17, జనవరి 2012, మంగళవారం

వార్తలు లేనప్పుడు ఏం చేస్తున్నారు ? కోడిగుడ్డు ఈకలు పీకుతున్న హిందీ ,ఇంగ్లిష్ చానల్స్ ... సినిమాలను నమ్ముకుంటున్న తెలుగు న్యూస్ చానల్స్

దాదాపు దశాబ్దం క్రితం తెలుగు వార్తా పత్రికల్లో ప్రత్యేకంగా ప్రతి రోజు సినిమా వార్తల కోసం ఒక పేజీని కేటాయించినప్పుడు వింతగా అనిపించింది. ప్రతిరోజు ప్రచురించడానికి సినిమా వార్తలు ఏముంటాయనిపించింది. ప్రైవేటు చానల్స్ ప్రారంభం అయిన కొత్తలో ఆ రోజు జరిగిన సంఘటనలు ఒకటి రెండు రోజుల తరువాత రోజుకు గంట పాటు ప్రసారం చేసేవారు. 24 గంటల న్యూస్ చానల్స్ ప్రారంభం అయినప్పుడు కూడా అదే తరహాలో 24 గంటల పాటు చూపించడానికి వార్తలు ఏముంటాయనే సందేహం వచ్చింది. ఒకటికాదు రెండు కాదు దాదాపు 24 గంటల వార్తలు చూపడానికి తెలుగులోనే 24 చానల్స్ వచ్చేశాయి. వీటిలో కొన్ని చానల్స్ ఉనికి ప్రజలకు తెలియదు, కొన్ని ఎలాగోలా నెట్టుకొస్తున్నాయి. చానల్స్ నెట్టుకురావడానికి ఆర్థిక వ్యవహారాలు ఒక సమస్య అయితే వార్తలు మరో సమస్యగా మారుతున్నాయి. చూపిన వార్తలే, జరిగిన గొడవలే ఎంత సేపని చూపిస్తారు. మరి వార్తలు లేనప్పుడు ఏం చేస్తారు.


  మీడియాకు సెలవు రోజు, ప్రజలు పండుగ వాతావరణంలో ఉంటారు. రాజకీయాలను పట్టించుకునేంత తీరిక ఉండదు. సొంత ఊళ్లకు వెళుతుంటారు. మరి ఇలాంటి సమయంలో చానల్స్‌కు వార్తలు ఎలా? వార్తలు లేకపోతే ఏం చేస్తారు. సంక్రాంతి సమయంలో తెలుగు చానల్స్‌తో పాటు జాతీయ చానల్స్ సైతం ఇదే విధంగా వార్తల కొరతను ఎదుర్కొన్నాయి. తరుచుగా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. వార్తల కొరత ఏర్పడినప్పుడు తెలుగు చానల్స్, జాతీయ చానల్స్ స్పందిస్తున్న తీరు వేరువేరుగా ఉంటోంది. హిందీ, ఇంగ్లీష్ జాతీయ చానల్స్ కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్టు ఒక చిన్న అంశాన్ని పట్టుకుని సాగదీస్తూ వార్తలను సృష్టించుకుంటున్నాయి. తెలుగు చానల్స్ ఎక్కువగా సినిమా కథనాలపై ఆధారపడుతున్నాయి. సంక్రాంతి రోజున తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చానల్స్‌లో కనిపించిన తేడా ఇది.
సంక్రాంతి రోజున పెద్దగా ముఖ్యమైన వార్తలేమీ లేకపోవడంతో తెలుగు చానల్స్ పూర్తిగా సినిమా అంశాలపైనే ఆధారపడ్డాయి. 1965 నుండి ఇప్పటి వరకు సినిమాల్లో ఐటెంసాంగ్స్‌పై టీవి5 ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. విజయలలిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం, సిల్క్‌స్మిత, అనురాధల తరం నుండి నేటి తరం ఐటెం గర్ల్స్ వరకు కొన్ని పాటలతో చూపించారు. టైం మిషన్ అంటూ ఒక్కసారిగా ఆనాటి రోజుల్లోకి తీసుకు వెళ్లారు. ఎంపిక చేసుకున్న అంశానికి నిజానికి సమయం సరిపోదు. కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని గుర్తు చేయడానికి ప్రయత్నించారు. ఇంత మందిలో ఇంద్రుడు చంద్రుడులో తన అందాలతో సంచలనం సృష్టించి వాంపు పాత్రల్లో విజృంభించిన జయలలితను ఎందుకో మరిచిపోయారు. తన పాత్రల పట్ల తనకే విసుగేసి విరామం ప్రకటించి అమ్మమ్మ డాట్‌కాం సీరియల్‌లో ఒక మంచి పాత్రలో నటించి ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
hm  టీవిలో శోభన్‌బాబు జయంతి సందర్భంగా ఆయనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.అదే రోజు భాను
ప్రియ జన్మదినం సందర్భంగా కొన్ని తెలుగు చానల్స్ ఆమెపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశాయి. ప్రముఖ నటుని కొత్త సినిమా విడుదలైతే తెలుగు చానల్స్ చాలా ఎక్కువగానే స్పందిస్తున్నాయి. బిజినెస్ మేన్ సినిమా విడుదల రోజున అన్ని చానల్స్‌లో వివిధ జిల్లాల్లో థియేటర్ల వద్ద రద్దీ ఎలా ఉంది? ప్రేక్షకుల సందడి ఎలా ఉంది అంటూ తెగ హడావుడి చేశారు. గతంలో ఇలాంటి హడావుడి అభిమాన సంఘాల వారు చేసేవారు, ఇప్పుడా పాత్రను తెలుగు చానల్స్ పోషిస్తున్నాయి. ఎక్స్‌ట్రా చానల్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా ఒక చానల్ ప్రసారాలు ప్రారంభమ య్యాయి. ఇది పూర్తిగా 24 గంటల సినిమా న్యూస్ చానల్.
ఇక వార్తలు లేని రోజున హిందీ, ఇంగ్లీష్ చానల్స్ విషయానికి వస్తే...
రాందేవ్‌బాబాపై ఒక ఎన్‌జివో సంస్థకు చెందిన వ్యక్తి ఇంకు చల్లాడు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఆ మధ్య శరద్‌పవార్‌ను ఒక సిక్కు యువకుడు చెంపదెబ్బకొడితే దేశ వ్యాప్తంగా ఇంటర్‌నెట్ సోషల్‌సైట్స్‌లో అతనికి మద్దతు లభించింది. ఈ వార్తను యాహూలో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వందలాది మంది స్పందించారు. చెంపదెబ్బకొట్టిన వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని సూచించారు. తీరా పోలీసు విచారణలో ఆ వ్యక్తి తనకు మతి స్థిమితం సరిగా లేదని, అందుకే అలా వ్యవహరిస్తున్నానని చెప్పుకున్నాడు. ఇలాంటి వాటికి జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం లభిస్తుండడంతో కొంత మంది ఇలాంటి దుందుడుకు చర్యలకు పూనుకుంటున్నారు. అయితే వీరు చేసే చిల్లర పనుల కన్నా ఈ సంఘటనలపై జాతీయ నాయకులు స్పందిస్తున్న తీరు మరింత సిల్లీగా ఉంది. ఎవరో రాందేవ్ బాబాపై ఇంకు చల్లగానే ఇది ఆర్‌ఎస్‌ఎస్ పనే అంటూ దిగ్విజయ్ సింగ్ తేల్చి చెప్పారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి అన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. ఎక్కడేం జరిగినా అందులో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కనిపిస్తుంటుంది. పార్లమెంటుపై దాడి జరిగినా, తాజ్‌మహల్ హోటల్‌పై దాడి సంఘటన అన్నింటిలో ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కనిపిస్తుంది. దీనికి ఆయనో ఆధారం కూడా చూపారో ఎన్‌డిఏ అధికారంలో ఉన్నప్పుడు బిజెపి కేంద్ర మంత్రి ఒకరికి బాబారాందేవ్‌పై ఇంకు పోసిన వ్యక్తి నమస్కారం చేస్తున్నప్పటి ఫోటో విడుదల చేసి ఇంత కన్నా ఇంకేం ఆధారం కావాలని ప్రకటించారు. దానికి కాంగ్రెస్ ప్రత్యర్థులు అంత కన్నా గొప్ప ఫోటో విడుదల చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ పాల్గొన్న ఒక సభలో బాబాపై ఇంకు చల్లిన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పటి ఫోటో వాళ్లు విడుదల చేశారు. ఈ రెండు ఫోటోలను పదే పదే చూపుతూ హిందీ, ఇంగ్లీష్ చానల్స్ గంటల తరబడి కోడిగుడ్డుపై ఈకలను పీకడానికి ప్రయత్నించాయి. ఒక రాజకీయ నాయకుడి వద్దకు ఎవరైనా వచ్చి నమస్కారం చేస్తే, అతన్ని పూర్తిగా స్కాన్ చేసి, అతని పుట్టుపూర్వోత్తరాలు, నేర చరిత్ర, మనస్తతత్వం అన్నీ తెలుసుకుని ప్రతి నమస్కారం చేస్తారా? నమస్కారం చేస్తే అతని నేరాలతో వారికి సంబంధం ఉన్నట్టా? రోడ్డుమీద వనమూలికలు అమ్మేవాళ్లు గతంలో అమితాబ్, ధర్మేంద్ర వంటి ఎందరో హీరోలతో ఫోటోలు దిగి రోడ్డు మీద ప్రదర్శనకు పెట్టేవారు. అంత మాత్రాన ఆ హీరోలకు రోడ్డుమీద వైద్యం చేసే వారు ఫ్యామిలీ డాక్టర్ అనుకుంటే ఎలా ఉంటుందో ? నాయకుడికి నమస్కారం చేసిన వారి ఫోటో చూసి వారి మనిషి అనుకుంటే అలానే ఉంటుంది.

8 కామెంట్‌లు:

 1. వార్తా పత్రికలు ఇప్పుడు కూడా సినిమాలని ఎక్కువగా నమ్ముకునే పనిలో ఉన్నాయి కదా. రివిజనిస్ట్ CPM పార్టీ యొక్క అధికార పత్రికలో మార్క్సిజం గురించి ఒక్క ముక్క కూడా వ్రాయలేదు కానీ సినిమాలూ, సొల్లు కబుర్ల గురించి బోల్డు వ్రాసారు.
  https://plus.google.com/111113261980146074416/posts/eT4dWf9mSE8

  రిప్లయితొలగించు
 2. ఇది చదువుతుంటే నాకో శ్రీధర్ కార్టూను గుర్తొస్తోంది. ఒకసారి ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద చర్చలు జరుగుతూ, రెండు రోజులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అప్పుడు ఎడిటర్ ఇలా అంటాడు "వార్తలు ఏమీ లేవు కదయ్యా, నిన్నటి ఎడిషనే మళ్ళీ వేసేయండి"

  రిప్లయితొలగించు
 3. ప్రవీణ్ గారు , సుజాత గారు స్పందించినందుకు థాంక్స్ సుజాత గారు ఓపత్రికలో మిత్రుడు అంతు చిక్కని రాష్ట్ర రాజకీయాలు అని రాశాడు ... అతనికి అంతు చిక్కకపోతే ఎవరికీ అంతు చిక్కడం లేనట్టే అనేది అతని భావన

  రిప్లయితొలగించు
 4. నాకు తెలిసిన ఒక వ్యక్తి NTV రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతను పని చేసే ప్రాంతంలో వార్తలు దొరకడం లేదని టివి చానెళ్ళ యాజమాన్యాలకి తెలియకుండానే రిపోర్టర్లు వార్తలు పంచుకుంటున్నారు.

  రిప్లయితొలగించు
 5. కొన్ని చానల్స్ సినిమా న్యూస్ చానల్స్ గా మారిపోయిన ఆశ్చర్యం లేదు

  రిప్లయితొలగించు
 6. प्रवीण् शर्मा garu thanks@ mettaseema చూస్తుంటే అలానే అనిపిస్తోందండి

  రిప్లయితొలగించు
 7. The problem is with 24 hour news channels. They have to show something all through the day. What they can show. So they repeat the same news over and over. Show anything even with remotest human interest as if it is greatest breaking news.

  Now a days, watching the so called news channels is quite nauseating. What these channels calling themselves as news channels is not journalism. A new word has to be coined which should be more nearer to cheap entertainment.

  రిప్లయితొలగించు
 8. లాభాలు వస్తున్నాయి కదా అని పదేసి టివి చానెళ్ళు పెడితే, ఆ చానెళ్ళన్నిటికీ సరిపోవడానికి వార్తలు ఎక్కడ దొరుకుతాయి? సైన్స్ చానెల్ పెట్టొచ్చు కదా అని ఓసారి నేను అన్నాను. దానికి అవతలివాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? "ఇండియా అంత అభివృద్ధి చెందిన దేశం కాదు కనుక సైన్స్ చానెల్ పెడితే ఎవరూ చూడరు" అని.

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం