7, జనవరి 2023, శనివారం

అవేం ప్రశ్నలు? ఇవేం అనుమానాలు?

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రకు చెందిన కొందరు మాజీ అధికారులు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఈ చేరికల తర్వాత తెలంగాణ, ఆంధ్రలోని పలు పార్టీల నాయకుల నుంచి చిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీల నాయకుల నుంచి అనుమానాలు, సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణవాదం ఇక ముగిసినట్టేనా? రెండు రాష్ర్టాలను కలుపుతారా? ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇప్పిస్తారా? అని కొందరు మేధావులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆంధ్ర మంత్రులతోపాటు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు విచిత్ర వాదన వినిపించారు. కేసీఆర్‌ వల్లనే రాష్ట్ర విభజన, ఆంధ్రకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆంధ్ర కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు సంగతి తేల్చాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. వాళ్ల డిమాండ్‌ వింటుంటే కేంద్రంలో ఉన్నది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమా? కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమా? అనే అనుమానం వస్తున్నది.

ఆంధ్రలో మూడు బలమైన రాజకీయ పక్షాలున్నాయి. అవి అధికారంలో ఉన్న వైస్సార్‌సీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, సినీ గ్లామర్‌ ఉన్న జనసేన. సాధారణంగా ఒక పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉంటే మిగిలిన రెండు పార్టీలు బీజేపీని వ్యతిరేకించాలి. కానీ ఆంధ్రలో ఉన్న విచిత్ర రాజకీయాల వల్ల బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఈ మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి. బీజేపీకి అంత బలం ఉన్నదా.. పోటీ పడి మద్దతు ఇవ్వడానికి అంటే.. ఆంధ్రలో బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే ప్రత్యేకత తప్ప. తాను వదిలేస్తే బాబు బీజేపీకి చేరువవుతాడనేది జగన్‌ భయం.

జగన్‌ను బీజేపీకి దూరం జరిపి తానూ చేరువ కావాలనేది బాబు వ్యూహం. ఇక పవన్‌ అయితే ఏకంగా తన సొంత పార్టీ కార్యక్రమాలకు సైతం బీజేపీ రూట్‌మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. బీజేపీ ఈ మూడు పార్టీలను ఆటాడిస్తూ ఆంధ్రకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నది. ఆంధ్రలో బీజేపీకి పెద్ద గా ఉనికి లేదు, తీవ్రంగా ప్రయత్నిస్తే సీట్లు వచ్చే అవకాశం ఉన్నదా అంటే అదీ లేదు. పోనీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయపక్షాల నుంచి హామీల అమలుకు ఒత్తిడి వస్తున్నదా? అంటే అదీ లేదు.

బీజేపీ ఇక దేనికి భయపడాలి. కేంద్రంలో సొంత బలంతో మోదీ అధికారంలోకి వచ్చిన రోజే, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలకు నీళ్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని జగన్‌ సూచనప్రాయంగా అప్పుడే చెప్పారు. ‘బీజేపీ సొంత బలంతో వచ్చింది. మనకు హోదా రాకుండా పోయింది. ఏం చేస్తాం’ అన్నారు. హేమాహేమీలైన మూడు పార్టీల నాయకులను వదిలేసి, ఏపీలో ఇప్పుడే పురుడు పోసుకున్న బీఆర్‌ఎస్‌ ప్రత్యేక హోదాకు, విభజన చట్టం హామీలకు బాధ్యత వహించాలట, ఇప్పించాలట.

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ‘అన్నాదమ్ముల్లా విడిపోదాం, రెండు రాష్ర్టాల్లో అభివృద్ధి సాధిద్ధాం’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విభజన సమయంలో ‘పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని’ పార్లమెంట్‌లోనే కవిత డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అనేకసార్లు విలేకరుల సమావేశాల్లో ‘హోదా ఇవ్వాలి. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేంద్రం నుంచి తెలంగాణకు, ఆంధ్రకు రావలసిన వాటిపై కేసీఆర్‌ మొదటినుంచి స్పష్టతతో ఉన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్‌ హైదరాబాద్‌లోనైనా, ఆంధ్రలోనైనా ఒకేరకంగా మాట్లాడగలరు. మాట్లాడే పరిస్థితి ఉన్నది. తప్పించుకోవలసిన అవసరం కేసీఆర్‌కు లేదు. ఆంధ్రలో ఉన్న మూడు రాజకీయపక్షాలకు కేంద్రాన్ని డిమాండ్‌ చేయడంలో ఇబ్బందులు ఉండవచ్చు, కేసీఆర్‌కు అలాంటి ఇబ్బందులేమీ లేవు.

శాసనసభ్యులను కొనడానికి వచ్చిన బ్రోకర్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని బీజేపీ ‘నెంబర్‌ త్రీ’ గురించి కూడా అందరికీ తెలిసేట్టు చేసి బీజేపీని ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తి కేసీఆర్‌. అలాంటి వ్యక్తి విభజన హామీల గురించి మాట్లాడేందుకు ఎందుకు భయపడుతారు? రెండు రాష్ర్టాలం కలిసి పోరాడుదాం, కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని ఆంధ్ర నేత లు మాట్లాడితే బాగుండేది. కేంద్రంలోని బీజేపీపై అంతో ఇంతో ధిక్కార స్వరం దక్షిణాది నుంచే వినిపిస్తున్నది.

తమ తమ రాష్ర్టాలకు కేంద్రం వల్ల జరుగుతున్న అన్యాయాలపై రెండు రాష్ర్టాలు ఉమ్మడిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ అనే ఆలోచన రాకముందే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంఘాలవారు ‘కేసీఆర్‌ ప్రయత్నిస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా వస్తుంది, ప్రయత్నించాలని’ డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ చేసినవారి సంఖ్య స్వల్పమే కావచ్చు, మోదీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున డిమాండ్‌ చేసినా హోదా ఇచ్చేవారు కాదేమో, కానీ కేసీఆర్‌ తలచుకుంటే సాధ్యమవుతుందనే అభిప్రాయం అప్పుడు సాధారణ ప్రజల్లో వ్యక్తమైంది.

బీఆర్‌ఎస్‌పై ఆంధ్ర నాయకుల విమర్శలు అలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ సహా పలు పార్టీల నాయకులూ ఇలాంటి చిత్రమైన వాదనలే వినిపించారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి ఆంధ్రలో కూడా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నందున తెలంగాణవాదం ఉనికి కోల్పోయిందనేది వారి వాదన. వారి వాదన ఎలా ఉన్నా కేసీఆర్‌తోనే తెలంగాణవాదం అని వారు ఇప్పటికీ అనుకుంటున్నారనేది వారి ప్రకటన తెలుపుతున్నది.

బీజేపీ ఒక జాతీయ పార్టీ, మోదీ ఆ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యా రు. ఇటీవల తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎన్నికలు జరిగితే గుజరాత్‌ ఆత్మగౌరవం అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధాని అని కాకుండా గుజరాత్‌ సీఎం తరహాలో మోదీ ప్రచారం సాగింది. విజయం సాధించారు కూడా. ప్రధానే గుజరాత్‌ సీఎం అభ్యర్థి స్థాయిలో ప్రచారం చేస్తే, ఒక ప్రాంతీయ పార్టీ తరఫున పోటీ చేసే కేసీఆర్‌ తెలంగాణను ఎలా వదిలేస్తారు.

టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత, ఇటీవలే ఉపాధి హామీ పథకం కింద రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునే కల్లాలు నిర్మిస్తే కేంద్రం రాష్ర్టానికి జరిమానా విధించింది. దీనిపై ఆందోళన చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీనే. ఉపాధి నిధులతో కల్లాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. టీఆర్‌ఎస్‌ అయినా బీఆర్‌ఎస్‌ అయినా పేరు ఏదైతేనేం తెలంగాణ గురించి ఉద్యమించేది మేమే అని ఆ పార్టీ నిరూపిస్తుంటే, ప్రత్యర్థుల విమర్శలు కూడా దాన్ని సమర్థించే విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను మించి ఉద్యమిస్తామనే ఆలోచన ఉండాలి కానీ తెలంగాణకు అన్యాయం జరిగే విషయాల్లో కేంద్రానికి మద్దతు ఇస్తే ఎవరికి నష్టం?.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌)

బుద్దా మురళి

<