15, డిసెంబర్ 2011, గురువారం

రాజకీయ పోకిరీలు వర్ధిల్లాలి


కాలేజీలోల అల్లరి మూక అమ్మాయిలను ఆటపట్టిస్తోంది. ఇంతలో హీరో అక్కడికొచ్చి ఒక పాట పాడడంతో అల్లరిమూక మమ్మల్ని క్షమించండి మాస్టారు ఇంకెప్పుడూ ఆడవారిని వేధించం అంటూ 1980లో కన్నీరు కార్చారు. రామారావు పాడిన పాట విని తన్మయం చెందిన వాణిశ్రీ తనకు సరిజోడు రామారావే అని అప్పుడు నిర్ణయించుకుని చీరకొంగును కొరుకుతూ కాలేజీ నుంచి పార్క్‌లోకి పరుగులు తీసింది.
పదేళ్లు గడిచాయి అమ్మాయిలను వేధిస్తున్న అల్లరి మూకను హీరో చితగ్గొట్టాడు. కాళ్లతో, చేతులతో విలన్లను చితగ్గొడుతున్న హీరో ధైర్యాన్ని చూసిన జయప్రద హీరోకు 1990లో మనసిచ్చేసింది. కాలం మరింతగా మారింది. హీరో అమ్మాయిల వెంట పడుతున్నాడు. గిల్లుతున్నాడు, గిచ్చుతున్నాడు. హీరోయిన్‌ను కూడా వదలలేదు. మిగిలిన ఎక్‌స్ట్రా ఆర్టిస్టుల కన్నా హీరోయిన్‌నే ఎక్కువగా వేధిస్తున్నాడు. వేధింపులకు అలవాటు పడిపోయిన హీరోయిన్ త్రిష చివరకు హీరోను ప్రేమించేసి, నువ్వు కాదంటే ప్రాణాలు వదిలేస్తానంది 2000ల సంవత్సరంలో. 1980లో విలన్లు అమ్మాయిలను వేధిస్తుంటే చీదరించుకున్న హీరోయిన్ చివరకు 2000ల సంవత్సరంలో అదే పని చేసిన హీరోకు మనసిచ్చేంతగా కాలం మారింది. సినిమాల్లో, రాజకీయాల్లోనే కాదు అన్నింటా కాలం బాగా మారిపోయింది. ఏం మారింది.. అప్పుడు జైలుకు వెళ్లిన వారికి ప్రజలు మంగళహారతులు పాడేవారు, ఇప్పుడు అలానే పాడుతున్నారు తేడా ఏముంది అనేది కొందరి అనుమానం. స్వాతంత్య్ర పోరాటం సాగించిన ప్రకాశం పంతులు జైలు నుండి వచ్చినప్పుడు చెన్నైలో ఎలాంటి స్వాగతం లభించిందో తెలియదు కానీ కనిమొళికి మాత్రం బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. డిఎంకెకూ ఒక పురుచ్చి తలైవి లభించిందని ఆ పార్టీ వారు సంబరపడుతున్నారట! ఇప్పట్లో అక్కడ ఉప ఎన్నికలు లేవు కానీ ఉండి ఉంటే మాత్రం కనిమొళి భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతారు.


అనుమానం ఉంటే పొరుగున ఉన్న కర్నాటకకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. మైనింగ్ కుంభకోణంలో గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టు తరువాత ఆయన ప్రియమిత్రుడు శ్రీరాములు బిజెపికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే 46వేల ఓట్ల మెజారిటీ లభించింది. అంతకు ముందు ఆయనకు నాలుగైదువేల మెజారిటీ కూడా రాలేదు. ఈ ఊపుతో ఆయన గాలితో కలిసి కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉన్న ఆస్తిని దేశానికి అర్పించిన వారిని ఆ కాలంలో రాజకీయాల్లో హీరోలుగా చూశారు, ఇప్పుడు దేశాన్ని దోచుకున్న వారికి హీరోవర్షిప్ వచ్చేస్తోంది.
తండ్రి లాంటి మామ కుర్చీ లాగేసిన వారిలోనే కథనాయకుడిని చూశారు కొంత కాలం. అబుసలేం, దావుద్ ఇబ్రహీంలను హీరోలుగా కొలిచేవారున్నారు.రాజకీయాల్లో ఆసక్తి లేక కానీ దావుద్ వస్తే ఓటర్లు వద్దంటారా?


ఎందుకలా అంటే ఔను వాళ్లు దొంగలు ఆ విషయాన్ని వారెప్పుడూ దాచుకోలేదు. కానీ రాజకీయ నటులు అలా కాదు కదా? నానా పటేకర్‌లు రాజనీకాంత్‌లా ఫోజు కొడతారు. దాంతో ఎవరు ఎవరో గుర్తించడం కష్టం. నిరంతరం నటనలో జీవించే నాయకులను అంచనా వేయడం అంత ఈజీ కాదని చెప్పడమే ఉద్దేశం.
ఆ హీరోగారు సినిమాలో పేదలకు అండగా, విలన్ల పాలిట సింహస్వప్నంగా ఉండే వారు. తాను ముఠామేస్ర్తి అయినా విలన్ ముఖ్యమంత్రిగా ఉన్న చితగ్గొట్టిన చరిత్ర అతనిది. నువ్వు ఏలాల్సింది చిత్రసీమను కాదన్నా రాజకీయ సీమను అని అభిమానులు అతన్ని అన్నా నువ్వు రాజకీయాల్లోకి వచ్చేయ్ అన్నా వచ్చేయ్ అని దీక్షలు జరిపారు. ఒకరు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయాల్లో విలన్లను చీల్చి చెండతాడు అని అభిమానులు కలలు కంటుండగానే ఆయన రాజకీయాల్లోకి రావడం విలన్లతో చేట్టాపట్టాలేసుకుని తిరగడం అయిపోయింది. విలన్లతో చేతులు కలిపిన హీరోల ట్విస్ట్‌ను మనం ఏ సినిమాలోనైనా ఊహించామా? మన సినిమాల్లో కథలుండవని అనుకుంటాం కానీ రాజకీయాల్లో సినిమాల కన్నా ఎక్కువ మలుపులుంటున్నాయి. నీ మిత్రుడెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతాను అంటారు.


గతంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్‌స్మిత అని వాంప్‌లు ప్రత్యేకంగా ఉండేవారు. సినిమాల్లో ఏదో ఒక పాటలో వీళ్లు తళుక్కున మెరిసి ప్రేక్షకులను మైమరిపించే వాళ్లు. సినిమాల బడ్జెట్ పెరిగి వినోదం తగ్గిన తరువాత బడ్జెట్ కోతలో భాగంగా వాంప్‌ల పాత్రలను తొలగించి ఆ బాధ్యతను హీరోయిన్లకే అప్పగించారు. ఇప్పుడు డ్రెస్స్‌ను చూసి ఎవరు హీరోయినో, ఎవరు వాంపో చెప్పలేం. అలానే రాజకీయ నాయకుల మాటలను బట్టి వారిని అంచనా వేయలేం.


1969లో బుద్ధిమంతుడే హీరో. హీరోయిన్ విజయనిర్మల బుద్ధిమంతుడు అనే హీరో అక్కినేనిని ప్రేమిస్తుంది. అదే 2006 సంవత్సరానికి వచ్చేసరికి ఇలియానా లాంటి అందగత్తె పోకిరీనే హీరోగా ఇష్టపడి ప్రేమించింది. సినిమాల్లో హీరోయినే్ల కాదు రాజకీయాల్లో సైతం పోకిరీలనే ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాయకులు పోకిరీ అవతారం ఎత్తాలి. దట్టంగా వేసుకున్న మేకప్ తొలగిస్తే చాలు అసలు రూపం అదే పోకిరీ రూపం బయట పడుతుంది.

9 కామెంట్‌లు:

 1. విలన్లతో చేతులు కలిపిన హీరోల ట్విస్ట్‌ను మనం ఏ సినిమాలోనైనా ఊహించామా?

  WOW

  REAL TIME STORIES

  YOUR BLOG IS A MIRROR OF THOSE THING

  AWESOME PRESENTATION

  ?!

  రిప్లయితొలగించు
 2. @కృష్ణప్రియ garu
  @Enduko Emo garu nacchinanduku thanks

  రిప్లయితొలగించు
 3. విలన్లతో చేతులు కలిపిన హీరోల ట్విస్ట్‌ను మనం ఏ సినిమాలోనైనా ఊహించామా?
  Do you know who is the hero? who is the villain ?

  Infront there is a crocodile festival !!

  Wait and see !!

  రిప్లయితొలగించు
 4. చాలా బాగా రాశారండీ. సూపర్ పోస్ట్. మన వెధవాయత్వాన్ని కళ్లకి కట్టినట్లు చూపించారు.

  రిప్లయితొలగించు
 5. కృష్ణ ప్రియ గారు ఎందుకో ఏమో గారు బులుసు సుభ్రమణ్యం గారు వనజవనమాలి గారు డేవిడ్ గారు రాజేష్ మారం.. గారు . KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు నీహారిక గారు Sravya Vattikuti గారు మీ అందరికీ నచ్చినందుకు థాంక్స్ . బాధ కరమైన విషయం ఏమంటే ఇందులో వ్యంగంగా రాసిన చాలా సంఘటనలు నిజంగానే జరిగాయి .

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం