22, సెప్టెంబర్ 2018, శనివారం

చరిత్ర సృష్టించనున్న ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో ఇవి తొలి ఎన్నికలు. ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించనున్నాయి. సీట్లు, ఓట్లపరంగా కొత్త రికార్డులను సృష్టించనున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందే ఎన్నికలు జరు గడం వల్ల ఎన్నికల కమిషన్ అధికారిక సమాచారంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగానే ఎన్నికల ఫలితాలు చూపించారు 2014లో ఎన్నికలు జరిగేనాటికి అధికారికంగా తెలంగాణ ఆవిర్భవించలేదు కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు అధికారికంగా తెలంగాణలో తొలి ఎన్నికలవుతాయి.

అనేక సర్వేలు చేయించాం టీఆర్‌ఎస్ వంద స్థానాల్లో విజయం సాధిస్తుందని కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలు, నారాయణఖేడ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ సర్వేల గురించి కేసీఆర్ చెప్పారు. ఫలితాలు దానికనుగుణంగానే వచ్చాయి. సర్వేలపై మాకు నమ్మకం లేదు. మేమే గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు పైకి చెబుతున్నా, పలు ఎన్నికల్లో సర్వేల గురించి కేసీఆర్ చెప్పినట్టుగానే ఫలితాలు రావడం వల్ల లోలోన కాంగ్రెస్ నాయకులూ భయపడుతున్నారు. కేసీఆర్ పార్టీపరంగా నిర్వహించిన సర్వేల్లోనే కాకుండా ఆజ్ తక్, టీవీ 5, ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ టీఆర్‌ఎస్ విజయావకాశాలు స్పష్టమయ్యాయి.

సీట్ల విషయంలో అనుమానాలు, సందేహాలు భిన్నాభిప్రాయాలు ఉం డవచ్చు. కానీ టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే మాట తెరాస వ్యతిరేకుల్లో కూడా బలంగా వినిపిస్తున్నది. విజయం ఖాయం కానీ అంతకుమించి రికార్డులు సృష్టిస్తుందా? అనేదే చూడాలి. ఓట్లు, సీట్ల పరంగా తెలంగాణ రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు సర్వేల్లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కేట్టు లేదనేవిధంగా ఉన్నా యి. అయితే ఓట్ల శాతం చూస్తే వివిధ సర్వేలు 43 నుంచి 48 శాతం వర కు ఓట్లు వస్తాయని చెబుతున్నాయి. ఐదేండ్ల పాలన తర్వాత అధికార పక్షానికి సహజంగా ఓటింగ్ శాతం తగ్గుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక సార్లు కాంగ్రెస్, టీడీపీలు రెండుసార్లు అధికారంలోకి వచ్చాయి. అయితే ఐదేండ్లు పాలించిన తర్వాత తిరిగి గెలిచినా ఓటింగ్ శాతం తగ్గింది. కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ సీట్ల సంఖ్యనే కాదు ఓటింగ్ శాతాన్ని కూడా గణనీయం గా పెంచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అయితే పోటీచేసిన సీట్లు, లభించిన ఓట్లను బట్టి టీఆర్‌ఎస్‌కు తెలంగాణలో 34.15 శాతం ఓట్లతో 63 సీట్లు లభించాయి. ఇప్పటివరకు మన వద్ద ఉన్న ఎన్నికల ఫలితాలు, ఓట్ల శాతాలు అన్ని ఉమ్మడి రాష్ట్రంలోనివే. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించగా 57లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుం చి ఇప్పటివరకు 13 సార్లు శాసనసభకు సాధారణ ఎన్నికలు జరిగాయి. 1972 లో జరిగిన ఒకేఒక ఎన్నికలో మాత్రమే అధికారపక్షం మొత్తం ఓట్లలో 50 శాతానికి పైగా సాధించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ 52.2 9 శాతం ఓట్లు సాధించింది.

83 ఎన్నికలకు సంబంధించి అధికారికంగా టీడీపీని గుర్తింపు పొందిన పార్టీగా చూపలేదు. టీడీపీ తరపున గెలిచినవారిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే చూపారు. 83 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకా రం టీడీపీని గుర్తింపు పొందని పార్టీ అని చూపుతూ ఆ పార్టీ తరపున ఒక రే గెలిచినట్టు చూపుతున్నారు. మిగతా వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే చూపిస్తున్నారు. ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు టీడీపీకి వచ్చిన ఓట్లు కలిపే చూపడంవల్ల నాటి ఓటింగ్ శాతం అధికారికంగా చెప్పలేం. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా ప్రతిపక్షం హోదా కూడా లేనివిధంగా 1994లో టీడీపీ విజయం సాధించింది. అయితే అప్పుడు కూడా టీడీపీ 50 శాతం ఓట్ల మార్కును దాటలేదు. 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 216 స్థానాలు గెలుచుకున్నది. సీపీఐ (21), సీపీఎం (16) వంటి మిత్రపక్షాలు 37 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ 33.85 శాతం ఓట్లతో కేవలం 26 సీట్లకే పరిమితమైంది.

ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఎన్నికలు 57లో జరిగాయి. కాంగ్రెస్ 47.3 8 ఓట్లు. 62లో 47.25 శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 72లో 52.29 శాతం 78లో 39.25 శాతం ఓట్లతో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 85లో 46 శాతం ఓట్లతో టీడీపీ, 89లో 47 శాతంతో కాంగ్రెస్, 94లో 44.14 శాతం ఓట్లతో టీడీపీ విజ యం సాధించింది. 99లో 43.87 శాతం ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. 2004లో 38.56 శాతం ఓట్లతో కాంగ్రెస్. 2009లో 36 శాతం ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది 2014లో తెలంగాణలో టీఆర్ ఎస్ 34.15 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది. సాధారణంగా ఇప్ప టివరకు అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి గెలిస్తే సీట్లు, ఓట్లు తగ్గుతున్నాయి. కానీ ఈసారి దీనికి భిన్నమైన ఫలితాలు చూడబోతున్నాం. ఓట్లు మాత్రమే కాదు సీట్లు కూడా పెరుగబోతున్నాయి.

టీఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగినా అన్ని పార్టీలు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి జై తెలంగాణ అనేక తప్పలేదు. అపాయింటెడ్ డేట్‌కు ముందే తెలంగాణలోనే ఎన్నికలు జరుగడం వల్ల అప్పు డు టీడీపీ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ కూడా కొంతవరకు ప్రభా వం చూపాయి. అప్పటివరకు టీఆర్‌ఎస్ పోటీచేస్తుందా? కాంగ్రెస్‌లో విలీ నమవుతుందా? అనే ప్రచారం బలంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో టీఆర్‌ఎస్ 63 సీట్లు సాధించడమే గొప్ప. అప్పటికీ ఇంకా విభజన అమ ల్లోకి రాలేదు టీడీపీ బీజేపీ పొత్తు కొంతవరకు పని చేసింది. టీఆర్‌ఎస్ 63 స్థానాలు సాధిస్తుందనే అంచనా కూడా అప్పుడు ఎవరికీ లేదు. సుడిగాలిలా కేసీఆర్ 70 నియోజకవర్గాల్లో చేసిన ప్రచారం ఫలించింది. 2014 కన్నా ముందు 2004లో 27 స్థానాలు, 2009లో 10 స్థానాల్లో మాత్రమే టీఆర్‌ఎస్ గెలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఘన విజయాలు సాధించింది. ఉద్యమకాలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసలు పోటీచేయని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 99 డివిజన్‌లలో విజయం సాధించింది. గ్రేటర్ చరిత్రలోనే ఈ స్థాయి విజయం ఏ పార్టీకి లభించలేదు. ఈ నాలుగున్నరేండ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలే టీఆర్‌ఎస్‌కు పెట్టని కోటలా మారాయి.

మేధావుల వాదన ఎలా ఉన్నా సాధారణ ప్రజల్లో కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉంటుంది. నెలకు వెయ్యి రూపాయలు అందించే ఆసరా పథ కం ఒక్కటి చాలు సాధారణ విజయానికి. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ , మత్స సంపద పెంచడానికి తీసుకున్న చర్యలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ వంటి పథకాల అమలు అధికారపక్షానికి ఘనవిజయం చేకూర్చి పెట్టనున్నాయి. అధికారంలోకి వచ్చాక ఏం చేశామో అధికార పక్షం చెబుతున్నది. తిరిగి అధికారం అప్పగిస్తే ఏం చేయనున్నారో చెబుతున్నారు. విపక్షం మాత్రం కేసీఆర్‌ను దించడమే మా ఏకైక లక్ష్యం అంటున్నది. ఓ లక్ష్యమంటూ లేని విపక్షం కూడా టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అంశం. వీటన్నింటి వల్ల ఈసారి టీఆర్‌ఎస్ రికార్డు స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించనున్నది.
-నమస్తే తెలంగాణ - కౌటిల్య (22-9-2018)