3, మార్చి 2026, మంగళవారం
బాబు ను భయపెట్టిన ఇజ్రాయిల్: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 125
ఉమ్మడి రాష్ట్రం లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం . అయన ఉపన్యాసం రొటీన్ గా సాగుతోంది . ఎన్నోసార్లు చెప్పిన విషయాలే చెబుతుండడం వల్ల పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు . కొత్త విషయాలు లేవు . చంద్రబాబు తన సొంత నియోజక వర్గంలో ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన రోజులు అవి . బాబు రొటీన్ ఉపన్యాసంలో తాను ఇజ్రాయిల్ పర్యటించనున్నట్టు చెప్పారు . అప్పటికే ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం సాగుతున్నందును అందరూ మామూలుగానే విన్నారు . అప్పుడు బీబీసీ రేడియోకు ఉర్దూ రిపోర్టర్ గా ఉన్న ఉమర్ ఫరూఖ్ మీరు ఇజ్రాయిల్ ఎలా వెళతారు ? మన దేశం పాలస్తీనా కు అనుకూలంగా ఉంది . ఇజ్రాయిల్ ఎలా వెళతారు అని ప్రశ్నించేసరికి బాబు ఖంగుతిన్నారు . పక్కనున్న అధికారులతో మెల్లగా మాట్లాడారు . వాళ్ళు ఏం చెప్పారో వినబడలేదు కానీ ఇజ్రాయిల్ వెళితే మైనారిటీ ఓటర్లకు దూరం అవుతారు అనే భయం పట్టుకుంది . అధికారులతో కొద్ది సేపు మెల్లగా మాట్లాడిన తరువాత అటూ ఇటూ కాకుండా తన ఇజ్రాయిల్ పర్యటన లేదు అన్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు .
****
అంతమంది ఉన్నప్పుడు ఇతరులకు వినపడకుండా బాబు ఎలా మాట్లాడారు అని సందేహం రావచ్చు . 95 ప్రాంతంలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా మాణిక్ రెడ్డి ఉండేవారు . మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు . జిల్లాలో పరిచయం కావడం వల్ల బాగా పరిచయం . బాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజూ బాబు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యేవారు . ఆ సమయంలో బాబుకు ఫోన్ వస్తే మాట్లాడేవారు కానీ ఎదురుగా కూర్చున్న మాకు ఎవరితో మాట్లాడారు , ఏం మాట్లాడారు తెలిసేది కాదు . కావాలి అంటే మీరు ఓసారి గమనించి చూడండి మీరు ఎదురుగా ఉన్నప్పడు ఎవరికైన ఫోన్ వస్తే ఎవరి నుంచి వచ్చింది , విషయం ఏమిటీ అనేది ఎంతో కొంత అర్థం అవుతుంది . కానీ బాబుకు కాల్ వస్తే కొన్ని వందల సార్లు అక్కడే ఉన్నాను ఎవరి నుంచి కాల్ వచ్చిందో , విషయం ఏమిటో అస్సలు అర్థం కాదు అని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు . అనుమానం ఉంటే ఓటుకు నోటు వీడియో చూడండి . కట్టేకొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది . ఎవరితో మాట్లాడాడు , ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు . మైకు ముందు గంటలతరబడి మాట్లాడే బాబు ఫోన్ లో మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు మాట్లాడుతారు . రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరం .. ఈ రోజుల్లో టెక్నాలెజీ మరీ పెరిగిపోయింది . అందరి బండారాలు బయటపెట్టే న్యూస్ ఛానల్స్ ఓనర్ల గూడుపుఠాణి లే బయటపడుతున్న రోజులివి .
***
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ పత్రికల్లో ఇందిరాగాంధీ - పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మెన్ యాసర్ అరాఫత్ ఫోటోలు , వారి వార్తలు ప్రముఖంగా వచ్చేవి . అరాఫత్ ఆజానుబావుడు అన్నట్టుగా ఉండేవారు . ప్రత్యేకమైన దుస్తులతో మీడియా ఫోటోలకు ప్రత్యేకంగా ఉండేవారు . ఇజ్రాయిల్ , పాలస్తీనా వివాదం గురించి అప్పుడు తెలియదు కానీ ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ మీడియా అరాఫత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది . బాబు హయాంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మీడియాలో ఎంత ప్రాముఖ్యత లభించేదో అరాఫత్ కు అంత ప్రాముఖ్యత లభించేది . 1948లో ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది . 1992 వరకు ఇజ్రాయిల్ తో మనదేశం కనీసం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు . 92లో పివి నరసింహారావు హయాంలో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది . అప్పటివరకు ఇండియా పాలస్తీనాకు పూర్తి మద్దతుగా నిలిచింది . 1999లో వాజపేయి హయాంలో సమావేశాలు జరిగాయి . నరేంద్ర మోడీ హయాంలో ఇజ్రాయిల్ , ఇండియా మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి . ఇజ్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ . ఇటీవల ఇజ్రాయిల్ పర్యటించి అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించారు . ***ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం గురించి , మైనారిటీ ఓట్లపై పడే ప్రభావం వంటి అంశాలను ఏ మాత్రం తెలియక కేవలం ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడం కోసమే బాబు ఇజ్రాయిల్ వెళ్ళాలి అనుకున్నారు . అదే విషయం మీడియా సమావేశంలో చెప్పగానే ఉర్దూ బిబిసి విలేకరి ప్రశ్నతో ఆమ్మో ఇదేదో మెడకు చుట్టుకునేట్టుగా ఉందని ఇజ్రాయిల్ పర్యటన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు . ఇప్పుడు బాబు ఎన్ డి ఏ కూటమిలో ఉన్నారు . బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు . ఇజ్రాయిల్ వెళ్ళాలి అనే కోరికను మూడు దశాబ్దాల తరువాత తీర్చుకొనే అవకాశం లభించింది . యుద్ధం ముగిసిన తరువాత భారత బృందం ఇజ్రాయిల్ పర్యటించే అవకాశం లేకపోలేదు . ఇండియా - పాక్ ల మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఇరాన్ పాక్ కు అండగా నిలించింది . ఇండియా పాలస్తీనాకు అండగా నిలిచినా , ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 1948 లో ఇండియా ఓటు వేసినా పాక్ తో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయిల్ ఇండియాకు సహకరించింది . ప్రపంచం లో ఎక్కడా ఆశ్రయం దొరకనప్పుడు శరణార్థులుగా వచ్చిన యూదులకు వందేళ్ల క్రితం ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఇప్పటికీ ఇండియాను అభిమానిస్తారు .కాలం మారింది ఇప్పుడు ఎవరికైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం కావాలి .
బుద్దా మురళి
మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసిన జర్నలిస్ట్ ల కథ
మబ్బులను చూసి కుండలో నీళ్లు పారబోయవద్దు అని మనకో జాతీయం ఉంది . అలా పారబోస్తే ఏమవుతుంది అంటే .. జర్నలిస్ట్ ల్లా అవుతుంది . జాతీయాలు జీవిత పాఠాల ఉంచి పుట్టాయి . మన బాధ భవిష్యత్తు తరానికి ఓ పాఠం కావచ్చు .
***
ఎకరం 50 వేల రూపాయలు..
నువ్వు రెండు లక్షలు చెల్లిస్తే ఇప్పుడే నీకు నాలుగు ఎకరాల భూమి వస్తుంది .
ఇప్పుడు రెండు లక్షలు చెల్లించి 20 ఏళ్ళ తరువాత తీసుకుంటే నీకో 200 గజాల స్థలం ఇస్తాను ..
ఐతే ఇదిగో రెండు లక్షలు ..
20 ఏళ్ళు గడిచాయి . బాబూ ఇబ్బంయూదుల్లో ఉన్నాను .. అప్పు చేసి నీకు రెండు లక్షలు చెల్లించాను . నామీద దయ చూపించి 200 గజాల స్థలం ఇవ్వు ప్లీజ్ ...
***
ఇలాంటి బేరం గురించి ఎప్పుడైనా విన్నారా ? అప్పటికప్పుడు నాలుగు ఎకరాల డబ్బు ఇచ్చి 20 ఏళ్ళ తరువాత 200 గజాల కోసం బతిమిలాడుకోవడం ఇదేం బేరం .. ఇది బేరం కాదు పిచ్చి అనుకుంటున్నారా ?
అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ జర్నలిస్ట్ ల వాస్తవ వ్యధ ఇది .
ఏ ఐ పుణ్యమా అని ఎలాంటి సమాచారం అయినా దొరుకుతుండడంతో ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో 2006 లో వ్యవసాయ భూముల ధరలు ఎలా ఉన్నాయి అని గ్రోక్ ను అడిగితే 50 వేలకు ఎకరం నుంచి రెండు లక్షలకు ఎకరంగా ఉండేవని చెప్పింది .
వై ఎస్ ఆర్ హయాంలో జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాక ల్యాండ్ కోసం ఒక్కో జర్నలిస్ట్ రెండు లక్షలు చెల్లించారు . వైఎస్ మరణం , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లు సీఎంలు అయ్యారు . తెలంగాణ ఏర్పాటు కెసిఆర్ , రేవంత్ రెడ్డిలు సీఎంలు అయ్యారు . అనేక మలుపులు తిరిగి సుప్రీం కోర్ట్ జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాల జీవోను కొట్టేసి డబ్బు తిరిగి చెల్లించమంది . గోడకు కొట్టిన సున్నం , ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు తిరిగి రావడం అంత ఈజీ కాదు .
ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులకు వణికి పోతుంది . వారం రోజుల జీతం ఆలస్యానికి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఓడించిన చరిత్ర వారిది . అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లు అవుతున్నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదు . కోర్ట్ కు వెళ్లిన వారికి చెల్లించామని తీర్పులు వచ్చినా అమలు చేసే స్థితి లేదు . అలాంటిది అడిగేవాడు దిక్కులేని జర్నలిస్ట్ ల డబ్బులు తిరిగి రావు .
ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇస్తారు అని ఓ ప్రచారం .
అంటే జర్నలిస్ట్ లు చెల్లించిన డబ్బుకు ఆ రోజుల్లో నాలుగు ఎకరాలు వస్తే , ఇప్పుడు అదే చోట రెండు వందల గజాల కోసం చకోర పక్షిలా ఎదురు చూడాలి .
సుప్రీం తీర్పు తరువాత కూడా కొందరు ఇంకా పాత స్థలాల మీద ఆశ వదులుకోలేక పోతున్నారు . అలా అని వీరిని తప్పు పట్టలేం . అప్పడు తెచ్చి డబ్బు కట్టి 20 ఏళ్లపాటు ఆశగా ఎదురు చూసి రోజూ వాటి గురించే కలలు , కంటూ స్థలం వచ్చాక కట్టే ఇంటిని ముందు కలల్లోనే కట్టుకోవడం వల్ల స్థలాలు రావు అనేదానిని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు .
రెండు దశాబ్దాల క్రితమే పరిస్థితి ఉహించి ఆంధ్ర మిత్రులు కొందరు తాము కట్టిన రెండు లక్షలు వెనక్కి తీసుకొని ఆంధ్రలో ప్లాట్స్ కొన్నారు .
2006లో భువనగిరి లో రెండు లక్షలకు రెండు ఎకరాలు వచ్చేవి . మిత్రుడు అయోధ్యరెడ్డి అదే సమయంలో తుర్కపల్లిలో జర్నలిస్ట్ మిత్రులకు తుర్కపల్లిలో మెయిన్ రోడ్ లో 80 వేలకు ఎకరం భూములు చూపించాడు . వాటి ధర ఇప్పుడు రెండు కోట్ల వరకు పలుకుతుంది . జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశల్లో మునిగిపోయి అటు వైపు ఎవరూ ఆసక్తి చూపలేదు .
నాలుగు ఎకరాలు అమ్మి సొసైటీకి రెండు లక్షలు కట్టాను , ఇప్పుడు నేను అమ్మిన భూమి 60 లక్షలకు ఎకరం అయింది . ఊర్లో , అన్నదమ్ముల ముందు నా పరువు పోయింది అని ఓ జర్నలిస్ట్ మంత్రి పొంగులేటి ముందు తన పరిస్థితి చెప్పుకున్నారు . తప్పు మీదంటే మీది అని ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు .
తప్పు పరిస్థితులదే తప్ప వ్యక్తులది కాదు .
జాతిరత్నాలు సినిమాలో సెంట్రల్ జైలులో వెన్నెల కిషోర్ బెస్ట్ బ్యాచ్ అంటే మనదే అని పొంగిపోతాడు . తెలుగునాట జర్నలిజం చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ అంటే ఇదే . 20 ఏళ్ళ క్రితం నాలుగు ఎకరాల విలువైన డబ్బు చెల్లించి 20 ఏళ్ళ తరువాత కూడా 200 గజాల కోసం ఆశగా ఎదురు చూడడానికి మించిన దురదృష్టకరమైన బ్యాచ్ ఉంటుందా ?
మంచి జీతాలు చెల్లించే మీడియా సంస్థల వారి పరిస్థితి వేరు జీతాలు కూడా సరిగా ఇవ్వని సంస్థల జర్నలిస్ట్ లు అప్పు తెచ్చి రోడ్డున పడ్డారు .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)