8, ఏప్రిల్ 2017, శనివారం

నా ఊరిని నాకిచ్చేయ్..!

‘‘మేధావి గారూ.. దిగులుగా ఉన్నారేం? ఈరోజు ‘ప్ర పంచ డిప్రెషన్ డే’ కదా!. సింబాలిక్‌గా- డిప్రెషన్‌లోకి వెళ్లారా? ’’
‘‘కాదు.. మా సొంతూరు వెళ్లి వచ్చా. అప్పటి నుంచి దిగులు మరింత పెరిగింది. నీకేం హాయిగా ఉంటావ్’’


‘‘ఏదో మిడిల్ క్లాస్ ఆలోచనతో డబ్బులే సమస్య అనుకున్నాను. నికరగువాలో ప్రజాస్వామ్య హక్కులు, అమెరికా సామ్రాజ్య వాదం నుంచి అనకాపల్లి సామాజ్ర వాదం వరకు మీకు అన్నీ సమస్యలే కదా? ’’
‘‘ ఆరోజులే వేరోయ్! ట్రుంకాయ్ దేశంలో పౌర హక్కులను కాపాడుదాం అని పిలుపు ఇస్తే రెండు వేల మంది పిల్లకాయలు కాలేజీ ఎగ్గొట్టి పరిగెత్తుకొచ్చేవాళ్లు. ఇప్పుడు ఒక్కడూ రావడం లేదు’’
‘‘ట్రుంకాయ్ అనే దేశం కూడా ఉందాండి? ఎప్పుడూ వినలేదు.’’
‘‘ అదే చెబుతున్నా.. ఇప్పుడు చాలా తెలివి మీరు పోయారు. ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే నువ్వు ఇంటర్నెట్‌లో వెతుకుతున్నావ్ ట్రూంకాయ్ పేరుతో దేశం ఉందా? అని’’


‘‘ ఇంటర్నెట్ పుణ్యమాని అరచేతిలో విశ్వం ఇమిడిపోయిందండి!’’
‘‘ అదో వ్యవసనం.. ఇది లేక ముందు- గోడల మీద కనిపించే నినాదాలు ఒక్కసారి గుర్తు చేసుకో. ఏ ఒక్క గోడైనా నినాదాలు లేకుండా కనిపించేదా? యూనివర్సిటీ దారిలో వెళితే గోడలన్నీ నినాదాలతో ... ఆ రోజులే వేరు’’
‘‘గోడలమీద నినాదాలు లేకపోవడమే మీ సమస్యనా?.’’
‘‘ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావ్! సమస్య గోడలు కాదు. ’’
‘‘మరేంటో స్పష్టంగా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నేనేమన్నా మేధావినా?’’
‘‘తెలుగు సాహిత్యం ఇలా ఎందుకు పడకేసిందో తెలుసా?’’
‘‘నాగిరెడ్డి- చక్రపాణి రోజుల్లో ‘చందమామ’ ఓ వెలుగు వెలిగింది.. మా ఇంట్లో ప్రతి నెలా వచ్చేది.. బొమ్మరిల్లు, యువ ,విజయ నెల నెలా చదివే వాడిని.. చదివేవాళ్లు లేక వాటిని మూసేశారట కదా? ’’
‘‘సాహిత్యం పడకేయడం అంటే పత్రికలు మూత పడడం గురించి చెబుతావేం?’’


‘‘మరేంటో మీరే చెప్పండి’’
‘‘కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎంత కష్టం.. ఎంత కష్టం..
మబ్బు పట్టి, గాలి కొట్టి
వాన వస్తే.. వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే
దాని తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం..
ఇది గుర్తుందా?’’
‘‘గుర్తు లేకపోవడమేంటి..? మహాకవి శ్రీశ్రీ కవిత తెలియని తెలుగు వాడుంటాడా? ’’
‘‘అదే మరి... అప్పుడెప్పుడో పుట్టిన శ్రీశ్రీ మళ్లీ ఎందుకు పుట్టలేదో అర్థమైందా? పివి నరసింహారావే కారణం’’
‘‘ఎంత మాట అనేశారండీ.. పివి గారు మంచి సాహితీ ప్రియులు. ఆయనకు పదహారు భాషలు వచ్చు. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువాదం చేశారు. ‘లోపలి మనిషి’ని బయట పెట్టారు. ఇంకో విషయం తెలుసా? ఇక రాజకీయాలు చాలు వరంగల్‌లో మళ్లీ సాహిత్య గోష్టులు జరుపుకుందాం అని పుస్తకాలన్నీ సర్దుకుని ప్రయాణానికి సిద్ధం అయ్యాక అనుకోని పరిస్థితుల్లో ప్రధాన మంత్రి పదవికి ఎంపిక అయ్యారు. ఆ పదవిలో ఉన్నా, పదవి నుంచి దిగిపోయినా సాహిత్యానికి దూరం కాలేదు కదండీ...అకారణంగా పివి కారణం అంటే నేను ఒప్పుకోను’’


‘‘వస్తా వస్తా.. అక్కడికే వస్తా... ఆకలి రాజ్యం సినిమాలో ఆపిల్ పండు చెత్తకుప్పలోని బురదలో పడిపోతే- ఆకలితో నకనకలాడుతున్న కమల్ హాసన్ పండును బురద నుంచి తీసి కడుక్కోని తింటాడు. అదే రాఘవేంద్ర రావు సినిమాలో అందమైన హీరోయిన్ బొడ్డు మీద ఆపిల్ పండ్లు పడతాయి. అదే ఇప్పటి హీరో అయితే- అత్తతో మాట్లాడేందుకు రైల్వే స్టేషన్‌ను, మరదలితో సరసాలకు విమానాశ్రయాన్ని అద్దెకు తీసుకుంటాడు. కారణం తెలుసా?’’
‘‘కమల్‌హాసన్ బురద ఆపిల్ పండుకు, రమ్యకృష్ణ బోడ్డు నుంచి జారి పడ్డ ఆపిల్ పండ్లకు- పివికి ఎలాంటి సంబంధం లేదు.. బాలచందర్ ఆలోచన, రాఘవేంద్రరావు మార్క్ శృంగారం. హీరోను అలా పేదవాడిగా చూపితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. వారు కోరితే సూర్యుడిని కూడా హీరో గుప్పిట్లో బంధిస్తాడు. ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం తప్ప పివికి సంబంధం లేదు.’’
‘‘అక్కడికే వస్తా .. ఎలా సంబంధమో చెబుతా!’’
‘‘మా ఊరు వెళ్లి వచ్చానని చెప్పా కదా? దుఃఖం పొంగుకొచ్చిందంటే నమ్ము’’
‘‘ఊరికి ఏమైంది?’’
‘‘అంతా మారిపోయింది. మట్టి రోడ్లు, గుడిసెలు, పేదరికం తాండవించేది.. చూడగానే అద్భుతమైన కవిత్వం పొంగుకొచ్చేది. అక్కడి ఆకలి కేకల నుంచి ఎంతో అద్భుమైన సాహిత్యం పుట్టింది. ఇప్పుడన్నీ సిమెంట్ రోడ్లు, పక్కా ఇళ్లు మాదా కబళం అని పలికే వాడు వెతికినా ఒక్కడూ కనిపించలేదు. పాలేరు పాండుగాడు గుర్తున్నాడు కదా? వాడి కొడుకు కూడా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదిస్తున్నాడు. ప్రతి ఇంట్లో ఒకడు అమెరికాలో ఉన్నాడు. చాలా బాధేసింది.’’
‘‘మేధావి గారూ.. ఆ ఊర్లో మీది కూడా పేద కుటుంబమే కదా? మీరు ఉపాధి కోసం ఊరొదిలి సిటీకి రావాలి. మీ ఊరు మాత్రం పేదరికంతో అలానే ఉండాలి అంటే ఎలాగండి..? అంత అభిమానం ఉంటే ఊర్లోనే ఉండి ఈ మాట మాట్లాడితే బాగుంటుంది.’’


‘‘నీకు భావోద్వేగాలు తెలియవు. నా బాల్యం నాకిచ్చేయ్‌లా నా ఊరును నాకిచ్చేయ్ అని గొప్ప కవిత రాద్దామని ఊరు వెళ్లి వచ్చిన నేనెంత బాధపడ్డానో నువ్వు ఊహించలేవు’’
‘‘ఆ గుడిసెలో సగం కడుపుతో పడుకున్న జీవితాన్ని కూడా తిరిగి ఇచ్చేయమని రాస్తారా? ?’’
‘‘నా ఊరును నాకిచ్చేయ మన్నా కానీ- నా పేదరికాన్ని నాకివ్వమనలేదు. తేడా అర్థం చేసుకో’’
‘‘మీకు తప్ప అందిరికీ పేదరికం ఇమ్మంటారు అంతేనా?’’
‘‘నీకు విషయం అర్థం కాదు వదిలేయ్’’
‘‘మా ఊరికి వచ్చే ఒకే ఒక బస్సును తగలబెడితే విప్లవం ఎలా వస్తుందో? సమసమాజం ఎలా ఏర్పడుతుందో 30ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నా నాకు ఇంకా అర్థం కాలేదు’’
‘‘ తగలబెట్టే వారికే అర్థం కాలేదు’’
‘‘ అసలు విషయం చెప్పనేలేదు’’
‘‘దేశంలో ఆర్థిక సంస్కరణలు రాకపోయి ఉంటే ఆకలి, నిరుద్యోగం, పేదరికం అడుగడుకునా ఆహ్వానం పలికేది. ఎంతోమంది శ్రీశ్రీలు పుట్టుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేవారు. సంస్కరణలు కవిత్వాన్ని చంపేశాయి. ఆఫ్రికా ఆడవుల్లో కోతుల పరిరక్షణ ఉద్యమానికి కదిలి రమ్మన్నా వచ్చే వేలాది మంది యువతను విప్లవానికి దూరం చేశాయి. అందుకే గొంతెత్తి గట్టిగా పాడాలనుకుంటున్నాను హే భగవాన్ నన్ను సంపన్నుడిగా ఇలానే ఉంచి నా పేద ఊరిని నాకిచ్చెయ్  ’’ *

బుద్ధా మురళి (జనాంతికం 7-4-2017)

2 కామెంట్‌లు: 1. చంపెను సంస్కర ణలు మేల్
  కొంపల కొక కుర్రవాడు కోటీశ్వరుడై
  సంపాదించె జిలేబీ
  నింపాదిగ వెళ్ళితి నట నిశ్చేష్టుడవన్ !

  జిలేబి

  రిప్లయితొలగించు
 2. వ్యంగ్య-వ్యాస-వైభవం - చప్పట్లు!

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం