19, అక్టోబర్ 2018, శుక్రవారం

‘మీటూ’ మగానుభావులు!


అరే చోటూ.. టూ బై ఫోర్ చాయ్ లావో ’’
‘‘ లోకం ఏందిరా ఇలా తయారైంది? ’’
‘‘మనం మహానుభావులం అనుకున్న వాళ్ల చెత్తకథలు వింటుంటే ..ఛీ ...ఛీ . ’’
‘‘వాళ్ల మీద కోపం వస్తుందా? జెలసీ కలుగుతుందా??’’
‘‘జీతానికే దిక్కులేదు. మా చానల్‌లో ఆరునెలల నుంచి జీతం ఇవ్వకపోయినా ఆఫీసులో నోరు మూసుకుని, కెమెరా ముందు నోరు బిగ్గరగా తెరిచి పని చేస్తున్నాం. ఇక మా జీవితానికి సరసాలు కూడానా? ’’
‘‘నీకు జీతం రాకపోయినా కనీసం టీవీలో కనిపిస్తావు.. నీకు అదన్నా తృప్తి ఉంది. మేం రాసే అక్షరాలు పత్రికలో కనిపిస్తాయి. బాస్‌లతో మేం తినే తిట్లు.. మేం భరించిన శాడిజం మనసులోనే దిగుమింగుకొని చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాలను సంపాదించుకుంటున్నాం. మేమెవరికి చెప్పుకోవాలి?’’
‘‘ఇంతకూ దేని గురించి చర్చ?’’
‘‘అదేరా! మీటూ అని ప్రపంచాన్ని ఇప్పుడు ఊపేస్తున్న అంశం. అక్కడెక్కడో హాలీవుడ్‌లో మొదలైన ప్రకంపనలు అన్ని రంగాలనూ చుట్టు ముట్టాయి. లక్షలాది మంది బాధితుల్లో ఓ డజను మంది ముందుకు వచ్చారు.’’
‘‘చాలాకాలం క్రితం ఓ సంపాదక ‘సుంద’రాంగుడు చనిపోతే బాధిత జర్నలిస్టులంతా ఏకంగా అతని శాడిజం గురించి ఓ పుస్తకమే తీసుకు వచ్చారు. అప్పటికే రిటైర్ అయిన బాధితులంతా చచ్చిన వాడు తిరిగి రాడు అనే ధైర్యంతో తమ గోడును రాసుకున్నారు. పోయిన వారికి నివాళి సర్వసాధారణం కానీ ఇలా పుస్తకం ద్వారా అతని శాడిజాన్ని బయట పెట్టారు. ఇలా ‘మీటూ’ను తొలుత కనిపెట్టింది తెలుగుసీమలోనే’’
‘‘మీటూ ఉద్యమంలో ఒక్కొక్కరి పేర్లు వింటే నాకైతే ఆశ్చర్యంగా లేదు. ఓషో రజనీష్ ఎప్పుడో చెప్పాడు. మనిషికి- మనిషి లక్షణాలన్నీ ఉంటాయి. ఆ మనిషి ప్రధానమంత్రి కావచ్చు. అమెరికా అధ్యక్షుడు కావచ్చు. ప్రపంచంలో కెల్లా సంపన్నుడు కావచ్చు. గుడి మెట్ల దగ్గర అడుక్కునే వాడు కావచ్చు. మనిషి మనిషే.. మనిషి ప్రాథమిక లక్షణాలన్నీ మనుషుల్లో ఉంటాయి. చట్టానికి, సమాజానికి భయపడి ఒకడిలో అణిగిమణిగి ఉంటాయి. నా చాంబరే నా ప్రపంచం, ఇక్కడ నేను చెప్పిందే చట్టం అనుకునే వాడిలో విజృంభిస్తాయి. ఎప్పుడో ఓసారి ఇలా ప్రపంచంలో ఎక్కడో ఎవరో చైతన్యవంతులై గొంతు విప్పినప్పుడు మిగిలిన వారూ మీటూ అని బయటకు వస్తారు’’
‘‘అంటే- వాళ్ల తప్పేమీ లేదా?’’
‘‘ఆ మాట నేనెక్కడన్నాను? అనుమతితో సాగే అక్రమ సంబంధాలు నేరం కాదని కోర్టు చెప్పింది కానీ మీ ఇష్టం ఉన్న వాళ్ల మీద చేయి వేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు. పట్టుపడనంత వరకే మహాత్ములు అంటున్నాను. ’’
‘‘ఏమోరా! నీ మాటలు వింటుంటే నువ్వు తప్పు చేసిన వారిని సమర్ధిస్తున్నట్టుంది..’’
‘‘నా మాటలకేం.. ఆ గాయత్రిని అదే పనిగా చూస్తున్నావేం? విషయం మీ ఆవిడకు తెలిస్తే’’
‘‘పడక పడక నీ కంట్లోనే పడ్డానా! వద్దురా బాబూ ఉన్న ఉద్యోగం ఊడిందంటే రోడ్డున పడతాను. అసలే రోజులు బాగా లేవు. ఒకరి తరువాత ఒకరు ధైర్యంగా బయటకు వస్తూ మీటూ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. అసలే ఆ పిల్లకు షార్ట్ టెంపర్.. కోపమొచ్చిందంటే మీటూ అంటూ ముందడుగు వేసిందా? నా బతుకు బస్టాండే.. అందుకే అటు చూడడమే మానేశా. ’’
‘‘నువ్వేం చేసుకుంటే నాకేం.. కానీ మనందరం మహానుభావులమే. కొందరు అవకాశం లేక మంచివాళ్లుగా ఉండిపోతున్నాం అని చెప్పడానికే ఆమె సంగతి గుర్తు చేశా’’
‘‘మన సంగతికేం కానీ- ఆ మధ్య వరల్డ్ బ్యాంక్ పెద్ద ఉద్యోగి, ఈ మధ్య సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహితలు సైతం ఇలాంటి విషయాల్లో మామూలు మనుషులే అని తేలినప్పుడు ఎందుకో వింతగా అనిపిస్తుంది’’
‘‘ఏయే రంగాల వాళ్లు ఎక్కువగా విలువల గురించి మాట్లాడతారో అదే రంగానికి చెందిన వారి బాగోతాలు మీటూ ఉద్యమం ద్వారా బయటపడుతున్నాయి.’’
‘‘ఔను.. సినిమా పెద్దలు, మీడియా పెద్దలు, నాయకులు, బాబాలు, కళాకారులు, రచయితలు విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మీటూ పుణ్యమా అని బయటపడిన ఉదంతాలన్నీ వీరివే.’’
‘‘పాపులారిటీని మించిన క్రేజ్ లేదంటారు. ఐనా వీరికి ఇదేం బుద్ధి?’’
‘‘ఇంతసేపు చెప్పినా మళ్లీ అదే మాట. మనిషికి మనిషి లక్షణాలన్నీ ఉంటాయి. ఇది రజనీష్ మాట’’
‘‘ఔనురా! నటుడు అలోక్‌నాథ్ సగం బట్టతలతో ఎంత హుందాగా ఉంటాడు. అతను నటించే సినిమాలు, సీరియళ్లలో ఏ పాత్ర ఐనా అతని భుజంపై వాలిపోయి తమ కష్టాలు చెప్పుకోవాలనిపించేంత హుందాగా ఉంటాడు. మనోడూ మగానుభావుడేనట! నానా పాటేకర్ సామాన్యుల గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతాడు? ముసుగు తీసేస్తే- ప్రతివాడూ డేరాబాబానే! అలోక్‌నాథ్ మాత్రమే కాదు, కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ కూడా మగానుభావుడే అని తేలింది’’
‘‘అప్పుడు ఆరోపణలు చేయకుండా ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్టు?’’
‘‘బాగా అడిగావురా! నీకు ఆరునెలల నుంచి జీతం రాకున్నా ఎందుకు మాట్లాడడం లేదు. రేపు నీకో మంచి ఉద్యోగం వచ్చిందనుకో ఈ సంగతి మైకు పుచ్చుకుని మాట్లాడకుండా ఉంటావా? ఉండలేవు. ఎందుకంటే ఎవరివైనా పొట్టతిప్పలే. నోరు విప్పితే బతుకు తెరువు పోతుందేమో అనే భయం. వాళ్లు ఇప్పటికైనా నోరు విప్పుతున్నందుకు అభినందించాలి కానీ అక్టోబర్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు. సెప్టెంబర్‌లో ఎందుకు చెప్పలేదు అనే వెర్రిమొర్రి ప్రశ్నలు వద్దు. కనీసం మరొకడు ఇలా బరితెగించేందుకు భయపడతాడు. ’’
‘‘హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలా జరుగుతున్నా- మన తెలుగు చిత్రసీమలో, తెలుగు మీడియాలో ఇలాంటివి లేకపోవడం మన అదృష్టం.’’
‘‘లేవా.. బైటపడేందుకు మనకు ధైర్యం చాలడం లేదా?
‘‘ముద్దయినా పెట్టాలి.. అంటూ కళామతల్లి ముద్దుబిడ్డ, 60 ఏళ్ల బాలకృష్ణుడు ముద్దుముద్దుగా పలికితే మురిసిపోయి తరించిన పుణ్యపురుషులం మనం ’’
‘‘ఆడ కావచ్చు, మగ కావచ్చు. శారీరక హింసను మించిన మానసిక హింసను అనుభవించినా బతుకు భయంతో మనం బయటపడడం లేదేమో!’’

 - బుద్దా మురళి(జనాంతికం19-10-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం