23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

బ్యాం‘కింగ్’ల ఆత్మకథ

నా ఆత్మకథ ఆవిష్కరణకు నువ్వు తప్పకుండా రావాలి!
‘‘ఏం పొడిచేశావని అప్పుడే ఆత్మకథ. ఆత్మకథ రాయాలనే నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. అనుకున్నదే తడువుగా రాసేసిన నీ కార్యదక్షతకు సలాం చేస్తున్నాను. ఈ ఆలోచన నీకు ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?’’
‘‘టీవిలో ఇంటర్వ్యూలా అలా ప్రశ్నలు అడుగుతూ పోతూనే ఉంటే ఎలా? నిజానికి అదో పెద్ద కథ. నేను ఆత్మకథ రాస్తానని ఎప్పుడూ ఊహించలేదు. రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. ’’
‘‘అప్పుడెప్పుడో నే పలికెడిది భాగవతం, పలికించేది రామభద్రుడు అని పోతన చెప్పినట్టు ఆత్మకథ రాయాలి అని నువ్వు అనుకోక పోతే నీ ఆత్మ అనుకుందా? ఒకందుకు మంచి పని చేశావు. ఆవిడెవరో లక్ష్మీపార్వతి ఆత్మకథ రాసేందుకు ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించడం, దీన్ని సాకుగా చూపించి అల్లుడు ఎన్టీఆర్ ఆత్మక్షోభించేట్టు చేయడం తలుచుకుంటే జాలేస్తుంది. ఆత్మకథ బాధ్యత ఎవరికో అప్పగించి, ఇంట్లో కుంపటి సీరియల్‌కు తెర లేపకుండా నీ ఆత్మకథ నువ్వే రాయాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయం.’’

‘‘నన్ను ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పక ముందే నువ్వే చెబుతున్నావ్?’’
‘‘సరే ఆత్మకథ రాయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందో తరువాత ఆత్మకథ పుస్తక ప్రచురణ ఆలోచన ఎలా వచ్చింది. దాని కెంత ఖర్చయిందో చెప్పు రేపు నేను కూడా ఆత్మకథ రాసుకుంటే ఉపయోగపడుతుంది. ’’
‘‘నా ఆత్మకథ బ్యాంకుకే అంకితం చేశాను. వారి వల్లనే రాశాను. వారిచ్చిన లోన్‌తోనే ప్రచురించాను. బ్యాంకు ఆవరణలోనే ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాను. ఒక రకంగా నా ఆత్మకథ నేను రాయలేదు. బ్యాంకు వాళ్లు నాతో రాయించారు. ’’
‘‘డైలీ సీరియల్‌లా లాగకు, న్యూస్ పేపర్ కాలంకు సరిపోయేంతగా సూటిగా చెప్పు?’’
‘‘వరుసగా నా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. పర్సనల్ లోన్ కావాలా? అంటూ పెద్దగా పట్టించుకోలేదు. కొందరు కాల్ చేసి అడగడం మొదలు పెట్టారు. ఒక అమ్మాయి అద్భుతమైన గొంతుతో సార్ పర్సనల్ లోన్ తీసుకోండి అని కోరింది. అవసరం లేదన్నాను. మీకు అవసరం లేకపోవచ్చు కానీ మాకుంది సార్. కస్టమర్ల టార్గెట్ పూర్తి చేయకపోతే తనకు చాలా కష్టం అంది. అంత చక్కని గొంతున్న అమ్మాయి మాట ఎందుకు కాదనాలి అని సరేలే అన్నాను. నిజానికి నాకు లోన్ అవసరం లేదు కానీ ఈ వంకతో అంత అందమైన గొంతు రూపం ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనుకున్నాను. ’’
‘‘లేటు వయసులో అన్నగారు వదిన ప్రేమలో పడ్డట్టు నువ్వు అందమైన గొంతుకు ఫిదా అయ్యావన్న మాట కథ ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఆత్మకథలో అమ్మాయి ఉందంటే హిట్టయినట్టే.. ప్రొసీడ్’’

‘‘ఆ అమ్మాయి గొంతు తప్ప ఆమె ఎవరో నాకు ఇప్పటి వరకు తెలియదు అతిగా ఊహించుకోకు’’
‘‘వావ్ అమ్మాయి ముఖం కూడా చూడకుండా ప్రేమలో పడడం అంటే అమలిన శృంగారం అని ఏదో అంటారు కదా? అలాంటిదన్న మాట. ఆత్మకథ రాయమని ఆ కనిపించకుండా వినిపించిన సుందరి చెప్పింది. నువ్వు రాశావు అంతే కదా? ’’
‘‘కాదు నాతో ఆత్మకథ రాయించింది. సుందరి కాదు సుందరుడు’’
‘‘ఇదేం ట్విస్ట్ నువ్వు ప్రేమించిన సుందరిని ఈ సుందరుడు తన్నుకుపోయాడా?’’
‘‘‘‘సుందరుడా వాడి బోందనా చమట కంపు ముఖం వాడూను. వాడి పేరు సుందర్’’‘‘కథ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఆత్మకథకు దారి తీసిన కథ చెప్పు ?’’

‘‘ఆ అమ్మాయి ఎంతో మధురమైన గొంతుతో పర్సనల్ లోన్‌కు అప్లయ్ చేయండి అని కోరితే సరే అని బ్యాంకుకు వెళ్లాను. నేను వెళ్లగానే ఆ ఆమ్మాయి స్వాగతం పలుకుతుంది అనుకున్నాను. కానీ ఆమె లేదు. లోన్ సెక్షన్‌లో సుందర్ అని చమట ముఖం వ్యక్తి కనిపించి ఓ పెద్ద పుస్తకం చేతికి అందించాడు. ఇంజనీరింగ్‌లో ఆల్ ఇన్ వన్ బుక్ కూడా అంత పెద్దగా ఉండదు. ఆ బుక్‌లోని ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. 360 పేజీల పుస్తకంలో మొత్తం 642 సంతకాలు పెట్టాను. ఐదువందల 76 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నేను చెప్పిన వివరాలన్నీ తిరిగి చదువుకున్న తరువాత నాకే ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎడిట్ చేస్తే నా ఆత్మకథ అవుతుందని అక్కడే ఐడియా వచ్చింది. సాంక్షన్ అయిన ఆ లోన్‌తోనే నా ఆత్మకథ ముద్రించాలని నిర్ణయించుకున్నాను. కొత్తగా ముందు మాట రాయడం తప్ప మిగిలిందంతా లోన్ కోసం దరఖాస్తులో రాసిందే.’’
యూరేకా.. యూరేకా’’
‘‘నా ఆత్మకథ వెనుక కథకు నేను యూరేకా అని అరవాలి కానీ విన్న నువ్వు అరవడం ఏమిటి?’’
‘‘నీ ఆత్మకథ కథ విన్నాక నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు లోన్ తీసుకుని విదేశాలకు చెక్కేసిన మహానుభావుల ఆత్మకథలు కూడా బ్యాంకుల్లో ఉంటాయి కదా? వాటి ఆధారంగా వారెక్కడకు వెళ్లింది? ఎక్కడ ఉన్నది? డబ్బు ఎక్కడ పెట్టింది? బంధువులు ఎవరు? పుట్టుమచ్చలెక్కడ ఉన్నాయి తెలుస్తాయి కదా? ఈ ఆధారాలతో వారిని వెతికి పట్టుకుని బొక్కలో వేయొచ్చు కదా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్? నీకసలు బుద్ధుందా? లక్ష రూపాయల పర్సనల్ లోన్‌కు వెళితే, రైతు వ్యవసాయ రుణానికి వెళితే ఆత్మకథ రాయిస్తారు. వేల కోట్ల లోన్ కావాలంటే కనీసం బ్యాంకులో అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాంకులే వారి ఇంటికి వెళ్లి దర్శనం కోసం పడిగాపులు కాస్తాయి. అలా వేల కోట్ల రుణాలతో దేశం విడిచి పారిపోయిన వారు గతంలో అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్న  ఫోటోలు తప్ప మరే వివరాలు ఉండవు. ఆయనెవరో నిరవ్ మోడీకి ఏ దేశ పౌరసత్వం ఉందో ఇంకా తేల్చలేకపోయారు. ఇక జీవిత చరిత్ర ఎలా తెలుస్తుంది.’’
‘‘మన మాటలు వింటూ మీ అబ్బాయి తనలో తానే ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. ఏం లెక్కలు బాబు’’
‘‘అంకుల్ నాదో డౌట్ మీరే తీర్చాలి. బోర్డు తిప్పేయడం కోసం బ్యాంకు ఏర్పాటు చేయడం, బ్యాంకులో భారీ లోన్, బ్యాంకులో పిఐఓ ఉద్యోగానికి ప్రిపేర్ కావడం ఈ మూడింటిలో ఏది ఈజీ అంటారు?’’
‘‘బ్యాంకులో పిఓ ఉద్యోగానికి చాలా కాంపిటేషన్ ఉంటుంది. మిగిలిన రెండింటిలోనీకు ఏది సాధ్యమో  నువ్వే తేల్చుకో...’’
బుద్దా మురళి (జనాంతికం 23-2-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం