17, జులై 2016, ఆదివారం

నగ్న సత్యం

‘‘నీకో నగ్న సత్యం చెప్పాలా?’’
‘‘సత్యం నగ్నంగా ఉండదు. సత్యానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన దస్తులు వేసి చూస్తుంటారు. సత్యమే దైవం. దైవం నిరాకారుడు. సత్యం కూడా ఆకారం లేనిది. చంద్రబాబుకు పచ్చగా కనిపించిన సత్యం జగన్‌కు అసత్యంగా కనిపించవచ్చు. కెసిఆర్‌కు సత్యం గులాబీ రంగులో కనిపిస్తే జానారెడ్డికి తెల్లగా కనిపించవచ్చు. భార్యాభర్తలిద్దరి దృష్టిలోనే సత్యం వేరువేరుగా ఉంటుంది. సత్యం అంటే నీ కోణంలో నువ్వు చూడడం. ఏదీ సంపూర్ణ సత్యం కాదు’’


‘‘ఇలాంటి మింగుడు పడని విషయాలు మనకెందుకు కానీ ఏంటీ వార్తలు?’’
‘‘మోడీ ప్రభుత్వంలో తమన్నా చేరే అవకాశం. మోడీ పాలనా తీరు బాగాలేదని వెంకయ్యనాయుడును ప్రధానమంత్రిని చేస్తే బాగుంటుందని వాజ్‌పాయి మనోగతం. కుష్బుకు జయలలిత మంత్రివర్గంలో చోటు. సినిమాలో హీరోగా నటించాలా? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నటించాలో తేల్చుకోలేక పోతున్న అజహరుద్దీన్. హీరోగా ఒప్పుకో భవిష్యత్తు ఉంటుందని మాజీ హీరోయిన్, మాజీ భార్య సంగీతా బ్రిజ్‌లానీ సలహా. పిసిసి బాధ్యతలు తీసుకుంటే చరిత్ర తప్ప భవిష్యత్తు ఉండదని తాజా భార్య సలహా. కట్టప్పకు రాజవౌళికి మధ్య ఘర్షణ. ప్రభాస్‌ను అకారణంగా నాతో చంపించావు అని రాజవౌళిని నిలదీసిన కట్టప్ప. టిఆర్‌ఎస్‌లోకి ఇలియానా? బక్కగా ఉండడంలో భావసారూప్యత ఉందని అమెను పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కెసిఆర్ ప్రయత్నం. అడ్డుకుంటున్న హరీశ్‌రావు. చాలా ఇంకా ఆసక్తికరమైన వార్తలు చెప్పమంటావా?’’


‘‘ఇవన్నీ వెబ్‌సైట్స్‌లో పల్లీ బఠానీ వార్తలు. నేనడిగింది మీడియాలో వార్తల గురించి.’’
‘‘ పల్లీ బఠానీ వార్తలా?అదేంటి? ’’
‘‘రాసేవాళ్లు చదివే వాళ్లు ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కాలక్షేపం కోసం పాప్‌కార్న్ తిన్నట్టు అన్నమాట! నాకు పల్లీ బఠానీలే ఇష్టం అందుకే అలా అన్నాను’’
‘‘ఇప్పుడు అన్ని వార్తలు ఒకేలా ఉంటున్నాయి.’’
‘‘ఆ వార్తల్లో ఒక్కటన్నా నమ్మేట్టు ఉందా?’’
‘‘ హీరో వీరోచితంగా ఫైట్స్ చేస్తే చూసి కాసేపు సంతోషపడతాం అంతే కానీ నిజంగా అది సాధ్యమా? ఆని థియోటర్ నుంచి బయటకు వచ్చాక ఆలోచిస్తామా? కాలక్షేపానికి కాసేపు చదివి వదిలేస్తారు’’


‘‘ ముందు నీకే చెబుతున్నాను . బ్రహ్మాండమైన కుంభకోణం బద్ధలు కానుంది’’
‘‘ఏంటా కుంభకోణం బోఫోర్స్ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలేమైనా బయటపెడతావా? మరింకేంటి 2జి స్కామ్, యూరియా స్కామ్, బొగ్గు స్కామ్, చెక్కర స్కామ్, బెల్లం స్కామ్, గడ్డి స్కామ్’’
‘‘ అధికారంలో ఎవరున్నా ఇవి మామూలే. ఇలాంటి వాటిని లైట్‌గా తీసుకోవాలి.’’
‘‘నువ్వే చెప్పు ?’’
‘‘హరిత హారం ’’
‘‘ హరిత హారంలో వెయ్యి కోట్ల కుంభకోణం అని కాంగ్రెస్ నేతలు చెబితే ఇప్పటి వరకు ఖర్చు చేసిందే 250 కోట్లు అని ప్రభుత్వం చెబుతోంది . జానారెడ్డిగారు లెక్కల్లో ఎక్స్‌ఫర్ట్ . 250 కోట్లలో వెయ్యి కోట్ల కుంభకోణం ఎలా సాధ్యం?’’
‘‘చెబితే కళ్లు తిరుగుతాయి. లక్షల వేల కోట్ల కుంభకోణం. కుంభకోణాన్ని బయటపెడితే చరిత్రను తిరగ రాయాల్సి ఉంటుంది.
కమ్యూనిస్టు సానుభూతి పరులు రాసిన చరిత్రను అటకెక్కించి తమ భావ జాలంతో బిజెపి కొత్తగా రాయిస్తున్న చరిత్ర గురించి కాదు. దాదాపు రెండువేల ఏళ్ల నుంచి మనం గుడ్డిగా నమ్ముతున్న చరిత్ర కు సంబంధించిన  దాని గురించి చెప్ప బోతున్నాను ’’
‘‘జరుగుతున్న చరిత్రనే టీవిల్లో వాళ్ల వాళ్ల రంగులతో చూపిస్తున్నారు. ఇక రెండువేల ఏళ్ల క్రితం నాటి చరిత్రను నిస్పక్షపాతంగా చెప్పడం, ఊహించడం సాధ్యమా? చెప్పు ఏం చేస్తాం.’’
‘‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడు రెండువేల ఏళ్ల నుంచి చరిత్ర మనను మోసం చేస్తూ ఉంది కదా? ఇంతకూ అశోకుడు నాటించింది మొక్కలా? చెట్లా?’’
‘‘???’’
‘‘కళ్లు తిరుగుతున్నాయి కదూ? ఒక్క ప్రశ్నకే ఇలా ఐతే ఎలా? ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. హరిత హారం అంటూ కెసిఆర్ హడావుడి చేయడంతో కాంగ్రెస్‌లో ఎంతో మంది మేధావులు మేధోమథనం చేసి ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. మొక్కలు నాటితే వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటితే వర్షాలు కురవవు. చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు కురుస్తాయి కానీ కెసిఆర్ మొక్కలు నాటితే అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కదా? కోట్లది మొక్కల చెట్లయితే అవి పీల్చుకోవడానికి కార్బన్‌డై ఆక్సిడ్ ఎక్కడి నుంచి తెస్తారు. కోట్లాది కొత్త చెట్లు వదిలే ఆక్సిజన్‌కు ఇరుగు పొరుగు రాష్ట్రాల వాతావరణాన్ని ఉపయోగించుకుంటారా? దీనిపై ఒప్పందాలు జరిగితే బయటపెట్టాలి. టీవి చర్చల్లో ఈ ప్రశ్న అడిగితే సమాధానం చెప్ప లేక నీళ్లు నములుతున్నారు.’’
‘‘ఇది సరే భారీ కుంభకోణం అన్నావు.? ’’
‘‘ ఒక్క చెట్టు తన జీవిత కాలం దాదాపు మూడు లక్షల విలువైన గాలి, పండ్లు, కర్ర ఇస్తాయని ఆ మధ్య ఒక లెక్క తేల్చారు. అంటే 240 కోట్ల మొక్కలు చెట్లయితే వాటిని మూడు లక్షలతో భాగిస్తే, వచ్చే అంకె ఎంత? ఇది ఎవరికి చెంతుతుంది. ఈ మొక్కలు చెట్లయ్యాక ఇన్ని లక్షల కోట్లు ఎవరికి చెందుతాయి ? వీటి లెక్కలు తేలాలి? ’’


‘‘ ఆలెక్కలు సరే నువ్వేమయినా మొక్కలు నాటావా? ?’’
‘‘ నేనేమన్నా అమాయకున్నననుకున్నావా? మొక్కలు కనిపించగానే అధికార పక్షం గుర్తుకొస్తుంది.  టిఆర్ స్ రహిత తెలంగాణ మా  టార్గెట్ . మొక్కల రహిత తెలంగాణ మా లక్ష్యం. అందుకే మేం అధికారంలోకి రావడానికి మొక్కలకు దూరంగా ఉంటాం’’


‘‘ మీ తెలివి తేటలను చూస్తే మీపై ప్రజలకు జాలి కలగడం ఖాయం. అధికారం మాట ఎలా ఉన్నా అడవుల పాలవుతారనిపిస్తోంది. కెసిఆర్ పుట్టక ముందు నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమిపై చెట్లున్నాయి. మొక్కలను ఒక పార్టీ సింబల్‌గా మార్చి మీ రాజకీయ జీవితాన్ని ఎడారి పాలు చేసుకోకండి. వెళ్లి ఒక మొక్క నాటి ప్రాయశ్చిత్తం చేసుకో’’
‘‘నాకు కోపం వస్తే చెట్ల నుంచి వస్తుంది కాబట్టి ఆక్సిజన్ కూడా పీల్చను .’’ 
‘‘నీ ఇష్టమ్ కానీ నువ్వో నగ్న సత్యం చెప్పావు కదా .. నేనో నగ్న సత్యం చెప్పాలా ? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అని ఒక వైపు ఒప్పుకొంటూ మరో వైపు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎందుకు దూరం పెట్టారో తెలుసా ? ఇందుకే .. ’’
-బుద్ధా మురళి (జనాంతికం 17-7-2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం