1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

దేవుడే దిగిరావాలి..


‘‘ ఛీ.. ఛీ.. మరీ ఇంత అన్యాయమా? ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతోంది?’’
‘‘ఏమైందిరా? ఐనా ఈ రోజు కొత్తగా విలువలు పడిపోవడం ఏమిటి? ఎప్పటి నుంచో ఇలా జరుగుతున్నదే కదా? కాలానికి తగ్గట్టు మార్పు తప్పదు. కలి ప్రవేశించినప్పుడే ఆ ప్రభావం మొదలైంది. ఇప్పుడేంది?’’
‘‘ఎంత కలికాలం ఐనా ఎంతో కొంత ధర్మం ఉండాలి...’’
‘‘ఔను.. ఇంతకూ ఏమైంది? ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచుతున్నారా? ఓట్లు కొంటున్నారా? ఎన్నికలు మొదలైనప్పటి నుంచే ఏదో ఒక స్థాయిలో ఈ వ్యవహారం సాగుతూనే ఉంది కదా? ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపోవడానికేముంది?’’
‘‘ఎప్పుడైనా విన్నామా? కన్నామా? కలి కూడా సిగ్గుపడేట్టు చేస్తున్నారు’’
‘‘ఎన్నికల గురించే కదా? నువ్వు మాట్లాడేది.’’
‘‘ఔను!’’
‘‘మరీ అంతగా ఆశ్చర్యపోవడం ఏంటి? లగడపాటి ఆవేదన గురించా? ’’
‘‘లగడపాటి ఏంటి?’’
‘‘అందరూ నవ్విన తరువాత తొర్రి పళ్లవాడు నవ్వాడని.. ఫలితాలు వచ్చిన రెండు నెలల తరువాత ఆయన ఆశ్చర్యపోతూ, నేను ప్రకటించిన ఎన్నికల ఫలితాలను అధికారికంగా గుర్తించాలి కానీ ఎన్నికల కమిషన్ ఫలితాలు ప్రకటించడం ఏమిటన్నట్టు ఆశ్చర్యపోతున్నాడు. ఎన్నికల కమిషన్ ఫలితాలను తాను గుర్తించేది లేదంటున్నాడు.’’
‘‘ఔను.. నేనూ చూశాను. బాబుగారిని - ఇంటికి వెళ్లి కలిసి వచ్చిన తరువాత ఢిల్లీలో ఈ ప్రకటన చేశాడని పత్రికలలో చదివాను’’
‘‘నీకంటే పనీపాటా ఉండదు. రోజూ నాలుగైదు పత్రికలు చదువుతుంటావు. టీవీలో వార్తలు చూస్తుంటావు. ఓట్లు లెక్కించగానే ఫలితాలు టీవీలో చూసి ఉంటావు. లగడపాటికి ఒకటా రెండా వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఆయన చూసి ఉండరు. బాబును కలిశాక- ఆయన ఫలితాలు చెప్పి ఉంటారు. రెండునెలల తరువాత స్పందిస్తే తప్పా? వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రాచీన విద్య చిలక జోస్యాన్ని గౌరవించే ఆయన్ని అభినందించాలి కానీ విమర్శిస్తావేం.’’
‘‘ఇంకెక్కడి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు? ఎప్పుడో నిండా మునిగిపోయారు. సైకిల్ నడుపుతున్నట్టు ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. ఆ సైకిల్ సహా ఆయన్ని అమ్మినా అప్పు తీరదని తెలిసిన వారంటారు.. ’’
‘‘లోకులు కాకులు. ఇలానే అంటారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం దివాలా తీస్తే తీసి ఉండొచ్చు. వ్యాపారం పోతే పోనీ చిలక జోస్యాలే నాకు ముఖ్యం అంటూ ఆయన నిలబడ్డాడు చూడు .. నాకది బాగా నచ్చింది. ప్రాచీన కళలు, సంస్కృతిని కాపాడాలని అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవారే. కానీ ఇలా ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించే వారేరి?’’
‘‘సర్లే .. ఆయనకు లేని బాధ నాకెందుకు? వ్యాపారాలు పోతే చిలక జోస్యం చెప్పుకొని బతుకుతారు. పెప్పర్ స్ప్రే ఏజెన్సీ తీసుకుంటారు... నాకేం?’’
‘‘మనం ఇంత సేపు మాట్లాడుకున్నా... ప్రజాస్వామ్యం విలువలు లేకుండా పోయాయంటూ నీ బాధ ఏంటో ఇప్పటి వరకు చెప్పనే లేదు.’’
‘‘ఓ అదా.. మనం ఎప్పుడైనా విన్నామా? కన్నామా? ’’
‘‘ఏంటో చెప్పి ఏడువ్’’
‘‘ఎన్నికలు పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత డబ్బులు ముట్టచెప్పడం మామూలే. ఇవ్వడం, తీసుకోవడం రెండూ మామూలే. కానీ ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడం ఎంత అన్యాయం? పంచాయతీ ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి డబ్బులు పంచిన వాళ్లు, ఓడిపోగానే ఇంటింటికీ తిరిగి మా డబ్బు మాకిచ్చేయమని అడుగుతున్నారట! ఇదెంత అన్యాయం?’’
‘‘ఎన్నికలన్నాక ఒకరికన్నా ఎక్కువ మందే పోటీ చేస్తారు. అందరూ పంచుతున్నారు. గెలిచేది ఒకరే కదా? ఈ మాత్రం ప్రజాస్వామ్య తత్త్వం అర్థం కాని వాళ్లు, తెలియని వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు? ఇలా ఐతే వచ్చే ఎన్నికల్లో వాళ్లు డబ్బులు పంచితే తీసుకుంటారా? ’’
‘‘ఓడినా గెలిచినా తిరిగి డబ్బులు అడగం అని హామీ పత్రం రాసుకుంటారేమో చూడాలి’’
‘‘ఇది విన్నావా? తెలంగాణలో వరి పండదు అన్నారు కదా?’’
‘‘వరి పండదు అన్నారు. అంతకు ముందు తినడం నేర్పించాం అన్నారు. సరే ఏమైంది?’’
‘‘ఈసారి దేశంలో అత్యధికంగా వరి తెలంగాణలోనే పండింది. దేవుడి దయ తెలంగాణపై భాగానే ఉంది. దేశానికి ధాన్యాగారంగా మారుతోంది.’’
‘‘అంతగా మురిసిపోకు.. తెలంగాణకు పెద్ద ప్రమాదం తప్పేట్టు లేదు. అది తెలుసుకో ముందు..’’
‘‘ఎలా?’’
‘‘రెండు నెలల తరువాత ఎన్నికలు జరుగుతాయి. మూడు నెలల్లో నేను గెలుస్తాను. నాలుగు నెలల్లో అద్భుతాలు జరుగుతాయి. ఐదు నెలల్లో మాయ మీ కళ్ల ముందు కనిపిస్తుందని కేఏ పాల్ అంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా నీకు అర్థం కాలేదా?’’
‘‘పాల్ సీఎం ఐతే ఏంటి?’’
‘‘ప్రపంచమంతా ఆయన చెప్పినట్టు వింటుంది కదా? ప్రపంచ నాయకులంతా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తారు కదా? ప్రపంచంలోని పెట్టుబడులన్నీ ఆంధ్రకే తరలిస్తానంటున్నారు. అప్పుడు తెలంగాణకు ఇక పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి?’’
‘‘అంటే పాల్ సీఎం కావడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చావా?’’
‘‘ఆయన మాటలు వింటే అలానే అనిపిస్తోంది. ఎంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు? అబద్ధాలు చెప్పేవారైతే ముఖంలో తేడా కనిపిస్తుంది’’
‘‘మాటల్లో నిజాయితీ లేదా పిచ్చితనం ఏదో ఒకటి ఉందనిపిస్తోంది’’
‘‘పిచ్చివాళ్లు, నిజాయితీ పరులు ఒకటే అంటావా?’’
‘‘నేనెప్పుడన్నాను? చేతికి ఉంగరం కూడా లేదని చెబుతున్నా- లక్షల కోట్లు తెచ్చేస్తానన్న ఆత్మవిశ్వాసం ముఖంలో కనిపిస్తోంది. పిచ్చితనమో, ఆత్మవిశ్వాసమో తెలియదు’’
‘‘సరే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటావా?’’
‘‘హోదా సమస్య కన్నా అతిమేధావులే అసలు సమస్య అంటాను. మేధావుల సమస్య నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలని కోరుకుంటా...’’
‘‘ఒకప్పుడు అధిక జనాభా పెద్ద సమస్య అనుకునేవాళ్లం. చైనా ఆ సమస్యను కూడా అనుకూలంగా మార్చుకున్నాక, ఇప్పుడు జనాభా కాదు అతి మేధావులే అసలు సమస్య అనిపిస్తోంది. సమాజం అతి మేధావుల సమస్య నుంచి ఎప్పుడు విముక్తి చెందుతుందో- ఆ దేవుడికే ఎరుక..’’
‘‘పాల్ దేవుడికా? ’’
‘‘సరే.. ఇక ఉంటాను..’’
*బుద్దా మురళి (1-2-2019 జనాంతికం )

1 కామెంట్‌:

  1. చేతికి ఉంగరం కాదు గురువు గారూ కనీసం వాచీ కూడా లేదంట.

    ఇవ్వాళ నిప్పు గారు అయ్యప్ప స్వాముల తరహాలో నల్ల చొక్కా వేసుకొని అసెంబ్లీకి వెళ్తే "తాతకు రెండు చొక్కాలు ఉన్నాయా" అని దైవాంశ సంభూతుడయిన బుడత మనవడు
    సంబర ఆశ్చర్యపోయాడట.

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం