైదరాబాద్‌నే నేను అంటున్నారు. మరి ఆయన హైదరాబాద్ అయితే నేనెవరిని? అనే ఆలోచన బుర్రను తొలిచేస్తుండడంతో ఇలా రోడ్డున పడ్డాను.’’
‘‘ చరిత్రకే చరిత్ర చెబుతున్న పసి కూనలను చూస్తుంటే జాలేస్తోంది. శ్రీరాముడంతటి దేవునికి నేనెవరినీ అనే సందేహం వచ్చి వశిష్టుని ఇంటి తలుపు తట్టాడు. ఎవరూ అని గురువు అడిగితే అది నేనెవరో తెలుసుకోవడానికే వచ్చాను అన్నారట! రాములోరికి గురువు ఉన్నారు నీకు అదీ లేరు. ఇంటింటి తలుపు తట్టు ఎవరో ఒకరు చెప్పకపోరు .’’
-బుద్దా మురళి (జనాంతికం 31-1-2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం