12, జనవరి 2012, గురువారం

మీరు వర్క్ హాలికులా - పనిమంతులా ?..... సప్త సూత్ర పరీక్షతో తేల్చు కోండి

ఆఫీసులో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒకరు -ఫైళ్లలోకి తలదూర్చేసి పనిలో బిజీగా ఉన్నారు. పక్కనే కూర్చున్న మరో వ్యక్తి టేబుల్ మీద -ఫైళ్లు గుట్టలుగా పేరుకుని ఉన్నాయి. వాటి సంగతి వదిలేసి -తన్మయత్వంతో ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. వీరిద్దరిలో ఒకరికి పని చెప్పదలిస్తే మీరు ఎవరికి చెబుతారు! నిజమే -మీరే కాదు, ఎవ్వరైనా అదే పని చేస్తారు. పనిలో బిజీగా ఉన్న వ్యక్తికే పని చెప్పాలని అనుకుంటారు.
ఇంతవరకూ ఓకె. కానీ -ఆ రెండు కుర్చీల్లో మిమ్మల్ని ఊహించుకోవాల్సి వస్తే మీరు ఏ కుర్చీలో కూర్చున్నట్టు ఊహించుకుంటారు? మీరు ఏ కేటగిరీకి ఓటేసుకుంటారో నిజాయితీగా అంచనా వేసుకోండి. మీది నిరంతరం పని చేసే మనస్తత్వమా? క్షణకాలం బద్ధకించినా మనిషి ఎందుకూ పనికిరాకుండా పోతాడని వాదించే రకమా? బద్ధకం సకల దరిద్య్రాలకు నిజరూపం అన్న వాదన కరక్టే కావచ్చు. కానీ నిరంతరం పనిలో నిమగ్నమై సొంత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మరింత ప్రమాదం. పనికి బద్ధకించినా, అతిగా పనికి ఉపక్రమించినా -రెండూ కొంపముంచే వ్యవహారాలే అన్నది నిపుణులు చెప్తోన్న మాట.
జీవనం కోసం మనం చేసే పని -జీవితంలో భాగం మాత్రమే. దాన్ని నిర్లక్ష్యం చేస్తే బతుకు పల్టీ కొట్టడం ఖాయం. అలాగని -జీవనం కోసం మనం చేసే పనే జీవితం అనుకున్నా బతుకు పల్టీ కొట్టడం మరింత ఖాయం. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం, ఏది ఎంత వరకూ అన్న విషయంపై అవగాహన పెంచుకోవడం తెలివైన వాళ్లు చేసే పని.
బద్ధకిస్తే బతుకు ఎలా పల్టీ కొడుతుందో అందరికీ తెలిసిన విషయమే కనుక దాన్ని పక్కనపెడదాం. కానీ, మనం చేసే పనే మన జీవితం అన్న భ్రమల్లో బతికేసే వర్క్‌హాలిక్‌ల లక్షణాలపై ఇటీవల శాస్ర్తియమైన సర్వే నిర్వహించారు. అలాంటి వారి జీవితంలో ప్రధానంగా ఏడు లక్షణాలను గుర్తించారు. అలాంటి లక్షణాల మీ జీవితంలోనూ కనిపిస్తున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు వర్క్‌హాలిక్‌లో కాదో మీకే అర్థమైపోతుంది.
జీవితానికి ఎన్నో లక్ష్యాలు. వాటి సాధనకు ఎన్నో పనులు. అయితే పనిలో మునిగిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారా? అదే ప్రమాదం. లక్ష్యంత ఎంత పెద్దదైనా, పనికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను దాటి మీరు పని చేస్తున్నారంటే, మీరు పని రాక్షసులే. ఆ విషయాన్ని నిర్థారించుకోవడానికి ఏడు లక్షణాలు.
కుటుంబం పట్ల నిర్లక్ష్యం: మీ వృత్తిలో మీరు ఏస్థాయిలోనైనా ఉండొచ్చు. హోదా ఎలాంటిదైనా కావచ్చు. అయితే మంచి భర్తగా, మంచి తండ్రిగా కుటుంబంలో మార్కులు తెచ్చుకోవాలి. పనిలో మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం పని రాక్షసుడి మొదటి లక్షణం.
1. సినిమాలు, షాపింగ్‌ల్లాంటి ఆనందాలకు దూరమై ఎంతకాలమైంది. 2. పిల్లల హోంవర్క్ పట్టించుకుని ఎన్ని రోజులైంది. 3. శృంగార జీవితాన్ని మర్చిపోతున్నారా? 4. బాధ్యతలను స్వీకరించలేకపోతున్నారు కదూ! ఈ లక్షణాలకు మీరు దగ్గరవుతున్నారంటే, కుటుంబ జీవితానికి దూరమైపోతున్నట్టు. సీరియస్‌గా ఆలోచించాల్సిందే.
మత్తుకు బానిస: తరచూ మద్యం తీసుకుంటున్నారా? అతిగా సిగరెట్లు తాగుతున్నారు కదూ! అంటే, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారన్న మాట. ఒత్తిడికి దూరంగా జరగాల్సిన తరుణం ఆసన్నమైంది. లేదంటే -ఆరోగ్యం ఫట్. కెరీర్‌లో పరుగులో విజయం సాధించి కొరుకున్న స్థానాన్ని సంపాదించే సమయానికి హెల్త్ గ్రాఫ్ పూర్తిగా కిందకు దిగిపోతుంది. అప్పుడు కొసరు మాట అటుంచి, అసలు జీవితానికి ఎసరొస్తుంది. ఆలోచించండి. ఉన్నతమైన కెరీర్ జీవితంలో భాగమే కానీ, అదే జీవితం కాదు. కెరీర్ కోసం జీవితాన్ని ఫణం పెట్టడం సరైన నిర్ణయం కాదని తెలుసుకోండి.
నిద్రకు పాతర: ఎక్కువ పని చేసేవారిలో సాధారణంగా కనిపించే లక్షణం నిద్ర లేమి. నిద్ర లేకపోవడం, ఒత్తిడి కారణంగా ఇస్నోమియాకు దగ్గరవుతారు. క్రమంగా నరాలు బలహీనపడతాయి. సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఉద్యోగంలో చేరిన కొత్తవారిలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితే వస్తే మీకు మీరు గ్రహించి పరిస్థితిని మెరుగు పర్చుకోవాలి. మనసుకు, శరీరానికి విశ్రాంతినివ్వడం నేర్చుకోవాలి.
నిస్సత్తువ: నిరంతరం తుమ్ములు. పడితే వదలని పడిసం. ఇలాంటివి మిమ్మల్ని బాధిస్తుంటే అధిక పనితో ఒత్తిడికి లోనవుతున్నారని అర్థం. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలుచూసుకుని కొన్ని రోజులు సెలవు పెట్టండి. నచ్చిన ప్రదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. దీనివల్ల శరీరం, ఆ తరువాత మనసు పునరుత్తేజం పొందుతాయి. మునుపటి చురుకుదనం మీలో కనిపిస్తుంది.
సిల్లీ మిస్టేక్స్: వాట్స్ యువర్ నేమ్? అన్న చిన్న ప్రశ్నకు నాలుగైదు క్షణాలు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా? లేదంటే -మీతో కలిసి పని చేసే స్నేహితుడి పేరు సైతం గుర్తుకు రావడం లేదా? అప్పుడప్పుడూ ఎదురయ్యే ఇలాంటి పరిస్థితికి -మేధావితనం వచ్చి చేరుతుందన్న భ్రమల్లో ఉండకండి. మీకు మతిమరుపు లక్షణం పెరుగుతుందన్న మాట. లేదంటే -పనిమీద ఏకాగ్రత పెరగటం వల్ల మిగిలిన అంశాలు, సొంత విషయాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న మాట. నిరంతరం పని ధ్యాసలో ఉండేవారికి ఇతర విషయాలు గుర్తుండవు. పరిస్థితి తీవ్రతకు ఇది అద్దం పడుతున్నట్టే. చిన్న చిన్న తప్పులే కదాని సిల్లీగా తీసుకోకుండా, సీరియస్‌గా ఆలోచించండి. లేదంటే, తరువాత ఆలోచించడానికి టైం ఉండదు.
కోపం, నిరాశ: బలమైన కారణం లేకుండానే కోపం వచ్చేస్తుంది కదూ! చిన్న చిన్న విషయాలకే నిరాశ పెరిగిపోతోంది కదూ! ఇంట్లో వారిపై ఆగ్రహం, పిల్లల్ని కసురుకోవడం ఎక్కువయ్యాయి కదూ! ఇవన్నీ వర్క్‌హాలిక్‌ల లక్షణాలు. పని పెరగటం వల్ల ఎదురయ్యే తిక్క ఇబ్బందులు. ఇవి మీలోనూ ఉన్నాయని గ్రహిస్తే మాత్రం జాగ్రత్త పడండి. పనిని దూరం పెట్టిండి. సమతుల్యమైన పని ప్రణాళికలు వేసకోండి. లేదంటే -ప్రేమాను బంధాలను తెంచేస్తుంది. మీలోనే కాదు, మొత్తం కుటుంబానే్న అశాంతికి గురి చేస్తుంది.
కాఫీల మీద కాఫీలు: మీకు టీ, కాఫీ తాగే అలవాటుందా? ఎన్నిసార్లు తాగుతారు? ఒకటీ రెండుసార్లంటే ఓకే. అదే పనిగా సేవించేవాళ్లంతా వర్క్‌హాలికులే. అదీ చివరి స్టేజికి చేరిపోయిన వాళ్లన్నమాట. డజనుసార్లు కాఫీ, టీ తాగడమంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు. ఒత్తిడి భయం నుంచి తప్పించుకోవడానికే వీటిని ఆశ్రయిస్తున్నారని అర్థం. కొన్నాళ్లకు మీ శరీరం డజను టీ, కాఫీలను భరించే స్థితిని కోల్పోతుంది. నిద్ర దూరమైపోతుంది. ఇస్నోమియా కౌగిలించుకుంటుంది. ఆరోగ్యం హరించుకుపోతుంది. ఈ లక్షణాలు కాసిన్ని కనిపించినా జాగ్రత్త పడండి. పనితీరు మార్చుకోండి.
పనిలో బద్ధకించకూడదు.. కరక్టే. కానీ, పనే జీవితం కాకూడదు. కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలి. మీకోసం మీరెంత సమయం పెట్టుకోవాలి. పనికి ఎంత సమయం కేటాయించాలో మీకు మీరే నిర్ణయించుకోండి. ప్రణాళిక వేసుకోండి. అనారోగ్యంతో చేసే పనిలో నాణ్యత ఉండదు. ఇదీ, ముక్తాయింపు.

2 కామెంట్‌లు:

 1. హాలికులు పనిమంతులు.
  పనిమంతులంతా హాలికులు కాలేరేమో !


  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 2. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు..... nice post sir..:):)

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం