1, జులై 2023, శనివారం

రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు ఎడమ భుజాలు ఉండవు బిగ్ బాస్ అని తాట తీశాడు .. యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -62

రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు ఎడమ భుజాలు ఉండవు బిగ్ బాస్ అని తాట తీశాడు .. యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -62 ------------------------ 2004 ఎన్నికలకు ముందు టీడీపీ బీట్ రిపోర్టర్ లు సచివాలయం లో సీఎం పేషీ వద్దకు వెళుతుంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనాయకులు మాకు ఎదురుగా వచ్చారు . అవాక్కయ్యారా ? అనిపించేట్టుగా ఓ వార్త చెప్పారు . మైసూరా రెడ్డి టీడీపీలో చేరుతున్నారు అనేది ఆ వార్త . కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని అందరికీ తెలిసిన విషయం ఎంతో అనుభవం ఉన్న మైసూరారెడ్డికి తెలియదు అనుకొం . ఎన్టీఆర్ వచ్చే అంత వరకు మంగళసూత్రం కట్టను అని భీష్మించుకు కూర్చున్న రమేష్ రెడ్డి (నెల్లూరు ) శరీరం అంతా ఎన్టీఆర్ పేరు , బొమ్మలతో పచ్చ బొట్లు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వరరావులు , ఎన్టీఆర్ ను దించి బాబు బలప్రదర్శన కోసం నిజాం కాలేజీలో బహిరంగ సభ లో ర్యాలీ ముందు భాగం లో వీరిద్దరు ఉండడం చూసిన అనుభవం . హోదా , పదవి , స్థాయి ఏదైనా కావచ్చు మనిషికి ఉండే లక్షణాలు అన్నీ మనిషికి ఉంటాయి అని చెప్పిన ఓషో సాహిత్యం ప్రభావం కొంత దీనితో అన్నీ సాధ్యమే , దేనికీ అవాక్కు కావలసిన అవసరం లేదు అని భావించేవాడిని .. రాజకీయాల్లో కుడి భుజం , ఎడమ భుజం , అభిమాని , వ్యతిరేకి అనేవి ఏవీ శాశ్వతం కాదు . ఆయా కాలాల్లో అవసరాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి . ఐనా అంతకు ముందే బిగ్ బాస్ లేఖను బయటపెట్టి అసెంబ్లీలో బాబును వణికించిన మైసూరారెడ్డి టీడీపీలో చేరుతారు అనే విషయం కొద్దిగా అవాక్కు అయ్యేట్టు చేసింది . మైసూరారెడ్డి ఆంధ్రభూమి , డక్కన్ క్రానికల్ యాజమాన్యానికి సన్నిహితులు / ఆంధ్రభూమి టైటిల్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించే / అభిప్రాయం చెప్పే స్థాయిలో ఉన్న వారు . మేనేజ్ మెంట్ కు సన్నిహితులు , హితులు . ఇలాంటి వారి విషయంలో వార్త రాయడంలో ఆచితూచి వ్యవహరించాలి . వార్త రాయక పోతే , అంత ముఖ్యమైన వార్త ఎలా మిస్ అయ్యావు అని తలంటుతారు . రాద్దాం అంటే నిజం కాకపోతే యాజమాన్యానికి కావలసిన వారు కాబట్టి ఇబ్బంది . ******** ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు డబ్బులు ముట్టినట్టు అప్పుడు టీడీపీలో ఉన్న సముద్రాల వేణుగోపాలా చారి ఓ లేఖ రాశారు . ఆ లేఖలో బిగ్ బాస్ కు అమోంట్ పంపినట్టు రాశారు . ప్రాంతీయ పార్టీల్లో బిగ్ బాస్ అంటే పార్టీ అధ్యక్షులు ... ఆ లేఖను మైసూరారెడ్డి సంపాదించారు . ప్రాజెక్టు లో డబ్బులు చేతులు మారాయని బిగ్ బాస్ ఎవరో తేల్చాలి అని శాసన సభ సమావేశాల్లో ఈ లేఖ బయట పెట్టి చంద్రబాబుకు చమటలు పట్టించారు . బిగ్ బాస్ లేఖతో మైసూరారెడ్డి పాపులర్ అయ్యారు . ఇది జరిగిన కొద్ది రోజులకు మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అని సమాచారం . నమ్మలేని నిజం ఒకటైతే , మేనేజ్ మెంట్ కు సన్నిహితులు అని మరో సమస్య . బ్యూరో చీఫ్ గా ఉన్న సి హెచ్ వి ఏం కృష్ణారావు మైసూరారెడ్డికి సన్నిహితులు ఇది నిజమేనా అని విషయం చెబితే , బహుశా వారికి ఈ విషయం నా కన్నా ముందే తెలుసేమో ... ఎటూ తేల్చకుండా చేరితే చేరవచ్చు ఏముంది అంటూ ఎటూ తేల్చకుండా బదులిచ్చారు . ఎడిటర్ కు వెళ్లి విషయం ఇది ..మీరు రాయమంటే రాస్తాను , లేదంటే లేదు అని చేతులు దులుపుకున్నాను . ఎక్కడైనా ప్రతి ఒక్కడు సేఫ్ గేమ్ ఆడుతాడు . ప్రతి ఒక్కడులో నేనూ ఉంటాను . **** ఓ శుభ ముహూర్తంలో ఎంవి మైసూరారెడ్డి టీడీపీలో చేరిపోయారు . టీడీపీ ఓడిపోతుంది అని ఆయనకు బాగా తెలుసు . మధ్యాన్న సూర్యుడిలా వై యస్ ఆర్ వెలిగిపోతుంటే నా పరిస్థితి ఏమిటీ ? ఈ మాట ఓ సారి ఆయనే నాతో స్వయంగా అన్నారు . టీడీపీ ఓడిపోతుంది , వైయస్ ఆర్ సీఎం అవుతారు అని తెలుసు . వైయస్ తో ఉన్న విభేదాల వల్ల టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం పొందాలని ఆయన వ్యూహం . తనతో పడని వారిని వైయస్ ఎలాగూ అణిచివేస్తాడని భావించి మైసూరా ఈ నిర్ణయం తీసుకున్నారు . టీడీపీ ఓడిపోయాక బాబుకు బాగా సన్నిహితం అయ్యారు . ప్రతి కీలక సమావేశంలో ఉండేవారు . ప్రభుత్వ నిర్ణయాలను చీల్చి చెండాడుతూ పత్రికల్లో వ్యాసాలు రాసేవారు . మీరూ అలా ఉండాలి అనిఅబు మిగిలిన నాయకులకు చెప్పేవారు . లక్షకోట్ల నామకరణం జగన్ లక్ష కోట్లు మింగేశారు అని టీడీపీ నాయకులు కనీసం ఓ లక్ష సార్లయినా ఆరోపించి ఉంటారు . లక్ష కోట్లు అని నామకరణం చేసింది మైసూరా రెడ్డినే . టీడీపీ ఓడిపోగానే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మైసూరారెడ్డికి అవకాశం ఇవ్వలేదు . బాబు తనను మోసం చేశాడని మీడియాలో వార్తలు . ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . ఆరేళ్ళ పదవీ కాలం ముగిశాక టీడీపీ నుంచి బయటకు వచ్చారు . జగన్ అవినీతిపై ఒక్కొక్కరు ఒక అంకె చెప్పారని , చివరకు రౌండ్ ఫిగర్ లక్ష కోట్లకు ఖరారు చేసినట్టు మైసూరారెడ్డి టీడీపీ నుంచి బయటకు వెళ్ళాక చెప్పారు . ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లినా ఎం వి మైసూరా రెడ్డి అనగానే కాంగ్రెస్ నాయకుడు అనే అనిపిస్తుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం