3, మార్చి 2026, మంగళవారం

మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసిన జర్నలిస్ట్ ల కథ

మబ్బులను చూసి కుండలో నీళ్లు పారబోయవద్దు అని మనకో జాతీయం ఉంది . అలా పారబోస్తే ఏమవుతుంది అంటే .. జర్నలిస్ట్ ల్లా అవుతుంది . జాతీయాలు జీవిత పాఠాల ఉంచి పుట్టాయి . మన బాధ భవిష్యత్తు తరానికి ఓ పాఠం కావచ్చు . *** ఎకరం 50 వేల రూపాయలు.. నువ్వు రెండు లక్షలు చెల్లిస్తే ఇప్పుడే నీకు నాలుగు ఎకరాల భూమి వస్తుంది . ఇప్పుడు రెండు లక్షలు చెల్లించి 20 ఏళ్ళ తరువాత తీసుకుంటే నీకో 200 గజాల స్థలం ఇస్తాను .. ఐతే ఇదిగో రెండు లక్షలు .. 20 ఏళ్ళు గడిచాయి . బాబూ ఇబ్బంయూదుల్లో ఉన్నాను .. అప్పు చేసి నీకు రెండు లక్షలు చెల్లించాను . నామీద దయ చూపించి 200 గజాల స్థలం ఇవ్వు ప్లీజ్ ... *** ఇలాంటి బేరం గురించి ఎప్పుడైనా విన్నారా ? అప్పటికప్పుడు నాలుగు ఎకరాల డబ్బు ఇచ్చి 20 ఏళ్ళ తరువాత 200 గజాల కోసం బతిమిలాడుకోవడం ఇదేం బేరం .. ఇది బేరం కాదు పిచ్చి అనుకుంటున్నారా ? అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ జర్నలిస్ట్ ల వాస్తవ వ్యధ ఇది . ఏ ఐ పుణ్యమా అని ఎలాంటి సమాచారం అయినా దొరుకుతుండడంతో ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో 2006 లో వ్యవసాయ భూముల ధరలు ఎలా ఉన్నాయి అని గ్రోక్ ను అడిగితే 50 వేలకు ఎకరం నుంచి రెండు లక్షలకు ఎకరంగా ఉండేవని చెప్పింది . వై ఎస్ ఆర్ హయాంలో జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాక ల్యాండ్ కోసం ఒక్కో జర్నలిస్ట్ రెండు లక్షలు చెల్లించారు . వైఎస్ మరణం , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లు సీఎంలు అయ్యారు . తెలంగాణ ఏర్పాటు కెసిఆర్ , రేవంత్ రెడ్డిలు సీఎంలు అయ్యారు . అనేక మలుపులు తిరిగి సుప్రీం కోర్ట్ జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాల జీవోను కొట్టేసి డబ్బు తిరిగి చెల్లించమంది . గోడకు కొట్టిన సున్నం , ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు తిరిగి రావడం అంత ఈజీ కాదు . ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులకు వణికి పోతుంది . వారం రోజుల జీతం ఆలస్యానికి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఓడించిన చరిత్ర వారిది . అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లు అవుతున్నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదు . కోర్ట్ కు వెళ్లిన వారికి చెల్లించామని తీర్పులు వచ్చినా అమలు చేసే స్థితి లేదు . అలాంటిది అడిగేవాడు దిక్కులేని జర్నలిస్ట్ ల డబ్బులు తిరిగి రావు . ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇస్తారు అని ఓ ప్రచారం . అంటే జర్నలిస్ట్ లు చెల్లించిన డబ్బుకు ఆ రోజుల్లో నాలుగు ఎకరాలు వస్తే , ఇప్పుడు అదే చోట రెండు వందల గజాల కోసం చకోర పక్షిలా ఎదురు చూడాలి . సుప్రీం తీర్పు తరువాత కూడా కొందరు ఇంకా పాత స్థలాల మీద ఆశ వదులుకోలేక పోతున్నారు . అలా అని వీరిని తప్పు పట్టలేం . అప్పడు తెచ్చి డబ్బు కట్టి 20 ఏళ్లపాటు ఆశగా ఎదురు చూసి రోజూ వాటి గురించే కలలు , కంటూ స్థలం వచ్చాక కట్టే ఇంటిని ముందు కలల్లోనే కట్టుకోవడం వల్ల స్థలాలు రావు అనేదానిని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు . రెండు దశాబ్దాల క్రితమే పరిస్థితి ఉహించి ఆంధ్ర మిత్రులు కొందరు తాము కట్టిన రెండు లక్షలు వెనక్కి తీసుకొని ఆంధ్రలో ప్లాట్స్ కొన్నారు . 2006లో భువనగిరి లో రెండు లక్షలకు రెండు ఎకరాలు వచ్చేవి . మిత్రుడు అయోధ్యరెడ్డి అదే సమయంలో తుర్కపల్లిలో జర్నలిస్ట్ మిత్రులకు తుర్కపల్లిలో మెయిన్ రోడ్ లో 80 వేలకు ఎకరం భూములు చూపించాడు . వాటి ధర ఇప్పుడు రెండు కోట్ల వరకు పలుకుతుంది . జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశల్లో మునిగిపోయి అటు వైపు ఎవరూ ఆసక్తి చూపలేదు . నాలుగు ఎకరాలు అమ్మి సొసైటీకి రెండు లక్షలు కట్టాను , ఇప్పుడు నేను అమ్మిన భూమి 60 లక్షలకు ఎకరం అయింది . ఊర్లో , అన్నదమ్ముల ముందు నా పరువు పోయింది అని ఓ జర్నలిస్ట్ మంత్రి పొంగులేటి ముందు తన పరిస్థితి చెప్పుకున్నారు . తప్పు మీదంటే మీది అని ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు . తప్పు పరిస్థితులదే తప్ప వ్యక్తులది కాదు . జాతిరత్నాలు సినిమాలో సెంట్రల్ జైలులో వెన్నెల కిషోర్ బెస్ట్ బ్యాచ్ అంటే మనదే అని పొంగిపోతాడు . తెలుగునాట జర్నలిజం చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ అంటే ఇదే . 20 ఏళ్ళ క్రితం నాలుగు ఎకరాల విలువైన డబ్బు చెల్లించి 20 ఏళ్ళ తరువాత కూడా 200 గజాల కోసం ఆశగా ఎదురు చూడడానికి మించిన దురదృష్టకరమైన బ్యాచ్ ఉంటుందా ? మంచి జీతాలు చెల్లించే మీడియా సంస్థల వారి పరిస్థితి వేరు జీతాలు కూడా సరిగా ఇవ్వని సంస్థల జర్నలిస్ట్ లు అప్పు తెచ్చి రోడ్డున పడ్డారు . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం