8, డిసెంబర్ 2011, గురువారం

రాజకీయ అవతార పురుషులు


వెనకటికో నక్క కాస్త మార్పు ఉంటుందని అడవిని వదలి గ్రామం పై పడింది. తిండి వేటలో పొరపాటున ఒక తొట్టిలో పడిపోయింది. ఆ తొట్టిలో రంగు నీళ్లు ఉన్నాయి. దాంతో నక్క రంగుల మయంగా మారింది. ఇక్కడ మనకు వర్కవుట్ కాదని తిరిగి అడవిలోకి వచ్చింది. రంగుల్లో మెరిసిపోతున్న నక్కను చూడగానే అడవిలో జంతువులన్నీ ముందు భయపడి పోయాయి . తరువాత తమను ఉద్దరించడానికి వచ్చిన కొత్త దేవత అనుకున్నాయి. నిజమే అడవిలో నిస్సారమైన జీవితం గడుపుతున్న మిమ్ములను ఉద్దరించడానికి అవతరించాను అని నక్క చెప్పుకుంది. తొలుత అడవిలోని నక్కలన్నింటిని బయటకు పంపించేసింది. నక్కకు అడవిలో ఎదురులేకుండాపోయింది. పులి, సింహం లాంటి జంతువులు కూడా నక్క ముందు తోక ఆడిస్తూ తమరి ఆదేశం అంటూ వినయంగా ఉండసాగాయి. జీవితం అంటే తనదే కదా? అనుకుంది నక్క.

 ఓ రోజు అడవిలో దూరంగా ఒక చోట కొన్ని నక్కలు బిగ్గరగా ఊలవేశాయి. ఇంకేం మన నక్కలోని సహజ అవతారం బయటకు వచ్చాడు. రంగుల నక్క కూడా బిగ్గర ఊలవేసింది. దీంతో నక్క బండారం బయటపడి దాని తాట ఒలిచాయి. మనం కూడా అంతే. చాలా మందిని ఏదో అవతారం అనుకుంటాం. సమయం రాగానే వారి అసలు అవతారం బయటపడుతుంది. నమ్మితే మోసం చేస్తావా? అని నిలదీస్తాం. అమాయకత్వం కాకపోతే నమ్మకపోతే ఎలా మోసం చేస్తారు.
1952 ప్రాంతంలో ఒక సాధువు దశావతారాల్లో తనది భూలోకంలో కడపటి అవతారమని ప్రకటించాడు. ఈ వార్తను అప్పటి తమిళ మహానేత రాజాజీ చదివి ఈ విషయంలో కూడా తనకు ప్రత్యర్ధి దాపురించాడని ఆవేదన చెందారట!
84లో నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు కర్నాటకలో క్యాంపులు నిర్వహించి ఎమ్మెల్యేలను రక్షించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో తల్లిదండ్రులను కావడికుండలను మోసినట్టు భుజాన మోసిన శ్రావణ కుమారుడి అవతారంగా రామారావుకు బాబు కనిపించారు. సరీగ్గా పదేళ్ళ తరువాత స్వయంగా తానే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దించినప్పుడు బాబు శ్రావణ కుమారుడు కాదు తండ్రినే చంపించిన ప్రహ్లాదుడి అవతారం అని కొందరు గుసగుసలాడుకున్నారు. ఎన్టీఆర్‌కు తాను అవతార పురుషుడిని అని గట్టి నమ్మకం ఉండేది. అభిమానులు సైతం ఆయన్ని అవతార పురుషుడిగానే కొలిచే వారు. ఆయుధాన్ని చేపట్టకుండానే మహాభారత యుద్ధం మొత్తన్ని నడిపించిన శ్రీకృష్ణుడు ఒక అనామకుడి చేతిలో మరణించాడు. అవతారాన్ని చాలించాలి కాబట్టి తన అవతారాన్ని అలా ముగించారన్నమాట ఎన్టీఆర్ సైతం తన అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చింది కాబట్టి అల్లుడి చేతిలో అంత సులభంగా ఓడిపోయాడని అభిమానులనుకుంటారు. డైరెక్ట్‌గా చెప్పుకోలేదు కానీ వైఎస్‌ఆర్ అవతార పురుషుడు, అందుకే ఆయన అధికారంలోకి వచ్చాకే వర్షాలు పడ్డాయి అని అభిమానులు చెప్పుకుంటారు. కానీ ఇది మనుషుల కాలం కలి కాలం. ఒక్క జీవితంలోనే ఎన్నో అవతారాలు ఎత్తితే కానీ జీవితం గడవదు.
సాధారణ కుటుంబరావులే రోజుకో అవతారం ఎత్తక తప్పదు. మా అమ్మతో నాకు పరమ చిరాకుగా ఉందోయ్ నువ్వెలా భరిస్తున్నావో కానీ అంటూ భార్య వద్ద భార్యా విధేయ అవతారం ఎత్తాలి. అమ్మా నీ కొడలు సంగతి తెలుసు కదా? రాచి రంపాన పెడుతోంది. నీ మీద ప్రేమ లేక కాదు.. ఆ గొడవను భరించలేక ... అంటూ అమ్మ దగ్గర నిస్సహాయ సుబ్బారావు అవతారం ఎత్తాలి. సినిమా వాళ్లకైనా అవతారాలు మార్చడంలో కొంత గ్యాప్ ఇస్తారు. కొత్త పాత్రను అర్ధం చేసుకుని జీర్ణం చేసుకుని, ఆవహించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. సుబ్బారావుల జీవితంలో ఆ మాత్రం చాన్స్ కూడా ఉండదు. పైగా ఇంట్లో అంతలా నటించి ఆఫీసుకు వచ్చాక బాసు జోకు వేయకముందే పడి పడి నవ్వాలి. ఊసరవెళ్లి అని తిడతారు కానీ అలా అవతారాలు మార్చకపోతే ఆ జీవి బతకలేదు కదా!
దేవతల కాలంలో విష్ణుమూర్తి అవతారం దేవతలకైనా, రాక్షసులకైనా విష్ణుమూర్తిలానే కనిపించేది. కానీ అదేం చిత్రమో కానీ ఈ కాలంలో మాత్రం ఒకే అవతారం ఒక్కోక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయకి సాక్షాత్తు అపర దుర్గగానే కనిపించింది. మాయావతిని దళిత దేవతగా దళితులకు కనిపిస్తుంటే ఆమెను తీవ్రంగా వ్యతిరేకించే వారికి మాత్రం విలన్ అవతారంగానే కనిపిస్తోంది. ఆమె మాత్రం దేశంలో చాలా మంది నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్న విషయం మాత్రం వాస్తవం. దళితులకు పెద్ద పీట అంటూ ఇంత కాలం అగ్రవర్ణ నాయకత్వ పార్టీలు ప్రకటించుకుంటుంటే ఆమె రివర్స్‌లో అగ్రవర్ణాలకు పెద్ద పీట అంటూ నిజంగానే ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణులకు అత్యధిక సీట్లు ఇవ్వడమే కాకుండా గెలిపించుకుని రాజకీయాల్లో కొత్త అవతారాన్ని దాల్చారు. ఇంటి నుండి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి వచ్చే వరకు ఒక రోజులో సామాన్యుల దశావతారాల ముందు ఏ దేవుళ్ల అవతారాలు, నాయకుల అవతారాలు సాటిరావు.

3 కామెంట్‌లు:

  1. జిలేబి గారు ఎంతమాట అన్నారండి సుమన్ ఎవరా ? తెలుగు జాతి కీర్తి కిరీటం ... వారానికో సినిమాను ఈ టీవి ప్రేక్షకులకు కానుకగా ఇస్తున్న సుమన్ ఎవరో తెలియదా ? సుమన్ ఎవరా ? అనే ప్రశ్నతోనే ఓ పెద్ద వ్యాసం రాయవచ్చు తెలుసా ?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం