9, ఏప్రిల్ 2018, సోమవారం

ధనం మూలం...ఒక పొరపాటుకు యుగములు వగచేవు-

ఒక పొరపాటుకు యుగములు వగచేవు- అంటాడో సినీ కవి. తారలకే కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా మనుషులందరికీ ఇది వర్తిస్తుంది. ఒక పొరపాటు జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. పేదరికంలో పుట్టి సంపన్నులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ సుదీర్ఘ కాలం మహరాణిలా బతికి, చివరి రోజుల్లో దీనంగా బతకడం వంటి కష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది.
అన్నీ అనుకున్నట్టే జరగవు.. నిజమే. కానీ మన చేతిలో ఉన్నంత వరకైనా మనం కోరుకున్నట్టు జీవితంలో చివరి దశ ఉండేట్టు ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవచ్చు.
ఆమె పేరు ఎస్. వరలక్ష్మి ఆమె జీవితం నిజంగానే దేవుడిచ్చిన వరం లాంటిది. కానీ- ముగింపు శాపం లాంటిదే.
ఎస్.వరలక్ష్మి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. అందమైన రూపం, దానికి తగిన గాత్రం. పాటలు పాడే మాట దేవుడెరుగు, మాటలు రాకపోయినా డబ్బింగ్‌తో నడిపించేస్తున్న కాలం ఇది. తెలుగు సినిమాలకు ప్రారంభ కాలంలో నటులు తమ పాటలను తామే పాడుకునే వారు. ఆ తరువాత నేపథ్య గాయనీ గాయకులు వచ్చారు. భానుమతి, ఎస్.వరలక్ష్మి లాంటి వారు తమ పాటలు తామే పాడేవారు. ఎస్.వరలక్ష్మి నటన ఎంత బాగుంటుందో, ఆమె పాటలు కూడా అంతే బాగా పాడేవారు. 1936లో బాలనటిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన వరలక్ష్మి నటించిన చివరి సినిమా 1986లో వచ్చిన ‘ముద్దుల కృష్ణయ్య’. ఐదు దశాబ్దాల పాటు బాలనటిగా, హీరోయిన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా సుదీర్ఘ కాలం నటించిన ఆమె జీవితం ఎలా ఉండాలి? సరైన ప్రణాళిక లేకపోతే చివరి రోజులు ఎంత దుర్లభంగా మారుతాయో ఎస్.వరలక్ష్మి జీవితాన్ని చూసిన వారికి కన్నీళ్లు తెప్పించాయి.
***
ఓసారి పలకరిద్దామని మద్రాస్‌లో ఎస్.వరలక్ష్మి ఇంటికి ఆ కాలం నటులు జమున, గీతాంజలి వెళ్లారు. ‘‘ఒకప్పుడు సినిమాలో హీరోయిన్‌గా మంచి అందగత్తెగా ఒక వెలుగు వెలిగిన వరలక్ష్మిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక పోయాను. నైటీలో అనామకంగా కనిపించిన ఆమెను చూసి ఏడ్చేశాను. మతిస్థిమితం సరిగా లేని కుమారుడికి అన్నం తినిపిస్తూ పాత నైటీతో ఆమె కనిపించారు. అందమైన రూపం, అద్భుతమైన గాత్రానికి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆనాటి వరలక్ష్మినేనా నేను చూస్తున్నది అని కన్నీళ్లు వచ్చాయి. ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చాను. అమ్మా అన్నీ పోయాయి. చివరకు ఆ గాత్రం అయినా నీతో ఉందా? ఒక పాట పాడు అని కన్నీటితోనే అడిగాను. పాడింది. రూపం మారినా గొంతు అద్భుతంగా ఉంది. మధురంగా పాడింది. మేం ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి ఎస్ వరలక్ష్మి భయం భయంగా పైకి చూస్తూ మీరు వెళ్లిపోండి... మీరు వెళ్లిపోండి .. వాళ్లు చంపేస్తారు-అని భయం భయంగా మాట్లాడింది. ఎవరు చంపుతారు? నీకే భయం లేదు. మేమున్నాం.. అని ఎంత ధైర్యం చెప్పినా మీరు వెళ్లండి.. అంటూ పంపించింది. మద్రాస్ నగర పోలీసు కమిషనర్‌కు చెప్పి పోలీసు భద్రత ఏర్పాటు చేయమని కోరాను’’ అంటూ ఇటీవల ఈ వ్యాస రచయిత సీనియర్ నటి జమునను కలిసినప్పుడు వరలక్ష్మి గురించి చెప్పారు. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను కలిసి ఎస్.వరలక్ష్మిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరాను. తనతో పాటు హీరోయిన్లుగా నటించిన కొద్ది మందికి జయలలిత ఒకసారి విందు ఇచ్చారు. ఆ విందులో కలిసినప్పుడు ఐదులక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరితే ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పాను. ఐదు కాదు ఎస్ వరలక్ష్మి పేరు మీద పది లక్షలు డిపాజిట్ చేసి ఆ వడ్డీ ఆమెకు వచ్చే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బాల నటిగా, హీరోయిన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ఐదు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన నటి చివరి దశ అలా ఉండడం తట్టుకోలేక పోయాను. ఎస్ వరలక్ష్మి వివాహం తరువాత అలా మారిపోయారు. ఇంట్లో వాళ్లు ఎవరితో కలవనిచ్చే వారు కాదు. ఒకసారి రావికొండల రావు ఆమెను పలకరించేందుకు వెళితే ఇంట్లో వాళ్లు కలిసే అవకాశం ఇవ్వలేదు.
ఆ కాలనీకి చెందిన ప్రముఖ నిర్మాత ఎఎల్ శ్రీనివాసన్‌ను ఎస్.వరలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. వివాహం తరువాత ఆమెను పంజరంలో బంధించినట్టు అయింది. ఆమెకు కుమారుడు, కుమార్తె. సినిమా రంగానికి చెందిన వారు ఎవరైనా ఆమెను కలిసేందుకు ఇంటికి వచ్చినా కలవనిచ్చే వారు కాదు. కుమారుడి మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఇంటిని బందిఖానాగా మార్చిన కుటుంబం ఆమెను బాగా కుంగదీశాయి.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు పుట్టడం వల్ల ఆమెకు వరలక్ష్మి అని పేరు పెట్టారు. 1939లో వచ్చిన బాలనాగమ్మ, 1957లో వచ్చిన సతీసావిత్రి వంటి సినిమాల్లో నటించారు. దీపావళి, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, మాంగల్య బలం, ఆదర్శ కుటుంబం, ప్రేమ్‌నగర్, బొమ్మా బొరుసా, శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం వంటి సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులోనే కాకుండా పలు తమిళ సినిమాల్లో కూడా నటించారు.
ఈ రోజుల్లో హీరోయిన్లకు రెండు మూడేళ్లపాటు స్థిరంగా అవకాశాలు దొరకడం లేదు. ఐనా వాళ్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో ఉన్నా ఎస్.వరలక్ష్మి మాత్రం తన వివాహ విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల చివరి రోజులు దయనీయంగా గడిచాయి. ఐదు దశాబ్దాలు అద్భుతంగా గడిచిన ఆమె జీవితం అంతిమ దశలో మాత్రం బాధాకరంగా సాగాయి.
చివరి దశలో జీవితం ఎలా గడవాలనేది జీవితం ప్రారంభ దశలోనే నిర్ణయించుకోవాలి. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. లేకపోతే ఎవరికైనా అంతిమ దశ బాధాకరంగానే ముగుస్తుంది. జీవిత చరమాంకం ఏ విధంగా ఉండాలనేది మన చేతిలోనే ఉంటుంది. మన గురించి మనమే పట్టించుకోనప్పుడు దేవుడు కూడా పట్టించుకోడు.
ఎస్.వరలక్ష్మిని జీవిత కాలమంతా అదృష్టం వెన్నంటి నిలిస్తే, చివరి దశలో మాత్రం దురదృష్టం బలంగా ప్రభావం చూపింది.
- బుద్ధా మురళి(

1 కామెంట్‌:

  1. kshaminchaali, tappulu vedakinanduku, balanagamma 1939 lo raaledu, 1942 lo vachindi andulo varalaxmi garu leru. avida gaatram chaala goppa gaa vuntundi, parichayaaniki thanks

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం