16, మార్చి 2018, శుక్రవారం

అద్దె బతుకులు!

‘‘కలికాలం.. పిదపకాలం.. ఏమండీ.. ఈ వార్త చూ శారా?’’
‘‘ఏ వార్త..? రెండు, మూడేళ్లలో హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించి నాయన నాలుగేళ్లయినా కొత్త రాజధానిలో భవనాల మాట దేవుడెరుగు డిజైన్ కూడా ఫైనల్ చేయలేక భావోద్వేగానికి గురైన వార్తేనా?’’
‘‘అది ఎన్నికల కాలం వార్త. నేను చెప్పింది కలికాలం వార్త’’
‘‘ఓ అదేనా? నాకూ బాధేసింది. నాకే కాదు చివరకు ఆ పార్టీ వ్యతిరేకులకు సైతం బాధేసింది. కలికాలం అంతే. రెండు సీట్ల నుంచి పార్టీ రథాన్ని అధికార పీఠం వరకు తీసుకువెళ్లిన అద్వానీకి ఈ వయసులో అంత అవమానం చూశాక.. రాజకీయంలో ఏదైనా సాధ్యమే అనిపించింది. రాజకీయమే ఊపిరిగా బతికేవారి తీరు అంతే. రాజకీయం, వ్యాపారం ఒకటే. వ్యాపారంలో సెంటిమెంట్ పని చే యదు. 1998లో దగ్గుబాటి బిజెపి తరఫున షడ్రకుని ఇంటికి పొత్తు కోసం వస్తే బయటే నిలబెట్టి, బయటి నుంచే పంపించారు. శత్రువు ఇంటికి వచ్చినా లోనికి ఆహ్వానించాలని అంటారు. ఇది సామాన్యుల విషయంలోనే.. కానీ, రాజకీయ వ్యాపారంలో ఇలాంటి సెంటిమెంట్లు పనిచేయవు. తోడల్లుడు కదా అని ఆయన ఇంట్లోకి పిలిస్తే, దగ్గుబాటి వల్లనే రెండు పార్టీల పొత్తు అని ఆయనకు క్రెడిట్ వస్తుంది. అందుకే బయటి నుంచి బయటకే పంపించారు. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన రాజకీయ గురువు అద్వానీ నమస్కారం చేస్తున్నా పట్టించుకోకుండా శిష్యుడు వెళ్లిపోవడం రాజకీయాల్లో మామూలే’’
‘‘మనుషులను నిచ్చెనమెట్లుగా భావించే వారికి ఎవరైనా ఒకటే. వారి దృష్టిలో అదో మెట్టు అంతే .. అక్కడెవరున్నారు? అనేది వారికి అనవసరం .. నేను చెబుతున్నది దాని గురించి కాదు’’
‘‘ఓహో... ఇప్పుడర్థమైంది. గోరఖ్‌పూర్‌లో అధికార పక్షాన్ని ఘో రంగా దెబ్బతీసిన ఉపఎన్నికల ఫలితాల గురించే కదా? చూడోయ్.. సికిందరాబాద్ అంత లేని త్రిపురలో విజయం సాధించగానే ప్రపంచాన్ని జయించినట్టు హడావుడి చేయడం వల్ల ఉపఎన్నికల్లో ఓటమి నిరాశ కలిగించడం సహజమే. ఓటమి, గెలుపు ఏదీ శాశ్వతం కాదు. ఆయన దేవదూతలా మనల్ని ఉద్ధరించడానికి పుట్టారు. అధికారంలోకి రాగానే ఏదో అయిపోతుందని అతిగా ప్రచారం చేశారు. రాబిన్ హుడ్‌లా ఏదో అద్భుతాలు చేసేస్తాడని అనుకున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్లేమీ దేవుళ్లు కాదు.. వాళ్లూ మనుషులే.. ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే నిరాశ పడాల్సి వస్తుంది. వారి పరిమితులు వారి కుంటాయి. పెద్దనోట్ల రద్దుతో అవినీతి మాయమై, దేశంలోని సంపద అంతా అందరికీ సమానంగా పంపిణీ జరుగుతుందని ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని జనం అమాయకంగా నమ్మారు.’’
‘‘నేనేం అడుగుతున్నాను. మీరేం చెబుతున్నారు? నేను లోకల్ విషయాలు చెబుతుంటే మీరేదో అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుతున్నారు’’
‘‘ఓహో.. తమ్ముడి పార్టీ వార్షికోత్సవ ఉపన్యాసం గురించా నీ అనుమానం. నేనేం చెప్పాలి. ఆయన చదివిన స్క్రిప్టు ఈసారి మేం రాయలేదు కాబట్టి ‘కమలం’ వాళ్ల స్క్రిప్టు అని ఓ పార్టీ వాళ్లు చెబుతున్నారు. ఇందులో కలికాలం.. పిదప కాలం అ ని బాధపడేందుకు ఏ ముంది? ఐనా, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడినే ప్రచారంతో బోల్తా కొట్టించిన వారిని ఢీ కొట్టడం ఎంత మాస్ హీరోకైనా అంత ఈజీ కాదు. ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఈయన పెద్ద నటుడా? వారి కన్నా రాజకీయం ఎక్కువ తెలుసా? ’’
‘‘ఆ విషయం కాదండీ.. 24 గంటల న్యూస్ చానల్స్ వచ్చాక, రాజకీయాలకు, సినిమాలకు తేడా లేకపోవడంతో నేనసలు సినిమాలు చూడ్డమే మానేశాను. ఎవరెలా నటిస్తే నాకేం?’’
‘‘ఇంతకూ కలికాలం అని నువ్వు అంతగా ఆశ్చర్యపోయిన విషయం ఏంటో చెప్పు?’’
‘‘సంతోషం .. ఇప్పటి వరకూ నా తరఫున కూడా నువ్వే సమాధానాలు చెబుతూ వచ్చావు. కనీసం ఇప్పుడైనా ఏంటో చెప్పమని అడిగావు.. ఈ వార్త చూశారా? ఇంట్లో వాడుకునే సోఫాలు, మంచాలు, పూల కుండీలు, ఏసీలు కూడా అద్దెకిస్తున్నారట! ఎంతకాలం అని ఒకే వస్తువును వాడుతాం , అద్దెతో తెచ్చుకుంటే నెలకోసారి ఫ్రిడ్జ్ మారిస్తే ఎంత హుషారుగా ఉంటుందో.. జనాల్లో మారిన ఈ వైఖరిని గమనించే ఏదడిగితే అది అద్దెకు సమకూర్చే కంపెనీలు పుట్టుకొచ్చాయి. కలికాలం ... ఛీ..్ఛ.. చివరకు సోఫాలు కూడా అద్దెకు తెచ్చుకుని వాడుకోవడం ఏంటో?’’
‘‘ఇందులో తప్పేముంది? జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అసలు జీవితమే శాశ్వతం కాదు అనే తత్వాన్ని బాగా వంట బట్టించుకున్న వారే ఎవరో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఏడు జన్మల వరకు కలిసే ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి వారే, పెళ్లి పందిరిలోనే మంగళసూత్రం కడుతూ పెళ్లి కొచ్చిన అందమైన అమ్మాయిలను అదోలా 
చూసే పెళ్లి కొడుకులున్న కాలం ఇది.. ఏది శాశ్వతం?’’
‘‘మరీ అద్దె బతుకులైపోయాయని మీకేమీ అనిపించడం లేదా?’’
‘‘పాజిటివ్‌గా తీసుకుంటే దీన్ని స్వాగతించాలనిపిస్తోంది. భూమి మీద శాశ్వతంగా జీవిస్తాం అనుకుంటూ సంపాదనే జీవితంగా బతుకుతూ జీవితాన్ని కోల్పోతున్నాం. ఏదీ శాశ్వతం కాదు అన్నీ నశించి పోతాయని అద్దె సోఫాలు, అద్దె ఫర్నిచర్ వ్యాపారం మరింతగా పెరిగితే మనుషుల ఆలోచనా దోరణి మారవచ్చు.  ఒక పార్టీ మరో పార్టీ కోసం పని చేయడం , ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్లడం, పాన్ షాప్‌లో పాన్ కొన్నంత ఈజీగా విడాకులు తీసుకోవడం .. ఒకరితో పెళ్లి మరొకరితో కాపురం ఇవన్నీ చూస్తుంటే మన జీవితాలే అద్దె జీవితాలు అయినప్పుడు అద్దె వస్తువులను విమర్శిస్తూ, అద్దె బతుకులు అని తీసిపారేయడం అన్యాయం.’’ *
-బుద్దా మురళి (జనాంతికం 16-3-2018)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం