9, ఆగస్టు 2026, ఆదివారం
జర్నలిస్ట్ కథలు... సొంతిల్లు
జర్నలిస్ట్ కథలు
సొంతిల్లు
మంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ . ఎప్పుడూ లేనంతగా కిక్కిరిసి పోయి ఉంది . మంత్రి చైర్ లో కూర్చుంటూ "మీ అందరికీ శుభ వార్త" అని అనగానే " సార్ మీరు వారానికి ఓ సారి సభకు నమస్కారం అన్నట్టు మీ అందరికీ శుభవార్త అంటారు . మొన్నోసారి మీ అందరినీ కోటీశ్వరులను చేసేస్తున్నాం అని ప్రకటించారు . అది చదివి అంతా మా జర్నలిస్ట్ ల మీద కుళ్ళుకుంటున్నారు . ఈ శుభ వార్తలు 20 ఏళ్ళ నుంచి వింటున్నాం . అయ్యేది లేదు పోయేది లేదు " అని సీనియర్ జర్నలిస్ట్ కాసింత అసహనంగానే తన అసంతృప్తిని బయటపెట్టాడు . " పాత శుభవార్తలు మరిచిపోండి . ఇప్పటి నుంచి ఒక లెక్క జర్నలిస్ట్ లకు సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ముచ్చర్ల గ్రామం లో రెండు వందల గజాల ప్లాట్ ఇవ్వాలి అని నిర్ణయించింది . " అని మంత్రి ప్రకటించగానే అరవింద్ కు తన కాళ్ళ కింద భూమి చీలిపోయి , తాను అందులో పడిపోయినట్టు అనిపించింది . తల గిర్రున తిరుగుతోంది . అరెస్ట్ చేస్తారనే భయంతో ఆగిపోయాడు కానీ మంత్రి బట్టతల మీద వాయించాలి అని ఉంది . సీనియర్ ల అందరి పరిస్థితి నవ్వలేక , ఏడవ లేక అన్నట్టు ముఖం పాలిపోయింది . వారందరి కన్నా తనకు ఎక్కువ బాధగా ఉంది . ఎక్కువ సేపు అక్కడే ఉంటే చేయరానిది ఏదైనా చేస్తనేమొ అనుకోని అక్కడే బెంచ్ పై తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు . తన కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటి గురించి తనకే తెలుసు . ఎవరి జీవితంలో ఇంత క్రూయల్ జోక్ వేయవద్దు దేవుడా ! అని మనసులో అనుకున్నాడు .
పక్క వాళ్ళు " ఏమైంది " అని పలకరిస్తే నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు . మాట్లాడితే దుఃఖం వస్తుందేమో అనుకోని "ఏమీ లేదు " అని బదులిచ్చి తల టేబుల్ పై వాల్చి ఆలోచనలో పడిపోయాడు . మూడు దశాబ్దాల జీవితం , రెండు దశాబ్దాల సొంతింటి కల కనుల ముందు కనిపిస్తుంది . ఒకదాని తరువాత ఒక దృశ్యం కనుల ముందు కనిపిస్తోంది
**** **** ***
డిగ్రీ పూర్తి చేసి అరవింద్ జర్నలిస్ట్ గా ఉద్యోగంలో చేరగానే న్యూస్ ఎడిటర్ కృష్ణయ్య పిలిచి " చూడు బాబూ !ఇప్పుడే డిగ్రీ పాస్ అయి వచ్చావు . జీవితం అంటే ఏమిటో తెలియదు . నువ్వు రిపోర్టర్ వు కాబట్టి ఎవరో ఒక నాయకుడు మందు తాగించడానికి ఆసక్తి చూపిస్తాడు . ఒక్క సారి ముందుకు లొంగావు అంటే ఇక నీ జీవితం అంతే . అలా అని నేనేమీ మందు ముట్టను అని చెప్పడం లేదు . నేను ముందుకు అలవాటు పడి జీవితాన్ని కోల్పోయాను . మనకు మందు తాగించిన వాడికి కూడా మన మీద గౌరవం ఉండదు . తాగుబోతులు కూడా తాగని వారికే విలువ ఇస్తారు . జీవితానుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను . వినడం వినక పోవడం నీ ఇష్టం . నువ్వు రిపోర్టర్ గా జిల్లాకు వెళ్ళగానే జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ లో చేరు . ఏ జిల్లా లో అయితేనేం ఒక ఇంటి వాడివి అయితే జీవితానికి ఓ భరోసా ఉంటుంది " అని జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పి పంపించాడు పెద్దాయన.
ఏడాదికి ఓ జిల్లా బదిలీ కావడంతో ప్రతి చోట చివరి నిమిషంలో తప్పిపోయిన ట్రైన్ లా ఉండేది పరిస్థితి . అరవింద్ అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్ లో వచ్చి పడ్డాడు . హైదరాబాద్ కు వచ్చిన కొంత కాలానికి కొత్త ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం సబ్సిడీ ధరతో ఇవ్వాలి అని నిర్ణయించింది . తంతే బూరెల బుట్టలో పడ్డట్టు రాజధాని నగరంలో సొంత ఇల్లు ఆలోచిస్తేనే అరవింద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది . ఉచితం కాదు మార్కెట్ ధర కన్నా కొంత తక్కువ . మూడు లక్షలు చెల్లించాలి . మూడు లక్షలు అంటే మామూలు విషయం కాదు . వచ్చే జీతం ఏ నెలకు ఆ నెల అన్నట్టు ఉంటుంది . ఊరికి వెళ్లి అమ్మ నాన్న , అన్నలకు విషయం చెప్పాడు ." రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండలేదు . పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక మేమే ఇబ్బందుల్లో ఉన్నాం "అని చెప్పి కుటుంబం అంతా చేతులెత్తేసింది . హైదరాబాద్ లో సొంతింటి కల దూరం అవుతుందా ? అని భయం వేసింది . తాకట్టు పెడదాం అంటే బంగారం కూడా లేదు . ఎరువుల కోసం ఎప్పుడో తాకట్టు పెట్టారు . చివరకు " నా వాటా మూడు ఎకరాలు నాకిచ్చేస్తే అమ్మేసుకుని ప్లాట్ కోసం డబ్బు కడతాను "అని అరవింద్ ప్రతిపాదించాడు . అంతా మూకుమ్మడిగా ససేమిరా అన్నారు ." పస్తులైనా ఉంటాం కానీ పొలం అమ్మేది లేదు "అని అన్నలు అంటే , మేం బతికి ఉన్నంత వరకు పొలం అమ్మితే మా మీద ఒట్టు అని తల్లిదండ్రులు అడ్డుకున్నారు. "పొలం అమ్ముకున్నారు అంటే ఊర్లో పరువు ఉంటుందా?" అని నానమ్మ తన వంతు వ్యతిరేకత చూపించింది . కుటుంబం అంతా ఏకగ్రీవంగా వ్యతిరేకించడంతో అరవింద్ తన అత్తా మామలను తీసుకువచ్చి తనకు వాటా కింద వచ్చే మూడెకరాలు పంచి ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడు . ఏడ్చినా , నచ్చజెప్పినా వినకపోవడంతో చివరకు అరవింద్ వాటా మూడు ఎకరాలు పంచి ఇచ్చారు . అతి కష్టం మీద మూడు ఎకరాలు అమ్మితే రెండున్నర లక్షలు వచ్చాయి . మరో 50 వేలు అప్పు చేసి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి మూడు లక్షలు చెల్లించి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినంత సంబరంగా అరవింద్ ఇంటికి వెళ్లి " డార్లింగ్ ఈ మహానగరంలో ప్రైమ్ ఏరియాలో ఇక మనకూ ఓ సొంతిల్లు , పర్మనెంట్ అడ్రస్ ఉండబోతుంది " అని ప్రేమగా భార్యకు చెప్పాడు .
రోజులు గడుస్తున్న కొద్దీ తాను కట్టబోయే సొంత ఇల్లు ఎలా ఉండబోతుందో అరవింద్ రంగురంగుల కలలు కంటున్నాడు . సొంత ఇంటి ఆవరణలో ఏయే రకం మొక్కలు పెంచాలో రోజుల తరబడి చర్చలు సాగాయి . ఇంటి ముందు పెంచే మల్లె చెట్టు మొగ్గలు ఎవరూ తుంచకుండా చూసుకునే బాధ్యత పుట్టబోయే బిడ్డకు అప్పగించాలి అనే నిర్ణయం అయిపొయింది . రోజూ ఇంట్లో పూజకు అవసరం అయిన పూల మొక్కల బాధ్యత మొత్తం అరవింద్కం తన భార్యకే అప్పగించాడు . చుట్టూ పక్కల వాళ్ళు పూలు తెంపుకు పోవడం ఓ పెద్ద సమస్య . కాలనీ అన్నప్పుడు ఇలాంటివి భరించక తప్పదు అనుకున్నారు ." మీ అమ్మానాన్న లు వచ్చినా , మా అమ్మానాన్నలు వచ్చినా ఉండేందుకు వారికో గాడి కూడా ఉండాలి కదా ?"అని అరవింద్ భార్య మనసు దోచాడు . .
బెడ్ రూమ్ నుంచి వంటగది వరకు సొంతింటిని తమ ఊహల్లోనే నిర్మించారు .
ప్లాట్ కేటాయింపు జరగడమే తరువాయి ముందస్తు తతంగం అంతా పూర్తి చేశారు .
వ్యవహారం అనేక మలుపులు తిరిగింది . నాకు దక్కంది మీకెలా దక్కుతుందో చూస్తా అని సీనియారిటీ లేని జర్నలిస్ట్ కృష్ణ కోర్టుకు వెళ్ళాడు . ఇంత మంది పేదలు, ఇండ్లు లేకుండా బతుకుతుంటే జర్నలిస్ట్ లకు సబ్సిడీ తో ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని పెద్ద భవంతిలో విశ్రాంతి జీవితం గడుపుతున్న గుడిసెవాసుల సంఘం నాయకుడు కోర్ట్ కు వెళ్ళాడు . చిలికి చిలికి గాలి వాన అయినట్టు వ్యవహారం సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది . కాల చక్రం రెండు దశాబ్దాలు అలా గిర్రున తిరిగింది . భార్య మంగళసూత్రం అమ్మి డబ్బు కట్టిన వాళ్ళు , వడ్డీకి తెచ్చి కట్టిన వాళ్ళు రోడ్డున పడ్డారు . సగం మంది రిటైర్ అయ్యారు . వీరిలో సగం మందిలోకం విడిచి వెళ్లారు . మిగిలిన వాళ్ళు అటు చావలేక ఇటు బతక లేక చావు బతుకు మధ్య బతుకీడుస్తున్నారు . ఓ శుభ ముహూర్తం లో మంత్రి మీ అందరినీ కోటీశ్వరులను చేస్తున్నాను . మీ ల్యాండ్ మీకే ఇస్తున్నాం అని ప్రకటించారు . జర్నలిస్ట్ లు రెండు చేతులా సంపాదిస్తున్నది సరిపోలేదా ?, కోట్ల రూపాయల భూమి ఎవడి సొత్తు అని ఇస్తారు అని తిట్టుకున్న వాళ్ళు , ఈర్ష పడ్డ వాళ్ళ సంఖ్యకు లెక్క లేదు . కానీ ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం అప్పటి రేటుతో కొని ఇప్పటి వరకు చకోర పక్షుల్లా ఎదురు చేస్తున్నవాళ్లు అని జాలి చూపిన వారు లేరు . ససేమిరా ఆ భూమి ఇవ్వడానికి వీలులేదు , వాళ్ళు కట్టిన డబ్బు వడ్డీతో తిరిగి చెల్లించండి అని ధర్మ ప్రభువులు తీర్పు చెప్పారు .
ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు . డబ్బుకు బదులు ఏదో ఒక చోట భూమి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది . ఈ నిర్ణయంలో భాగంగానే మంత్రి విలేకరుల సమావేశం .
**** ****
ముచ్చర్లలో సర్వే నంబర్ 988 లో మీకు రెండు వందల గజాల ఇంటి స్థలం ఇస్తున్నామని మంత్రి విలేకరుల సమావేశంలో ప్రకటించగానే అరవింద్ కు ఏడుపు ఆగలేదు . ప్రభుత్వం ఇచ్చిన జీవో లో తప్పు ఉంటే ప్రభుత్వాన్ని శిక్షించాలి కానీ , జర్నలిస్ట్ లను శిక్షించడం ఏం న్యాయమో అర్థం కాలేదు . మూడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైమ్ ఏరియా లోని జర్నలిస్ట్ ల ల్యాండ్ తీసుకుని, మహానగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఐదు వేలకు గజం దొరికే చోట రెండు వందల గజాలా ? అని అందరూ బాధపడుతుంటే . అరవింద్ బాధ వర్ణనాతీతం . ముచ్చర్ల ఎక్కడో కాదు తన బాల్యం అంతా గడిపిన తన సొంత ఊరు .మూడెకరాల వ్యవసాయ భూమి అమ్మి , రెండు దశాబ్దాలు నిరీక్షించి అదే గ్రామం లో రెండు వందల గజాలు పొందుతున్న తన దురదృష్టాన్ని చూసి అరవింద్ తట్టుకోలేక పోతున్నాడు . అన్నదమ్ములకు , తల్లితండ్రులకు ముఖం ఎలా చూపాలో అర్థం కావడం లేదు . నిజమే పెద్దలు చెప్పినట్టు పస్తులు ఉండాలి కానీ సొంత ఊరిలో పొలం అమ్ముకోవద్దు అనుకున్నాడు . మబ్బులను చూసి కుండలో నీటిని పారబోసిన తన అజ్ఞానానికి తనను తానే తిట్టుకున్నాడు . ముచ్చర్ల సర్వే నంబర్ 988 ని మరోసారి చూసి ఏడుపు ఆపుకోలేక పోయాడు . సర్వే నంబర్ 988 అంటే తమ భూమే . తాను అమ్మిన భూమి అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వం చేతికి వచ్చింది . తాను అమ్మిన మూడెకరాల భూమిలో 20 ఏళ్ళ తరువాత తనకు రెండు వందల గజాలు వస్తోంది . భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో . తన భూమిలో రెండు వందల గజాల కోసం మూడు ఎకరాలు అమ్మిన నన్ను నేను జీవితంలో క్షమించను అనుకున్నాడు .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం