7, జనవరి 2023, శనివారం

అధికారం కోసం తెలంగాణ బేరం

 ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబుసుపోక నిర్వహించిన సభ కాదు. తిరిగి రమ్మని పిలుపు ఇచ్చినంత మాత్రాన తమ్ముళ్లు తిరిగి వస్తారు అని అనుకునేంత అమాయకుడేం కాదు బాబు. ఆ సభ వెనుక, ఆ పిలుపు వెనుక బోలెడంత రాజకీయం ఉన్నది.

ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో తమ్ముళ్లను రమ్మని పిలిచినప్పటికీ, అసలు ఉద్దేశం మాత్రం ఆంధ్రలో బీజేపీతో పొత్తు కోసమే ఆ పిలుపు. తెలంగాణలో టీడీపీ ఉనికి చూపించి, తెలంగాణలో మా ఓట్లు మీకు కావాలి అంటే జగన్‌ను వదిలేసి ఆంధ్రలో మాతో పొత్తు పెట్టుకోండి అని బీజేపీతో బేరం కోసమే జరిపిన సభ ఇది. ఆంధ్రలో కుల సమీకరణలు, పథకాలతో జగన్‌ బలంగా ఉన్నారు. 2019లో టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. చివరకు కుప్పం మీద కూడా జగన్‌ కన్ను వేశారు. మరోవైపు, పులివెందులలో తమకు డిపాజిట్‌ రాకపోయినా, అభ్యర్థులు లేకపోయినా ఈసారి పులివెందులలో కూడా గెలుస్తాం అని టీడీపీ ప్రతిసారి చెబుతూనే ఉంటుంది. కుప్పంలో కూడా గెలుస్తాం అని జగన్‌ చెప్పడం, టీడీపీ తరహాలో ఏదో ప్రచారం కోసం చెప్పిన మాట కాదు. దానికి పకడ్బందీగా సన్నాహాలు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీలో వైయస్‌ఆర్‌ పార్టీ విజయం సాధించింది అంటేనే ఆ పార్టీ ప్రయత్నాలు అర్థం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుందో బాబుకు తెలుసు. అందుకే బలమైన కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ బీజేపీ మిత్రపక్షమే అయినా బాబు డైరెక్షన్‌లోనే పని చేస్తారు. బాబును ఎలాగైనా సీఎంను చేయాలి అనేది పవన్‌ తపన. బాబు కాదు ఈసారి నేను సీఎం అవుతా అని మాటవరుసకు కూడా ఆయన అనటం లేదు. జగన్‌ను మళ్లీ సీఎం కానివ్వను అంటారు కానీ నేను అవుతాను అనడం లేదు. ఆంధ్రాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపులపై పవన్‌ ప్రభావం ఉంటుంది. పవన్‌ ఎలాగూ తన మనిషే. ఇక బీజేపీ అండ కూడా సాధిస్తే గట్టి పోటీ ఇవ్వవచ్చు అనేది బాబు ఆలోచన. జగన్‌ వైపు మొగ్గు చూపుతున్న బీజేపీని తన వైపు తిప్పుకోవడానికి బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ అనేక సార్లు బాబుతో పొత్తు పెట్టుకున్నది. విభజన తరువాత కూడా పొత్తు పెట్టుకొంది. బాబు రాజకీయం బీజేపీకి బాగా తెలుసు. మోదీపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతూ బాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడం బీజేపీ మరిచిపోలేదు. అలా అని ఆయనను బహిరంగంగా వ్యతిరేకించడం లేదు.

ఎందుకంటే, ఆంధ్రలో జగన్‌, బాబుల్లో ఎవరు గెలిచినా మద్దతు ఇచ్చేది తమకే అని బీజేపీకి తెలుసు. అయితే విజయావకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటే వారి వైపు ఉండాలి అనేది బీజేపీ ఆలోచన. దీనిని గ్రహించే చంద్రబాబు.. జగన్‌తో కన్నా తమతో కలువడం వల్ల ఎక్కువ ప్రయోజనం అని బీజేపీకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్‌ వైపు ఉండాలనుకుంటే ఆయనతో బహిరంగంగా పొత్తు పెట్టుకోవలసిన అవసరం బీజేపీకి లేదు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్‌ పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువ. ఎన్నికల తర్వాత వైయస్‌ఆర్‌ పార్టీ ఎంపీల మద్దతు బీజేపీకి చాలు. అంతేకానీ ఎన్నికలకు ముందే సీట్ల ఒప్పందం అవసరం లేదు. అదే టీడీపీతో ఐతే సీట్ల సర్దుబాటు కూడా ఉంటుంది. ఈ విధంగా బీజేపీ లెక్కలు బీజేపీకి ఉంటాయి. అటు బాబు అయినా ఇటు జగన్‌ అయినా బీజేపీకి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు. ఎవరితో కలిస్తే ఎక్కువ లాభం అనే లెక్కలు ఆ పార్టీకి ముఖ్యం. ఇప్పటి లెక్కల ప్రకారం బీజేపీకి జగన్‌తోనే ఎక్కువ లాభం. కానీ, టీడీపీతో కలిస్తేనే ఎక్కువ లాభం అని నమ్మించాలి అనేది చంద్రబాబు ప్రయత్నం. దాంట్లో భాగంగానే తెలంగాణను బేరం పెట్టాలి అనేది ఆయన ప్రయత్నం. దాని కోసమే ఖమ్మంలో టీడీపీ సభ, తమ్ముళ్ళకు తిరిగి రావాలి అనే పిలుపు.

బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అని కలలు కంటున్నది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం బెడిసి కొట్టి బ్రోకర్ల వీడియోలు బయటకు రావడం వల్ల జాతీయ స్థాయిలో బీజేపీ పరువు పోయింది. ఇదే సరైన సమయం అని భావించిన చంద్రబాబు తెలంగాణపై కన్నేశారు. తమతో పొత్తు పెట్టుకొంటే తెలంగాణలో బీజేపీకి ప్రయోజనం అని బాబు ఆ పార్టీకి సందేశం ఇస్తున్నారు. ఆంధ్రలో బీజేపీ, పవన్‌లతో పొత్తు కోసం బాబు తెలంగాణలో లేని టీడీపీని బేరం పెట్టారు. విభజన జరిగి ఎనిమిదేండ్లు అయినా చంద్రబాబు నాయుడికి తెలంగాణను తెగనమ్మాలి అనే ఆలోచన పోలేదు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను అని పట్టుబట్టి మోదీ ఏడు మండలాలు కలిపిన తర్వాతే పదవి చేపట్టాను అని బహిరంగంగానే చెబుతున్నారు.

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ఆంధ్రలో విజయం సాధించేందుకు బీసీ ఓట్ల కోసం తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్యను ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో బాబుకు బాగా తెలుసు. కానీ ఆంధ్రలో గెలుపు కోసం తెలంగాణలో బీసీ సీఎం అనే నినాదం. చివరకు ఆంధ్రలో తన భవిష్యత్తు కోసం తెలంగాణ టీడీపీ నాయకుల రాజకీయ జీవితాన్ని కూడా బాబు పణంగా పెట్టారు. ఆంధ్రలో జరిగిన టీడీపీ మహానాడులో తెలంగాణ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ టీడీపీ నాయకులతో ఉపన్యాసాలు, తీర్మానాలు చేయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం తెలంగాణ టీడీపీ నేతలతో బాబు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడించి, వారి రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు. మరోసారి ఆంధ్రలో తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణను అమ్మకానికి పెట్టి, తమ్ముళ్ల రాజకీయ జీవితాన్ని సైతం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

2018 ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని తెలుగు ఎల్లో మీడియా హడావుడి చేసింది. కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. తిరిగి బాబు మీడియా ఖమ్మం సభ ద్వారా బాబుకు తెలంగాణలో ఉనికి ఉన్నదని భ్రమలు కల్పిస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బాబు, లోకేష్‌ విస్తృతంగా ప్రచారం చేస్తే, 150 డివిజన్లు ఉంటే టీడీపీ గెలిచింది ఒకే ఒక డివిజన్‌. బాబు వ్యవహారం తెలిసిన తర్వాత తెలంగాణలో టీడీపీ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మాది కర్ణ, దుర్యోధన సంబంధం అని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. బాబు ఆంధ్రకు వెళ్ళాక రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరారు.

అలాంటి రేవంత్‌ కూడా తిరిగి రాడు, తెలుగు తమ్ముళ్లు ఎవరూ తిరిగి రారు అనే విషయం బాబుకు బాగా తెలుసు. ఐతే తెలంగాణలో బీజేపీ అవసరాన్ని గ్రహించి బీజేపీతో ఆంధ్రలో పొత్తు కోసం బాబు తెలంగాణను అమ్మకానికి పెట్టారు. బాబు గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో లేని పార్టీని అమ్మకానికి పెట్టిన బాబు వ్యాపారి ఐతే, బీజేపీ దేశమంతా వ్యాపారం చేసే గుజరాతీ వ్యాపారి. వ్యాపారంలో వారిది అందెవేసిన చేయి. బాబు అమ్మకానికి పెట్టినా కొనేంత అమాయక వ్యాపారి కాదు బీజేపీ. అయినా ఇంకా ఏడాది సమయం ఉంది. ఏమైనా జరుగవచ్చు అని బాబు ఆంధ్ర కోసం తెలంగాణను బీజేపీకి అమ్మకానికి పెట్టారు.

– బుద్దా మురళి