24, జులై 2016, ఆదివారం

రజనీకాంత్- చిరంజీవి- కన్యాశుల్కం

‘‘అబ్బాయి కమల్ హాసన్ అంత అందగాడు. ఐటి కంపెనీలో  ఉద్యోగం
నెలకు లక్ష.. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ రెండు, బ్యాంకులో డిపాజిట్. ఐనా అమ్మాయి నో చెప్పింది’’
‘‘ఎందుకు? ’’
‘‘కబాలి మొదటి రోజు మొదటి ఆటకు టికెట్ సంపాదించగలవా? అని పెళ్లి చూపుల్లో అమ్మాయి అడిగితే  అబ్బాయి నా వల్ల కాదు అన్నాడట! దాంతో నన్నేం  సుఖపెడతావు సంబంధం క్యాన్సిల్ అంది’’
‘‘ బాబూ ఈ జోకు కబాలి విడుదలకు ముందుది తరువాత సీన్ మారింది’’
‘‘కబాలి ఎలా ఉందట!’’
‘‘అభిమానులను అలరించిందని కొందరు, కబాలి కాదు బలి అని మరి కొందరు పోటాపోటీగా సామాజిక మాధ్యమాల్లో రివ్యూలు రాసేస్తున్నారు. ’’
‘‘ఇంతకూ ఎలా ఉందో చెప్పలేదు’’
‘‘ఎలా ఉంటే మనకేంటి రివ్యూలు చదవడమే తప్ప సినిమాలు చూసే అలవాటు లేదు’’
‘‘ఓ పెద్దాయన్ని అడిగితే బలవంతంగా 30లక్షలకు కొన్న బిక్షగాడు సినిమా 18 కోట్లు వసూలు చేసి బయ్యర్‌ను కోటీశ్వరున్ని చేసింది. 11కోట్లకు కొన్న కబాలి బయ్యర్‌ను బికారిని చేసింది అని చెప్పాడు. ’’
‘‘లోకం తీరు అంతేనోయ్ అభిమానులు చూసిన కబాలి, విమర్శకులు చూసిన కబాలి ఒకటే.. కానీ ఎవరి కోణంలో వాళ్లు చూశారన్నమాట! సినిమానే కాదు ప్రతి దాన్ని ఎవరి కోణంలో వాళ్లు చూస్తారు. అనార్కలి అంత అందగత్తే ఏమీ కాదు అని తండ్రి మందలిస్తే నా కళ్లతో చూడు అని సలీమ్ అన్నాడట! ఏమైనా రజనీ ఎన్టీఆర్ కన్నా గ్రేట్’’
‘‘ఎన్టీఆర్ 60ఏళ్ల వరకు హీరోగా నటించవచ్చునని తెలుగునాట నిరూపిస్తే  రజనీ 65 ఏళ్ల వయసులో హీరోగా నటించడమే కాకుండా అనేక దేశాల్లో రజనీ మానియా సృష్టించవచ్చునని నిరూపించారు. రామకృష్ణ మఠంలో ఉపన్యాసాలు ఇవ్వాల్సిన వయసులో కబాలి అంటూ ఆ డైలాగులు చెప్పిన తీరు అభిమానులకు వెర్రెక్కించడం చిన్న విషయం కాదు. ఆ ఒక్క డైలాగు చాలు అంటున్నారు?’’
‘‘రాజకీయాల్లో కాకుండా సినిమాల్లో నటించే అల్లుడు దొరకడం రజనీకాంత్ అదృష్టం, ఎన్టీఆర్ దురదృష్టం ’’
‘‘ఎన్టీఆర్‌కు రజనీకాంత్‌కు పోలికేంటి? చిరంజీవి, రజనీకాంత్‌ను పోల్చాలి కానీ’’
‘‘ ఆ పోలికలు కూడా జరుగుతూనే ఉన్నాయి కదా? చిరంజీవి 150 సినిమా ఎలా ఉంటుందో? ఇంతకూ కథేంటో? ’’
‘‘ఇంత వరకు ప్రపంచంలో ఎవరూ టచ్ చేయని కథ తన వద్ద ఉందని చిన్నికృష్ణ చెబుతున్నాడు కదా? ’’
‘‘ అంటే ఆయన నమ్ముకున్న  ఇంగ్లీష్ సినిమా సిడి ఎవరి కళ్లల్లోనూ పడలేదని ఆయన ధీమా నేమో’’
‘‘చిరంజీవికి తమన్న హీరోయిన్ అట కదా? ’’
‘‘ఐతే కచ్చితంగా అది కన్యాశుల్కం అవుతుంది?’’
‘‘ఈరోజుల్లో కన్యాశుల్కం కథతో సినిమా తీసేవారెవరు? ఆ రోజుల్లో కన్యాశుల్కంలో గిరీశంగా నటించిన ఎన్టీఆరే ఇది నీ సినిమా, నేను నటించాల్సింది కాదని గిరీశంగా నాటకాల్లో నటించిన పాత తరం సినీ హీరో రమణమూర్తితో అన్నారట!. అలాంటిది ఇప్పుడు కన్యాశుల్కం కథతో చిరంజీవి సినిమా తీస్తారా?’’
‘‘అగ్ని హోత్రావధాని తన చిన్న కూతురును వయసు మళ్లిన లుబ్దావదాన్లకు ఇచ్చి పెళ్లి చేయాలనుకునే కథే కదా కన్యాశుల్కం. ఆ కాలంలో సమాజంలో వృద్ధులతో పిల్లలకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కాలం మారింది షష్టిపూర్తి చేసుకున్న హీరోలతో కుర్ర హీరోయిన్ల జత. కన్యాశుల్యం తెలుగు సినిమా పెద్దగా హీట్ కాలేదు కానీ వృద్ధ హీరో కుర్ర హీరోయిన్‌గా కన్యాశుల్కం ఫార్ములా సినిమాల్లో నేటికీ సజీవంగా ఉంది. ’’
‘‘నీకు కుళ్లు అందుకే చిరంజీవితో తమన్న నటించడాన్ని జీర్ణం చేసుకోలేక పోతున్నావ్’’
‘‘అయ్యో రాజకీయాల్లో, సినిమాల్లో కుర్రాళ్ల కన్నా పెద్దలకే విజయావకాశాలు అని చెప్పదలుచుకున్నాను అంతే కానీ కుళ్లు నాకెందుకు? ప్రపంచంలో అత్యధిక శాతం యువత ఉన్న దేశం మనదేనట! మరి వీళ్లు యువతను పక్కను పెట్టి సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనైనా వయసు మీరిన వారికే పెద్ద పీట ఎందుకు వేస్తారంటావు? శ్రీశ్రీ చెప్పిన కొంత  మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అనే మాట గుర్తుకొస్తుంది’’
‘‘రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఇదే ట్రెండ్. మోదీ మోదీ అని దేశమంతా కుర్రాళ్లు ఊగిపోయి నాలుగు పదుల రాహుల్‌కు సరిగ్గా ఆయన వయస్సన్ని సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి, ఆరు పదుల మోదీకి ఆరింతల సీట్లిచ్చి అధికారం అప్పగించారు. ఆంధ్రలోనూ డిటోనే కుర్ర నేతకు ఓదార్పు బాధ్యతలు అప్పగించి కొత్త రాష్ట్రాన్ని ఐదేళ్ల క్రితం షష్టిపూర్తికి చేరుకున్న నేతకు అప్పగించారు. వెనుకబడిందనుకున్న ఉత్తర ప్రదేశ్‌లో వయసు మీరిన ములాయంకు విశ్రాంతి ఇచ్చి కుర్ర ముఖ్యమంత్రిని ఏరికోరి ఎన్నుకున్నారు. తన వయసే తనకు ప్లస్ అనుకుని తమిళనాడులో కరుణానిధి కుర్చీమీదే కనులు మూయాలని కలలు కన్నారు. కుర్రాళ్లను పక్కన పెట్టి పెద్దలను ఆదరిస్తాం నిజమే కానీ మరీ ఇంత పెద్దలను కాదని కరుణపై ఏ మాత్రం జాలి చూపకుండా తమిళులు జయలలితకే మళ్లీ అధికారం అప్పగించారు. ఒకవేళ కరుణ గెలిచి ఉంటే దేశంలో ఎన్నో రికార్డులకు తమిళనాడు వేదిక అయి ఉండేది.’’
‘‘వామపక్షాల్లో 60-70 ఏళ్ల వయసు వాళ్ళు కుర్రాళ్ళు అన్నట్టు .  పై స్థాయికి వెళ్లాలంటే కనీస వయసు 80 ఏళ్లు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు క్రమంగా వామపక్షాలు కనుమరుగవుతున్నా, వయసు విషయంలో వారే రాజకీయ పక్షాలకు, సినిమాలకు అదర్శంగా మారుతున్నారు.’’
‘‘ఓ కుర్ర హీరో అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవడం బోలెడు మంది కుర్ర హీరోలు ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించి ఇటు అవకాశాలు లేక అటు మరో పని చేయలేక పాపం వాళ్ల పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది వీళ్లేమిటో 70 వరకు హీరో పాత్రలు వదలం అంటున్నారు . .’’
‘‘సినిమాకు పెట్టుబడి పెట్టే వారికి లేని దురద మనకెందుకు కానీ? పెద్దలంటే గౌరవం వల్ల అలా చేస్తున్నారేమో? ’’
‘‘ గౌరవమా ? తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపడంలో గ్రోత్ రేట్ ఘనంగా ఉన్నది మన దగ్గరే. ఇండియా ఎప్పటికీ ఎవరికీ అర్ధం కాదు’’
-బుద్ధా మురళి (జనాంతికం 24. 7. 2016)

4 కామెంట్‌లు:  1. ::: కానీ ఎవరి కోణంలో వాళ్లు చూశారన్నమాట! సినిమానే కాదు ప్రతి దాన్ని ఎవరి కోణంలో వాళ్లు చూస్తారు.

    ఈ మీ టపాని ఏ కోణం లో చూడ మంటారండీ :) ?

    జిలేబి

    రిప్లయితొలగించు
  2. చిరంజీవి నిరుజ్జోగి పాపం తమన్నా పేద్ద మెగా హీరోతో నటించడం ఆమె అదృష్టం ఈ మాటే ఆమెచేత చెప్పిస్తారు చూస్కోండి

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం