17, మార్చి 2011, గురువారం

వయసు పిలిచింది
March 1st, 2011

కుక్క ఊర్మిళాపతిరావును తోసుకుంటూ పరిగెత్తింది. ఛీ..ఛీ... రిటైర్ అయిన వారంటే కుక్కకు కూడా చులకనే, హోదాలో ఉన్నప్పుడు అంతా కుక్కిన పేనులా ఉండేవారు. ఇప్పుడు పేను కూడా పాములా బుసకొడుతోంది అని దురదగా ఉన్న తలను గోక్కున్నాడు. ఊర్మిళాపతిరావు రిటైర్ అయిన విషయం ఆ కుక్కకు తెలుసో లేదో కానీ ఎప్పుడూ లేనట్టుగా కుక్క మాత్రం ఆయన్ని పెద్దగా పట్టించుకోకుండానే తోసుకెళ్లింది. బిజీగా ఉండేందుకు ఏం చేద్దామా? అని ఊర్మిళాపతిరావు రకరకాలు ఆలోచనలు మొదలు పెట్టాడు. అందరిని వణికించుకున్న తనకు అందరికీ వణికిపోయే వ్యాపారం అచ్చిరాదనే నిర్ణయానికి వచ్చేశాడు. డబ్బుకు కొదవ లేదు. ఎన్ని తరాలు తిన్నా తరగని సంపదను ఉద్యోగంలో ఉండగానే కూడబెట్టాడు. ఎంత సంపద ఉన్నా ఎదుటివాడిని వణికించుకునే పరిస్థితి లేనిదే వృధా అనిపించింది. ఎక్కడికెళ్లినా భయం భక్తి చూపే వాళ్లు, మనం చెప్పింది శ్రద్ధగా వినే జనం లేనప్పుడు ఏమున్నా వృధా అనిపించింది.పూర్వీకులు చెప్పినట్టుగా ఇప్పటి వరకు తనకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోయింది. అన్ని కోరికలు తీరి, అన్ని బాధ్యతలు ముగించుకున్న తరువాత వానప్రస్థాం చేసి శేష జీవితాన్ని ప్రశాతంగా గడిపే అదృష్టం పూర్వీకులకుండేది. ఇప్పుడు ఎవరికి వారు రిటైర్ అయన తరువాత జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. బతకడం కన్నా, రిటైర్‌మెంట్ తరువాత హోదా లేకుండా బతకడం చాలా కష్టం అనిపించింది. ఛా ఏ హీరోనన్నా కాకపోతిని రిటైర్‌మెంట్ తరువాత ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ‘‘ఇంత కాలం నన్ను ఆదరించిన ఈ ప్రజలకు ఏదో సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను’’ అంటూ గంభీరంగా ప్రకటించే చాన్స్ ఉండేది అనుకున్నాడు టీవిలో పాత సినిమాను చూస్తూ. హీరోలైతే ప్రజలకు ఏదో చేయడానికి షష్టిపూర్తి వరకు వేచి చూడాలి, హీరోయిన్లకు ఈ అదృష్టం నాలుగు దశాబ్దాల వయసులోనే దక్కుతుంది అని రోజాను చూస్తూ నవ్వుకున్నాడు. హీరో హీరోయిన్లకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరుగుతోంది నాకే ఏమీ తోచడం లేదు అనుకున్నాడు. పనీ పాటా లేకుండా ఉన్నావు కాస్త కూరగాయలు కోసివ్వవచ్చు కదా? అని భార్య నోటి నుంచి డైలాగు రాకముందే ఏదో ఒకటి చేయాలని ఊర్మిళాపతిరావు తీవ్రంగా అనుకున్నాడు. మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉందో సరిగ్గా గుర్తిస్తే, వ్యాపారంలో సగం విజయం సాధించినట్టే! ఈ సూత్రం వ్యాపారానికే కాదు అన్నింటికి వర్తిస్తుంది. ప్రపంచంలో వ్యాపారం కానిదేదీ లేదు.ఇప్పుడు మార్కెట్‌లో దేనికి బాగా డిమాండ్ ఉందా? అని ఊర్మిళాపతిరావు ఆలోచన మొదలు పెట్టాడు. వార్తలు చదువుతూ టీవిలో వార్తలు వింటూ కనులు మూసుకుని ఆలోచించిన ఆయన ఒక్కసారిగా యూరేకా అని గట్టిగా ఆరిచి, ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు. నిన్నటి నుంచి ఆందోళనగా ఉంటున్న నాన్న ఒక్కసారిగా అలా అరవడంతో పిల్లలు ఏమైందని కంగారు పడ్డారు. బహుశా మరిచిపోయిన స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ గుర్తుకొచ్చినట్టుందని భార్య పిల్లలకు మెల్లగా చెప్పింది. మార్కెట్‌లో తన భర్తకు ఉన్న పేరుకు ఇంట్లో ఉన్న సంపదకు బ్యాలెన్స్ కుదరడం లేదని ఆమె గట్టి నమ్మకం. అంతగా కష్టపడే ఆయన ఇంతకన్నా బాగా సంపాదించి ఉంటాడని, అదంతా తమకు తెలియకుండా ఎక్కడో దాచిపెట్టి తమను మోసం చేస్తున్నారని ఆమెకు మొదటి నుంచి ఆనుమానంగానే ఉంది. ఊర్మిళాపతిరావు చెప్పేది వినడానికి అంతా ఆసక్తిగా ముందుకు వచ్చారు. ‘‘నేను రిటైర్ అయ్యాను కదా! ఇంట్లో కూర్చోని మిమ్ములను విసిగించను’’ అన్నాడు. పదిమంది పేద పిల్లలకు చదువు చెబుతారా?- అని భార్య అడిగింది. నా ప్రతిభను నాలుగు గోడలకు పరిమితం చేసేంత పిచ్చివాడిననుకుంటున్నారా? - అని కోపంగా అన్నాడు. ‘‘ఎక్కడ చూసినా కుంభకోణాలే. అవినీతికి అంతు లేకుండా పోయింది. నేను అవినీతిపై ఉద్యమించాలని నిర్ణయించుకున్నాను. అవినీతిపై సమర శంఖం పూరిస్తాను, అవినీతి సొమ్మును బయటకు లాగుతాను. అవినీతి పరుల గుండెల్లో నిద్ర పోతాను’’ అని ఊర్మిళారావు ఆవేశంగా చెబుతుండగానే భార్య కెవ్వున అరిచింది.‘‘ ఆరునూరైనా నేను ఒప్పుకోను. ఇంత కాలం ఎంతో కష్టపడి, ఎసిబికి ఎక్కడ పట్టుపడతానా? అని భయం భయంగా బతుకుతూ మీరు సంపాదించిన డబ్బు బయట పెడతానంటే ఒప్పుకోవడానికి నేనేం పిచ్చి దాన్ని కాదు. సంపాదించించిందంతా బయటపెట్టడానికి మీకు చేతులెలా వస్తాయి. అవసరమైతే నేనూ, నా పిల్లలు కలిసి నీ చేతులు విరగ్గొడతాం కానీ ఆ సొమ్మును బయట పెట్టనిచ్చేది లేదు -అంటూ మహంకాళి అవతారం ఎత్తి గుక్కతిప్పుకోకుండా చెప్పింది. ఊర్మిళాపతి కంగారు పడిపోయి , ‘‘ పిచ్చిదానా పూర్తిగా వినవు తొందరపడతావు అవినీతిపై పోరాటం అంటే సొంత అవినీతిని బయటపెట్టే పిచ్చోడెవడైనా ఉంటాడా? నేను చెప్పింది ఇతరుల అవినీతి గురించే పిచ్చి మొహమా! రాష్టమ్రంతా తిరుగుతాను, ఉపన్యాసాలిస్తాను, టీవి చర్చల్లో పాల్గొంటాను ఇక రాష్ట్రంలో మన పేరు మారుమ్రోగిపోతుంది..’’ అంటూ ఊర్మిళాపతి రావు తన ప్రాజెక్టును బయటపెట్టాడు. ఇంటి సొమ్ము బయటపెట్టకుండా మీరేం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంది భార్య , అయినా మీరు చెప్పినవన్నీ మీ ఒక్కడితో ఎలా సాధ్యం? అని అడిగింది. దానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒక పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అవినీతి వల్ల ఇప్పుడు వాళ్లు అవినీతిపై ఉద్యమిస్తుంటే ఎవరూ నమ్మడం లేదు. దాంతో అవినీతిపై పోరాటానికి మనకు ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టు అప్పగించారు. అవినీతిపై గంభీరమైన ఉపన్యాసాలు ఇవ్వడం వరకే నా బాధ్యత, టీవి కవరేజ్, సభకు జనాన్ని సమకూర్చడం లాంటివన్నీ పెద్ద తలలు బయట నుంచి చూసుకుంటారు’’ అని నవ్వాడు. ఇద్దరూ నవ్వుకున్నారు.ముక్తాయింపు: అవినీతిపై సాగే ఉద్యమాలను జనం నమ్మాలంటే ఇంటి నుంచే మొదలు పెట్టాలి. (ఆంధ్రభూమి )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం