1, ఫిబ్రవరి 2012, బుధవారం

మధురవాణి..చింతామణి..సామాజిక న్యాయం


 ‘‘వా’నాకు అది కావాలి అని ఆరేళ్ల బాబిగాడు కాళ్లు నేలకేసి కొట్టుకుంటున్నాడు. కావాలంటే క్యాడ్‌బరీ తీసుకో అని తాత పరంధామయ్య వాడిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడేమో ఏడుపు శృతి పెంచాడు. తినే వస్తువు కాకపోతే టీవిలో అంత మంది ప్రముఖులు అదే మాటను మళ్లీ మళ్లీ ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించాడు. పదే పదే ఒకే మాట వినిపిస్తే అది కచ్చితంగా యాడ్ అని, యాడ్ అంటే తినే వస్తువే అనేది వాడు నమ్మిన సిద్ధాంతం. ‘‘నాన్నా వాడేదో అడుగుతున్నాడు ఇవ్వోచ్చు కదా?’’ అని లోపలి నుంచి కూతురు ఆదేశించింది. ‘‘అది కాదమ్మా వాడేమడుగుతున్నాడో మీకు తెలుసా?’’ అని తండ్రి మాటను పూర్తి చేయక ముందే, ‘‘తెలుసులే నాన్నా వాడేమన్నా నీ కొడుకు కొడుకు కాదు కదా! కూతురు కొడుకు కదా? ఇలానే ఉంటుందిలే’’ అని కూతురు ముక్కు చీదుకుంటూ వంట గది నుంచే నిష్టూరంగా పలికింది.

 ‘‘ఇదిగో మిమ్మల్నే.. రిటైర్ అయి పని పాటా లేకుండా ఇంట్లోనే ఉన్నారు కదా? మనవడు అడిగింది కొనివ్వలేరా?’’ అని అక్కడి నుంచే కూతురుకు మద్దతుగా భార్య గర్జించింది. పరిస్థితి చేయి దాటి పోయేట్టుగా ఉందని కంగారు పడ్డ పరంధామయ్య పదరా బుజ్జి నువ్వడిగింది ఇస్తాను అని బయటకు నడుస్తూ, వాడికి సామాజిక న్యాయం కావాలట! టీవిలో కనిపించిన ప్రతి ఒక్కరు, సామాజిక న్యాయం... సామాజిక న్యాయం అంటుంటే. వీడేమో అదేదో తినే వస్తువు అనుకుంటున్నాడు.అని పరంధామయ్య చెప్పాడు.
***
ఏమిచ్చినా బాబిగాడు ఊరుకోవడం లేదు. సామాజిక న్యాయమే కావాలంటున్నాడు. మిత్రులకు ఫోన్ చేసి పార్క్‌కు రమ్మన్నాడు పరంధామయ్య. సామాజిక న్యాయం కంటికి కనిపించేది కాదురా బుజ్జి అని బుజ్జగిస్తూ చెప్పాడు. కనిపించక పోతే ప్రతి ఒక్కరూ అదే ఎందుకు చెబుతారు? నాకు సామాజిక న్యాయం కావాలి అని మళ్లీ ఏడుపు అందుకున్నాడు. ఇంతలోనే మిత్రులు రావడంతో బుజ్జిగాడి సమక్షంలోనే మిత్రులంతా సామాజిక న్యాయంపై చర్చ మొదలు పెట్టారు. ‘‘నాకు తెలిసి ఎన్టీఆర్ చేసిన సామాజిక న్యాయం మరెవ్వరూ చేయలేదు. షష్టిపూర్తి + డజను సంవత్సరాల వయసులో తమ వర్గం శ్రీమతినే పెళ్లి చేసుకున్న దాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది?’’ అని ఎన్టీఆర్ అభిమాని చెప్పుకొచ్చాడు. ‘‘అసలు సామాజిక న్యాయం అనే పదానికి గ్లామర్ తీసుకు వచ్చిందే మా చిరంజీవి, ఓట్లు మా వాళ్లే వేశారు, సీట్లు మా వాళ్లే గెలుచుకున్నారు, మంత్రి పదవులు మా వాళ్లకే ఇప్పించుకున్నాం ఇంతకు మించిన సామాజిక న్యాయం ఏముంటుంది’’ అని చిరు అభిమాని ప్రశ్నించాడు.

 ‘‘ వైఎస్‌ఆర్ హయాం ఆయన తన ప్రత్యర్థి సామాజిక వర్గాల వారిని సైతం తన కోటరీలో చేర్చుకున్నారు. ఇంతకు మించిన సామాజిక న్యాయం ఇంకేముంటుంది అదే దారిలో జగన్ పయనిస్తున్నారు. వారిని మించిన సామాజిక న్యాయం ఇంకెక్కడుంటుంది’’ అని ఆయన అభిమాని సూటిగా ప్రశ్నించారు. సామాజిక న్యాయం, బాబు ఒకరి కోసం ఒకరు పుట్టారు. అతుక్కొని పుట్టిన వీణావాణి కవలపిల్లల మాదిరిగా బాబు సామాజిక న్యాయం కలిసే పుట్టాయి. వాటిని విడదీయడం ఎవరికీ సాధ్యం కాదని పచ్చ చొక్కా ఆయన ఆవేశంగా పలికాడు. అల్లుడు, మేనల్లుడు, కూతురు వీరి కోసం తపించడాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది సామాజిక న్యాయంలో కెసిఆర్‌ను మించిన వారు లేరని ఇంకొకాయన బల్లగుద్ది చెప్పాడు.
మీరంతా మీమీ సామాజిక వర్గాం వారి గొప్పలు చెప్పుకుంటూ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. గతి తార్కిక భౌతిక వాదం గురించి అవగాహన లేని బూర్జువా శక్తులు మాత్రమే ఇలా మాట్లాడగలవు. మీకు దధీచి తెలుసా? అని ఎర్రన్న సీరియస్‌గా అడిగాడు. వాడెవడు రష్యన్ కమ్యూనిస్టు నాయకుడా? అని ఓ పెద్దాయన ఎద్దేవా చేశాడు. ఒక రకంగా ఆయన పూర్వపు కమ్యూనిస్టు. దధీచి తన వెన్నుముకను ఇంద్రుడికి ఇస్తే, దాంతో ఇంద్రుడు వంద అంచులు గల వజ్రాయుధాన్ని చేసుకొన్నాడు. ఇంద్రుడి ఆయుధం కోసం దధీచి తన వెన్నుముకను ఇస్తే కమ్యూనిస్టు సోదరులు పువ్వాడ నుంచి రాఘవులు వరకు చంద్రుడి కోసం తమను తానే ఆర్పించుకున్నారు. సామాజిక వర్గ ప్రయోజనాల కోసం సొంత పార్టీని త్యాగం చేసి తెలుగు పార్టీ పల్లకీని మోసిన మా ఎర్రన్నలను మించిన సామాజిక న్యాయం ఎక్కడుంది ఎర్రాభిమాని ప్రశ్నించాడు.
ఏరా కపాలేశ్వర్ నువ్వేమంటావు. ప్రతి దానికి కన్యాశుల్కం గురించి చెబుతావు కదా? అని పరంధామయ్య సన్నిహిత మిత్రున్ని అడిగాడు. నాకు మాత్రం మధురవాణి, చింతామణిలు గుర్తుకొస్తున్నారు. గిరీశం మొదలు లుబ్దావధాన్లు వరకు అందరినీ సమానంగా ఆదరించిన మధురవాణి, భవానిశంకర్ నుంచి సుబ్బిశెట్టి వరకు అందరినీ సమానంగా ఆదరించిన చింతామణిని మించి సామాజిక న్యాయం చేసినవారు ఎవరున్నారని కపాలేశ్వర్ పకపకా నవ్వాడు.

 ఏడవాలో, ఏడుపు నిలిపివేయాలో నిర్ణయించుకోలేక బుజ్జిగాడు ఆయోమయంలో పడిపోయాడు.

12 కామెంట్‌లు:

 1. మీరు రాసిన వ్యాసాలను క్రమం తప్పకుండా చదువుతూవుంటాను. ఈ వ్యాసం చాలా, చాలా బాగుంది. Excellent.

  రిప్లయితొలగించు
 2. rama గారు థాంక్స్. మన నాయకుల వ్యవహారం ఇలా బాగా రాయడానికి వీలుగా ఉంది .

  రిప్లయితొలగించు
 3. రాఘవులు గురించి అడిగారు కాబట్టి నేను సమాధానం చెపుతున్నాను. రాఘవులు మార్క్సిస్ట్ కాదు. నిజ జీవితంలో దేనికీ పనికిరాని కులం కోసం అతను తన సిద్ధాంతాలని త్యాగం చేశాడంటే అతను జీవితంలో దేనికీ పనికిరాడని అనుకోవాలి.

  కులం అనేది ఐడెంటిటీ ప్రాకులాటకి సంబంధించినది తప్ప ఇంకొకటి కాదు. నిజంగా గతితార్కిక భౌతికవాదం అర్థమైనవాళ్ళు ఎవరూ కులం లాంటి వాటిని నమ్మరు. గతితార్కిక భౌతికవాదం మనిషికీ, సమాజానికీ మధ్య సమతుల్యత ఉండాలని చెపుతుంది. సమాజం గురించి ఆలోచించని వైయుక్తికవాదులు కులం గురించి కూడా ఆలోచించే అవకాశం లేదు కానీ తమ ఐడెంటిటీ కోసం కులం పేరు చెప్పుకుంటారు. సమాజం గురించి ఆలోచించకుండా కులం, మతం లాంటి ఐడెంటిటీల పేర్లు చెప్పుకుని సంతృప్తి పడాల్సిన అవసరం మార్క్సిస్ట్‌లకి ఉండదు. సమాజం గురించి ఆలోచించేవాడు కులంతో నిమిత్తం లేకుండా కులం బయటి ప్రపంచం గురించి ఆలోచిస్తాడు కానీ కులం లోచనాలలోంచి సమాజాన్ని చూడడు.

  గతితార్కిక భౌతికవాదానికీ, కులానికీ మధ్య పొంతన అనేది కుదరదు అని ఏ మార్క్సిస్ట్‌నడిగినా, మావోయిస్ట్‌నడిగినా చెప్పగలడు. కులం కోసం సిద్ధాంతాలని త్యాగం చేసే రాఘవులు లాంటివాళ్ళు మాత్రం మార్క్సిస్ట్‌లు అయ్యే అవకాశం లేదు.

  రిప్లయితొలగించు
 4. ‘‘నాకు తెలిసి ఎన్టీఆర్ చేసిన సామాజిక న్యాయం మరెవ్వరూ చేయలేదు. షష్టిపూర్తి + డజను సంవత్సరాల వయసులో తమ వర్గం శ్రీమతినే పెళ్లి చేసుకున్న దాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది? muraligaru e sentence ekkado kodutondandi. lp ntr samajika vargam kademo

  రిప్లయితొలగించు
 5. (మీరు రాసిన వ్యాసాలను క్రమం తప్పకుండా చదువుతూవుంటాను. ఈ వ్యాసం చాలా, చాలా బాగుంది. Excellent) * 100= My self

  ?!

  రిప్లయితొలగించు
 6. ravi adidam garu ఇద్దరూ ఒకటే వర్గ మండి ... ఈ విషయం లో అనుమానం అవసరం లేదు. మరింత వివరంగా చెప్పలేను

  రిప్లయితొలగించు
 7. ఎందుకో ? ఏమో ! garu yaramana garu మీ ప్రోత్సాహానికి థాంక్స్

  రిప్లయితొలగించు
 8. प्रवीण् शर्मा garu గతి తార్కిక బౌతిక వాదం అని సరదాగా రాశాను దాని గురించిపెద్దగా తెలియదు.. చదవలేదు

  రిప్లయితొలగించు
 9. గతితార్కిక-చారిత్రక భౌతికవాదం చదివితేనే అర్థమవుతుంది. కేవలం నోటి మాటలు వింటే అర్థం కాదు. "కులం" అనే కాన్సెప్ట్‌కి సాధారణ భౌతికవాదంతో కూడా పొంతన కుదరదు. దానికి గతితార్కిక భౌతికవాదంతో పొంతన కుదిరే అవకాశం లేదు. రాఘవులుని ఎర్రబాబు అని మీరు అంటే సాధారణ భౌతిక సూత్రాలు కూడా అర్థం కాని రాఘవులు మార్క్సిస్ట్ ఎలా అవుతాడు అని అడగడానికి వ్యాఖ్య వ్రాసాను. గతితార్కిక-చారిత్రక భౌతికవాదం గురించి చదివిన తరువాతే వ్రాయండి. గతితార్కిక-చారిత్రక భౌతికవాదం గురించి ఏటుకూరి బలరామమూర్తి గారు వ్రాసిన రచనలూ, కంభంపాటి సత్యనారాయణ గారు వ్రాసిన రచనలూ సులభంగా అర్థమవుతాయి.

  రిప్లయితొలగించు
 10. ఇక్కడ నా ఉద్దేశం నాయకులంతా వాళ్ళ వర్గం ( కమ్యూనిజం లోని వర్గం కాదు ) కోసమే పని చేస్తున్నారని చెప్పడం తప్ప ..గతి తార్కిక ..... గురించి విమర్శించడం .. చర్చించడం కానే కాదు ... సాధారణంగా ఆ పదం కమ్యునిస్తులకు సింబాలిక్ కాబట్టి ఉపయోగించాను.

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం