2, జూన్ 2016, గురువారం

తెలంగాణా జైత్ర యాత్ర

‘‘తెలంగాణ సాధించామని సంబరపడుతున్నారు. ఈ సంబరాలు ఎక్కువ రోజులు ఉండవు. ఆరునెలలు గడిస్తే కెసిఆర్‌పై తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరిగి ఆంధ్రలో కలిపేయమని ఉద్యమిస్తారు.’’ తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా ఉన్న టిజి వెంకటేశ్ చెప్పిన మాటలివి. ఆయన కోరుకున్న తెలంగాణ అది. ఇటీవల ఒక టీవి చానల్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు లైవ్‌లో మాట్లాడుతుంటే ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్ చేసి ‘‘సార్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం మా నాయకుల వల్ల కాదు. కెసిఆర్ ప్రయత్నిస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది. దయచేసి మీరీ ప్రయత్నం చేయాలి’’ అని అభ్యర్థించారు. ఉద్యమ కాలంలో మీడియాలో టిజి వెంకటేశ్ పేరు ఎక్కువగా వినిపించేది. ఇప్పుడాయన రాజకీయంగా తెరమరుగయ్యారు.


ప్రత్యేక హోదా కోసం ఎవరు ప్రయత్నించినా సాధ్యం కాదు. కానీ ఒక రాష్ట్రం పని చేస్తున్న తీరుపై చివరకు ఆ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రజల్లో సైతం ఇలాంటి నమ్మకం కలిగిందంటే అది తెలంగాణ సాధించిన విజయమే. ఏ ప్రభుత్వం అయినా ప్రజల విశ్వాసాన్ని పొందడం కన్నా మించిన విజయం ఉండదు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొందనేందుకు ఇదే నిదర్శనం. ఈ రెండు సంఘటనలకు మధ్య రెండేళ్ల కాలం ఉంది. తెలంగాణ సాధించిన అభివృద్ధి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో కలిగించిన విశ్వాసం కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లోనే కాకుండా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్‌లో సైతం తెలంగాణ ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. ఒక వ్యక్తి టీవిలో మాట్లాడిన దాన్ని అందరి అభిప్రాయంగా భావించలేం నిజమే. కానీ హైదరాబాద్ జనాభాలో మూడొంతుల మందిమి మేమే, 60లక్షల జనాభాలో 50 లక్షల మంది మావారే అంటూ ఆంధ్ర నాయకులు ఉద్యమ కాలంలో లెక్కలు చెబుతూ వచ్చారు. అలాంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పక్షం రికార్డు స్థాయిలో 99 డివిజన్లలో విజయం సాధించడం అంటే రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని టిఆర్‌ఎస్ సాధించిందనేందుకు బలమైన ఉదాహరణ.
ఆవిర్భవించిన ఆరునెలల్లో తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని నమ్మిన వాళ్లు, కావాలని కోరుకున్న వారు లెక్కలేనంత మంది ఉన్నారు. టిజి వెంకటేశ్ లాంటి ఒకరిద్దరు తమ మనసులోని మాట బయటకు చెప్పారు. అలా బయటకు చెప్పని రాజకీయ నాయకులు, మేధావులు, సినిమా పెద్దలు, అన్ని రంగాల్లోనూ లెక్కలేనంత మంది ఉన్నారు. ‘మీకు పాలించడం చాతకాదు, మీకు తినడం నేర్పింది మేమే. సంస్కృతి నేర్పింది మేమే’ అని ఒక ఆంధ్ర ఎంపినే ఉద్యమ కాలంలో బహిరంగంగా విమర్శించారు. ఉద్యమ నేతగా కెసిఆర్ లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షుసులే అన్నట్టు ఆంధ్రలంతా తెలంగాణ వ్యతిరేకులే అని విమర్శించినా, తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే కంటితో తీస్తాను అని భరోసా ఇచ్చారు. ఉద్యమ కాలంలో అటు ఇటు రెండు వైపుల నుంచి పరుష వాఖ్యలు సహజమే. ఆంధ్రలో కలిపేయమని తెలంగాణ ప్రజలే ఉద్యమిస్తారని గట్టిగా నమ్మిన ఆంధ్ర నాయకుల మాటలు ఎలా ఉన్నా, తెలంగాణ ఆవిర్భవించిన తరువాత పోరాడి సాధించుకున్న తెలంగాణ వారిని సైతం ఒక విధమైన అనుమానం వెంటాడేది. తెలంగాణ ప్రయోగం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే విఫలం అవుతుందా? అనే అనుమానం ఎదో మూల మెదడును తొలిచేది. శాపనార్థాలను, విమర్శలను, భయాలను ఆందోళనలను,అనుమానాలను అన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైన పాలన సాగించింది.

 కాళ్లు కడిగిన రోజే కాపురం చేసే తీరు తెలుస్తుంది అన్నట్టు మొదటి రెండేళ్లు దేశం దృష్టిని ఆకట్టుకునే విధంగా పాలన సాగించిన తెలంగాణ దేశంలో తమకు తిరుగు లేదని నిరూపించుకుంటోంది.
తెలంగాణ అవసరాలు ఏమిటో సరిగ్గా గుర్తించిన ప్రభుత్వం ఆ దిశలోనే రెండేళ్ల పాలన సాగించింది. ఆత్మగౌరవ ఉద్యమం, స్వయం పాలన కోసం సాగించిన ఉద్యమం, అవమానం, వివక్షపై తిరుగుబాటు, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరే కోణంలో చూపినా, ఉద్యమంలో ఎవరు ఏ కారణంతో పాల్గొన్నా సాధించిన తెలంగాణ అభివృద్ధి పథంవైపు పయనిస్తేనే ఉద్యమానికి సార్థకత. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన మంచినీటి అందించే పథకానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇచ్చింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు ఏటా 25వేల కోట్లు కేటాయిస్తోంది. మిషన్ కాకతీయ విజయవంతం అయితే గ్రామాల స్వరూపం మారుతుంది. ఈ పథకాలు విజయవంతంగా అమలు చేసే దిశలో ప్రభుత్వం సరైన అడుగులే వేస్తోంది అని ఉప ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇచ్చారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు తెలంగాణ భవిష్యత్తును తీర్చి దిద్దే విధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కోటి ఎకరాలకు సాగునీరు వంటి పథకాలు చేపట్టడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఎప్పుడూ లేని విధంగా ఆశావాహ దృక్ఫథం కనిపిస్తోంది. వరుసగా రెండేళ్ల కరువు మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పెద్ద సమస్యలు అంటూ ఏమీ రాలేదు.


పాలనలో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రభుత్వం రాజకీయంగానూ కొత్త సంప్రదాయాలను నెలకొల్పితే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. టిఆర్‌ఎస్ మంత్రివర్గంలో ఉన్న దాదాపు సగం మంది సమైక్యవాదం వినిపించిన వారు, సమైక్యవాద పార్టీ కోసం పని చేసిన వారున్నారు. చంద్రబాబుతో పాటు విభజనను అడ్డుకోవడానికి బెంగాల్ వెళ్లి మమతను కలిసిన వారూ ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో టిడిపిలో ఉండి తరువాత టిఆర్‌ఎస్‌లో చేరిన వారూ ఉన్నారు. ఇలాంటి వారు ఎవరూ వద్దని పార్టీ మడికట్టుకుని ఉంటే తెలంగాణ విఫల ప్రయోగంగా మిగిలిపోయి ఉండేది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు నవ్వుకునే విధంగా ఉండేది. దేశంలోని బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి దేశం దివాళా తీసిన సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి జార్ఖండ్ ఎంపిలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారు. ఇది నైతికమా అనైతికమా అంటే కచ్చితంగా అనైతికమే అంటారు. నైతికతకు కట్టుబడి మడికట్టుకుని పివి కూర్చొని ఉంటే బంగారం తాకట్టు పెట్టే దశ నుంచి విదేశాలను అడుక్కునే దశకు చేరుకుని ఉండేది దేశం. కానీ పివి అలా చేయడం వల్ల ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం వల్ల దేశం ఈరోజు ప్రపంచంలోనే ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. రాజ్యాన్ని కాపాడుకోవడం రాజు తొలి ధర్మం. 14ఏళ్లు నాతో పాటు ఉద్యమం చేసిన వారే పార్టీలో ఉండాలి, వారికే టికెట్లు అని కెసిఆర్ మడికట్టుకుని ఉంటే పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు.


ఏర్పడితే ఎంత అద్భుతంగా పాలించుకోవచ్చు, రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చునో చెప్పిన కెసిఆర్ అధికారంలోకి వస్తేనే వాటిని అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎవరు పార్టీలో చేరారు, ఎవరు పార్టీ మారారు అంటూ ఎవరెన్ని విశే్లషణలు చేసినా సాధారణ తెలంగాణ ప్రజలు మాత్రం ఎన్నికల ఫలితాల రూపంలో ప్రభుత్వం సరైన దారిలోనే వెళుతోందని చెబుతున్నారు. విడిపి అసోసియేట్స్ ఇటీవల దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులపై జరిపిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచారు. తెలంగాణ పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అభినందనల్లో ముంచెత్తారు. టిఆర్‌ఎస్‌కు సాధారణ మెజారిటీ కన్నా కేవలం మూడు సీట్లు ఎక్కువ వచ్చాయి. శాసన మండలి ఎన్నికల సమయంలో టిడిపి నాయకత్వం కొందరు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించింది. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే ఐదారుగురు ఎమ్మెల్యేలను టిడిపి తమవైపుతిప్పుకుని ఉండేది. ప్రభుత్వం ఇరకాటంలో పడేది. పాలించడమే కాదు రాజకీయమూ తెలుసు అని తెలంగాణను అస్థిరపరచాలని చూసిన వారి ఎత్తుగడను తిప్పికొట్టడమే కాకుండా ఏడాది తిరిగే సరికల్లా వారికి అస్థిత్వమే లేకుండా చేయడంలో రాజకీయంగా టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.


తెలంగాణ ఆవిర్భవించినా, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలు మావే అన్నట్టుగా కొందరి వైఖరి ఉండేది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే ఏ పార్టీకి లేనంత మెజారిటీ టిఆర్‌ఎస్‌కు లభించింది. పాలేరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. తెలంగాణలో టిఆర్‌ఎస్ జైత్ర యాత్ర హైదరాబాద్, పాలేరుతో సంపూర్ణం అయింది. సాధారణంగా ఎంత గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడైనా అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది రెండేళ్లు గడిచిన తరువాత ప్రజల్లో కొంత వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. నరేంద్ర మోదీ విషయంలో సైతం అదే జరిగింది. కానీ చిత్రంగా తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కన్నా, సాధారణ ఎన్నికల సమయంలో కన్నా అధికారంలోకి వచ్చిన తరువాత టిఆర్‌ఎస్ బలం మరింతగా పెరిగింది. ప్రజల్లో టిఆర్‌ఎస్ పట్ల విశ్వాసం పెరిగింది. అనేక రాష్ట్రాల వారున్న గ్రేటర్‌లో ఘన విజయమే దీనికి నిదర్శనం.


గతంలో కనీసం డిపాజిట్ తెచ్చుకునే స్థితిలో కూడా లేని నారాయణఖేడ్, పాలేరు వంటి నియోజక వర్గాల్లో సానుభూతి పవనాలకు ఎదురొడ్డి ఘన విజయం సాధించింది. టిఆర్‌ఎస్ ఫక్తు ఒక రాజకీయ పార్టీనే అని కెసిఆర్ ప్రకటించినా, ఒక రాజకీయ పార్టీగానే విపక్షాలు టిఆర్‌ఎస్‌ను విమర్శించినా తెలంగాణ ప్రజలు మాత్రం అలా భావించడం లేదు. అలా భావించి ఉంటే ఉప ఎన్నికలను రెండు రాజకీయ పార్టీల మధ్య పోటీగా ప్రజలు చూసి ఉండేవారు. అలా చూసి ఉంటే టిఆర్‌ఎస్‌కు ఈ స్థాయిలో విజయం లభించి ఉండేది కాదు. తెలంగాణ విజయాన్ని తెలంగాణ ప్రజలు తమ విజయంగా భావిస్తున్నారు. మా రాష్ట్రం మా పాలన, మా ప్రభుత్వం అనే బలమైన భావన ప్రజల్లో కలిగించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విజయం సాధించింది. ప్రభుత్వం పట్ల ఆదే స్థాయి నమ్మకం తెలంగాణలో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారిలో సైతం కలిగించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. రెండేళ్ల పాలన ముగిసింది. రాబోయే రోజులు చెప్పిన మాటలు వేగంగా ఆచరణలో చూపాల్సిన కాలం. తాను చేపట్టిన పథకాల అమలే తెలంగాణ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష.- బుద్దా మురళి (2-6-2016 ఎడిట్ పేజి )
తెలంగాణా జైత్ర యాత్ర 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం