20, మార్చి 2011, ఆదివారం

నేతల తెలివి

February 9th, 2011
ఏమేవ్ చిన్నోడి టెక్ట్స్ బుక్స్ ఒకసారి ఇలా తీసుకురా! పరుగులాంటి నడకతో హడావుడిగా ఇంట్లోకి అడుగుపెడుతూ విశ్వనాథం భార్యను కేకేశాడు. విశ్వనాథం జీవితం రాజకీయాలంత సుదీర్ఘమైంది. రాష్ట్ర రాజకీయాలను ఆయన జీవితాన్ని విడివిడిగా చూడలేం. సినిమాల్లో హీరోలు ఒక్క బ్రేక్ దొరికితే చాలని ఎదురు చూసినట్టుగానే విశ్వనాథం రాజకీయాల్లో ఒక్క బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న విశ్వనాథం చదువుకునే రోజుల్లో క్లాస్‌లో ఉన్న సమయం కన్నా రాజకీయ పార్టీల మీటింగుల్లో గడిపిన సమయం ఎక్కువ. అతను మోసిన పుస్తకాల బరువు కన్నా జెండాల బరువు అధికం.
ఇందిరాగాంధీ పోయాక వాళ్ల అబ్బాయి ప్రధాని అయ్యారు, తరువాత ఆయన భార్య చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు మనవడు రాహుల్‌ను ప్రధానమంత్రి పదవి కోసం ముస్తాబు చేస్తున్నారు. కానీ పాపం విశ్వనాధంకు మాత్రం బ్రేక్ రాలేదు. ఏదైనా ఒక పదవి ఇవ్వండి స్కాం చేయకపోతే అడగండి - అని గట్టి హామీ ఇచ్చినా ఆయన ప్రతిభను నమ్మడం లేదు.విశ్వనాథానికి పెళ్లి, పిల్లల విషయంలో సైతం ఆలస్యం అయింది. కాంగ్రెస్‌లో కుటుంబ పాలనే , ఆ పార్టీని నమ్ముకుంటే కలిసొచ్చేట్టు లేదని విశ్వనాధం వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ అన్నగారు పెట్టిన పార్టీ వైపు ఆశగా అడుగులు వేశాడు.
వారసత్వ వ్యతిరేక సిద్ధాంతంతో పుట్టిన పార్టీ వారసత్వం అన్న తరువాత ఎవరికీ అని అల్లుళ్లిద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. మురారీ మురారీ నడుమ నారీ అన్నట్టు అల్లుళ్లిద్దరిని పక్కకు తప్పించి వదిన రంగ ప్రవేశం చేశారు. పెద్దల్లుడి సహకారంతో చిన్నల్లుడు ‘అన్నా వదిన’లను పక్కన తోసేసి, అధికారం చేపట్టి సొంత బలంతో పెద్దల్లుడిని పక్కకు పడేశాడు. ఇప్పుడు చిన్నల్లుడి కొడుకు వారసత్వం చేపట్టే కాలం సమీపించింది. ఇక్కడా నాకు అవకాశం దక్కేట్టు లేదనుకున్న విశ్వనాథం సామాజిక న్యాయాన్ని నమ్ముకుని చిరంజీ చేయి పట్టారు. సామాజిక న్యాయం ప్రొడ్యూసర్‌కు అన్నీ తొందరే తాదూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు, రాజకీయాల్లో తాను నిలదొక్కుకోకముందే తమ్ముళ్లను, బావమరిదిని రంగంలో దించాడు. మామ సక్సెస్ అయితే తరువాత అధికారం దక్కేది అల్లుడికే కదా! అని సామాజిక నేత అల్లుడు కాచుకొని కూర్చున్నాడు.
చదువు అబ్బని వారంతా రాజకీయాల్లో చేరినట్టు, రిటైర్ అయిన హీరోలంతా రాజకీయాల్లో చేరినట్టు విశ్వనాధం సైతం తిరిగి కాంగ్రెస్ సముద్రంలో కలిశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే చేరుకున్నాడు. కాంగ్రెస్ నుంచి మొదలై టిడిపి, ప్రజారాజ్యం మీదుగా మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి పడ్డ తన రాజకీయ జీవితంలో తానేం సాధించానా? అని విశ్వనాధం ఆలోచించుకుంటే ఆయనకు దిక్కుతోచలేదు.

హే! భగవాన్ ఎవరెవరరికో అవకాశాలు కల్పిస్తున్నావు నా సంగతేమిటని దీర్ఘంగా ఆలోచిస్తున్న విశ్వనాధానికి మంత్రి మాటలు కళ్లు తెరిపించాయి. భర్త హడావుడి చూసి కంగారు పడ్డ మాణిక్యం ఏమైందండి అని గాబరాగా అడిగింది. ఏమీ కాలేదు కానీ ముందు వాడి బుక్స్ ఇలా ఇవ్వు అని అడిగాడు. ఇన్నాళ్లకు తన భర్త కొడుకు చదువు గురించి పట్టించుకుంటున్నందుకు ఆమెకు సంతోషం వేసింది. ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని విశ్వనాథం జనగణమన అధినాయక జయహే అని కంఠతా పట్టాడు. తరువాత వందేమాతరంపై కుస్తీ పట్టాడు. అన్ని టెక్ట్స్ బుక్స్‌ను ముందేసుకున్నాడు.
ముందు సంతోషపడ్డా భర్త ప్రవర్తన ఆమెను ఆయోమయంలో పడేసింది. భార్య పరిస్థితి అర్థం చేసుకున్న విశ్వనాథం మాణిక్యం డియర్ గాబరాపడకు అంటూ అప్పటికే సిద్ధం చేసుకున్న కొశ్చన్ బ్యాంక్ చూపించాడు. ఇంత కాలం రాజకీయాల్లో అదృష్టం కలిసి రాలేదని బాధపడ్డాడం ఇప్పుడు మన బాధలన్నీ తీరిపోనున్నాయి అంటూ కొశ్చన్ బ్యాంక్‌లోని ప్రశ్నలు చదివాడు. చైనా వాల్ పొడవెంత? ఆ గొడల నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలెన్ని? ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ఎక్కువగా పండించే జిల్లా ఏదీ? మెదక్ జిల్లా కంది గ్రామంలో కందులు పండుతాయా? లేదా? కాకరకాయ శాస్ర్తియ నామం ఏమిటి? ఎంత వేడిలో నీరు ఆవిరిగా మారుతుంది. వర్షాలు ఎలా కురుస్తాయి. దేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రదేశం ఏదీ? గవర్నర్ అధికారాలేమిటి? రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? అంటూ విశ్వనాథం చదువుతూ పోతుంటే మాణిక్యం మరింత ఆందోళన చెందింది. నీ పరిస్థితి నాకర్ధమైంది డియర్ పదవి రాలేదని పిచ్చిపట్టిందనుకుంటున్నావేమో అదేం కాదు. ఇది చూడు అంటూ రెండు వార్తలు ఆమెకు ఇచ్చాడు. జగన్ పోలవరం కాలువ పొడవు ఎంతో చెబితే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మంత్రి డిఎల్ రవీంద్ర ప్రకటించారు. దీనికి జగన్ శిబిరం సమాధానం చెబుతూ ఇది తెలుగు రాష్ట్రం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు ముఖ్యమంత్రి , ఆయన ఎవరి సహాయం లేకుండా జనగణమన పాడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంబటి రాంబాబు చెప్పాడు. యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకే కదా? చనిపోయిన తమ్ముళ్లను ధర్మరాజు తిరిగి బతికించుకున్నది. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతాను నా రాజకీయ జీవితాన్ని బతికించుకుంటాను అని విశ్వనాథం ఆనందంగా గెంతాడు.పోలవరం కాలువ పొడవెంతో చెబితే ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నవాళ్లు ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు మంత్రిపదవి ఇవ్వకుండా ఎలా ఉంటారో నేనూ చూస్తా అని విశ్వనాథం పలికాడు. ఐనా! ఐదు పదాల ప్రమాణస్వీకరాన్ని చదివేందుకు ఏడుసార్లు తడబడి ఆరు తప్పులు చేసిన కిరణ్‌కుమార్‌కు అంత కఠిన పరీక్ష అన్యాయం అని మాణిక్యం సానుభూతిగా చెప్పింది. బ్రేకింగ్ న్యూస్: ఎంతో కష్టపడి జాతీయ గీతం తప్పుల్లేకుండా పాడడం నేర్చుకున్నాను. ఇచ్చిన మాట ప్రకారం నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని మంత్రి శంకర్‌రావు సోనియాగాంధీని కలిశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం