5, జూన్ 2016, ఆదివారం

తాతా మనవడు - లోక కళ్యాణం

‘‘సాటి మనిషిలోని మేధస్సును మనం ఒప్పుకోం. మేధావులందరూ ఎప్పుడో ఒకప్పుడు పిచ్చివాళ్లుగా ముద్ర పడిన వారే.’’
‘‘ఈ రోజుల్లో మేధావి అని పిలిస్తే సిగ్గుపడాలి కానీ, ఇంత బాధెందుకోయ్’’
‘‘నా బాధ లోకం గురించి. మేధావుల మాటలను తేలిగ్గా తీసుకునే సమాజం గురించి’’
‘‘అంత ఇదై పోవలసిన అవసరం లేదు. ఐన్‌స్టీన్ లాంటి మహా మహా మేధావులనే పిచ్చి వాళ్లను చూసినట్టు చూశారు. కొందరికైతే ఉరిశిక్ష వేశారు. రాళ్లతో కొట్టారు. దేశ బహిష్కరణ శిక్ష విధించారు.?’’
‘‘నా సంగతి కాదు. ఒక మాట చెప్పు. అమెరికా వెళ్లి వచ్చిన వాడు అక్కడి సంగతులు చెబుతుంటే నువ్వు అమెరికా వెళ్లలేదు కాబట్టి అసలు అమెరికా అనే దేశమే లేదు అని వాదిస్తే ఎలా ఉంటుంది’’
‘‘ చీ..చీ.. అలా ఎందుకు వాదిస్తాను. అమెరికాను కనిపెట్టింది నేనే, అని ఎవడైనా చెబితే వ్యతిరేకిస్తా కానీ అమెరికా లేదని నేనెందుకంటాను?’’
‘‘ నేనూ అదే చెబుతున్నాను. ఒక విషయం మనకు తెలియదనుకో ఇక ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకుంటే ఎలా? తెలిసిన వారి తెలివిని మెచ్చుకోవాలి. మనుషుల్లో ఇంత సంకుచితత్వం ఏంటోయ్? ’’
‘‘ ఇంతకూ ఏమైంది? ’’
‘‘అభిమన్యుడు తెలుసుకదా? తల్లి కడుపులో ఉండగానే యుద్ధ తంత్రం తెలుసుకున్నాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు.’’
‘‘ఔను మహాభారతంలో ఉంది. అనుమానం ఎందుకు? ’’
‘‘ అష్టావక్రుడి గురించి చదివే ఉంటావు. తన తండ్రి పాండిత్యాన్ని తల్లి కడుపులో ఉండగానే గ్రహించి తప్పును ఎత్తి చూపుతాడు. తండ్రికి ఆగ్రహం కలిగి అష్ట వంకరలతో అష్టావక్రునిగా పుట్టమని శపిస్తాడు. తల్లి గర్భంలో ఉండగానే అంత తెలివి ఉన్నందుకు సంతోషించాలి కానీ ఇలా శపించడం ధర్మమా? ’’
‘‘అస్సలు కానే కాదు.. అయితే పురాణాల్లో ప్రతి శాపానికి ఓ కారణం ఉంటుంది. శాపలన్నీ లోక కళ్యాణం కోసమే. ఐనా అప్పుడెప్పుడో పురాణాల కాలంలో జరిగిన దానికి ఇప్పుడు బాధపడుతున్నావంటే నువ్వు రోజు రోజుకు చాలా సెన్సిటివ్ అవుతున్నావోయ్’’
‘‘ఆనాటి సంగతికి కాదు ఈనాటి బాలమేధావుల విషయంలో సమాజం చిన్నచూపు చూడడం బాధేస్తోంది. ఏమైందో చెప్పి నీ బాధను కొనసాగించు’’
‘‘పెదబాబుకు ప్రధానమంత్రి పదవి చేపట్టే చాన్స్ వస్తే, కొద్ది నెలల టెంపరరీ ఉద్యోగం ప్రధానమంత్రి పదవి కన్నా కొన్ని ఏళ్ల టెంపరరీ ఉద్యోగం ముఖ్యమంత్రి పదవే లాభసాటి అని చినబాబు సలహా ఇచ్చారు. ’’
‘‘వావ్ ఎంత రాజకీయ పరిజ్ఞానం. పొలిటికల్ సైన్స్ స్టూడెంటా? ’’
‘‘కాదు కామర్స్ స్టూడెంట్?’’
‘‘అందుకేనా ఏది లాభసాటో చక్కగా చెప్పారు’’
‘‘చెప్పేది పూర్తిగా విను. ఎటూ తేల్చుకోలేక ఎంఎ ఎకనామిక్స్ పెదబాబు ఆలోచిస్తుంటే, తొమ్మిదో తరగతి పాల బుగ్గల పసి వయసులోనే చినబాబు ఈ చిక్కుముడిని ఈజీగా విప్పేసి పూవు పుట్టగానే పరిమళిస్తుంది అని స్కూల్ తెలుగు టెక్ట్స్ బుక్‌లో చదువుకున్న పాఠాన్ని ఆచరణలో చూపించారు. దానికి మనం మెచ్చుకోవాలా? వద్దా ? అది చెప్పు ముందు. మెచ్చుకునే విశాల హృదయం లేకపోయినా పరవాలేదు పైగా అనుమానిస్తున్నారు. మేధావులందరూ ఇలా అవమానాలపాలైన వారే’’
‘‘చినబాబు నిజంగా చెప్పాడంటారా? మరి అప్పుడేమో బాబుగారు తెలుగు గాలి, తెలుగు నేల, తెలుగు నీళ్లు, తెలుగు గోంగూర, తెలుగు ఆవకాయను వదిలివెళ్లను. తెలుగు వాడి అభివృద్ధి అంతు చూసేంత వరకు ఇక్కడే ఉంటాను అందుకే ప్రధానమంత్రి పదవి త్యాగం చేశానని 96 నుంచి మోదీ హయాం వరకు చెబుతూనే ఉన్నారు. ఇరవై ఏళ్ల తరువాత తూచ్ అది కాదు అసలు నిజం వేరు. జీనియస్ ఐన మా అబ్బాయి లెక్కలేసి చెప్పడంతో నేనా నిర్ణయం తీసుకున్నాను అని చెబుతున్నారు. ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఇది నిజమే అంటావా? ఎంఎ కన్నా తొమ్మిదో తరగతికి ఎక్కువ తెలుస్తుందంటావా?’’
‘‘నాకు అదే చిర్రెత్తుకొస్తుంది. మేధావులను ఇలా అనుమానించడం తగదు. పురాణాల మీద నీకు నమ్మకం ఉంది కదా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాన కాంతులు వెదజల్లిన వారు మనకు ఎంత మంది లేదు. అంతెందుకు శ్రీకృష్ణుడు తెలుసు కదా?’’
‘‘ఎందుకు తెలియదు? రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు నేనూ చూశాను.’’
‘‘ సర్లే ఆ సంగతి ఎందుకు కానీ శ్రీకృష్ణుడు అంతకు ముందు నుంచే ఉన్నారు. శ్రీకృష్ణుడు పసికూనగా ఉన్నప్పుడే ఎంత మంది విలన్లను చంపేశాడు. తెలుగుసినిమాల్లో ముంబై విలన్లను చూసే మనం బెంబేలెత్తిపోతున్నాం. అలాంటిది పసికూనగానే శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో నుంచి వెళ్లడానికి దారి చేశాడు. కాళీయునిపై నృత్యం చేశాడు. లేడీ విలన్ అని జాలి కూడా చూపకుండా కంటి చూపుతో చంపేశాడు. ఇవన్నీ నిజం కాదంటావా? నీలో నాస్తిక భావాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి గమనిస్తున్నాను’’
‘‘అయ్యో అపార్ధం చేసుకోకు ప్రతి రోజు లేవగానే దేవున్ని మొక్కుతాను. ప్రతి శనివారం గుడికి వెళతాను. దైవభక్తి విషయంలో నన్ను అనుమానించకు. వాళ్లంటే దేవుళ్లు కానీ ఈ కాలంలో పిల్లాడు అంత ముందు చూపుతో గొప్ప సలహా ఇవ్వడం, ఈ చారిత్రక సత్యాన్ని కమ్యూనిస్టుల్లా ఈయన పాతికేళ్ల తరువాత బయటపెట్టడం ఎందుకో.... ?’’
‘‘అదే అంటున్నాను. ఉన్నారో లేదో తెలియని దేవుళ్లు చేశారన్నది నమ్ముతాం కళ్ల ముందు మానవ రూపంలో కనిపించే మానవ దేవుళ్ల మేధస్సును ఒప్పుకోం. ’’
‘‘దేవుళ్లు ఏదీ చేసినా లోక కళ్యాణం కోసమే అని ప్రతి పౌరాణిక సినిమా చాటి చెప్పిన సత్యం. చినబాబు సలహా కూడా లోక కళ్యాణం కోసమే. సలహా ఇచ్చి ఉండకపోతే మొత్తం దేశమే ప్రయోగ శాలగా మారేది. సలహాతో దేశాన్ని రక్షించినట్టే కదా ’’
‘‘అంతే .. అంతే..’’
‘‘ఇంకో సందేహం. 96కు ఏడాది ముందే కదా? తాతయ్యను దించేయడానికి ఇదే సరైన సమయం అని మనవడే సలహా ఇచ్చి ఉండొచ్చంటావా?’’
‘‘ఈప్రశ్నకు ఇంకో పాతికేళ్ల తరువాత చినబాబు సమాధానం చెబుతారు’’
బుద్దా మురళి (జనాంతికం 5-6-2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం