17, మార్చి 2011, గురువారం

రాజకీయం - హాస్యం

పాలూ నీళ్లలా హాస్యం -కామెడీ-, హుందాతనం - సీరియస్‌నెస్ -రెండూ కలిసిపోయినప్పుడు ఏది కామెడీనో, ఏది సీరియస్సో తేల్చుకోవడం కొంచం కష్టమే. కనీసం పాలు మరిగిస్తే, ముందు నీళ్లు ఆవిరైతే మిగిలినవి పాలు అని తేలుతాయి కానీ సీరియస్‌నెస్‌ను, కామెడీని వేరు చేయడం అంత సులభం కాదు. నియంత హిట్లర్‌ను చూసి ప్రపంచం గడగడ లాడిపోతుంటే కామెడీ కింగ్ చార్లీ చాప్లిన్‌కు మాత్రం అతనిలో గొప్ప కమెడియన్ కనిపించారు. తనకు కనిపించిన దాన్ని గ్రేట్ డిక్టెటర్ పేరుతో ప్రపంచానికి హిట్లర్‌ను కమెడియన్‌గా చూపించేశాడు కూడా! ఎవరికి వారు తమను తాము హీరోలనుకుంటారు. నియంతలకు ఇలాంటి అలవాటు మరీ అధికం. మీలో మీకు తెలియని గొప్ప కమెడియన్ ఉన్నాడని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటే వారికీ మంచిది, ప్రజలకు మంచిది. కొందరు నేతలు తమకు తెలియకుండా ఎంత గొప్ప కామెడీ చేసినా జనం వారిని సీరియస్ నేతలుగా చూస్తారు, కొందరు సీరియస్‌గా ఉన్నా వారినంతా కామిక్ నేతలనుకుంటారు.దేశంలో కాంగ్రెస్‌లో ఉన్నంత మంది హాస్య నేతలు మరే పార్టీలోనూ కనిపించరు. తెలుగు సినిమాల్లో కనిపించే హాస్య నటుల కన్నా ఎక్కువ మంది కాంగ్రెస్‌లో కనిపిస్తారు. అధికారంలో ఉండేది వారే, ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాలని సవాల్ చేసేది వారే, అమ్మ దేవత అని పొగిడేది వాళ్లే, కాంగ్రెస్‌కు పట్టిన దయ్యం అని వాళ్లే తిట్టుకుంటారు. సమైక్యాంధ్ర దీక్షలు వారివే ....తెలంగాణ దీక్షలు వారివే ! ఇద్దరి మాటలను అమ్మ వింటుంది మాట్లాడదు. దేశం కానీ దేశం, భాష రాదు అపాయింట్‌మెంట్ ఇవ్వదు, ఇచ్చినా నోరు మెదపదు, అయినా నూటా పాతికేళ్ల పార్టీకి ఆమెనే అధ్యక్షురాలు. వంద కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్ణయించేది మూగరాజకీయాలు. ఇది కామెడీ కాదంటారా? దేశంలో గతంలో హాస్య నేతగా రాజ్‌నారాయణకు మంచి గుర్తింపు ఉంది. నిజానికతను చాలా సీరియస్ నేత. ఎంత సీరియస్ కాకపోతే ఇందిరాగాంధీనే ఓడించగలరు? పాపం చరిత్ర మాత్రం అతనికి ద్రోహం చేసి కమెడియన్ గానే గుర్తించింది. మన తెలుగునాటు బాబుగారు చాలా సీరియస్‌గా చెప్పే విషయాలను శ్రద్ధగా పరిశీలిస్తే అందులో బోలెడు కామెడీ కనిపిస్తుంది. ‘ఐటి బాబు’ రాట్నం ముందు కూర్చోని నూలు వడుకుతున్నట్టు కనిపిస్తే అంతకు మించిన సీరియస్ కామెడీ ఇంకేముంటుంది?జనతాపార్టీ నేత సుబ్రమణ్య స్వామిని చాలా మంది కమెడియన్‌గా చూస్తారు. దేశాన్ని కుదిపేస్తున్న 2జి స్పెక్ట్రమ్‌పై సుప్రీంకోర్టు అంత సీరియస్‌గా స్పందిస్తోందంటే దానికి కారణం సుబ్రమణ్యస్వామే కదా! అలాంటి సీరియస్ నేతను కమెడియన్‌గా చూడడానికి మించిన కామెడీ ఉండదేమో! ఇలాంటి నేత మనకూ ఉన్నారు. గోనే ప్రకాశ్‌ను సైతం అంతా ఇలానే చూస్తారు కానీ అతను చెప్పే విషయాలు, బయట పెట్టే రహస్యాలు మాత్రం వాస్తవమేనని అతని బారిన పడిన వారికి బాగా తెలుసు. కెసిఆర్ సోనియాగాంధీని ఎందుకు తిట్టడం లేదబ్బా అని అంతా ఎదురు చూడడం రాష్ట్రంలో పెద్ద కామెడీ. కాలం కలిసిరానప్పుడు కామెడీ సినిమా తీసినా అట్టర్ ఫ్లాపైతే నిర్మాత పరిస్థితి ట్రాజెడీగా మారినట్టు, కంప్యూటర్ ముందు కనిపించాల్సిన వేళ్లు రాట్నం మీద కనిపిస్తే కామెడీ కాకుంటే మరేమిటి? ఇందులో కామెడీ ఏముందనే సందేహమా? లెక్క చెప్పినా జోకు చెప్పినా అర్ధం కాకపోతే చెప్పిన వాడిదే తప్పంటారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాట కాలంలో నూలు వడకడాన్ని సైతం స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం మార్చారు. విదేశీయ వస్తువులు బహిష్కరించాలని స్వదేశీయ పరిశ్రమలను ఆదరించాలని ఆయన నూలు వడికారు. బాపూజీ నూలు వడకడంలో లక్ష్యం ఏమిటో ఏ మాత్రం తెలుసుకోకుండా బాబు మాత్రం మీడియాకు వెరైటీ ఫోటో కోసం మాత్రమే నూలు వడికితే అది సీరియస్ కామెడీ కాకుండా మరేమవుతుంది? అదేం చిత్రమో కానీ తెలుగువారిలో హాస్య ప్రియత్వం తక్కువ అనే అపవాదు ఉంది. అసలు దేశంలో మరే భాషకు చెందిన సినిమా రంగంలోనూ లేనంత మంది హాస్య నటులు తెలుగులో ఉన్నారు. ఇవివి సత్యనారాయణ తన సినిమాలో కనీసం రెండు మూడు డజన్ల మందైనా హాస్యనటులైనా ఉండాలని కోరుకునే వారట! తెలుగునాట సినిమా పుట్టినప్పటి నుంచి హాస్యానికి బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు మన హాస్యనటులు హీరోలుగా వచ్చినన్ని సినిమాలు మరెక్కడా లేవు. హాస్యనటునిగా తెలుగునాట వెలిగిపోతున్న సమయంలోనే కదా, బాబుమోహన్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి బాబుగారు ఆయన్ని క్యాబినెట్ మంత్రిని చేశారు. తన క్యాబినెట్ మంత్రులు, నటులు అంతా తన దృష్టిలో సమానమేనని చాటిన చంద్రబాబును మించిన సీరియస్ కామెడీ చేసేదెవరు. మన కమెడియన్లు చాలా మంది తమ కుమారులను హీరోలుగా పెట్టి సినిమా తీస్తే అవి కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడం కమెడీయన్లు తట్టుకోలేని సీరియస్‌నెస్. బ్రహ్మానందం, ఎంఎస్‌నారాయణ, బాబు మోహన్ స్టార్ ఇమేజున్న కమెడీయన్లు. ఈ ముగ్గురూ తమ కుమారులను హీరోలుగా పెట్టి సినిమాలు తీస్తే అవి కాస్తా అట్టర్ ఫ్లాపయ్యాయి. కామిక్ నటుల జీవితంలో ఇదో ట్రాజెడీ. ఒక్క సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం మనకున్నంతక మిక్ హీరోలు మరెక్కడా ఉండరు. ఈ విషయాన్ని మనం సరిగా ప్రచారం చేసుకోకపోవడం వల్లేనేమో తెలుగువారిలో హాస్య ప్రియత్వం తక్కువ అనే అపవాదు మనమీదుంది. ఇంత మంది హాస్య నేతలుండడం మనం చేసుకున్న అదృష్టం.ముగింపు: రాష్ట్ర రాజకీయాలను సంతలో తప్పిపోయిన పిల్లలతో పోల్చారొకరు. లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ్ సంతలో తల్లి నుంచి తప్పిపోయి ఏడుస్తున్న పిల్లాడు! చిరంజీవి తల్లి నుండి తప్పి పోయి తిరిగి తల్లి ఒడిలో చేరి సంతోషంతో గంతులేస్తున్నాడు.... జగన్‌ను అటు తల్లి వదల్చుకోవాలనుకుంది, ఇటు కొడుకు తల్లిని వీడి పోవాలనుకున్నాడు! బాబు బృందం సంతకు చాలా దూరంగా నిలబడి సంతలో తప్పిపోయిన వారు తమవైపు వస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు!!

3 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ బాగుంది.

    మీరు ఏమీ అనుకోను అంటే ఒక చిన్న సవరణ : టపాని అంత పెద్ద పేరాగ్రాఫ్ గా కాకుండా చిన్న చిన్న పేరాగ్రాఫ్ లా ముక్కలు ముక్కలుగా మార్చితే - ఇంకా ఆసక్తికరముగా మారుతుంది.

    అలాగే వర్డ్ వెరిఫికేషన్ ని తీసెయ్యండి.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం