3, మార్చి 2018, శనివారం

మీడియా- శ్రీదేవి- సబ్బుల వ్యాపారం

 ‘‘ఛీ ..ఛీ ..    మీ మగజాతే అంత..! చేసిన పాపం ఊరికే పోదు..’’
‘‘పోనీ లేవే.. బయటి వారి గొడవలు మనకెందుకు? పాపం.. శ్రీదేవి ఎంత అందంగా ఉండేది. అంత చిన్న వయసులోనే ఆ దేవుడు తీసుకెళ్లాడు. అదేంటో నేను బాగా ఇష్టపడ్డ గాయకుడు ఇదే వయసులో పోయాడు. వయసులో ఉండగా నేను తెగ ప్రేమించిన శ్రీదేవి అదే వయసులో పోయింది. అంతా దైవలీల’’
‘‘అందుకే అన్నాను మీ మగజాతే అంత అని.. ఈ పాపం ఊరికే పోదు’’
‘‘ఎవరిమీద కోపం ఉంటే వాళ్లను తిట్టు.. అంతే కానీ ఆ వంకతో మొత్తం మగవాళ్లను తిట్టకు. నా ముందు సాటి మగవాళ్లను తిడితే సహించలేను’’
‘‘నేను నేరుగా మిమ్మల్నే తిడుతున్నా.. అర్థం చేసుకోలేక పోవడం మీ దౌర్భాగ్యం .. శ్రీదేవిది ఎంత ముద్దొచ్చే రూపం. పొట్టన పెట్టుకునే దాకా నిద్ర పోలేదు. మీ మగజాతే అంత ’’
‘‘ఏంటీ శ్రీదేవిని నేను పొట్టన పెట్టుకున్నానా? అదేదో టీవీ 8+3-2 చానల్ కూడా ఈ మాట చెప్పలేదు. టీవీ చానళ్లు బోనీకపూర్‌పై అనుమానం వ్యక్తం చేశాయి.. కానీ నామీద కాదు. ఒకప్పుడు వర్మలానే శ్రీదేవిని నేను ప్రేమించిన విషయం నిజమే. ఆమె పెళ్లి చేసుకుని నటించడం మానేసిప్పటి నుంచి నేను సినిమాలు చూసింది లేదు. ఆమె తిరిగి నటించడం ప్రారభించినా నేను మాత్రం మళ్లీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేదు. ఆయన నెవరో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా నేనే... నేనే.. అని చెప్పుకుంటారు. అలానే ఎక్కడే తప్పు జరిగినా నువ్వు నన్ను దోషిని చేయడం ఏమీ బాగాలేదు’’
‘‘ముమ్మాటికీ మీరే కారణం.. మూడు పదుల వయసుకే మగాళ్లకు బాణా పొట్ట, తెల్ల జుట్టు వస్తే ఫరవాలేదు. కానీ.. పాపం ఆ అమ్మాయి 40-50 ఏళ్ల వయసు వచ్చినా పదహారేళ్ల వయసు సినిమా నాటి అందంతో మెరిసిపోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేరు. మీ కోసమే వయసు కనిపించకుండా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు అడ్డమైన మందులు తిని, ఆపరేషన్లు చేయించుకుని చిన్న వయసులోనే చనిపోయింది’’

‘‘అదంతా పాత న్యూస్. శ్రీదేవి సౌందర్య రసహ్యమే ఆమె మరణానికి కారణం అని చానల్స్ హడావుడి చేశాయి. మరుసటి రోజుకు న్యూస్ మారిపోయింది.. నువ్వు చూడలేదా? ’’
‘‘అన్మీ చూస్తున్నా, మీ మగవాళ్ల వేషాలన్నీ చూస్తున్నాను. బోనీ కపూర్ కాకపోతే ఇంకో కపూర్ ఎవడైతేనేం మగవాడే కదా ? ఆమె ప్రాణాలు తీసుకుంది.’’
‘‘ఔను.. ఆమె షూటింగ్‌లో తప్ప జీవితంలో సుఖపడింది లేదట! వర్మ రాశాడు’’
‘‘అతను మీకన్నా తక్కువనా? బతికున్నన్నాళ్లు శ్రీదేవిని ప్రేమించానంటూ వర్మ ఆమెకు కంటిపై కునుకు లేకుండా చేశాడు. పోయాక ఆత్మకు శాంతిలేకుండా ఏదో ఒకటి అంటున్నాడు. మగజాతికి ఈ పాపం తగిలి తీరుతుంది. ’’
‘‘కాంతం నేకేమన్నా చుట్టం అవుతుందా?’’
‘‘ఎదురుగా ఉన్న భార్య పేరు గుర్తు లేదు కానీ, ఎప్పుడో కాలేజీ క్లాస్‌మేట్ కాంతం బాగానే గుర్తుంది? అందుకే అన్నాను మీ మగజాతికి పాపం తగిలి తీరుతుందని, ఏం కాంతం కనిపించిందా? శ్రీదేవిలా అందంగా ఉందా? వయసుకు తగ్గట్టు లావయిందా?. పరాయి వాళ్లు మీకు అందంగానే కనిపిస్తారు లే!’’
‘‘అసలు కాంతం తెలుసా? నీకు?’’
‘‘తెలుసుకోవలసిన అవసరం లేదు.’’
‘‘పోనీ మునిమాణిక్యం తెలుసా?’’
‘‘శ్రీదేవి గురించి కలవరించే మరో వర్మనా? ఎవరైతే నాకేం ఈ మగాళ్లంతా అంతే శ్రీదేవి తప్ప మరో విషయమే లేదు వాళ్లకు.’’
‘‘పాపం మునిమాణిక్యంకు శ్రీదేవి తెలియనే తెలియదు. నాలానే అమాయకుడు. నోటి నుంచి మరో కాంత పేరు వినగానే క్లాస్‌మేట్ అని నిర్ణయానికి వచ్చేయడమేనా?. మునిమాణిక్యం సృష్టించిన పాత్ర కాంతం. ఆమె కూడా అచ్చం ఇలానే ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా తలాతోక లేని వాదన చేస్తుంది. అటూ ఇటూ తిప్పి ప్రతి విషయంలో మొగుణ్ణి సాధిస్తుంది ఆచ్చం నీలానే.. ఆమెతో పరిచయం ఏమైనా ఉందా? అని ఏదో సరదాగా అన్నాను.’’
‘‘తలా తోక లేకపోవడం ప్రపంచంలో ఏం జరిగినా మనం కోరుకున్న దానికి లింక్ పెట్టి వాదించడానికి తెలుగు చానల్స్ అని చెబితే సరిపోతుంది కదా? ఈ తరం వారికి తెలియని, చెప్పినా అర్థం కానీ మునిమాణిక్యం, కాంతంల గురించి ఎందుకు?’’
‘‘ఏమో అనుకున్నా నీకూ రాజకీయాలు బాగానే తెలుసు. కానీ పాపం చానల్స్‌నెందుకంటావు?’’
‘‘అదేదో చానల్ వాళ్లు బాత్‌టబ్‌లో పడితే బతుకుతారా? చస్తారా? చేతులు విరుగుతాయా? కాళ్లు విరుగుతాయా? కాలు విరిగితే కుడి కాలు విరుగుతుందా? ఎడమ కాలా? ఏ కాలు ముందు విరుగుతుంది అని బాత్‌టబ్‌లో దూకి మరీ చూపారు కదా? పనిలో పని బావిలో దూకాల్సింది శ్రీదేవితో పాటు నేరుగా పై లోకానికి వెళ్లే వాళ్లు.. ఏం జరిగిందో అక్కడికెళ్లి ఆమెనే అడిగితే సరిపోయేది. వీళ్లను అనకుంటా ఇంకెవరిననాలి?’’
‘‘ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉంది కాబట్టి ఏదో పద్దతిగా పోవాలని బాత్‌టబ్ కథనాలతోనే సరిపెట్టుకున్నారు. లేకపోతే.. అదే ఎన్నికల సమయంలో అయితే ?’’
‘‘ఐతే ఏం చేసేవారు? ఏకంగా పై లోకానికి వెళ్లేవారా?’’
‘‘శ్రీదేవిది హత్య.. దీని వెనుక భారత రాజకీయాల కుట్ర ఉంది. తెలుగు పార్టీలు పొత్తు కోసం జాతీయ పార్టీపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర పాలకులకు ఆశ చూపి, గల్ఫ్ పాలకులను ఒప్పించి కుట్రను బయటపడకుండా చేశారు అంటూ ఓ సంచలన వార్త వండితే అప్పుడు తెలిసేది. తెలుగు పార్టీలు అంటే మనకు ఏ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీని ఖాళీలో భర్తీ చేసేయొచ్చు. గల్ఫ్ పాలకులు ఖండించరు, ప్రశ్నించరు. అప్పటికి ఎన్నికలు ముగిసిపోతాయి. కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. నిన్న అలా ప్రసారం చేశారు. అలా జరగలేదు కదా? అని అడిగేదెవరు? చెప్పేదెవరు? ’’
‘‘ నోరు తెరిస్తే విలువలు ముఖ్యం అనే చెబుతారు కదా ?  ’’
‘‘సబ్బుల వ్యాపారం ఎలాంటిదో మీడియా వ్యాపారం కూడా అలాంటిదే.. మీరు అనవసరంగా మీడియాకు విలువలు ఆపాదిస్తున్నారని బాబా సాహెబ్ అంబేద్కర్ 1950లోనే చెప్పారు. ఏడు దశాబ్దాల క్రితం ఆయనకు అర్థం అయిన విషయం మనకే ఇంకా అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి కూడా మనం ఇష్టపడడం లేదు. ’’
బుద్దా మురళి (జనాంతికం 2-3-2018)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం