2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సూర్యుడి కిడ్నాప్!

‘‘శేఖర్.. అర్జంట్‌గా నువ్వు మా ఇంటికి రావాలి. ఆయన మాట అదోలా ఉంది. మీ ఇద్దరూ కూర్చున్నప్పుడు, కవితా పఠనంలో ఇలాంటి మాటలు చాలా సార్లు విన్నాను, కానీ పట్టించుకోలేదు.. నాతో కూడా అలానే ఏవేవో మాట్లాడుతున్నారు. ’’
‘‘ఏరా! నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. నువ్వే ఉల్కలా ఊడిపడ్డావ్.. మా ఆవిడ కంగారుపడి కాల్ చేసింది కదూ! నా మదిలో ఓ అద్భుతమైన ప్లాన్ మెదిలింది. సక్సెస్ అయితే ప్రపంచం మనకు దాసోహం అంటుంది.’’
‘‘అంత గొప్ప ప్లాన్ ఏంటో చెప్పు’’
‘‘మనం భూకంపం సృష్టించబోతున్నాం. ప్రపంచ దేశాలను మన మార్గం పట్టించబోతున్నాం.’’
‘‘దావోస్‌ను మా ఊరికి  లాక్కోస్తానంటూ ఆయనెవరో గత రెండేళ్ల నుంచి చెబుతున్నట్టు నువ్వు ప్రపంచ దేశాలను మీ అపార్ట్ మెంట్ కు లాక్కురావాలనుకుంటున్నావా?’’
‘భూకంపం సృష్టిస్తా .. భూ మార్గం పట్టిస్తా- అని మహాకవి శ్రీశ్రీ అప్పట్లో అంటే అంతా ‘ఆహా.. ఓహో..’ అన్నారు. నేను నిజంగానే భూ కంపం సృష్టించే ఐడియా చెబుతానంటే ‘హీ..హీ’ అని నవ్వుతున్నావా? ’’
‘‘కవిత్వంతో ఆలోచనల భూకంపం వేరు, నువ్వు చెబుతున్న భూకంపం వేరు. ’’
‘‘తాన్‌సేన్ రాగాలతో వర్షాన్ని కురిపించినప్పుడు, మంటలు సృష్టించినపుడు నిజమని నమ్మినప్పుడు నా మాటలెందుకు నమ్మవు.’’
‘‘ఇంతకూ ప్రపంచాన్ని కుదిపేసే ఆ విషయం ఏంటో చెప్పు ’’
‘‘సూర్యుడ్ని కిడ్నాప్ చేద్దాం..’’
‘‘వాడెవడు? మీ ఆఫీసులో క్లర్కా? నగరమనంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆఫీసులో ఏవైనా గొడవలు ఉంటే, మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా కిడ్నాప్ చేస్తామనడం మంచిది కాదు’’
‘‘ నేను సూర్యుడి కిడ్నాప్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆఫీసులో బోడి సూర్యారావు గురించి చెబుతున్నావ్..’’
‘‘సూర్యుడేమన్నా మనిషా గొంగడి కప్పి కారులో కిడ్నాప్ చేసేందుకు.?. ’’
‘‘ఆయనెవరో రుషికి కోపం వచ్చి సముద్రాన్ని కమండలంలో బంధించ లేదా? మూడు లోకాలపై మూడు కాళ్లు పెట్టిన దేవుడి అవతారం గురించి తెలియదా? వీరహనుమాన్ బాల్యంలోనే సూర్యుడిని మింగేందుకు వెళితేనే కదా మూతి ఎర్రగా కాలింది.వాళ్లకు సాధ్యం అయింది మనకు కదా మనిషిని తక్కువగా అంచనా వేయు కు మానవుడే మహనీయుడు అని ఘంటసాల ఎప్పుడో అన్నారు ’’
‘‘అవన్నీ పురాణాలు ’’
‘‘ఒక నాటి చరిత్రే తరువాత  పురాణాలు. చంద్రగ్రహం, సూర్యగ్రహం వంటివి నమ్ముతావు కదా? రాహుకేతువులు తెలుసు కదా? రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడం సాధ్యం అయినప్పుడు కిడ్నాప్ చే యడం ఎందుకు సాధ్యం కాదు?’’
‘‘సరే.. నిజమే అనుకుందాం కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెడతావు? మీ డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో దాచిపెడతావా? ’’
‘‘ఎక్కడ దాచిపెడదామనేది తరువాత. ఈ కిడ్నాప్‌లో నువ్వు నాకు సహకరించాలి’’
‘‘అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టు మొదటి కిడ్నాప్ సూర్యుడితోనే ఎందుకు? పోనీ చంద్రుడ్ని కిడ్నాప్ చేస్తే కొంచెం సేఫ్ కదా!’’
‘‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే  కొట్టాలి. కిడ్నాప్ చేస్తే సూర్యుడ్నే చేయాలి, బ్రాండ్ అంబాసిడర్ హక్కులుమనమే  సాధించాలి. ’’
‘‘కిడ్నాప్ చేసి ఏం చేద్దామని నీ ఆలోచన?’’
‘‘చార్మినార్ వద్ద మదీనా హోటల్ గురించి తెలుసా? ’’
‘‘మదీనా లో సూర్యుడ్ని దాచి పెడతావా? అందులో టీ చాలా బాగుంటుంది. సూర్యుడ్ని అందులో దాచడం సాధ్యం కాదు. ’’
‘‘పూర్తిగా విను.. ఇప్పుడు పెట్రోల్ డబ్బులతో సంపన్న దేశాలుగా వెలిగిపోతున్న ఎన్నో గల్ఫ్ దేశాల కన్నా మన దేశం సంపన్నంగా ఉండేది. మక్కా యాత్రీకులకు సహాయం చేసేందుకు ఆ కాలంలో మదీనా హోటల్ కట్టారు. పెట్రోల్ వల్ల గల్ఫ్ దేశాలు, సాంకేతిక విప్లవం వల్ల యూరప్ దేశాలు, సహజ వనరులతో మరెన్నో దేశాలు సంపన్న దేశాలుగా మారాయి. సూర్యుడ్ని కి డ్నాప్ చేస్తే అమెరికా, దావోస్, గల్ఫ్.. వాళ్ల అబ్బలాంటి దేశాలు కూడా జీ హుజూర్ అంటూ మనలను వేడుకోవలసిందే. వాళ్లు పెట్రోల్ అమ్ముకొని బలిసినట్టు, మనం సూర్యుడి వేడిని అమ్ముకుని సంపన్నుల మవుదాం. ’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘సూర్యుడు లేకపోతే జీవరాశి బతుకుతుందా? ’’
‘‘ఒక్క క్షణం కూడా బతకలేదు. చెట్టు, చేమ, పుట్ట, సమస్త జీవకోటి సూర్యుడి వల్లనే బతుకుతుంది. సూర్యుడు లేకపోతే ప్రాణకోటి లేదు, ప్రకృతి లేదు. ’’
‘‘కదా..! అందుకే అలాంటి సూర్యుడినే కిడ్నాప్ చేసేద్దాం. గల్ఫ్ దేశాలు ప్రపంచానికి గ్యాలన్లలా పెట్రోల్ అమ్మి బతికినట్టు, మనకు డబ్బులు చెల్లించిన వారికే సూర్యుడి వేడి అందేట్టు చేద్దాం.’’
‘‘ఈ పనేదో అర్జంట్‌గా చేసేయాలి. ఆలస్యం అయితే సూర్యుడే ఉండడు. సూర్యుడు వృద్ధుడవుతున్నాడని ఓ వెబ్‌సైట్‌లో బ్రేకింగ్ న్యూస్ చూశాను. పది మిలియన్ సంవత్సరాలకు సూర్యుడు వృద్ధుడై అంతరించి పోతాడట! ఇప్పటికే రెండు మిలియన్ సంవత్సరాల కాలం గడిచిపోయిందట.. వెబ్‌సైట్ తమ్ముడు సూర్యుడితో మాట్లాడివచ్చినట్టుగా చక్కని వార్త ప్రసారం చేశాడు.’’
‘‘ప్లాన్ మొత్తం రెడీ అయింది ’’
‘‘ఓ నేత సూర్యుడు మా బ్రాండ్ అంబాసిడర్, సూర్యుడు మొదట ఉదయించేది మా ఊరిలోనే అని చెప్పారు కదా? సూర్యుడ్ని నువ్వెట్లా సొంతం చేసుకోగలుగుతావ్? ’’
‘‘ చెప్పాడు కానీ సూర్యుడి పై అయన ఇంకా కాఫీ రైట్ హక్కులు సాధించలేదు . ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంటూ విస్తృత ప్రచారం ప్రారంభించక ముందే సూర్యుడిని కిడ్నాప్ చేసేస్తాం.. ఎవరికీ తెలియని రహస్యం చెబుతున్నాను- సూర్యుడు మొట్టమొదట ఉదయించేది గోల్కొండ చౌరస్తా నుంచి ముందుకు వెళితే వచ్చే గాంధీనగర్ రెండవ వీధి బంగ్లాపైన . మొన్న పార్టీ ఆలస్యం కావడంతో రాత్రంతా ఆక్కడే ఉండిపోవలసి వచ్చింది. తెల్లారి లేచాక సూర్యుడు మొదట అక్కడే ఉదయించడం కళ్లారా చూసాను.  అది మా ఫ్రెండ్ ఇళ్ళే . రాత్రికి అక్కడ మాటు వేసి సూర్యోదయం కాగానే కిడ్నాప్ చేద్దాం. సూర్యుడ్ని కిడ్నాప్ చేశాక కాపీరైట్ హక్కులన్నీ మనకే ఉంటాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు వాడుకున్నా కప్పం కట్టాల్సిందే’’
‘‘సూర్యుడి కిడ్నాప్ ఆపరేషన్ అమలుకు మెరికల్లాంటి వారు కావాలి. సూర్యుడిని కిడ్నాప్ చేసేందుకు నాతో కలిసి రావాలి  అని జాతి జనులకు పిలుపు ఇస్తున్నాను  ’’
***
‘‘అమ్మాయ్.. మీ ఆయనకు ముందు మజ్జిగ ఇవ్వు. టీవీలో ‘సూర్యుడు మావాడే’ అంటూ సాగుతున్న ఉపన్యాసాలను అదే పనిగా విని, నిద్రపోయి లేచాడు. ఆ ప్రభావం ఇంకా ఉండడంతో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవి మామూలు కలవరింతలే.. కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధ్యం అయినంత వరకు టివిలో ఉపన్యాసాలు , వార్తలను సీరియస్ గా తీసుకోకుండా చూడండి  ’’
*
-బుద్దా మురళి (జనాంతికం 2-2-2018)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం