11, జనవరి 2012, బుధవారం

మతిమరుపులో మన నేతలు మహా మేధావులోయ్


ఒక శాస్తవ్రేత్త తన ఇంటి తలుపులకు ఒకటి పెద్దది, మరోటి చిన్నది రెండు రంధ్రాలు చేశాడట! ఎందుకలా అంటే పిల్లులు లోనికి రావడానికి, బయటకు వెళ్లడానికి అని సమాధానం చెప్పాడు. మరి రెండెందుకు అంటే ఒకటి చిన్నపిల్లికి మరోటి పెద్ద పిల్లికి అంటూ చెప్పుకొచ్చాడు. మాకు తెలుసులే ఆ ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త అంటున్నారా? సరే ఈ మధ్య టైమ్స్ వాళ్లు మ్యాన్ ఆఫ్‌ది సెంచరీ అంటూ ఐన్‌స్టిన్ గురించి ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు.
ఐన్‌స్టిన్ ప్రినె్ట్సన్ యూనివర్సిటీలో పని చేశారు. యూనివర్సిటీ నుండి ఒకసారి ట్యాక్సీలో ఇంటికి వెళుతున్నారు. ఇంటి అడ్రస్ మరిచిపోయారు. అయితే ట్యాక్సీ డ్రైవర్ ఐన్‌స్టిన్‌ను గుర్తించలేదు. ఇప్పుడు ఇంటికెలా వెళ్లడం అనే ఆలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తరువాత డ్రైవర్‌తో ఐన్‌స్టిన్ ఇల్లు తెలుసా? అని అడిగాడు. ఈ నగరంలో ఐన్‌స్టిన్ ఇళ్లు తెలియని వారెవరుంటారు? ప్రతి ఒక్కరికి తెలుసు అన్నా డు. ఐతే ఆయన ఇంటికి పదా! అన్నాడు ఐన్‌స్టిన్! ఆయన్ని మీరు చూడాలనుకుంటున్నారా? అని డ్రైవర్ ఆసక్తిగా అడిగాడు. ఐన్‌స్టిన్ చిరునవ్వుతో అది కాదు నేనే ఐన్‌స్టిన్‌ను ఇంటి అడ్రస్ మరిచిపోయాను అని చెప్పాడు నింపాదిగా! మరోసారి ఎక్కడో లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా, టికెట్ ఎక్కడో పడిపోయిందని కంగారుగా వెతకసాగాడు. అది గమనించి కండక్టర్ సార్ మిమ్ములను నేను గుర్తుపడతాను, మీరు టికెట్ కొన్నారు, ఆ విషయం నాకు తెలుసు. వెతకాల్సిన అవసరం లేదు పోతే పోనివ్వండి అన్నాడు. అయినా కంగారుగా ఐన్‌స్టిన్ అలానే వెతకసాగాడు. కండక్టర్ దక్కరకు వచ్చి వదిలేయండి సార్ మీరు నాకు తెలుసు అన్నాడు. దానికి ఐన్‌స్టిన్ నేనెవరో మీకు తెలియవచ్చు కానీ నేను ఎక్కడ దిగాలో నాకు గుర్తు లేదయ్యా! బాబు ఇప్పుడా టికెట్ చూస్తే కానీ ఎక్కడ దిగాలో తెలియదు అని దిగులు పడ్డాడట!
 మేధావుల్లో ఇలాంటి లక్షణాలు సహజమే. ఐతే ఏంటీ ? అనే కదా మీ ప్రశ్న. చెప్పదలుచుకున్నదాన్ని మరిచిపోయి ఏదేదో చెబుతున్నాననే కదా మీ అనుమానం.
ఇప్పుడు బాగా ఆలోచించండి మన నాయకులకు అన్యాయం జరిగిందా? లేదా? తన పేరును, తన ఇంటిని మరిచిపోయిన వాడే మేధావి అయినప్పుడు ఓటేసిన లక్షల మంది ఓటర్లను ఐదేళ్ళ వరకు మరిచిపోయేవాడు ఎంత మహామేధావి అయి ఉంటాడు. మీ, మా నియోజక వర్గం అనే తేడా లేదు మన నాయకులంతా ఐదేళ్ల వరకు మనను మరిచిపోతున్నారంటే మన నేతలు మహా మేధావులు అని అంగీకరించి తీరాల్సిందే. మరిచిపోవడం మీకూ మంచిదే! ఒకవేళ గుర్తుంటే ఒక్కో పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పిందో గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికలయ్యాక వాటిని వారు మరిచిపోతున్నారు కాబట్టే కొత్త మాటలు చెప్పగలుతున్నారు. తెలివిని ఐ క్యూ అని కొలిచినట్టు మతిమరుపును కొలిచే విధానం ఉంటే మన నేతలు ప్రపంచానికి మతిమరుపులో పాఠాలు నేర్పించగలరు.
రామాలయం కట్టకపోతే దేశం సర్వనాశనం అవుతుందని గగ్గోలు పెట్టి ఊరువాడ తిరిగి ఇటుకలు సేకరించి, ఇటుకపై ఇటుక పేర్చి అధికార భవనాన్ని నిర్మించుకునే నాయకులు ఆ వెంటనే విషయం మరిచిపోతారు.
వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు అంత భారీగా పెంచితే ఎలా భరిస్తాం అంటూ ఆందోళనకు దిగిన వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చడం కూడా వీరోచిత చర్యగా సమర్ధించుకున్న మహానుభావుడు, అధికారం పోగానే ఆ విషయం మరిచిపోయి విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు చివరి రక్తం బొట్టు వరకు ఉద్యమిస్తాను అని రోడ్డుమీద బైటాయించడం అంటే అతని మతిమరుపు స్థాయి సామాన్యమైనదా? ఆయన మహామేధావి కాకుంటే మరేమిటి? అమ్మానాన్న లేని అనాధను శిక్ష వేయకుండా వదిలేయండి న్యాయమూర్తిగారూ అని వెనకటికొకడు కోర్టులో దీనంగా వేడుకున్నాడు. వాడి ఏడుపు అందరికీ కన్నీళ్లు తెప్పించింది ఇంతకూ కేసు ఏమిటంటే వాడు అమ్మానాన్నలను హత్య చేశాడు. ఆ విషయం మరిచిపోయాడు కాబట్టి వాడు కచ్చితంగా మహామేధావి. మామను పోటు పొడిచిన వారు ఆ విషయం మరిచిపోయి మామ ఫోటోతో ఓట్లు అడుక్కోవడం అంటే మతిమరుపు గొప్పతనమే.
మీ ఇ-మెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ మీరు మరిచిపోవద్దు. కానీ అది మీ మాజీ ప్రేయసి పేరనే విషయం మీ శ్రీమతి మరిచిపోకపోతే మీ జీవితం రాంగోపాల్ వర్మ సినిమా అంత అయోమయంగా తయారవుతుంది.

7 కామెంట్‌లు:

 1. అబ్బాబ్బబా ....ఏమి కంపారిజను ...:):౦ తల తరిగి మైండు బ్లాకు అయ్యి గుబ గుయ్యి అంది ...నా లాంటి నేతలను ఇల్లా అవమానించడం ఏమి బాగోలేదోయ్......--- రాజకీయనాకుడు

  సుపరండి ..చాలా బాగా రాసారు ---------బ్లాగరు

  కేకలున్ కేవ్వులున్ చప్పట్లున్
  రచయితా ఎంత బాగా రాసేన్
  ------------- కవి

  :):) ---- నేను

  రిప్లయితొలగించు
 2. hilarious మురళి గారు!
  On a serious note, మరచిపోకుండా పాత తప్పులనే మళ్ళీ చేస్తే, విధానాలలో course correction జరగదు కదా!

  రిప్లయితొలగించు
 3. బొందలపాటి గారు మీ కామెంట్ కు థాంక్స్ చాలా రోజుల క్రితం ఎక్కడో చదివాను ఒక రచయిత ఒక వ్యాసం లో ప్రయోజనాత్మక మరుపు అనే పదాన్ని ఉపయోగించారు. మన నాయకులు ఎప్పుడూ ఏది ప్రయోజనం అనుకుంటే అది మరిచిపోతారు తమకు ప్రయోజనం అనుకుంటే అందరూ మరిచిపోయినా వాటిని సైతం గుర్తు చేస్తారు

  రిప్లయితొలగించు
 4. AAAAAAwesome.....
  బాగా కంపేర్ చేశారు.. రాజకీయ నాయకులది మతి మరపు నాటకం అని తెలుసు కాబట్టే.. వారిని మేధావుళ్ళా నటించే వారు అని ప్రజలకు అర్ధం అయ్యింది.. కానీ.. ప్రజలకు వేరే దారి లేదు.. ఎందుకంటే రాజకీయం లోకి పోయే వారంతా ఇలా మార వలసిందే.. మనం ఒక అబద్ధపు నిజం లో బతుకుతున్నం.. రంగులు మారుతూనే ఉంటాయి..

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం