5, అక్టోబర్ 2018, శుక్రవారం

పిల్లలు-జ్ఞానవృద్ధులు


‘‘మీలో మీరే మురిసిపోయే బదులు అదేంటో మాకూ చెప్పండి ’’
‘‘ఎన్నికలు ముగిసేంత వరకు రోడ్డు మీద ఎన్నికల గుర్తులేవీ కనిపించకుండా కార్లు, సైకిళ్లు, మనిషి చేతులను నిషేధించాలని కోర్టుకు వెళితే ఎలా ఉంటుందంటావు?’’
‘‘ఐడియా భలేగా ఉంది. ఈ డిమాండ్‌తో నీ పేరు మార్మోగిపోవడం, టీవీల్లో నీ ఇంటర్వ్యూలు, ఒక్కసారిగా నువ్వు సెలబ్రిటీవి ఖావడం ఖాయం. కత్తిలాంటి ఐడియాతో మీడియాలో గొడ్డలి లాంటివాడివి కావచ్చు.’’
‘‘ఈ పాపులారిటీతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఏదో ఒక కూటమిలో చేరిపోయి కనీసం నీకూ నాకూ సీట్లు సంపాదించేయవచ్చు!’’
‘‘సీటుదేముందిరా! ఏదో ఓ మూలకు సర్దుకొని కూర్చోవచ్చు.’’
‘‘సీటు అంటే అది కాదు. కూటముల పొత్తులో టిక్కెట్ ’’
‘‘గెలుస్తామంటావా?’’
‘‘కూటమి కిక్కిరిసిపోయిందంటున్నారు. మనల్ని చేర్చుకుంటారా?’’
‘‘నాదో ఐడియా.. ఇప్పటికే చాలా కూటములు ఏర్పడ్డాయి కదా? మనం ఈ కూటములన్నింటినీ కలిపి ‘కూటముల జేఏసీ’ని ఏర్పాటు చేసి, మన వాటా కింద ఒకటి, రెండు సీట్లు డిమాండ్ చేస్తే..’’
‘‘60 ఏళ్లు దాటాక హీరో అవకాశాలు ఉండవని తెలిసి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తరువాత చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ కాలేదు. రిటైర్డ్ ప్రొఫెసర్లు, రిటైర్డ్ డాక్టర్లు, రిటైర్డ్ కళాకారులు, గాయకులు, రిటైర్డ్ మావోయిస్టులు, స్వచ్ఛంద లేదా నిర్బంధ పదవీ విరమణ చేసిన ఐఎఎస్‌లు రాజకీయాల్లో నిలదొక్కుకుంటారా?’’
‘‘నీరు-నిప్పులా బతికిన పార్టీలు ఒకే వేదికపై నిలబడితే వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా? అసెంబ్లీలో సీట్ల కన్నా కూటమిలో ఎక్కువ పార్టీలుంటే అప్పుడేమవుతుంది? ’’
‘‘కిలో కరక్కాయ పొడికి ఎవరికో వెయ్యి రూపాయలు వచ్చాయని అంతా క్యూలో నిల్చొని డిపాజిట్లు కడితే నిండా మునిగారు. అలానే ఎన్టీఆర్‌కు రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్ వర్కౌట్ అయిందని అందరూ పొలోమంటే ఏమైంది? మేధావులకు రిటైర్‌మెంట్ తర్వాత పెన్షన్ తప్ప రాజకీయ భవిష్యత్తు అనుమానమే.’’
‘‘తాతోయ్.. లక్ష రూపాయలివ్వవా! నేను క్యాడ్‌బరీ చాక్లెట్ కొనుక్కుంటా..’’
‘‘లేవు.. పోరా!’’
‘‘లక్ష లేకుంటే పోనీ ఓ రూపాయి ఇవ్వు తాతయ్యా! ’’
‘‘మీ అమ్మను అడుగు’’
‘‘మా మనవడి సంగతి వదిలేయ్! మనం రాజకీయాలు మాట్లాడుకుందాం. ఆచార్యులు, గాయకులు అధికారంలోకి వచ్చేస్తారంటావా? ’’
‘‘తాతోయ్ ! ఎన్నిసార్లు అడగాలి పోనీ పది పైసలివ్వు ఐస్‌క్రీమ్ కొనుక్కుంటా..’’
‘‘ఔనురా! పిల్లగా.. మీ తాతను డబ్బులడుగుతావ్! సమాధానం రాక ముందే తు ర్రుమని పారిపోతావ్! ’’
‘‘పిల్లాడ్ని వదిలేయండి.. పక్కింట్లో పిల్లలతో ఏదో చర్చలకు వెళ్లాడు.’’
‘‘చక్కని కథ, అద్భుతమైన స్కిృప్ట్‌తో సినిమా తీస్తే రికార్డులు తిరగ రాయాల్సిందే! అలానే అద్భుతమైన మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు వెళితే విజయం సాధించి తీరుతారు. ఈ ఉదయమే మా ఇంటికి ఓ మ్యానిఫెస్టో వచ్చింది. చాలా అట్రాక్టివ్‌గా ఉంది. మీరూ చదివి అభిప్రాయం చెప్పండి’’
‘‘నెలకు పదివేల రూపాయల ఇంటి అద్దె, 25 కిలోల బియ్యం, 15 లీటర్ల పాలు, 450 రూపాయల కూరగాయలు. బట్టల ఇస్ర్తికి 250, హోటల్‌కు వెయ్యి, సినిమాకు వెయ్యి, చిట్టీకి 15వందలు, మందులకు ఆరువందలు. పిన్ని వాళ్లింట్లో శుభకార్యానికి పనె్నండు వందలు. ఇంటర్‌నెట్ కనెక్షన్‌కు వెయ్యి, కేబుల్ కనెక్షన్ ఐదువందలు, సెల్‌ఫోన్‌కు... ఇదేంటోయ్ మ్యానిఫెస్టో చాలా చిత్రంగా ఉంది. ఎవరు తయారు చేశారో కానీ బాగుందోయ్. చాలా ప్రాక్టికల్ నాయకులు. మన జీవితానికి ప్రతి నెలా ఏం అవసరమో అదే మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇంతకన్నా ప్రాక్టికల్‌గా ఉండే మ్యానిఫెస్టో దేశంలో ఏ పార్టీ కూడా విడుదల చేయలేదు. ’’
‘‘కుటుంబం కాస్త ఆగు... సారీ నీకిచ్చింది పార్టీ మ్యానిఫెస్టో కాదు. నేనురాసుకున్న మా ఇంటి బడ్జెట్’’
‘‘రెండింటికీ పెద్ద తేడా ఉన్నట్టు అనిపించడం లేదు. ఇంటింటి పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి నెల నెలా మీ ఇంటి బడ్జెట్ అమలు చేసే బాధ్యత మాదే అని ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తే నా సామిరంగా ...’’
‘‘ఒక రూపాయి ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వకపోతే బాబాయ్‌ని చాక్లెట్ కోసం కోటి రూపాయలు అడుగుతాను? ’’
‘‘మీ మనవడు నాకు పిచ్చెక్కించేట్టు ఉన్నాడురా! బుడిబుడి అడుగులతో వచ్చీరాని మాటలు మాట్లాడుతుంటే ముచ్చటేస్తుంది కానీ.. చాక్లెట్ కొంటా అని ఓసారి పది పైసలిమ్మంటాడు, మరోసారి కోటి అంటాడు. కోటి రూపాయలకు పది పైసలకు సంబంధం ఉందా? ’’
‘‘తాతోయ్.. పక్కింటి పిన్ని మామిడికాయ ముక్క ఇచ్చింది. కోటిరూపాయలు నాకేమొద్దు.’’
‘‘అరేయ్.. నువ్వు నాకు పిచ్చెక్కిస్తున్నావురా!’’
‘‘రావుగారూ! పిల్లలు బాలమేధావులు వారిని అలా కొప్పడితే ఎలా?
నాలుగు డజన్ల పార్టీలు పుట్టాయి . పుట్టిన రోజు నాడు వాళ్లేమన్నారు? అధికారంలోకి వచ్చేస్తాం. భూలోక స్వర్గం చూపించేస్తాం అని సవాళ్లు విసిరారు. మూడు డజన్ల మంది రెండో వారం నుంచే కనిపించడం లేదు. మిగిలిన డజనులో సగం మంది రోజూ పత్రికల్లో కనిపిస్తున్నారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని సవాల్ చేసిన వీళ్లు తీరా ఎన్నికలు వచ్చాక ఒకటి రెండు సీట్లు కేటాయించండి చాలు అంటున్నారు.’’
‘‘ఔను.. ఐతే వారికి, మీ మనవడికి సంబంధం ఏమిటి?’’
‘‘ఉంది.. రావుగారూ.. పిల్లలు, వృద్ధ జ్ఞానులైన మేధావులూ ఒకటే.. కల్లాకపటం లేని వాళ్లు. దైవ స్వరూపులు. వాళ్లు ఊహాలోకాల్లో ఉంటారు. చిన్నపిల్లలు లక్ష ఇమ్మంటారు. వెంటనే పోనీ పది రూపాయలు ఇమ్మంటారు. చివరకు మామిడి ముక్కే చాలన్నాడు. అధికారంలోకి వచ్చి ప్రపంచాన్ని మార్చేస్తామన్న మేధావులు వెంటనే- ఒక్క సీటన్నా ఇవ్వండని అడుగుతారు. పిల్లలను, జ్ఞాన వృద్ధులైన మేధావులను ప్రేమించాలి. కోపగించుకోవద్దు’’
‘‘ఇంతకూ ఫలితాలెలా ఉంటాయంటారు?’’
‘‘ఇండియాలో పాకిస్తాన్ పార్టీ గెలుస్తుందా? ఇండియాలో ఇండియా పార్టీ గెలుస్తుంది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం గెలుస్తుంది.’’ *

1 కామెంట్‌:

  1. మురళి గారూ, ఇంతకీ మీ బ్లాగు మానిఫెస్టో రాయనే లేదు. మీ బ్లాగు చదివినందుకు ఒక లకారం, కామెంటు రాసినందుకు కోటి రూపాయలు లాంటి వాగ్దానాలు ఇస్తేనే ఇకపై మా ఆదరణ. మీ బ్లాగు ఈ విశ్వానికే ఉత్తమ బ్లాగు పోటీ నెగ్గాలంటే ఈ మాత్రం తప్పదు. అసలే పక్క బ్లాగు వాళ్ళు బోల్డన్ని తాయిలాలు ప్రకటించారు ఆనక మీ ఇష్టం.

    మనలో మాట: ప్రస్తుతానికి వాగ్దానం చేస్తే చాలు, పొరపాటున గెలిస్తే అప్పుడు ప్రపంచ బాంక్ అప్పు రాలేదనో సింగపూరు ప్రధాని చేయిచ్చాడనో ఎదో ఒక నెపం చెప్పొచ్చు.

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం