9, జూన్ 2023, శుక్రవారం
స్టార్ రైటర్స్ ను సృష్టించిన మెగా ఎడిటర్ సికరాజు... వార పత్రికకు అభిమాన సంఘాలు చనిపోతే సింగిల్ కాలం వార్తా వద్దన్న శాస్త్రి >: జర్నలిస్ట్ జ్ఞాపకాలు -46
స్టార్ రైటర్స్ ను సృష్టించిన మెగా ఎడిటర్ సికరాజు...
వార పత్రికకు అభిమాన సంఘాలు
చనిపోతే సింగిల్ కాలం వార్తా వద్దన్న శాస్త్రి
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -46
_________.... ____________________
ఈ తరం వాళ్ళు నమ్మక పోవచ్చు కానీ ఒక కాలం లో ఆంధ్రభూమి రచయితలు అంటే సినిమా తారలను మించిన క్రేజీ ఉండేది . రచయితలు జిల్లాల్లో పర్యటిస్తే సినిమా వాళ్ళను చూసినట్టు గుంపులు గా జనం ఎగబడేవారు . పత్రికకు అభిమాన సంఘాలు ఉండేవి , పత్రిక మార్కెట్ లోకి రావడానికి ఆలస్యం అయితే ఆఫీస్ ముందు ధర్నాలు జరిగేవి . రచయితలకు సినిమా నటుల్లా క్రేజీ తీసుకువచ్చింది ఎడిటర్ సి . కనకాంబరరాజు . డక్కన్ క్రానికల్ ఏజెన్సీ తీసుకుంటేనే ఆంధ్రభూమి వారపత్రిక ఏజెన్సీ ఇస్తాం అని షరతులు పెట్టేవారు . వారపత్రికకు అంత మోజు ఉండేది .
*********
ఆంధ్రభూమి ఆఫీస్ లో ఎడిటర్ ఛాంబర్ లోకి సబ్ ఎడిటర్ వెళ్లి , ముఖం అదోలా పెట్టుకొని వచ్చాడు. ఏమైంది అని అడిగితే , ఆంధ్రభూమి వారపత్రిక ఎడిటర్ కనకాంబరరాజు మరణించారు . ఎడిటర్ శాస్త్రికి చెప్పి ఆ వార్త వేద్దాం అంటే అవసరం లేదు అని చిరాగ్గా చెప్పి పంపించాడు అని సమాధానం . ఆంధ్రభూమిలో 1987 లో జొన్నలగడ్డ రాధాకృష్ణ నన్ను రిపోర్టర్ గా నియమించారు . కనకాంబరరాజు తో అనుబంధం లేదు , వ్యతిరేకత లేదు . కానీ వార్తాపత్రికను ఊహించని స్థాయికి తీసుకువెళ్లాడు అనే గౌరవం ఉండేది . సింగిల్ కాలం వార్త కూడా వేయాల్సిన అవసరం లేదు అని శాస్త్రి అలా పంపడంలో ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు . తనను తానూ తప్ప ఇతరులను అసలు మనుషులుగానే గుర్తించని అతను ఇక మనుషుల్లోని గొప్ప తనాన్ని గుర్తిస్తాడు అనుకుంటే అత్యాశ అవుతుంది . కనకాంబరరాజు మరణించాడు అని తెలియడం , సింగిల్ కాలం వార్త కూడా వేయాల్సిన అవసరం లేదని అన్నట్టు విన్నాక,ఆఫీస్ లో ఉండలేక సన్నిహితంగా ఉండే ముగ్గురు మిత్రులం బయటకు వెళ్లి మాట్లాడుకున్నాం . నేనూ , శైలేంద్ర , వెల్జాల చంద్రశేఖర్ అని గుర్తు . మనిషి అనే వాడు ఎప్పుడో ఒకప్పుడు పోతాడు , పోవలసిందే . ఎడిటర్ శాస్త్రి పోతే , అప్పుడు మనం భూమిలోనే ఉంటే భూమిలో మాత్రం వార్త రాకుండా చూసుకోవాలి అని మాట్లాడుకుని శాంతించి లోపలి వెళ్లి పోయాం . అప్పుడు మేం అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు . ఇలా మాట్లాడుకున్నాం అని తెలిసినా , మా ఉద్యోగాలు వదిలి మా అంతట మేం బయటకు వెళ్లి పోయేంతగా ఎడిటర్ మానసికంగా పెట్టే హింస గురించి తెలుసు . నెల నెల వచ్చే ఆ మంచి జీతాన్ని వదులుకుంటే బతికే పరిస్థితి కాదు .
*****
నిద్ర పోతున్న జర్నలిజాన్ని తట్టి లేపింది . పరుగులెత్తించింది ఉదయం అని చాలా మంది చెబుతారు . ముసలి తనం తో అడుగులు వేయలేక మెల్లగా నడుస్తున్న వారపత్రికలు కనకాంబరరాజు పరుగులు నేర్పించారు . 1976 లో ఆంధ్రభూమి వారపత్రిక మొదలైంది . మొదటి సంచిక నుంచి నాకు అనుబంధం ఉంది. సికిందరాబాద్ బుర్గుశెట్టి బజార్ లో మా అన్నకు బట్టల షాప్ ఉండేది . అప్పటి వరకు ఆంధ్రప్రభ వారపత్రిక వచ్చేది . ప్రభ మానేసి ఆంధ్రభూమి మొదటి సంచిక నుంచి తెప్పించడం వల్ల మొదటి నుంచి అనుబంధం . తరువాత 87లో భూమిలో చేరాక వారపత్రిక హడావుడి , కనకాంబరరాజు కు ఉండే ఫాలోయింగ్ , అయన వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు కనిపించే హడావుడి చూసే వాడిని . మంచి^ కళాకారుడు ^ అని ప్రచారం ఉండేది . ఎదుటి వారిని కళాకారుడు అని చెప్పడం ద్వారా నేను పవిత్రుడిని అని చెప్పుకోవడం మన హిపోక్రసి . కొందరి కళలు బయటపడి కళాకారుడు అనే ముద్ర పడుతుంది . కొందరివి గుప్త దానాల్లా గుప్త కళలు . అస్సలు బయటపడవు . స్వాతి ముత్యం లో కమల్ హాసన్ లా కనిపిస్తారు కానీ నిజానికి మన్మథ లీలలో కమల్ హాసన్ లు . నిలువెత్తు సంప్రదాయం నడిచివస్తున్నట్టు , దండం పెట్టాలి అనిపించే మహా అవధాని మాడుగుల నాగఫణి శర్మ మంచి కళాకారుడు అని అమెరికాలో కేసు పెట్టేంత వరకు బయటపడలేదు . అవకాశం ఉంటే ప్రతివాడు కళాకారుడే .. భయం , అవకాశం లేకపోతే తప్ప ...
కనకాంబరరాజులోని కళాకారుడు గురించే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు . అందులో నిజం ఉందో లేదో తెలియక పోయినా ...
కానీ కనకాంబర రాజు స్టార్ రైటర్స్ ను తయారు చేసిన మెగా ఎడిటర్ అనే మాట మాత్రం నిజం . అంతకు ముందు ఆంధ్రపత్రిక , ఆంధ్రజ్యోతి , ఆంధ్రప్రభ వారపత్రికలు ఉన్నా , వీటికి భిన్నంగా ఆంధ్రభూమి ఉండేది . తొలుత కనకాంబరరాజు ఆంధ్రపత్రికలో పని చేసేవారు . 76లో తొలి ఎడిటర్ కందనాతి చెన్నారెడ్డి , అప్పుడు కనకాంబరరాజు డిప్యూటీ ఎడిటర్ . 1980 లో కందనాతి వెళ్ళిపోయాక కనకాంబరరాజు ఎడిటర్ . దాదాపు 1990 వరకు స్వర్ణయుగాన్ని చూపించారు .
*******
యండమూరి వీరేంద్రనాథ్ , మల్లాది వెంకట కృష్ణమూర్తి , కొమ్మనాపల్లి గణపతి రావు , చందుసోంబాబు , కార్టూనిస్ట్ మల్లిక్ ఇంకా చాలా మంది సినిమా స్టార్స్ గా వెలిగిపోయారు . వాస్తును తెలుగు వారికి అంటించడం లో సికరాజుది కీలక పాత్ర . దంతూరి పండరినాథ్ సీరియల్స్ రాసేవారు ... ఆయనకు వార పత్రికలో వాస్తు సమాధానాలు రాసే బాధ్యత అప్పగించారు . వార పత్రిక ద్వారా వాస్తు జనం బుర్రలోకి బాగా ఎక్కింది . ప్రజల వాస్తు ఎలా ఉన్నా దంతూరి వాస్తు మాత్రం దశ తిరిగింది . సీరియల్స్ రాయడం మానేయడమే కాదు , రాశారు అనే ఆనవాళ్లు ఉండడం కూడా ఇప్పుడు ఇష్టపడరు . రాజధానిలో ఖరీదైన వాస్తు కన్సల్టెంట్ లో వారు ఒకరు . కొమ్మనా పల్లి సినిమాల వైపు వెళ్లగా , యండమూరి ఒక్కరే ఇంకా పాపులర్ రచయితగా రాస్తూనే ఉన్నారు . ఇంగ్లీషులో వచ్చిన భూతు జోకులతో కర్నల్ ఏకలింగం నవల రాసిన మల్లాది ఇప్పుడు భక్తిలో మునిగిపోయారు . మిగిలిన వారి సంగతి తెలియదు . వీరందరినీ వెలుగులోకి తీసుకువచ్చి స్టార్ రైటర్ గా మార్చింది కనకాంబరరాజు .
*****
1993 లో నేను నల్లగొండ జిల్లాలో రిపోర్టర్ గా ఉండగా , మిగిలిన జిల్లాల నుంచి రిపోర్టర్ లు ఫోన్ చేశారు . వార పత్రిక ఎడిటర్ కనకాంబరరాజును ఆంధ్రభూమి దినపత్రికకు కూడా ఎడిటర్ ను చేస్తున్నారు , తిరుగుబాటు వస్తుంది , అయన ఎడిటర్ గా ఉంటే పవిత్రులం మనం పని చేయడం ఏమిటీ అనేది ఆ ఫోన్ లోని ఆందోళన సారాంశం . జీతం ఇచ్చేది యాజమాన్యం , వాళ్ళ పత్రిక వాళ్ళిష్టం . నువ్వు రిపోర్టర్ గా , పలానా వ్యక్తి ఎడిటర్ గా ఉండాలి అని పెట్టుబడి పెట్టిన వ్యక్తి నిర్ణయించాడు . వ్యతిరేకించడానికి నువ్వెవరు , నచ్చక పోతే వెళ్ళిపో ....అని నా అభిప్రాయం చెప్పాను . మన ఆఫీస్ లో పని చేసే అటెండర్ నాగేశ్వర్ రావును ఎడిటర్ గా పెట్టినా నాకు అభ్యంతరం లేదు . ఎందుకంటే అటెండర్ లలో అతనొక్కడే సౌమ్యంగా మాట్లాడతాడు ,మనం అంటే గౌరవం , మంచినీళ్లు తెమ్మన్నా తెచ్చి ఇస్తాడు అని జోకేశాను . తిరుగుబాటు లేదు గాడిద గుడ్డు లేదు అంతా ఎవరి పనుల్లో వారున్నారు .
*****
జర్నలిస్ట్ లు అందరు కూడా ఈగోతో కనకాంబరరాజును తక్కువగా అంచనా వేశారుకాని . ఆంధ్రభూమి దిన పత్రికకు కూడా అతను కొత్త రూపు తీసుకువచ్చారు . రెండేళ్ల లోపే ఉన్నా బలమైన ముద్ర వేశారు . ఇప్పుడు అన్ని దినపత్రికల ఆదివారం అనుబంధాలు పుస్తక రూపం లో వస్తున్నాయి . అది మొదలు పెట్టింది కనకాంబరరాజు . ఈనాడు తో పాటు అన్ని పత్రికలకు దినపత్రికల సైజులోనే ఆదివారం అనుబంధం పేజీలు ఉండేవి . ఆదివారం అనుబంధం మొదటి సారి రాజు హయాంలోనే టాబ్లాయిడ్ సైజు బుక్ లో తెచ్చారు . తరువాత అన్ని దినపత్రికలు దీనిని అనుసరించాయి . దిన పత్రికలకు మ్యాగజైన్ లా మార్చింది రాజు హయం లోనే . ఏడు వారాల నగలు అంటూ రోజుకో ప్రత్యేక అనుబంధం మొదలు పెట్టారు . చాలా కాలం తరువాత ఈనాడు అదే విధంగా ఏడు వారాల నగలు అని మొదలు పెట్టారు . ఐతే ఈనాడు ఏది ప్రారంభించినా ఒక పద్దతి ఉంటుంది . అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి .ఒక మార్పు తీసుకురావాలి అంటే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాకే చేసి , మార్పును కొనసాగించడం ఈనాడు విధానం . ఆంధ్రభూమిలో అవి ఉండవు గుడ్డెద్దు చేలో పడ్డ వ్యవహారంలా ఉంటుంది . రాజకీయ నాయకుల పర్సనల్ లైఫ్ గురించి ఇంటర్వ్యూలు ఇప్పుడు కామన్ దినపత్రికలో ఎడిట్ పేజీలో అది మొదలు పెట్టింది కనకాంబరరాజు . 89లో ఇండిపెండెంట్ గా గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు వ్యక్తిగత జీవితం గురించి ఈ పేజీలో 93లో రాశాను . ఎన్టీఆర్ ఇప్పటికీ నా రాజకీయ గురువు అని .... టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారు నీ ఇంటర్వ్య వల్ల ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . నీ వల్లే టీడీపీలో చేరాను అని మోత్కుపల్లి చాలా సార్లు చెప్పారు .
********
జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ లో తన ప్లాట్ లో కనకాంబరరాజు పెద్ద ఇల్లు కట్టుకున్నారు . గృహ ప్రవేశానికి డిసి ఎండి ని కూడా పిలిచారు . నేను వెళ్ళలేదు కానీ వెళ్లిన వారు చెప్పిన మాట ఎండి గృహప్రవేశానికి వచ్చి మా ఇల్లు కంటే మీ ఇల్లే పెద్దగా ఉందని అన్నాడని వినిపించింది . ఆ తరువాత చెప్పాపెట్టకుండా కనకాంబరరాజును బయటి నుంచి బయటే పంపించారు . యాజమాన్యం సంప్రదాయం చిత్రంగా ఉంటుంది . పత్రిక తమది కాదు ఎడిటర్ ది అన్నట్టుగా పూర్తిగా వదిలేస్తారు . అలా దశాబ్దాలు గడిచిపోతాయి . ఒక రోజు హఠాత్తుగా గేటు బయటి నుంచే పంపించేస్తారు . ఎందుకు విపరీతంగా స్వేచ్ఛ ఇస్తారో , ఎందుకు గేటు బయటి నుంచే పంపిస్తారో ఎవరికీ చెప్పారు . ఎబికె ప్రసాద్ ను రెండు సార్లు , కనకాంబరరాజును , శాస్త్రిని ఇలానే బయటి నుంచి బయటే పంపించారు . ఇంతకాలం నన్ను ఆదరించిన తెలుగువారికి ఏదో చేయాలి అని సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాను అని ఎన్టీఆర్ 60 ఏళ్ళ వయసులో డైలాగు చెప్పినట్టు .... సమాజానికి ఏదో చేయాలి అని బయటకు వచ్చాను అని చెప్పుకొనే వాళ్ళు చెప్పుకుంటారు కానీ వాస్తవం మాత్రం అవమానకరంగా బయటకు పంపడం డిసి మేనేజ్ మెంట్ పాలసీ . నాయర్ లేనిదే డిసి లేదు అనుకున్నాం అలాంటి నాయర్ ను సైతం ఇలానే పంపారు .
******
కనకాంబరరాజు హయాంలో వారపత్రికలో , మాసపత్రికలో నేను ఒక్క అక్షరం కూడా రాయలేదు . ఛాన్స్ ఇవ్వమని నేను అడగలేదు ,వారు ఇవ్వలేదు . తరువాత టి వెంకట్రామ్ రెడ్డి సంపాదకుడు అనే పేరుతోనే వార , మాస పత్రిక వచ్చింది కానీ , వస్తుందా అని అడిగేట్టుగా వచ్చింది . 90ల లో కనకాంబరరాజు హయాంలోనే వారపత్రిక తన వైభవం కోల్పోయింది . టివిలు ఇంటిని ఆక్రమించడం , వారపత్రికలు స్వాతి ఆక్రమించడం తో ఏదో వస్తుంది అంటే వస్తుంది అన్నట్టు మారింది . 95 లో కనకాంబరరాజు శకం భూమిలో ముగిసింది . ఆ తరువాత ఆయన కనీసం రెండేళ్లు కూడా బతకలేదు . తాను పని చేసే పత్రికనే తన జీవితం అనుకోని బతకడం వల్ల బయటకు పంపితే తట్టుకోలేక పోయారేమో అని నాకు అనిపిస్తుంది . ఉద్యోగం పైన , సంస్థ పైన , వ్యక్తుల పైన అతిగా ప్రేమ , అనుబంధం పెంచుకోవడం ప్రమాదం . రాజు తరువాత వారపత్రికలో , మాసపత్రికలో చాలా ఏళ్ళ పాటు రాజకీయ కాలం రాశాను . పెద్దగా ఆసక్తి ఉండేది కాదు .
ఓ సారి ఆంధ్రభూమి ఆఫీస్ లో భూమి యేవో వార్షికోత్సవాలు అని రచయితలతో సమావేశం . వృద్ధ ఆలోచనలతో సాగిన ఆ సమావేశంలో భూమిని పరిగెత్తించిన కనకాంబరరాజు ప్రస్తావనే లేదు . పవిత్రత సంతరించుకుంది అని ఉపన్యాసం . ఎక్కువ సమయం వినలేక వెళ్ళిపోయాను . జ్ఞాపకాలను మిగిల్చి కరోనా ఆంధ్రభూమిని 2020లో మింగేసింది .
*****
ఫోటో కానీ సమాచారం కానీ దొరుకుతుందేమో అని చూస్తే సరిగా కనిపించని ఒక ఫోటో నెట్లో కనిపించింది . ఎంతో మంది స్టార్ రైటర్స్ ను తయారు చేసిన కనకాంబరరాజు గురించి సమాచారం లేకపోవడం బాధాకరం . ఈ మధ్య ఆంధ్రభూమి గురించి ఎవరో ఒక వీడియో చేశారు . శాస్త్రి గురించి, శాస్త్రి చేత , శాస్త్రి పత్రిక ఆంధ్రభూమి అన్నట్టుగా వీడియో ఉంది . ఇప్పటికీ ఆంధ్రభూమి దినపత్రిక అంటే గోరాశాస్త్రిని (మరణించారు )గుర్తు చేస్తారు . పత్రికపై ఇది శాస్తి (బతికున్న శాస్త్రి) ముద్ర అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా తామే రాసుకోవడం ద్వారా చరిత్రలో ఇరికిపోతారు .
తెలిసింది రాయాలి . జీవితమంతా భయపడుతూనే బతకాలా ? తెలిసింది రాద్దాం , రాయకపోతే ఇదే చరిత్ర అని చరిత్రను ఇష్టమొచ్చినట్టు రాసుకుంటారు . వాస్తవం చెప్పగల స్థితిలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం పాపం .
- బుద్దా మురళి
8, జూన్ 2023, గురువారం
మీరు అమరావతికి వెళ్ళండి పిల్లలతో మేం హైదరాబాద్ లోనే. ఐఏఎస్ ల భార్యలు వంద కోట్లు ఇచ్చి బాబే తెరాస పెట్టించాడు : సీనియర్ అధికారులంతా అమరావతికే ... ఆ రోజుల్లో చిత్రమైన ప్రచారం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -45
మీరు అమరావతికి వెళ్ళండి పిల్లలతో మేం హైదరాబాద్ లోనే ఐఏఎస్ ల భార్యలు
వంద కోట్లు ఇచ్చి బాబే తెరాస పెట్టించాడు : సీనియర్ అధికారులంతా అమరావతికే ...
ఆ రోజుల్లో చిత్రమైన ప్రచారం
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -45
^^ మీ కేంటీ రెడీమేడ్ రాజధాని హైదరాబాద్ ఉంది .కష్టాలు అన్నీ మాకే . చివరకు ఐఏఎస్ ల భార్యలు కూడా హైదరాబాద్ వదిలి మేం అమరావతి కి రాం .. పిల్లలతో ఇక్కడే ఉంటాం . మీరు వెళ్ళండి అంటున్నారు అని చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నపుడు చీఫ్ సెక్రెటరీ ని మించి అధికారం చెలాయించిన బాబు ఓ యస్ డి లక్ష్మీ నారాయణ చెప్పిన మాటలు ఇవి . 2014లో తెలంగాణ ఏర్పడి , ఓటుకు నోటు కేసు తరువాత చంద్రబాబు హఠాత్తుగా హైదరాబాద్ నుంచి ఆంధ్రకు తరలి వెళ్లారు . అప్పుడు రాజ్యసభ ఎన్నికలు. అసెంబ్లీలో హడావుడిగా ఉంది . అధికారిక పనిమీద వచ్చిన లక్ష్మీనారాయణ( ఐఏఎస్ ) అక్కడ తనకు పాత పరిచయం ఉన్న నన్ను చూడగానే దగ్గరకు వచ్చి ఏమైంది హడావుడి అని ప్రశ్నించారు . ఒకప్పుడు లక్ష్మీనారాయణ నడచివస్తున్నాడు అంటే రాష్ట్రంలోని అధికారం అంతా నడిచి వస్తుంది అన్నట్టు ఉండేది . బాబుకు లక్ష్మీనారాయణ చదువుకునే రోజుల్లోనే స్నేహితుడు . 78లో బాబు శాసన సభకు ఎన్నిక అయినప్పుడు బాబు , లక్ష్మీనారాయణ హైదరాబాద్ లోని ఏం ఎల్ ఏ క్వార్టర్ లో ఒకే క్వార్టర్ లో ఉండేవారు . వారిది అంత ఘాడమైన స్నేహం కావడంతో సీఎం పేషీలో లక్ష్మీనారాయణ అధికారం వెలిగిపోయేది . తనది కానీ వేరే లోకంలోకి వచ్చాము అన్నట్టు కనిపించిన అతన్ని గతం లో ఎప్పుడూ అలా బేలగా చూడలేదు .
పాత పరిచయం ఉన్న వ్యక్తిని దగ్గరలో నేనొక్కడినే కనిపించడం తో దగ్గరకు వచ్చి మాట్లాడారు .
ఎలా ఉంది కొత్త కాపురం అంటే , ఉద్యోగులు హైదరాబాద్ నుంచే వస్తా మనడం కాదు , చివరకు ఐఏఎస్ లు సైతం ఇష్టపడడం లేదు . వాళ్ళ భార్యలు మీరు వెళితే వెళ్ళండి మేం హైదరాబాద్ లోనే ఉంటాం అంటున్నారు అని కొద్ది సేపు మాట్లాడి వెళ్లి పోయారు ... కొత్త కాపురంలో ఇబ్బందులు ఉంటాయని తెలుసు , కానీ ఎలా ఉంది అని అడగడానికి కారణం ఉంది .
*****
2001లో తెరాస ఆవిర్భవించిన కొత్తలో టీడీపీ శిబిరం నుంచి చిత్రమైన ప్రచారాలు జరిగేవి . జ్యోతిలో ఇరిగేషన్ వార్తలు రాసే రిపోర్టర్ , చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే కాంట్రాక్టర్ ఒకరు ఓ రోజు అసెంబ్లీ లో TDLP కార్యాలయం వద్ద ఉంటే మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి , బాబే వందకోట్లు ఇచ్చి తెరాస ను పెట్టించారు అంటూ కథ చెప్పుకొచ్చారు . అతనో మేస్త్రీ లాంటోడు , అసెంబ్లీలో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు , కాంట్రాక్టర్ ను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు అని అతని గురించి ... హిమాయత్ నగర్ టీడీపీ కార్యాలయం కార్యదర్శిగా పని చేసిన మూర్తి అని మిత్రుడు చెప్పేవాడు . ఇక వంద కోట్ల కథ చెప్పిన అతను జ్యోతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో కుంభకోణాలు అని తెగ రాసే వారు . ఓ సారి మంత్రిగా ఉన్న యస్ వి సుబ్బారెడ్డి మీడియాతో వంద కోట్ల ప్రాజెక్ట్ లో వంద కోట్ల కుంభకోణం అని రాయండి , కానీ వంద కోట్ల ప్రాజెక్ట్ కు రెండు వందల కోట్లు స్వాహా చేశామని రాయడం ఏమిటండి అని విస్తుపోయారు . నాయనా పులి వచ్చే కథలా .. ఇలాంటి కథల వల్ల వార్తల విలువ తగ్గిపోయింది .
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు . రాయల సీమ వారు . వందకోట్లు ఇచ్చి తెలంగాణ కోసం పార్టీ ఎందుకు పెట్టిస్తారు , దాని వల్ల ఆయనకేం లాభం లాజిక్ ఉండాలి కదా ? అంటే అదంతే చాలా విషయాలు ఉంటాయి అంటూ చెప్పుకు పోయారు . నీ పేరు మురళి తెలుసా ? అని ఎవరైనా చెప్పినా ఆసక్తిగా వినడం నాకు అలవాటు. అతను ఎక్కడి వరకు చెబుతాడో చూద్దాం అన్నట్టు వింటాను . ఇలాంటి చిత్రవిచిత్రమైన ప్రచారాలు ఆ పార్టీ శిబిరం నుంచి వినిపించేవి .
*****
పదమూడేళ్ల ఉద్యమం తరువాత తెలంగాణ సాకారం అయింది . ఓ రోజు సచివాలయం లో అందరు రిపోర్టర్ లు గుమికూడే సచివాలయం ప్రెస్ రూమ్ ఎదురుగా ఉన్న చెట్టు వద్ద వంద కోట్ల కథ చెప్పిన జర్నలిస్ట్ కనిపించారు . అప్పుడు అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తున్న సమయం . అధికారులంతా ఆంధ్రానే సెలక్ట్ చేసుకుంటున్నారు , త్వరగా ప్రమోషన్ వస్తుంది అని . ఇరిగేషన్ లో నైతే తెలంగాణ కు మరీ ఇబ్బందే . సీనియర్లు అంతా ఆంధ్రాకే వెళుతున్నారు . రేపు రేపు ఇబ్బందులు తప్పవు అంటూ సానుభూతి చూపారు . పత్రికలో రాసే వార్తల్లోనే కాదు చివరకు తోటి వారితో మాట్లాడడం కూడా తాము ఏం జరగాలని కోరుకుంటారు , అది జరుగుతున్నట్టు కథలు చెబుతారు అనిపించింది . 2014 నుంచి తొమ్మిదేళ్లు గడిచాక ఇంజనీర్లు ఉండరు ఇబ్బంది అన్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి ఎండాకాలం లోను తెలంగాణ పల్లెల్లో జల కళ ఉట్టి పడుతోంది . జాతీయ ప్రాజెక్ట్ అయినా పోలవరం పూర్తి కాలేదు .
ఇలాంటి కథలు వినే .. అసలేంటో నిర్ధారించుకుందాం అని లక్ష్మీ నారాయణతో కొత్త కాపురం ఎలా ఉంది అని మాట్లాడాను .
7, జూన్ 2023, బుధవారం
హైదరాబాద్ లో మూడు రాష్ట్రాలు ముగ్గురు గవర్నర్లు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వందేళ్లకు వస్తుంది తేల్చేసిన ఎడిటర్ బిల్లు సవరణ ప్రతిపాదనలు రామబాణం అన్న టీడీపీ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -44
హైదరాబాద్ లో మూడు రాష్ట్రాలు ముగ్గురు గవర్నర్లు
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వందేళ్లకు వస్తుంది
తేల్చేసిన ఎడిటర్
బిల్లు సవరణ ప్రతిపాదనలు రామబాణం అన్న టీడీపీ
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -44
___________________________________________
ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం కార్యాలయం లోకి వెళితే శాసన సభ్యులంతా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంది . నేను పదవ తరగతి పరీక్షలకు వెళుతున్నప్పుడు ఆ దృశ్యం అచ్చం అలానే ఉండేది . ఒకరు శ్రద్దగా చదువుతుంటాడు , ఇంకో విద్యార్ధి పరీక్షలో కాపీ కొట్టే విధంగా చిన్న అక్షరాలతో రాస్తుంటా డు .అలానే ఉన్న దృశ్యం వీరందరికీ మధ్యలో కూర్చొని టీడీపీ శాసన సభ్యులు దూళిపాళ నరేంద్ర సలహాలు ఇస్తున్నారు . వారి సందేహాలు తీరుస్తున్నారు . 2013 డిసెంబర్ 16న అసెంబ్లీలో రాష్ట్ర విభజన పై ముసాయిదా బిల్లు ప్రవేశపెడతారు . అంతకన్నా ముందు రోజు tdlp లో కనిపించిన సీన్ ఇది . ఏం జరుగుతుంది అని అడిగితే రామబాణం వేయబోతున్నాం అని ఉత్సాహంగా చెప్పారు . ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెడుతున్నారు కదా ? మేం బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నాం . ఎన్ని సవరణలు అయినా ప్రతిపాదించవచ్చు . ఒక్కో శాసన సభ్యుడు కనీసం వంద సవరణలు ప్రతిపాదిస్తాడు . ప్రతిపాదిస్తున్న సవరణలు రాసి అసెంబ్లీ కార్యదర్శికి ముందే ఇవ్వాలి . దానికోసం ఈ కసరత్తు . అలా ఇస్తే ఏమవుతుంది ? అని అడిగితే సవరణలు వేలలో ఉంటాయి . ప్రతిపాదించిన ప్రతి సవరణపై చర్చ జరగాల్సిందే అంటే ఆలోచించండి , ఏడాది గడిచినా చర్చ పూర్తి కాదు . ఇదే మా రామబాణం అని చెప్పుకొచ్చారు .
తెలంగాణ ను అడ్డుకోవడానికి ఏ ఒక్కరు ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోలేదు .
కేంద్రం లో అధికార పక్షం , ప్రధాన ప్రతిపక్షం అనుకూలంగా ఉన్నప్పుడు ఏ ప్రయత్నం ఐనా వృధానే అని చెప్పాలని ఉన్నా , అక్కడి వాతావరణం చెప్పడానికి వీలుగా లేకపోవడంతో మౌనంగా చూస్తూ ఉండిపోయాను .
****
నాలుగు తెలుగు దిన పత్రికలు ఉంటే సర్క్యులేషన్ లో నాలుగవ స్థానం లో ఉన్నా ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి తెలంగాణ ను అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదు . లాభసాటి ప్రయత్నాలు చేశారు . లాభసాటి అంటే ఫలించే ప్రయత్నాలు అని కాదు . సమైక్యాంధ కోసం ఏదో రాయడం , దాన్ని పుస్తకంగా ప్రచురించడం , ఏదో తక్కువ జీతం తో నెట్టుకొచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులైన తెలంగాణ జర్నలిస్ట్ లకు బుక్స్ అంటగట్టి అమ్మి పెట్టమనడం .... పర్మనెంట్ ఉద్యోగులకు వెజ్ బోర్డు సిఫారసులు అమలవుతాయి . జీతం ఎక్కువ , ఉద్యోగ భద్రత ఉంటుంది . నేను తెలంగాణ కోరుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పే అవకాశం ఉంటుంది . కాంట్రాక్ట్ వాళ్లకు చాలా తక్కువ జీతం కనీసం నోరు తెరిచి తెలంగాణ కోరుకుంటున్నాను అని చెప్పే స్వేచ్ఛ ఉండదు , పైగా సమైక్యాంధ్ర కోసం రాసిన పుస్తకాలు అమ్మి పెట్టాలి . ఉద్యమ సంఘాల వార్తలు రాసే రెడ్డి అనే కుర్రాడి ఇంట్లో ఈ పుస్తకాల కట్టలు కనిపించాయి . ఓ నాయకుడు ఇతని పరిస్థితి గమనించి డబ్బు ఇచ్చి , పుస్తకాలు నీ వద్దనే ఉండనివ్వమని వదిలేశాడు .
****
హైదరాబాద్ కేంద్రంగా మూడు రాష్ట్రాలు ఏర్పడతాయి అని ఒక సారి ఎడిటర్ అద్భుతంగా రాశారు . ముగ్గురు గవర్నర్లు ఉంటారని సెలవిచ్చారు . తీరా చూస్తే విభజన తరువాత రెండు రాష్ట్రాలకు చాలా కాలం ఒకరే గవర్నర్ ఉన్నారు . తెలంగాణ ఏర్పడితే చీకటి , నక్సలైటు విజృంభిస్తారు అని అందరూ రాశారు . మూడు రాష్ట్రాలు , ముగ్గురు గవర్నర్లు అనే కొత్త కోణం బాగుంది అనిపించింది . రాస్తున్నది అబద్దం అని తెలిసినప్పుడు ఆకట్టుకునే అబద్దమే రాయాలి .
ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో నలుగురు రిపోర్టర్ లతో ఎర్రంనాయుడు పిచ్చాపాటి మాట్లాడుతూ తెలంగాణ రాదు అని చెబుతూ నక్సలైట్ల సమస్య , శాంతిభద్రతలు అంటూ యేవో చెప్పుకుంటూ పోతున్నారు . అవి కాదు కానీ మీకు అంతకన్నా బలమైన కారణం చెబుతాను అని అమెరికా ఒప్పుకోవడం లేదు , తెలంగాణ ఇవ్వ వద్దు అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది అందుకే ఇవ్వడం లేదు అని చెప్పండి బాగుంటుంది అని చెబితే , అయన వెంటనే ఔను నిజం .. కావాలంటే మొన్న వార్త కూడా వచ్చింది అన్నారు . విదేశాల్లో పర్యటించే అమెరికా పౌరులకు అమెరికా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది . తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం గురించి పర్యాటకులకు వార్నింగ్ ఇస్తే ఆ వార్తను ప్రస్తావిస్తూ అమెరికా వద్దంటోంది అని చెప్పుకొచ్చారు .
****
శ్రీకృష్ణ కమిటీ పై ఎడిటర్ సీరియస్ గా రాసిన ఆణిముత్యం లాంటి వ్యాసం ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది . .. శ్రీ కృష్ణ కమిటీ ఆంధ్ర , తెలంగాణల్లో అనేక జిల్లాల్లో పర్యటించింది . కొన్ని వేల మంది కమిటీకి స్వయంగా లేఖలు ఇచ్చారు . వేల మంది విభజన పై తమ అభిప్రాయాలు కమిటీకి మైయిల్ చేశారు . ఓ సారి తమకు ఎన్ని వినతి పత్రాలు వచ్చాయో కమిటీ ప్రకటించింది . ఎడిటర్ఎ ఓ రోజు ఎ న్ని వేల వినతి పత్రాలు , ఒక్కో వినతి పత్రంలో ఎన్ని పేజీ లు అని లెక్క తెలిస్తే లక్షల్లో వచ్చింది . ఒక పేజీ చదవడానికి ఎంత సమయం పడుతుంది . లక్షల పేజీలు చదివేందుకు ఎన్ని కోట్ల నిముషాలు , ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో లెక్క వేసి .... ఇన్ని వినతి పత్రాలు చదివేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పి ... చదివేందుకు ఇన్ని సంవత్సరాలు పడితే ఇక నివేదిక ఎప్పుడిస్తారు , తెలంగాణ రాదు అని తేల్చేశారు . జెమినీ టివిలో కావచ్చు చర్చ . ఎడిటర్ శాస్త్రి తో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు . ఆఫీస్ లో స్టాఫ్ తో మాట్లాడినట్టు టివి చర్చలో తెలంగాణ ప్రజలెవరూ తెలంగాణ కోరుకోవడం లేదు . అది నాయకుల కోరిక మాత్రమే అంటూ చెప్పుకు పోయారు . అలా చెబితే ఆఫీస్ లో ఐతే ఔను అన్నట్టు తలాడించే వాళ్ళం . అది టివి అక్కడున్నది హరగోపాల్ .... మీరు అలా మాట్లాడడం తప్పు , తెలంగాణ ఇవ్వ వద్దు సమైక్యాంధ్ర గానే ఉంచాలి అని మీ వాదన వినిపించవచ్చు తప్పు లేదు కానీ , తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుకోవడం లేదు అని వారి తరపున మీరెలా చెబుతారు . వారి కోరిక చెప్పుకొనే హక్కు కూడా వారికి ఇవ్వరా అని జూనియర్ రిపోర్టర్ కు చూపినట్టు చెప్పారు .
మూడు రాష్ట్రాలు , ముగ్గురు గవర్నర్ లు , రాజ్యాంగ సంక్షోభం లక్షల పే జీ ల నివేదికలు, అమెరికా ఆగ్రహం ,,నక్సలైట్లు , చీకటి .. ఊహించినట్టు ఏమీ లేవు . చక్కగా రెండు రాష్ట్రాలు , ఇద్దరు గవర్నర్లు మాత్రమే ఉన్నారు . ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పని తాము చేసుకుంటున్నారు .
6, జూన్ 2023, మంగళవారం
మోడీని అందలమెక్కించి .. బాబును వెంటాడుతున్న గోద్రా :బీజేపీ తో పొత్తుపై నిర్ణయించడానికి బీజేపీ ఎవరన్నాను ... నా మాటే నిజమైంది ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -43
బీజేపీ తో పొత్తుపై నిర్ణయించడానికి బీజేపీ ఎవరన్నాను ... నా మాటే నిజమైంది ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -43
20 ఏళ్ళ క్రితం నాటి మాట .. 2002 ఎన్టీఆర్ భవన్ మెట్లెక్కి పైకి పోతుంటే అప్పుడే చంద్రబాబు వచ్చారు .ఇంగ్లీష్ ఛానల్ స్టార్ న్యూస్ రిపోర్టర్ బాబును పలకరించి గోద్రా అల్లర్ల గురించి అడిగారు . ఆ సమయంలో ఎన్టీఆర్ భవన్ లో ఇద్దరు ముగ్గురు విలేకరులు తప్ప ఎవరూ లేరు . ఆ సమయంలో ఉద్భవించిన వార్త రెండు దశాబ్దాలు అవుతున్నా బాబును వెంటాడుతూనే ఉంది . గోద్రా అల్లర్లకు బాధ్యత వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి అని బాబు డిమాండ్ చేశారు . ఆ డిమాండ్ పుణ్యమా అని సీఎంగా మోడీ తన పదవిని పదిలం చేసుకోవడమే కాకుండా , ప్రధాన మంత్రి పదవి వరకు ఎదిగారు . బాబుకేమో మోడీ దర్శనం లభించడం లేదు .
*****
మీడియాను చూస్తే మాట్లాడకుండా ఉండలేరు .అది బాబు బలహీనత , బలం రెండూ . పదేళ్ల ఉమ్మడి రాష్ట్ర సీఎం , ఐదేళ్ల ఆంధ్ర సీఎంగా జర్నలిస్ట్ లందరి సంక్షేమం వంటివి పెద్దగా పట్టించుకోలేదు కానీ కడుపు నిండా , కడుపు నిండానే కాదు ఒక్కోసారి అజీర్తి లేసేంతగా వార్తలు వడ్డించారు . ఆయన ఉన్నప్పుడు నాలుగైదేళ్ళ వర్షాలు లేక పంటలకు కరువు వచ్చిందేమో కానీ ఆ బీట్ రిపోర్టర్ల వార్తల కరువు అనే మాటే ఎరుగరు . పత్రికల్లో సింహా భాగం టీడీపీ రిపోర్టర్లే ఆక్రమించే వారు .
బాబు ఎన్టీఆర్ భవన్ కు వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు మీడియాతో మాట్లాడేవారు . అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భవన్ తో పాటు సచివాలయానికి వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు మాట్లాడేవారు . వై యస్ ఆర్ సీఎం కాగానే మీడియా అలానే మాట్లాడేందుకు ప్రయత్నిస్తే , ఏమైనా మాట్లాడేది ఉంటే నేనే పిలుస్తాను అని వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు మాట్లాడే సంప్రదాయానికి స్వస్తి పలికారు .
2004 లో టీడీపీ ఓడిపోయాక అసెంబ్లీ లో బాబు ఛాంబర్ లో ఇలానే మాట్లాడేవారు . ఓ రోజు బాబు సభలో ఉండగా ఛాంబర్ లో ఉన్న టీడీపీ నేత అమర్ నాథ్ తో బాబు ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు మీడియాతో మాట్లాడితే ఏం బాగుంటుంది . ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే మాట్లాడాలి అని ఉచిత సలహా ఇచ్చాను . సభ తరువాత కొద్ది సేపటికి బాబుతో ఛాంబర్ లో ఏదో రాజకీయ అంశాన్ని ప్రస్తావిస్తే చాలా సేపు మాట్లాడారు . తరువాత అమర్ నాథ్ నా దగ్గరకు వచ్చి ఎక్కువగా మాట్లాడవద్దు అని మీరే సలహా ఇస్తారు . మీ సలహా గురించి నేనేమో బాబుకు చెప్పాను .. మళ్ళీ మీరే మాట్లాడేట్టు చేస్తారు ఇదేంటి అని నిష్టురంగా అడిగారు .
ఎక్కువగా మాట్లాడవద్దు అని మిత్రుడిగా సలహా ఇచ్చాను . రిపోర్టర్ గా వార్త కోసం మాట్లాడేట్టు చేశాను . ఆఫీస్ కు వెళ్లి సలహా ఇచ్చి వచ్చాను అంటే కుదరదు కదా ? వార్త రాయాలి కదా ? ఎక్కువగా మాట్లాడాలా ? వద్దా అని బాబు నిర్ణయించుకోవాలి అన్నాను . వద్దు అని సలహా ఇచ్చినా మీడియా కనిపిస్తే బాబు ఒకప్పుడు మాట్లాడకుండా ఉండలేక పోయేవారు ..
****
అలాంటి అలవాటుతోనే ఓ సారి కొంప మునిగింది . స్టార్ న్యూస్ రిపోర్టర్ పకలరించి గోద్రా గురించి అడగ్గానే మోడీని సీఎం పదవి నుంచి దించేయాలి అని డిమాండ్ చేశారు . ఐతే ఈ డిమాండ్ వెనుక బాబు కు ఓ సమాచారం ఉంది . పాలకుడు రాజధర్మం పాటించాలి ,అందరినీ సమానంగా చూడాలి అని ప్రధానిగా ఉన్న వాజపేయి గుజరాత్ పరిణామాలపై స్పందించారు . మతం , కులం , ప్రాంతం అనే ఏ వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడడమే రాజధర్మం అని వాజపేయి చెప్పారు . దీనితో మోడీకి ఉద్వాసన ఖాయం అనుకున్నారు . ఓ దశలో అది ఖరారు అయింది కూడా . మోడీని ఉంచాలా ? తొలగించాలా ? అనేది పార్టీ అంతర్గత వ్యవహారం . దీనిలో ఇతర పార్టీల జోక్యం ఏమిటీ అనే వాదన మొదలైంది . అద్వానీ మోడీకి అండగా నిలిచారు . వాజపేయి రాజధర్మం బోధించడం అప్పుడు పత్రికల్లో చదవడమే తప్ప చూడలేదు . యూ ట్యూబ్ పుణ్యమా అని అది ఇప్పుడు చూశాను . వాజపేయి రాజధర్మం గురించి చెబుతుంటే పక్కనే ఉన్న మోడీ నవ్వుతూ మధ్యలోనే జోక్యం చేసుకుంటూ రాజధర్మం పాటిస్తున్నాను అన్నారు . నన్నెవరూ తొలగించలేరు అనే ఆత్మ విశ్వాసం ఆ నవ్వులో కనిపిస్తుంది .
ఎలాగూ మోడీని తొలగిస్తున్నారు , అదేదో మన ఖాతాలో వేసుకుందాం అనుకున్న బాబు ఇరకాటంలో పడిపోయారు . హైదరాబాద్ లో మోడీని అడుగు పెట్టనివ్వం , అరెస్ట్ చేస్తాం అని ప్రకటించారు . మోడీనే కొనసాగుతారు అని తేలాక ఈనాడులో పెద్ద వార్త రాయించారు . ప్రస్తుతానికి మోడీని కొనసాగించినా , అంతా సద్దుమణిగాక మోడీని తొలగిస్తామని బీజేపీ అధిష్టానం బాబుకు హామీ ఇచ్చింది అని ఈనాడులో పెద్ద వార్త . ఆ తరువాత బాబు కొద్ది రోజులు మీడియాకు దూరంగా ఉన్నారు . ఎన్టీఆర్ భవన్ లో కొద్ది రోజులు మీడియాను తన వద్దకు రానివ్వలేదు . తరువాత షరా మాములే . గుజరాత్ లో తాత్కాలిక సర్దుబాటుగా సీఎం అయిన మోడీ గోద్రా అల్లర్లతో సీఎంగా స్థిరపడడమే కాకుండా , ప్రధానమంత్రి వరకు వచ్చారు . రెండు దశాబ్దాలు గడిచినా గోద్రా అల్లర్లతో మోడీ రాజీనామా చేయాలనే బాబు డిమాండ్ ఇప్పటికీ బాబును వెంటాడుతూనే ఉంది . 2014లో అదే మోడీని బాబు మహాత్మగాంధీ తో పోల్చి అభిమానం సంపాదించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు . మళ్ళీ విడిపోయి ఇప్పుడు మళ్ళీ మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికి గత నాలుగేళ్ళ నుంచి బాబు చేయని ప్రయత్నం లేదు . చివరకు తెలంగాణ నుంచి నరుక్కు రావడానికి ప్రయత్నిస్తున్నారు .
******
1998 లో సొంతంగా ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి 4 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి . వాజపేయి ఇమేజ్ గ్రహించిన బాబు 99 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ముందుకు వచ్చారు . బీజేపీకి అప్పుడు రాష్ట్రంలో పార్టీ ఎటుపోతేనేం కేంద్రంలో అధికారం కావాలి . అప్పుడు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు . దాదాపు 18 జిల్లాల బీజేపీ కమిటీలు టీడీపీతో పొత్తు వద్దు అని తీర్మానాలు చేశాయి . కొందరు తరువాత రాజీనామా చేశారు . నేను ఆంధ్రభూమిలో టీడీపీ వార్తలు రాస్తే అప్పుడు బీజేపీ వార్తలు ఈశ్వర్ రెడ్డి అనే జర్నలిస్ట్ రాసేవాడు . పొత్తు ఉంటుంది అని నేను రాస్తుంటే అతను పొత్తు ఉండదు , నేను కిషన్ రెడ్డితో ఇప్పుడే మాట్లాడాను అని చెబుతుంటే ... కిషన్ రెడ్డి ఎవరు ? పొత్తు గురించి ఆయనకేం సంబంధం అని తేలిగ్గా తీసుకున్నాను . అదేంటి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఆయనకేం సంబంధం అంటావేమిటి అని అంటే , కావచ్చు పొత్తు ఉండాలా ? వద్దా ? అనేది బాబు నిర్ణయిస్తారు , ఉండదు అని చెప్పడానికి రాష్ట్ర బీజేపీ ఎవరు అని ధీమాగా చెప్పాను . అప్పుడు బాబు పలుకుబడి అలాంటిది . నేను చెప్పినట్టే అప్పుడు బీజేపీతో పొత్తు ఉంది . 18 జిల్లాల తీర్మానాలు , రాష్ట్ర అధ్యక్షుని మాటలు పట్టించుకోలేదు . సీట్లే కాకుండా బాబు బీజేపీకి అప్పుడు కొందరు అభ్యర్థులను కూడా ఇవ్వాల్సి వచ్చింది . మీ వాళ్ళు అభ్యర్థులు బలమైన వాళ్ళు కాదు బలమైన అభ్యర్థులను నేనే ఇస్తాను అంటే మహా ప్రభు అని తీసుకున్నారు .
****
బీజేపీతో తెలంగాణలో పొత్తు ఉండదు అంటే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన చూశాక అవన్నీ గుర్తుకు వచ్చాయి . బండి మాటకు పార్టీలో ఎంత విలువ ఉంటుందో తెరాస శాసన సభ్యులను కొనడానికి వచ్చిన బ్రోకర్లు స్పష్టంగా చెప్పారు . బండి తో పాటు లోకల్ లీడర్లది ఏమీ ఉండదు అధిష్టానం చూసుకుంటుంది అని ...
అంటే ఇప్పుడు కూడా బాబు పొత్తును ఖరారు చేస్తారా ?
బాబుకు ఇప్పుడు అంత సీన్ లేదు ... మోడీ ఆత్మ అమిత్ షా ఖరారు చేస్తారు . ప్రధాన మంత్రులను నిర్ణయించాను .. వరుసగా ఇంటర్వ్యూలు చేసి ప్రధానిని ఖరారు చేసి చక్రం తిప్పాను అని చెప్పుకొన్న బాబుకు నాలుగేళ్లయినా మోడీ అపాయింట్ మెంట్ దక్కక పోవడం , అమిత్ షా , నడ్డా ల దర్శనమే మహద్భాగ్యం అనుకుంటున్నారు అంటే మరీనా పరిస్థితి తెలియడం లేదా ?
గాలికి పోతున్న పిండిని కృష్ణార్పణం అన్నట్టు అసలు ఉనికి లేని తెలంగాణ లో టీడీపీని బీజేపీ కోసం త్యాగం చేసి ,ఆంధ్రాలో బీజేపీ మనసు దోచేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు . ఏమవుతుందో చూడాలి బాబు లోకల్ వ్యాపారి అయితే మోడీ గుజరాతీ వ్యాపారి . ఏక్ సే బడ్ కర్ ఏక్ .. సబ్ సే బడ్ కర్ గుజరాతి ....
- బుద్దా మురళి
5, జూన్ 2023, సోమవారం
సాక్షిలో ఉద్యోగం చేయవద్దన్న బాబు ... గాంధీ భవన్ నుంచి పత్రిక వచ్చినా బాబు కోసమే పని చేస్తుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకం- 42
సాక్షిలో ఉద్యోగం చేయవద్దన్న బాబు
గాంధీ భవన్ నుంచి పత్రిక వచ్చినా బాబు కోసమే పని చేస్తుంది ..
జర్నలిస్ట్ జ్ఞాపకం- 42
_______________________________
^^ ఒక వేళ గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఒక పత్రిక నడిపారు అనుకో , దాన్ని కూడా మేనేజ్ చేసే శక్తి మీకుంది . మిగిలిన కాలం అంతా కాంగ్రెస్ గురించి రాసుకోండి , కానీ ఎన్నికల సమయం లో టీడీపీకి అనుకూలంగా రాయండి అని చెప్పి వారిని ఒప్పించేంత శక్తి బాబుకు ఉంది ^^ అని నేను చెప్పగానే ఎన్టీఆర్ భవన్ లో అప్పటి పొలిట్ బ్యూరో సభ్యులు సి రామచంద్రయ్య నవ్వు ఆపుకోలేక పోయారు . నేను నీకేదో చెప్పాలి అనుకుంటే నువ్వే నాకు బ్రెయిన్ వాష్ చేసేట్టుగా ఉన్నావు . బాబు అంత సమర్థుడే అని ఆయన ఒప్పుకున్నారు .
******
అది 2004 ఎన్నికల సమయం సర్వేలో టీడీపీకి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని NDTV చెప్పింది . అప్పుడు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలపై సర్వే ఫలితాలు చెప్పలేదు . పార్లమెంట్ కే పరిమితం అయ్యారు. 42 స్థానాలు ఉంటే అందులో కేవలం ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పడం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోతారు అని చెప్పడమే . ఈ సర్వే ఫలితాలతో టీడీపీ గంగవెర్రులెత్తింది . ప్రతి రోజు ndtv పై ధ్వజ మెత్తుతూ విలేకరుల సమావేశాలు ఎన్టీఆర్ భవన్ లో జరిగేవి .
అప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న యస్. జైపాల్ రెడ్డి దగ్గరి బంధువు ( షడ్డకుడు కావచ్చు ) NDTV లో డైరెక్టెర్ . దీనితో టీడీపీ వాళ్ళు కథలు అల్లారు . జైపాల్ రెడ్డి ద్వారా ndtv ని మేనేజ్ చేసి సర్వే పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ వాదన . ప్రతి రోజు కొంతమంది నాయకులు ఈ విషయం పై ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు . సి రామచంద్రయ్య సీఏ , సీనియర్ నాయకులు . మీడియా గురించి అవగాహన ఉంది . తెలుగుదేశం పార్టీ తరపున నడిపించే పత్రికకు ఆయనే సంపాదక బాధ్యతలు . ఆ తరువాత ఉదయం దినపత్రిక నడిపే ప్రయత్నం చేశారు . సి రామచంద్రయ్య సంపాదకులుగా ఉదయం నడిపేందుకు సన్నాహాలు చేశారు . అజామాబాద్ లోని ఉదయం కార్యాలయానికి కొన్ని నెలల పాటు అయన రోజూ వచ్చే వారు . కొంతమంది సిబ్బంది నియామకం కూడా జరిగింది .
జైపాల్ రెడ్డి బంధువు ఆ ఛానల్ లో బంధువుగా ఉండడం , మేనేజ్ చేశారు అంటూ యేవో చెప్పుకొచ్చారు . తరువాత ఎన్టీఆర్ భవన్ లో పిచ్చాపాటి మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తూ తానూ చెప్పింది నిజమే అన్నట్టుగా వివరణ ఇచ్చారు . అంత పెద్ద ఛానల్ బంధువు కోసం క్రెడిబులిటీ పోగొట్టు కోదు .. ఒక వేళ అలా మేనేజ్ చేసే అవకాశం ఉంటే మీ పార్టీకి సాధ్యం అవుతుంది కానీ ఎవరికి వారే అన్నట్టుగా ఉండే కాంగ్రెస్ వల్ల కాదు అని , గాంధీ భవన్ నుంచి పత్రిక నుంచి పత్రిక వచ్చినా దాన్ని మేనేజ్ చేసే శక్తి బాబుకు ఉందని చెప్పాను ...
*****
దేవతా వస్త్రాలు ధరించాం , మేం ఎవరికీ కనిపించడం లేదు అని మీడియా మురిసిపోతుంది కానీ .. మీడియాకు పార్టీలకు విడదీయ రాని అనుబంధం . 82లో టీడీపీ పుట్టినప్పుడు ఆ పార్టీ మ్యానిఫెస్టో ముద్రించింది ఈనాడు లో .... ఆ మ్యానిఫెస్టో మైసూరారెడ్డి వద్ద చూశాను . అయన అలా భద్రపర్చుకున్నారు .. పార్టీలకు పత్రికల మద్దతు కామన్ కానీ ఏకంగా మ్యానిఫెస్టో అలా పత్రికలో ముద్రించడం , తమ పత్రికలో ముద్రించామని స్పష్టంగా పేర్కొనడం అదే మొదటి సారి , చివరి సారి .
****
ఒక మీడియా ఒక పార్టీకి కట్టుబడి ఉండాలి అనేమీ లేదు . ఓనర్ పార్టీ మారినప్పుడల్లా మీడియా మారుతుంది .ఓనర్ పార్టీనే మీడియా పార్టీ . వి 6 తెలంగాణ ఉద్యమ కాలం లో తక్కువ పెట్టుబడితో వచ్చి విజయం సాధించింది . తెలంగాణ ఉద్యమానికి కట్టుబడి ఉండేది . ఉద్యమం వల్ల ఛానల్ , ఛానల్ వల్ల ఉద్యమం పరస్పరం ప్రయోజనం పొందాయి . ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ , బీజేపీ , ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాదన చాలా బలంగా వినిపిస్తుంది .
ఇక టివి 9 ను 2004 ఎన్నికల తరువాత టీడీపీ బహిష్కరించింది . మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 127 మున్సిపాలిటీల్లో టీడీపీకి 27 వస్తాయి అని టివి 9 సర్వే . దాంతో టీడీపీ ఛానల్ ను బహిష్కరించింది . రవి ప్రకాష్ , కరీం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి బాబుతో రాయబారాలు నడిపారు . టివి 9 ను కొత్త మేనేజ్ మెంట్ కొనగానే తెరాస స్వరం వినిపిస్తుంది అనుకున్నారు . మేనేజ్మెంట్ బీజేపీకి దగ్గర కావడం తో ఇప్పుడు బీజేపీ స్వరం వినిపిస్తోంది . జగన్ పై ఈగ వాళ్లొద్దు అని ఆదేశాలట ...
****
సాక్షి ఆవిర్భావ సమయం అసెంబ్లీ లాబీ లో అప్పుడు కాంగ్రెస్ శాసన సభ్యునిగా ఉన్న దగ్గుబాటి కనిపిస్తే పార్టీకి మద్దతు వేరు ఏకంగా పార్టీ నే పత్రిక పెట్టడం ఏమిటీ అని కొమ్మినేని శ్రీనివాస్ అడిగారు . ఒకే పార్టీకి మీడియా ఉండడం కన్నా ఇలా అన్ని పార్టీలము మీడియా ఉండడం బెటర్ అని నా అభిప్రాయం చెప్పాను .
సాక్షి టీడీపీకి చిరాకు పెట్టడం మొదలైంది .టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది . అసెంబ్లీ లాబీ లోని తన ఛాంబర్ లో బాబు ఓ రోజు మీడియాతో అక్రమ సంపాదన ,అవినీతి సంపాదనతో పెట్టిన సాక్షిలో ఎలా పని చేస్తారు అని మీడియాను నిలదీశాడు . పలానా పత్రిక చదువ వద్దు , పలానా పార్టీ పత్రిక అని విమర్శించడం విన్నాం కానీ ఏకంగా అందులో ఉద్యోగం చేయవద్దు అని నాయకులు అనడం మొదటి సారి . బాబు వాక్ ప్రవాహం అలా సాగుతూనే ఉంది . సాక్షి అక్రమ సంపాదన తో పెడితే , మరి జ్యోతి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు దాచుకొని పొదుపు చేసి పెట్టిందా ? అని అడిగితే బాబు సమాధానం చెప్పలేదు . సాక్షి చదవ వద్దు, అందులో పని చేయవద్దు సరే మరి ఏ పత్రిక చదవాలి , ఎక్కడ పని చేయాలి అది కూడా చెప్పండి అంటే సమాధానం లేదు . అక్కడే ఉన్న రేవంత్ రెడ్డి బయటకు వస్తూ భుజం తట్టి నిజమే కదా ? ఇప్పటి దాకా ఆ ఆలోచన రాలేదు ఆంధ్రజ్యోతి ఎలా పెట్టారు ? అదేమన్నా సక్రమ సంపాదనా ? అనే ఆలోచనే రాలేదు అన్నారు .
జగన్ అరెస్ట్ అయినప్పుడు సాక్షి మూత పడుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం . సాక్షి మానేయండి ఆంధ్రజ్యోతి వేసుకోండి అని పేపర్ బాయ్స్ ఇంటింటికి వెళ్లి ప్రచారం .ఉద్యోగుల్లో ఆందోళన సహజం . అప్పుడు అజిత , సారధి సాక్షిలో ఉండేవారు . ఏమవుతుంది అని అడిగితే , అస్సలు భయపడకండి ఏమీ కాదు . అవసరం అయితే ప్రపంచంలో ఉన్న రెడ్లు అంతా అండగా నిలుస్తారు . పత్రికను బతికిస్తారు అని చెప్పాను .
ఏ మీడియా పార్టీ రహితంగా లేదు . అలా అని స్వచ్చందంగా పార్టీలకు మద్దతు ఇవ్వడం లేదు . ఎవరి లెక్కలు వారికి ఉంటాయి .
మరి నీ లెక్కలు అని అడుగుతున్నారా ?
ఆంధ్రభూమిలో స్వేచ్ఛ అనుభవించాను . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం చమటలు దారపోస్తుంటే , మేనేజ్ మెంట్ సమైక్యాంధ్ర అని చెప్పి వదిలేసింది అస్సలు జోక్యం చేసుకోలేదు . అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ కోసం రాసే స్వేచ్ఛ అనుభవించాను. కొద్దిపాటి జీతం పెరుగుతుంది అని స్వేచ్ఛను ఎలా వదులు కుంటాను .
**** సరే NDTV సర్వే ఏమైంది ?అని సందేహమా ? నిజం కాలేదు . ఔను నిజం కాలేదు . టీడీపీకి ఆరు పార్లమెంట్ సీట్లు వస్తాయని NDTV చెప్పింది . కానీ ఆరు రాలేదు . ఐదే వచ్చాయి . సర్వే పై బాబు మొదలుకొని పార్టీ నాయకులు అందరూ ధ్వజమెత్తినా , మేం చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి అని NDTV ఒక్క సారి కూడా చెప్పకుండా హుందాగా ఉంది .
4, జూన్ 2023, ఆదివారం
ఆంధ్ర , తెలంగాణ కు మీడియా చేసిన ద్రోహం బాబునూ వదల లేదు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -41
ఆంధ్ర , తెలంగాణ కు మీడియా చేసిన ద్రోహం
బాబునూ వదల లేదు ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -41
ఉమ్మడి రాష్ట్రం లో అధికారంలో ఉన్నప్పుడు మీడియా డార్లింగ్ అని చంద్రబాబు కు ముద్దు పేరు . అలాంటి బాబు సైతం ఒక దశలో మీడియాకు వణికిపోయారు . తెలంగాణ ఉద్యమ చివరి దశ .. తెలంగాణ సాకారం అవుతున్న సమయం . తెలంగాణ ఏర్పాటు ఖాయం అని తెలంగాణ నాయకులకే కాదు ఆంధ్ర నాయకులకు అందరికీ తెలిసిన సమయం . కనీసం ఆ చివరి దశలోనైనా విభజన సరే, ఆంధ్రకు ఏమిస్తారు అని కొద్ది మంది నాయకులు ప్రశ్నిస్తే వారి మీద మీడియా పడిపోయిన సందర్భం అది . తమ మీడియా ద్వారా తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటాం అని మీడియా పిచ్చి కలలు కన్న సమయం అది . ఆ దశలో ఒకరిద్దరు ధైర్యం చేసి ఆంధ్రకు ఏమిస్తారు అని ప్రశ్నిస్తే , మీడియా వారిపై దాడి చేసి నోళ్లు మూయించింది . మీడియాకు బాబు సైతం బయపడి మాట మార్చారు .
విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతానికి మీడియా చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు . ఆంధ్ర ప్రాంతానికి ద్రోహం చేశారు , తెలంగాణ వారు ఆత్మ హత్య చేసుకోవడానికి కారణం అయ్యారు .
*****
తెలుగు నాట స్వతంత్ర పోరాటం లో కీలక పాత్ర వహించింది తెలుగు మీడియా . హేమా హేమీలైన స్వాతంత్య్ర సమర యోధులు ఎంతో మంది అప్పుడు పత్రికలు నడిపారు . చివరకు ఆంధ్ర రాష్ట్రం , హైదరాబాద్ స్టేట్ విలీన సమయంలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది అప్పటి మీడియా పెద్దాయన కాశీనాధుని నాగేశ్వర రావు ఇంట్లో . అలాంటి మీడియా తెలంగాణ ఉద్యమ సమయంలో అనాలోచిత చర్యలతో తెలంగాణను అడ్డుకుందాం అనుకోని ఆంధ్రకు తీరని అన్యాయం చేసింది ...
******
ఎప్పుడూ చర్చలోకి రాలేదు , ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ .. విభజన జరిగితే ఆంధ్ర కు కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు కావాలి అని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు కోరారు . అంతే మీడియా ఒక్క సారిగా ఆయన మీద పడిపోయింది . ఐదు లక్షల కోట్లు కావాలి అని అడుగుతున్నారు అంటే మీరు విభజనకు ఒప్పుకుంటున్నట్టే కదా ? అని దాడి మొదలు పెట్టారు . కంగారు పడ్డ బాబు నా ఉద్దేశం అది కాదు .. కొత్త రాజధాని కట్టడానికి ఐదు లక్షల కోట్లు అవుతాయి అని చెబుతున్నాను . విభజన కోరడం లేదు అని మరుసటి రోజు మాట మార్చేశారు .
అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ , ఒక జర్నలిస్ట్ సమక్షంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 లో మనం తెలంగాణ ఆపగలిగాం . ( కేవలం నాలుగైదు సీట్ల మెజారిటీ మాత్రమే ) 2014 నాటికి అధిష్టాన వర్గం నిర్ణయాన్ని వ్యతిరేకించేంత బలం ఉండదు . ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, ఇతర అంశాలు మీ ప్రాంతానికి ఏం కావాలో వాటిపై దృష్టి పెట్టండి అని సూచించారు . ఆ మీటింగ్ లో వైయస్ ఇంకో మాట కూడా అన్నారు . తెలంగాణ వారికి మీరు బంగారం తో ఇల్లు కట్టించి ఇచ్చినా మళ్ళీ తెలంగాణ కావాలనే అంటాడు అని చెప్పుకొచ్చారు . కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక తరువాత వైస్సార్ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు . బొత్స తోనే కాకుండా ఇతర మంత్రులతో కూడా ఇలా చెప్పి ఉండవచ్చు .కానీ బొత్సతో చెప్పినప్పుడు అక్కడున్న జర్నలిస్ట్ చెప్పిన సమాచారం ఇది .
దీనితో కొందరు మంత్రులు ఈ అంశం పై దృష్టి పెట్టారు . బొత్స బహిరంగంగానే ఆంధ్రకు ఏం కావాలో అడగాలి అని చెబితే మీడియాకు టార్గెట్ అయ్యారు . కెసిఆర్ తో కుమ్మక్కు అయి బొత్స విభజన కుట్ర చేస్తున్నారు అని మీడియాలో వార్తలు
****
చివరి దశలో అసెంబ్లీ సమావేశం . అప్పటి వరకు మిత్రులుగా ఉన్న ఆంద్ర తెలంగాణ శాసన సభ్యులు జోక్ వేసినా సీరియస్ గా తీసుకుంటున్న సమయం . అలాంటి పరిస్థితి అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు . అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి రాయలసీమకు చెందిన ఓ శాసన సభ్యునితో బాచుపల్లి వద్ద చెక్ పోస్ట్ పెడతాం అని జోక్ చేస్తే అతను సీరియస్ అయి చూద్దాం అంటూ ఏదో అన్నారు . పరిస్థితి అర్థం చేసుకొని శాసన సభ్యులు , మీడియా సైతం తమ తమ పరిధిలో ఉండి పోయారు . టీడీపీ శాసన మండలి సభ్యులు యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ నేనూ ఏదో మాట్లాడుకుంటూ లాబీ లో వీళుతుంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సీరియస్ గా వచ్చి , మీరు రాజీనామా చేస్తున్నారా ? లేదా ? రాజీనామా చేయనివారిపై దాడులే అని లాక్కెళ్లారు .
అదే రోజు లాబీ లో కావూరి సాంబశివరావు కూడా ఉన్నారు . విభజన అనివార్యం , ఆంధ్రకు ఏం కావాలో ఇవ్వండి అని చెబుదాం అంటే మీరు విభజనకు అనుకూలమా ? అని మీడియా మా పై దాడి చేస్తుంది . ఆంధ్రకు మీరెంత ద్రోహం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు అని ఆయన వాపోయారు . అదే రోజు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా అసెంబ్లీ కి వచ్చారు . ఏమవుతుంది అని మీడియా అడిగితే సుదీర్ఘంగా వివరించారు . సంక్షిప్తంగా అయన చెప్పిన దానిలో తెలంగాణ అనివార్యం అని ఆయన చెప్పినట్టు నాకు అర్ధమైంది .
****
ఇటీవల టివి 9 ఛానల్ ఇంటర్వ్యూ లో లగడపాటి రాజ్ గోపాల్ మేం కాంగ్రెస్ కు ద్రోహం చేశామని పశ్చాత్తాపం ప్రకటించారు . ఒక్క కాంగ్రెస్ కే కాదు లగడపాటి మొత్తం ఆంధ్రకు అన్యాయం చేశారు . ఆ సమయం లో అసెంబ్లీ కమిటీ హాలులో మీటింగ్ కు కాంగ్రెస్ నాయకులనే కాదు టీడీపీ శాసన సభ్యులను కూడా ఉద్దేశించి లగడపాటి సందేశం ఇచ్చే వారు . మీడియా లగడపాటిని ఆకాశానికి ఎత్తడం తో తెలంగాణను ఆపడానికి వచ్చిన సూపర్ మాన్ అన్నట్టు చూసే వారు . ఆంధ్ర భగత్ సింగ్ అంటూ మీడియా లగడపాటిని ఆకాశానికి ఎత్తింది . లగడపాటి , ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు ప్రాక్టికల్ గా ఆలోచించి ఉంటే ఆంధ్రకు ఏం కావాలో అడిగి సాధించుకునే వారు . వాళ్ళ రాజకీయ జీవితం ముగిసేది కాదు ఆంధ్రకు అన్యాయం జరిగేది కాదు .
ఆ సమయం లో ntv ఒక్కొక్కరిని వెంటాడింది . పనబాక లక్షి పై చేసిన ప్రత్యేక స్టోరీ గుర్తుంది పోయింది . ఎందుకు రాజీనామా చేయడం లేదు అని తిట్ల దండకం మొదలు పెట్టారు .
బాబు ఐదు లక్షలు కావాలి అంటే ధ్వజమెత్తిన ఆంధ్ర మీడియా , విభజన తరువాత ఐదు లక్షల కోట్ల మాట దేవుడెరుగు మోడీ వచ్చి చెంబె డు, నీళ్లు తట్టెడు మట్టి ఇచ్చినా ఆంధ్ర మీడియా అదే మహద్భాగ్యం అనుకుంది . లగడపాటి లాంటి వ్యాపార నాయకుడు పశ్చాత్తాపం ప్రకటించారు కానీ ఆంద్ర మీడియా మాత్రం తాము ఆంధ్రకు చేసిన ద్రోహం పై పశ్చాత్తాపం ప్రకటించలేదు . సమీక్ష చేసుకోలేదు .
****
ఓట్ల లెక్కింపు ప్రారంభ అయి ఫలితాలు వస్తున్న సమయం లో కూడా తమకు నచ్చిన పార్టీని గెలిపించే ప్రయత్నాలు వదులుకొని మీడియా ఆంధ్రజ్యోతి. తెలంగాణ ఏర్పాటు సమయం లోనూ అదే వైఖరి . పార్లమెంట్ లో బిల్లు ఆమోదం ప్రక్రియ అయిపొయింది . రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి . వేసవి విడిదిగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బొల్లారం రాష్ట్రపతి భవన్ లో విడిది చేశారు . ఎవరైనా వెళ్లి వినతి పత్రాలు ఇవ్వవచ్చు . అంతా అయిపోయాక విభజన విషయంలోనూ కొందరు వినతి పత్రాలు ఇచ్చారు . రాష్ట్రపతి మాట్లాడేదేమి ఉండదు . కానీ వినతి పత్రాలు తీసుకుంటారు . చాలా పనులు ఉన్నాయి విభజన బిల్లుపై ఇప్పుడు సంతకం చేయను అని రాష్ట్రపతి చెప్పినట్ట్టు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త . అంత పెద్ద వార్త రాసినా , ఎందుకో కానీ అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు .
అసెంబ్లీ తీర్మానం కన్నా ముందు ఓ రోజు ఆఫీస్ వెళితే డీసీ ఆఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు . లోపలి వెళ్లి సి హెచ్ వి ఎం కృష్ణారావు ను ఏం జరిగింది ? అంతమంది పోలీసులు ఉన్నారు అని అడిగితే , డీసీ లో తెలంగాణకు వ్యతిరేకంగా కెసిఆర్ పై ఏదో రాశారు , తెరాస వాళ్ళు దాడి చేస్తారేమో అని ముందు జాగ్రత్త అని చెప్పారు . నేను నవ్వి గుడ్డి కన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అన్నట్టు తెలంగాణ రాకుండా అడ్డుకోవడంలో మీడియా పాత్ర అయిపొయింది . ఇన్విటేషన్ ఇచ్చి దాడి చేయండి ప్లీజ్ అని పిలిచినా కెసిఆర్ దాడి చేయరు . జలదృశ్యం నుంచి తెరాస కార్యాలయాన్ని బాబు ప్రభుత్వం రోడ్డు మీద పడేసినా ఏమీ అనలేదు . తెలంగాణ సాధించే వ్యూహం కెసిఆర్ కు తెలుసు అన్నాను . తెలంగాణ ఉద్యమాన్ని వార్తలు గానే చూసినంత వరకు మీడియా ప్రాధాన్యత ఇచ్చింది . వార్తల స్థాయి దాటి వాస్తవం అవుతున్న స్థితిలో తెలంగాణను ఆపడానికి విశ్వ రూపం చూపింది . తమ అనాలోచితం తో తమ ప్రాంతానికి అన్యాయం చేసింది .
2, జూన్ 2023, శుక్రవారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -40
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను
కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -40
-----------------------------------------------------------------------
అంతా అయ్యాక ఇప్పుడు ఇప్పుడు ఏ టుంరీలు ఏమైనా మాట్లాడవచ్చు . కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఈజీగా ఏమీ రాలేదు . ప్రతి క్షణం సస్పెన్స్ .. నరాలు తెగేంత ఉత్కంఠత ... ఏమవుతుందో తెలియని భయం .. మరో వైపు మాఫియా మీడియా ...
సాధారణంగా బ్రేకింగ్ న్యూస్ లు మనకు తెలిసినవే .. బ్రేకింగ్ న్యూస్ కాకుండా అతికించే న్యూస్ ఒకే ఒక్కటి .. అది ఎంతో మంది ప్రాణాలు తీసింది .. భయపెట్టింది .
ఒక్క మాట ఔను ఒకే ఒక్క మాట పోయే ప్రాణాలను నిలబెట్టింది ... మాటకు ఎంత శక్తి ఉంటుందో నిరూపించిన మాట అది . మీడియా ప్రచారం వల్ల సర్వత్రా నిరాశ ఆవహించిన సమయం అది ఆత్మ హత్యలు మళ్ళీ మొదలైన సమయం ఆ సమయంలో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ వస్తుంది అని తాను చెప్పదలుచుకున్నది చెప్పి ... ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను , తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను అని పిడికిలి బిగించి ఆత్మవిశ్వసం తో పలికారు . ఆ విలేఖరుల సమావేశం లో నేనూ సి డబ్ల్యూ సి నిర్ణయం అయిపోయిన తరువాత నాకు ఎప్పుడూ తెలంగాణ రాదేమో అనే అనుమానం కలుగలేదు . కానీ మీడియా ప్రచారంతో భయాలు పెంచారు . మీడియా సమావేశం ముగించి కిందకు వచ్చాక కెసిఆర్ గారికి అదే చెప్పాను .. ఆత్మ విశ్వసం తో మీరు చేసిన ప్రకటన బాగుంది . టివిల వల్ల భయం పెరిగింది . మీ ప్రకటనతో తెలంగాణ కోరుకుంటున్న వారిలో ఆత్మ విశ్వసం పెరుగుతుంది అని ....
******
16 డిసెంబర్ 2013న రాష్ట్ర విభజన కు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లును అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు . అంతకు ముందే సి డబ్ల్యూ , సి నిర్ణయం అయిపొయింది . కేంద్ర మంత్రులం మండలి ఆమోదం అయిపొయింది . డ్రాఫ్ట్ బిల్లు రాష్ట్రపతికి పంపడం అయిపొయింది . సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి పంపించారు . అభిప్రాయం కోసమే తప్ప అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు . ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండడం తెలంగాణలో తక్కువ సంఖ్య కావడం వల్ల బిల్లు వీగిపోతుంది అని ముందే తెలుసు . ఐతే అసెంబ్లీలో బిల్లు వీగిపోగానే తెలుగు మీడియా హడావుడి అంతా ఇంత కాదు . బ్రేకింగ్ న్యూస్ ల స్థానంలో టివిలు పగిలిపోయేంత శబ్దం తో ఆంధ్ర తెలంగాణ రెండింటిని జాతక బెడుతున్నట్టు చూపిస్తూ హడావుడి చేశారు .
ఆ రోజు అసెంబ్లీ ముగియగానే లాబీ నుంచి బయటకు వస్తే మెట్ల వద్ద న్యాయ నిపుణులు జంధ్యాల రవి శంకర్ జర్నలిస్ట్ లతో ఇప్పుడేమవుతుంది అని చెబుతున్నారు . అసెంబ్లీ తీర్మానమే అత్యున్నతం అన్నట్టుగా సాగుతుంది ఆయన వాదన . ఎక్కువ మంది జర్నలిస్ట్ లు అదే కోరుకుంటున్నందున ఆసక్తిగా వింటున్నారు . కొంత సేపు విని నేను అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలను అతక బెట్టేస్తారా ? అని కొంత వెటకారంగా అడిగాను . అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే అడిగారు , ఆ అభిప్రాయం అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు అని కేంద్రం చెబుతున్నప్పటికీ మీడియా ప్రచారం వల్ల మరికొన్ని ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి . ఆ సమయంలోనే కెసిఆర్ సాయంత్రం తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను . తెలంగాణ లోనే తిరిగి వస్తాను అని అటు నుంచే ఢిల్లీ వెళ్లి .. నిజంగా తెలంగాణ సాధించిన తరువాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టారు . తిరిగి వచ్చాక ఆ రోజు ఒక్క NDTV తోనే మాట్లాడారు . మాకు కాంగ్రెస్ తోనే పోటీ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరం అయితే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని కెసిఆర్ చెప్పారు . ప్రధాన ప్రత్యర్థికే మద్దతు ఇవ్వడానికి సిద్దపడడాన్ని NDTV ఆశ్చర్యంగా చూసింది .
*****
మల్లిక్ కార్టూన్ ఒకటి .. కెసిఆర్ పక్కన ఉంటే ఒక వ్యక్తి పది హేను రోజుల్లో తెలంగాణ వస్తుందట అని కిందపడి దొర్లుతూ నవ్వుతుంటాడు . మల్లిక్ కార్టూనిస్ట్ కాబట్టి తన మనసులోని అభిప్రాయాన్ని కార్టూన్ రూపం లో ప్రదర్శించారు . తెలంగాణ వస్తుంది అని కెసిఆర్ చెప్పినప్పుడు చాలా మంది నాయకులు ఇలానే ఎకసెక్కాలు ఆడేవారు . ఢిల్లీ నుంచి నాకు సిగ్నల్స్ ఉన్నాయి , తెలంగాణ ఏర్పడుతుంది అని కెసిఆర్ చెబితే చాలా మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్ లో టవర్లు ఏమైనా ఏర్పాటు చేశారా అని జోకులేశారు . సి డబ్ల్యూ సి తొలి సమావేశం లోనే నిర్ణయం తీసుకోలేదు . అనేక సార్లు సమావేశాలు జరిగాయి . సమావేశం లో ఏ నిర్ణయం తీసుకోక పోతే తుస్సు మన్న సి డబ్ల్యూ సి సమావేశం అని కొమ్మినేని కామెంట్ గుర్తుంది . తీరా సి డబ్ల్యూ సి లో తెలంగాణ ఏర్పాటు కు నిర్ణయం తీసుకుంటే , ఎవరినీ సంప్రదించకుండా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు అని ధ్వజమెత్తారు .
****
కెసిఆర్ తో మాట్లాడితే తెలంగాణ వస్తుంది అని నమ్మకం కలుగుతుంది . బయటకు వెళ్లి ఎవరితో మాట్లాడినా తెలంగాణ రాదు అనిపిస్తోంది అని జర్నలిస్ట్ మిత్రుడు అనే వాడు . బాగ్ లింగం పల్లి వద్ద 69 ఉద్యమ కారుల సమావేశం జరిగింది . గద్దర్ పాల్గొన్నారు . తెలంగాణ వస్తుందా ? అని అడిగితే ఆంధ్ర నాయకుల లాబీ సామాన్య మైనది కాదు . రానివ్వరు అని చెప్పారు . యుద్ధ నౌకలు , అప్పుడు ఉద్యమం లో కీలక స్థానాల్లో ఉన్న నాయకులను సకల జనుల సమ్మె అప్పుడు అడిగితే రాదు అన్నట్టుగానే మాట్లాడేవారు . ఒక్క కెసిఆర్ మాత్రం ఉద్యమ సన్నాహక సమావేశాలు నుంచి చివరి వరకు తెలంగాణ వస్తుంది .. ఎలా వస్తుందో చెప్పేవారు .
1, జూన్ 2023, గురువారం
దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే ..... విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 39
దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే .....
విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్
జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 39
------------------
షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలిపేయమని ఒకరు పిలుపు ఇస్తే , ఆంధ్ర కాంగ్రెస్ లో చేరమని మరొకరి పిలుపు . ప్రతి రోజు ఆంధ్ర జ్యోతి మొదటి పేజీని అలంకరించి , సీఎంలను మించి ఆ మీడియాలో ప్రాధాన్యత పొందిన షర్మిల కు ఎన్ని సీట్లు అనే చర్చ నుంచి అసలు ఆమె పోటీ చేస్తుందా ? ఏ పార్టీలో కలిసి పోతుంది అనే చర్చ సాగుతోంది . పార్టీలో చేరిపోవాలి అని కాంగ్రెస్ పిలుపు ఇస్తే నాకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయి అని ఆమె చెబుతోంది . సీఎంను అవుతాను అని abn ఛానల్ లో చెప్పిన ఆమె అసలు పోటీ చేస్తుందా ? అనుమానమే . .. ఎందుకిలా అని ఆలోచిస్తే పాపం ఆంధ్ర జ్యోతి దీవెనలతో వెలుగు చూసిన అన్ని పార్టీల పరిస్థితి ఇదే అని చరిత్ర కళ్ల ముందు కనిపించింది .
*****
పలానా పెద్దాయన దీవిస్తే మంచి జరుగుతుంది . ఆమె దీవెనలు ఉంటే అనుకున్నది అవుతుంది ... ఆ డాక్టర్ష హస్తవాసి మంచిది . పోవడానికి సిద్ధం అయిన వారు కూడా లేచి కూర్చుంటారు - అంటుంటారు . ఇవి నమ్మకాలు . వీటికి శాస్త్రీయత ఏమీ ఉండదు . ఐనా నమ్ముతుంటారు . . విచిత్రంగా మీడియాకు సంబంధించి కూడా ఇలాంటి నమ్మకం ఒకటి ఉంది . పాపం రాధాకృష్ణ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన దీవెనలు అందుకున్న పార్టీలు అన్నీ మటాష్ అయ్యాయి . ఈ నమ్మకానికి శాస్త్రీయత లేకపోవచ్చు , కానీ అలా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. విజయశాంతి పార్టీ తల్లి తెలంగాణ నుంచి షర్మిల తెలంగాణ వై యస్ ఆర్ కాంగ్రెస్ వరకు అన్ని పార్టీలను వారి మీడియా భుజాన మోసి దీవెనలు అందించింది ... ఆచారం తప్పకుండా దీవెనలు పొందిన అన్ని పార్టీలు చావు దెబ్బ తిన్నాయి . అదే సమయంలో వారి మీడియా శపించిన పార్టీలు అధికారం లో వెలిగి పోతున్నాయి . అటు ఆంధ్ర లో ఇటు తెలంగాణ లో ....
*****
షర్మిల కాంగ్రెస్ లో చేరాలి అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు ... ఆంధ్రకు వెళ్లి రాజకీయం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి సుచించారు ... షర్మిల కాంగ్రెస్ లో చేరుతారు అని కొన్ని పత్రికల్లో , ఆంధ్ర కాంగ్రెస్ లో అని మరి కొన్ని పత్రికల్లో వార్తలు . ఆమె నేమో నేను సీఎం ను అవుతున్నాను అని Abn ఛానల్ ఇంటర్వ్యూ లో చెబుతుంటే ... ఆమెకో పార్టీ ఉందని , దానికో పేరు ఉందనిమరిచిపోతున్నారు . వాట్స్ ఆప్ లో మాత్రమే కనిపించే వాట్స్ ఆప్ పత్రికల సర్వేల్లో ఆమెకు ఉదారంగా 74 సీట్లు ఇస్తుంటే ఇవేవీ గుర్తించకుండా కాంగ్రెస్ వాళ్ళు పార్టీలో చేరిపొమ్మంటున్నారు .
ఆంధ్ర లో అన్న ను తీవ్రంగా వ్యతిరేకించాలి . అవసరం ఐతే రాష్ట్రపతి పాలన పెట్టించాలి . ఇటు తెలంగాణలో అన్న చెల్లిని ఆకాశానికి ఎత్తాలి , తెలంగాణ ను రక్షించడానికి అవతరించిన దేవత అన్నట్టు చూపించాలి . దీనికోసం ఎంత కష్టపడుతున్నారు . . ఇది మాములు విషయమా ? ఒకే కుటుంబంలో అన్నను రాక్షసుడిగా , చెల్లిని దేవతగా చూపాలి అంటే ఆషామాషీ కాదు దమ్ముండాలి . తమకా దమ్ముందని పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అండగా నిలిస్తే .... కాంగ్రెస్ లో కలిపేయండి.. ఆంధ్రాలో ఓ టికెట్ ఇస్తాం అనడం ఎంత అమానవీయం .
*****
విజయ శాంతికి ఆంధ్ర జ్యోతికి ఎంతో అనుబంధం ఉంది .ఆంధ్రజ్యోతి మొదటి యజమాని కి సినిమా వ్యాపారాలు ఉన్నాయి . ఉమ్మడి రాష్ట్రం లో ఆంధ్ర జ్యోతి తొలుత విజయవాడ నుంచే వచ్చేది . సచివాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఓ గది కార్యాలయంగా ఉండేది . ఆంధ్ర జ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభం ప్రచారం ఓ సంచలనం. అప్పటి వరకు ఈనాడు , ఉదయం తమ ఎడిషన్ లు ప్రారంభించేప్పుడు ఉదృతంగా ప్రచారం చేశాయి . ఉదయం ఐతే ఏకంగా ఉదయం టైటిల్ ఎలా ఉండాలో చెప్పండి అని అనేక డిజైన్ లలో అప్పటి అన్ని పత్రికల్లో మొదటి పేజీ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు . కానీ ఆంధ్రజ్యోతి మాత్రం నభూతో న భవిష్యతి అనే విధంగా విజయశాంతి పోస్టర్ లతో ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రచారం చేశారు . అప్పుడు విజయశాంతి హీరోయిన్ గా సినిమా రంగాన్ని ఏలేస్తున్నారు . దిన పత్రికకు హీరోయిన్ పోస్టర్ తో ప్రచారం ఏమిటా ? అని సాంప్రదాయ వాదులు ముక్కున వేలేసుకున్నారు కానీ బాగానే వర్కౌట్ అయింది . విజయశాంతి తెలంగాణ తల్లి పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పాత అనుబంధాలతో ఆంధ్రజ్యోతిలో ప్రచారంతో హోరెత్తించారు . బహుశా తెలంగాణలోనే కాకుండా మొత్తం దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీకి కూడా అంత ప్రచారం లభించి ఉండదేమో . వారం పాటు మొదటి పేజీ సింహ భాగం ఆమె పార్టీకే .కేటాయించారు .
బాధ్యత మొత్తం మీడియా భుజానికి ఎత్తుకుంది . అమె నెమో తెలంగాణ సాధిస్తాను అని పార్టీ పెట్టింది . ఆమెకేమో తెలంగాణ ను వ్యతిరేకించే మీడియా మద్దతు . ఆమెకు వై యస్ ఆర్ ఆత్మగా గుర్తింపు ఉన్న కెవిపి రామచంద్రరావు ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం . తెరాస నుంచి గెలిచి కాంగ్రెస్ కు అనుబంధంగా పని చేస్తున్న శాసన సభ్యులు జగ్గారెడ్డి తరుచుగా తల్లి తెలంగాణ అధ్యక్షురాలు విజయశాంతి ఆఫీస్ లో కనిపించేవారు .
సరే బయట ఎలా ఉన్నా లోపల పార్టీ పని చేసేది తెలంగాణ వాళ్లే అయి ఉంటారు అని ఓసారి వెళ్ళాను . ఆ రోజు ఆమె పుట్టిన రోజు వెళ్ళాక తెలిసింది . అక్కడున్న బొకే నుంచి ఓ గులాబీ పూవు తీసి ఇచ్చి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పాను . ఎన్నికల ప్రచారం కోసం కొందరు పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు . పలకరిస్తే గుంటూరు నుంచి తెలంగాణ పాటలు పడేందుకు వచ్చిన ఉపాధ్యాయులం రిహార్సల్స్ చేస్తున్నాం అన్నారు . బాగుంది అనుకోని విజయశాంతిని ఏమడిగినా ఆమె పక్కనున్న భర్త శ్రీనివాసరావు సమాధానాలు చెబుతున్నారు . ఆమె నోరుమెదపలేదు . ఇంత దాకా వచ్చినందుకు ఏదో మాట్లాడించాలి అని ప్రయత్నిస్తే తెలంగాణ ను విముక్తి చేస్తాను అన్నారు . ఆఫీస్ కు వచ్చి తెలంగాణను తరువాత విముక్తి చేద్దువు కానీ ముందు ఆ శ్రీనివాసరావు నుంచి విముక్తి సాధించండి అని రాశాను . అధ్యక్షురాలిని ఏమడిగినా ఆయనే సమాధానం చెబుతున్నారు అని .... మరోసారి కలిసినప్పుడు గుర్తు పెట్టుకొని ఏమండీ అలా రాశారు అని అడిగారు . తాట తీస్తారు అని మీరు రోజూ అంటారు కదా ? ఈ మాట తెలంగాణ లో ఏ జిల్లాలో అంటారు అని అడిగాను.. అదేంటీ ఆ మాత్రం తెలియదా ? అన్నట్టు చూసి నేను చాలా సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడేప్పుడు అన్నాను అని చెప్పారు . పార్టీ నడపడం ఆంధ్రజ్యోతి మొదటి పేజీ ఆక్రమించినంత ఈజీ కాదు అని గ్రహించి తెరాస లో విలీనం చేశారు . తరువాత కాంగ్రెస్ , బీజేపీ అంటూ అటూ ఇటు తిరిగి ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు . ఆమె బీజేపీలో ఉన్నారు అని అంత కరెక్ట్ గా చెబితే నాకు గొప్ప జ్ఞాపక శక్తి ఉందని అపోహ పడకండి . పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదు అని అధ్యక్షుడిని ఇటీవల ఆమె విమర్శించారు . దాని వల్ల గుర్తుంది పోయింది .
******
ఇక కోదండరాం ను సీఎంగా ప్రాజెక్ట్ చేయడానికి సర్వం సిద్ధం అయిన తరువాత ఇప్పుడే వద్దు ముందు మహాకూటమిని ఫోకస్ చేద్దాం అని మహాకూటమిని ఓట్లు లెక్కింపు మొదలైన తరువాత కూడా మెజారిటీ సీట్లు ఇచ్చారు . ఐతే ఎలక్షన్ కమిషన్ ఫలితాలు వేరుగా ఉన్నాయి . కోదండరాం సొంత పార్టీ పెట్టినప్పుడు కోదండరాం కూడా ఉహించనంత ప్రచారం కల్పించారు . తెరాస నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినా ఆకాశానికెత్తారు . పత్రికల్లో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు అనే రాస్తారు వారు పార్టీ పెడుతున్నట్టు చెప్పినా భుజానికెత్తుకున్నారు . ఉద్యమ సమయంలో గద్దర్ పార్టీ , ఇంటి పార్టీ ఇవి గుర్తున్నవి మాత్రమే ఇంకా ఎన్నో పార్టీలు వాటికీ మంచి ప్రచారం కల్పించారు . అదేం హస్తవాసో అవన్నీ కాల గర్భంలో కలిసి పోయాయి . ఆంధ్ర లో తెలంగాణ లో మీడియా అండగా నిలిచినా పార్టీలు కనుమరుగు అవుతుంటే , మీడియా వ్యతిరేకించిన పార్టీలను జనం ఆదరిస్తున్నారు . మీడియా మేనేజ్అం మెంట్టే కు నచ్చింది తెలుగు ప్రజలకు నచ్చడం లేదు . ఇదేం శాపమో ...
***
దీవించడం వల్ల మటాష్ అవుతున్నారా ? మటాష్ అయ్యే పార్టీలను దీవిస్తున్నారా ? అని ప్రశ్నిస్తే , ఏమో తెలియదు ...
31, మే 2023, బుధవారం
ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని... ఖరీదైన జీవిత పాఠం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38 --------------------
ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని...
ఖరీదైన జీవిత పాఠం
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38
----------------------------------------------
ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని సమంత అడిగితే పాపం అమాయకురాలు అనిపించింది . ఊహు అని ఎవడంటాడు .. ఊ అనే అంటాడు కదా ?
మేం అన్నాం ... ఇప్పుడు కాదు మూడున్నర దశాబ్దాల క్రితం . మేం అంటే నన్ను నేను గౌరవించుకోవడం కాదు . నేనొక్కడినే కాదు ఇంకో ముగ్గురం ఊహు అన్నాం . అబ్బా ఎంత పొరపాటు చేశాం అలా అని ఉండాల్సింది కాదు అని మా అమాయకత్వాన్ని తలుచుకొని మేమే నవ్వుకుంటాం . మా ఊహు విలువ ఒక్కొక్కరికి రెండు వేల కోట్లు . ఔను నిజం
*****
ఏడాది క్రితం కా కాలనీ ప్రెసిడెంట్ హై టెక్ సిటీకి దగ్గర అని రెండు కోట్ల రూపాయలతో ఓ ఫ్లాట్ కొన్నాడు . గృహ ప్రవేశానికి పిలిస్తే ... డ్రైవర్ కు అడ్రెస్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటే . వెళ్లి ... వెళ్లి ఓ చోట ఆపి అడ్రెస్ చూస్తున్నాడు . ఎదురుగా చూస్తే తెల్లాపూర్ అని బోర్డు కనిపించింది . మెదక్ జిల్లాలో కూడా ఓ తెల్లా పూర్ ఉంది అని డ్రైవర్ కు చెబితే అతను అలానే నా వైపు చూస్తూ సార్ ఇది మెదక్ జిల్లాలోని తెల్లాపూర్ నే మనం వచ్చింది మెదక్ జిల్లా తెల్లా పూర్ కే అన్నాడు .
*****
1988-89 ప్రాంతం లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి స్టాప్ రిపోర్టర్ ను . తెలుగు విశ్వవిద్యాలయం పి ఆర్ ఓ గా చేసి రిటైర్ అయిన చెన్నయ్య (ఈనాడు , మురళీ ధర్ శర్మ ( ఆంధ్ర జ్యోతి ) ఇంకో రిపోర్టర్ ఉండేవారు . జేసీ మహంతి అని ఒరిస్సాకు చెందిన ఐఏఎస్ జిల్లా కలెక్టర్ . తెగ ఉత్సాహంగా పని చేసే వాళ్ళం . ఉమ్మడి రాష్ట్రం లో అప్పుడు తొలిసారిగా తెల్లాపూర్ లో డ్రిప్ ఇరిగేషన్ మొదలు పెట్టారు . అక్కడ పూల తోటలు పెంచడానికి కలెక్టర్ చాలా ప్రోత్సాహం అందించారు . మీరు యువకులు జీవితం గురించి మీ అవగాహన తక్కువ . మీరు చేసేవి ప్రైవేటు ఉద్యోగాలు.. ఉద్యోగానికి , జీవితానికి భద్రత ఉండదు . మీకు ఒక్కొక్కరికి తెల్లాపూర్ లో ఐదెకరాల భూమి ఇస్తాను . మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూనే పూల తోటలు పెంచండి అని కలెక్టర్ సలహా ఇచ్చారు . అప్పుడు భూములు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్ లకు ఉండేది .
ఆయన చెప్పగానే అందరం ఊహు .. అన్నాం . భూములు తీసుకుంటే ఆఫీస్ లో తెలుస్తుంది , ఉద్యోగాలు పోతాయి అని బయటకు చెప్పక పోయినా అందరి భయం అదే . అప్పుడు దాదాపు అందరికీ 900 నుంచి 11 వందల రూపాయల జీతం . ఆ ఉద్యోగం పోతే ఇంకేమన్నా ఉందా ? అనుకున్నాం .
87 లో ఆంధ్రభూమిలో జొన్నలగడ్డ రాధాకృష్ణ నన్ను ఉద్యోగంలో నియమించారు . జిల్లాకు వెళ్లేప్పుడు జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇస్తారు తీసుకో అని చెప్పారు కానీ , వ్యవసాయ భూమి ఇస్తా అంటే ఏం చేయాలో చెప్పలేదు .
జేమ్స్ బాండ్ 007 లెవల్ లో అసలు కలెక్టర్ మనకు వ్యవసాయ భూమి ఎందుకు ఆఫర్ చేశారు . ఇందులో ఏమైనా కుంభకోణం ఉందా ? అని మాలో కొందరు పరిశోధన మొదలు పెట్టి , డ్రిప్ ఇరిగేషన్ లో ఏదో ఉండే ఉంటుంది అనుకుని సంతృప్తి పడ్డాం .
బహుశా కలెక్టర్ మీ కర్మ అనుకోని ఉండొచ్చు . తరువాత ఆయన విదేశాల్లో శిక్షణ కోసం వెళ్లారు .
*****
డ్రైవర్ ఇది మెదక్ జిల్లా తెల్లాపూర్ అనగానే అవన్నీ గుర్తుకు వచ్చాయి . అక్కడ పూల తోటలు లేవు . ఆకాశమంత ఎత్తులో అపార్ట్ మెంట్స్ ఉన్నాయి . మొక్క మహా వృక్షమై భూమి నుంచి ఆకాశాన్ని ముద్దాడి నట్టు కాంక్రీట్ జంగల్ లో ప్రతి భవనం ఆకాశానికి కన్ను గురుతుందేమో అనిపించేంత ఎత్తులో భవనాలు ...
ఒక్క ఫ్లాట్ కే రెండు కోట్లు అంటే ఐదెకరాలు వెయ్యి కోట్లు , అపార్ట్ మెంట్స్ నిర్మాణానికి డెవలప్ మెంట్ కు ఇస్తే కనీసం వాటి విలువ రెండు వేల కోట్లు . ఒక్కో రిపోర్టర్ కు రెండువేల కోట్లు అంటే ? కోటి రూపాయల్లో ఎన్ని సున్నాలు ? వెయ్యి కోట్లలో ఎన్ని సున్నాలు ? ఇప్పుడు లెక్కలు బాగానే వస్తాయి కానీ అప్పుడు ముందు చూపు లేకుండే ...
***
అంత ఆస్తి చే జారి పోయిందని దిగులు పడుతున్నాను అనుకుంటున్నారా ? అంత లేదు . ఇవన్నీ గాలిలో లెక్కలు . ఒక వేళ ఐదు ఎకరాలు తీసుకుంటే ఉద్యోగం పోయేదేమో , ఐదు ఎకరాలు అప్పుడు అమ్ముకుంటే లక్ష కూడా వచ్చేది కాదేమో . చచ్చి చెడి అమ్మకుండా అలానే ఉంచుకుంటే ఎవడో బకాసురుడు ఆక్రమించుకునే వాడేమో , నా భూమి అంటే హత్య చేసే వాడేమో , ఏమో ఏదైనా జరిగేది .
ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటంటే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందనంతగా ఉంటుంది . వర్షం పది నీరు నిలిస్తే ఇదేనా విశ్వనగరం అని టుంరీలు టీవీల్లో హడావుడి చేస్తారు . వర్షం పడితే అమెరికా అయినా హైదరాబాద్ ఐనా అంతే .. ఏ టుంరీ ఏమనుకున్నా హైదరాబాద్ విశ్వనగరమే. రింగు రోడ్డుకు అటా ఇటా అని కాదు ఎటో ఓ వైపు ఇంత స్థలం ఉండడం మంచిది . ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడు కొనలేరు . ప్రజలారా తొందర పడకండి భూమి రిజిస్ట్రేషన్ కు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు దీనితో భూముల ఘోరంగా పడిపోతాయి అని మేధావి మిత్రుడు తెగ ప్రచారం చేశాడు . అతను ప్రచారం చేసినప్పుడు పది లక్షలకు ఎకరం అని చెప్పిన భూమి ఇప్పుడు రెండు కోట్లు .
తెలంగాణ ఏర్పడగానే 2014 లో ఎన్ టివి లో గొప్ప స్టోరీ చేశారు . హైదరాబాద్ లో నిర్మాణ రంగం పడిపోయింది . బెంగళూరు వెళ్ళిపోయింది అని బెంగళూరులో జరుగుతున్నా నిర్మాణాలు చూపారు . పిల్లర్ల నిర్మాణానికి కనీసం 21 రోజులు పడుతుంది . కనీసం 21 రోజులు ఆగి ntv ఈ స్టోరీ చేసినా బాగుండేది . తెలంగాణ నిర్మాణం చేసిన క్షణం లోనే అంత పెద్ద నిర్మాణాలు ఎలా జరిగాయో .
బయటకు వెళ్లి విచారిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటో తెలుస్తుంది . మీడియా తమ పార్టీలకు అనుగుణంగా వార్తలు వండుతుంది . వాటిని పట్టించుకోవద్దు హైదరాబాద్ లో ఇల్లు అంటే బంగారమే ...
ఇక జర్నలిజం అంటే ఏదో దేశాన్ని పొడిచేద్దాం , ఉద్దరించేద్దాం అనే భ్రమలు వద్దు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జర్నలిస్ట్ కూడా ఆరు దశాబ్దాల క్రితమే చెప్పారు . సబ్బుల వ్యాపారం లాంటిదే జర్నలిజం అని . వారు ఆరు దశాబ్దాల క్రితం గ్రహించిన దానిని మనం ఇప్పటికైనా గ్రహించక పోతే ఎలా ? ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పార్టీల మీడియా కాలం ఇది .
ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది . ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37
ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది .
ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37
------------------//////-----------
జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానం లో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు . వన భోజనాలు , సమావేశాలుల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది .
అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ?
ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను అధికారి చెంపదెబ్బ కొట్టడమా ?
ఔను చెంపదెబ్బ కొట్టడం ... అందులోనూ టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ...
ఇద్దరు సీఎంలు ఆదరించారా ?
ఔను చంద్రబాబు ,వై యస్ జగన్ మోహన్ రెడ్డి ... ఒకే సారి కాదు ఒకరి తరువాత ఒకరు అభిమానం చూపించారు .
95 ఆగస్టులో ఎన్టీఆర్ చైతన్య రథం పై పార్వతి తో కలిసి వైస్రాయ్ హోటల్ కు వచ్చారు . లోపలి వెళ్లి తమ్ముళ్ళతో మాట్లాడాలి అనుకున్నారు . కనిపిస్తే చాలు కాళ్ల మీద పడి పోతారు . ఉపన్యాసం ఇస్తే కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతారు అనుకోని ఉండ వచ్చు . కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ లా కళాకారులు కాదు .
ఎన్టీఆర్ తన వాహనం తో పాటు వైస్రాయ్ లోకి రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు . ఇంద్రారెడ్డి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకొని తోసేశారు . నేను ఇంకా హోం మంత్రినే అని ఇంద్రారెడ్డి పోలీసులకు చెబుతున్నాడు . అక్కడ ముఖ్యమంత్రినే ఆపేశారు , హోం మంత్రి ఓ లెక్కనా అని అంత ఉద్రిక్త పరిస్థితి లోనూ నవ్వు వచ్చింది .
అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పరిటాల రవి గేటు తోసుకొని లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు . అక్కడ ఉన్న పోలీసు అధికారి ఇక్భా ల్ పరిటాల రవిని చెంప దెబ్బ కొట్టి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు . ప్రభుత్వం పడి పోయిన కీలక సంఘటన లో ఇది భాగమే కానీ ప్రత్యేక వార్తగా నిలువ లేదు . మొత్తం వార్తలో ఓ వ్యాఖ గానే కవర్ అయింది .
*****
అనంతరం చంద్రబాబు సీఎం గా కుదురుకున్న తరువాత ఇక్బల్ ను తన సెక్యూరిటీ అధికారిగా నియమించారు . చెంపదెబ్బ కొట్టినప్పటి నుంచి ఇక్బల్ దశ తిరిగింది . బాబు ది యూస్ అండ్ త్రో పాలసీ వాడుకుని వదిలేస్తారు అంటారు కానీ కీలక సమయం లో తనకు అండగా నిలిచిన అధికారులు , మీడియా వామ పక్షాల నాయకుల సహాయం ఉంచుకోలేదు . సహాయానికి మించిన మేలు చేశారు .
ఇక్బల్ కు ప్రమోషన్ కూడా వచ్చింది . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు ...
ఆ తరువాత పరిణామాలు , లోపలి వ్యవహారాలు తెలియవు కానీ రాష్ట్ర విభజన తరువాత ఇక్బల్ హఠాత్తుగా ysr కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . జగన్ అతనికి శాసన మండలి సభ్యత్వం కల్పించారు .
***
ఒక గృహిణిగా ఉన్న రేణుకా చౌదరి నాదెండ్ల పై చెప్పు విసిరి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్లారు .చెప్పు తో కార్పొరేటర్ టికెట్ వచ్చింది .ప్రచారం లో అప్పటి కాంగ్రెస్ మాస్ లీడర్ పి జె ఆర్ ముందు కారు బానెట్ ఎక్కి తొడ కొడుతూ రారా దమ్ముంటే అని సవాల్ చేసి రాజకీయాల్లో ఎక్కడికో వెళ్లారు .
ఈ స్ఫూర్తి తో గత ఏడాది మహానాడులో ఒకరిద్దరు మహిళలు మైకు ముందు తొడగొట్టి సవాల్ చేస్తూ ప్రసంగాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు . ఒక్కో సీజన్ లో ఒక్క చర్య తో పాపులర్ అవుతారు . తొడ గొట్టే టెక్నీక్ అన్ని సార్లు ఫలితం చూప దేమో ...
ఇక ఇక్బల్ కు చెంప దెబ్బతో దశ తిరిగింది .
ఆ రోజు ఆలా చేసి ఉండక పోతే అందరు పోలీసుల్లా వయసు రాగానే రిటైర్ అయి పెన్షన్ తో కాలక్షేపం చేసే వారు . దెబ్బ తో బాబు దృష్టిలో తరువాత కాలం కలిసొచ్చి జగన్ దృష్టిలో పడ్డారు . ఏమో ఏదో ఓ రోజు మంత్రి కూడా కావచ్చు .
***
పరిటాలను తొలిసారి హిమాయత్ నగర్ లో ని టీడీపీ కార్యాలయం లో చూశా . నలుగురైదుగురు రిపోర్ట్రర్ లం ఆయనతో మాట్లాడు తుంటే రెండంచెలుగా మా చుట్టూ లుంగీ బ్యాచ్ ఉంది . ఏదో రాజకీయాలు మాట్లాడుకుంటాం మీరేంటి అంటుకొని నిలబడతారు చిరాగ్గా అని ముందు అన్నా తరువాత తెలిసింది . లుంగీ బ్యాచ్ పరిటాల ప్రైవేటు సెక్యూరిటీ అని ...
చివరి వరకు ఎన్టీఆర్ తో ఉన్నారు . ఎన్టీఆర్ ను దించేశాక ఓ రోజు బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం లో అరుగు మీద మాటా ముచ్చట . ఈనాడు రిపోర్టర్ కనిపించగానే మీ రామోజీ సంగతి , ఈనాడు సంగతి చెబుతా అని పరిటాల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు . నేనూ విన్నాను ..ఓ చిన్న పత్రికలో ఈ వార్త వచ్చింది .
2004 లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక . ఓ సారి అసెంబ్లీ ఆవరణ లో పరిటాల కనిపిస్తే ఇది బై ఎలక్షన్ కేసే అని గుంపులో ఒకరు అనడం వినిపించింది . తన ప్రాణాలకు ముప్పు ఉందని పరిటాల కూడా గ్రహించారు . అనంత పూర్పా లో ర్టీ సమావేశం లోనే మొద్దు శీను హతమార్చారు .!బావ కళ్ళల్లో ఆనందం చూడాలి అని టీవీ 9 ఇంటర్వ్యూ లో మొద్దు శీను చెప్పిన డైలాగు ఆ రోజుల్లో పూరి జగన్నాద్ పోకిరి సినిమా డైలాగును మించి పాపులర్ అయింది . కొన్ని సినిమాల్లో మొద్దు శీను డైలాగులను కూడా ఉపయోగించు కున్నారు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
