29, ఫిబ్రవరి 2012, బుధవారం

సెల్‌టవర్ ప్రజాస్వామ్యం.... మాయదారి మల్లిగాడు

ఇరవైమూడు జిల్లాల నుంచి పేరుమోసిన పెద్దవారంతా ఒకరి తరువాత ఒకరు వస్తున్నారు. ‘‘ఎలాగున్నావన్నాయ్ ఈ మధ్య ఏమైనా కొత్తగా మర్డర్లు చేశావా? పాత మర్డర్లేనా? ఇంకెంత కాలం పాత మర్డర్ల గురించి చెప్పుకొని తిరుగుతావన్నాయ్ ... ’’ ఒక పరాచికం. ‘‘చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్టు మీ ఫాదర్ చేసిన హత్యలేనా? కనీసం ఒక్కడినన్నా చంపావా! బావా!’’ ఒకరి చమత్కారం. జైలుకెళ్లి వచ్చినట్టున్నావు బాగా ఒళ్లు చేశావ్! మధ్య వయసు రౌడీని స్నేహితుడు పలకరించాడు. లేదన్న చిన్నబ్బాయి మలేషియాలో రౌడీ ట్రైయినింగ్‌కు వెళితే తోడుగా ఉండొచ్చని వెళ్లి వచ్చాను. మసాజులతో ముఖం కాస్తా మారింది... అని నవ్వాడు. 


పెద్దింట్లో పెళ్లివారి విడిదిలా కోలాహాలంగా ఉందా ప్రాంతం.
సమావేశం ప్రారంభానికి సూచనగా గంట మ్రోగించారు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. చీమకుట్టిన శబ్దం, దోమ తుమ్మిన తుమ్ము వినిపించేంత నిశ్శబ్దం. మాయదారి మల్లిగాడు గారు లోనికి ప్రవేశించారు. సుశిక్షితులైన సైనికుల్లా అంతా లేచి నిలబడ్డారు. ఆయన అసలు పేరేమిటో ఆయనతో సహా ఎవరికీ తెలియదు. మాయదారి మల్లిగాడు సినిమా వచ్చినప్పుడు అచ్చం అలానే లుంగి కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని మామూళ్లు వసూలు చేసేవాడు. ఆ పేరే అతనికి స్థిరపడిపోయింది. తరువాత వందలాది ఎకరాలను ప్లాట్లు అమ్మి, వందలాది మంది ఏజెంట్లతో ఇన్‌స్టాల్‌మెంట్లు వసూలు చేయిస్తున్నందున పేరు తరువాత గారు చేరి మాయదారి మల్లిగాడు గారు అయింది. మల్లిగాడు గారికి తన పర అనే తేడా ఉండదు. అందుకే తన భూమితో పాటు ప్రభుత్వ భూమిని కలుపుకొని తనవిగానే చూసుకుంటాడు. అలాంటి మల్లిగాడు అధ్యక్ష స్థానంలో ఉండి సమావేశాన్ని నిర్వహిస్తుండడంతో అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
అలాంటి వాతావరణంలో ‘నీ యబ్బ ఒరేయ్’ అని చైనా నుంచి దిగుమతి చేసుకున్న లెటెస్ట్ రింగ్‌టోన్ వినిపించగానే అంతా అటు వైపు తలలు తిప్పారు. సంస్కారం లేని వాళ్లు కూడా పెద్ద రౌడీలమని చెప్పుకుంటారు. సిగ్గుండాలి అని వెనకవైపు ఉన్నవారు ఎవరో తిట్టారు. ఆ మాటలతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏనుగు ఘీంకరించినా వినిపించనంత గందరగోళంగా మారింది. చిట్టినాయుడుకి చిర్రెత్తుకొచ్చింది. ఎవరినుద్దేశించి తిట్టారో కానీ తననే అలా తిట్టారని అనిపించింది. మీకు సిగ్గుతో పాటు లజ్జ ఉండాలి’’ అన్నాడు. సిగ్గు,లజ్జ అంటే రైతు బజారులో అమ్మే కూరగాయలు కావురా? విదేశాల్లో మాత్రమే అమ్ముతారు అని వెనక నుంచి ఎవరో అరిచారు. నువ్వు కూడా మాట్లడేటోడివేనా? మా అబ్బాయి చిన్నప్పటి నుండి సంస్కారవంతమైన సబ్బుతో స్నానం చేయడమే కాదు, తినేవాడు కూడా. నీ కొడుకులా నా కొడుకు జిల్లాపరిషత్ స్కూల్‌లో చదవలేదు. కానె్వంట్ స్కూల్‌లో చదివించాను. చిన్నప్పుడు వాడు ఉగ్గుపాలు వద్దని సంస్కారవంతమైన సబ్బు త్రిబుల్ ఎక్స్‌నే కొరికే వాడు. అలాంటి మా వాడి గురించి మాట్లాడే అర్హతుందా? నీకు? మీవాడు అమ్మాయిలను ఉపయోగించుకుని ఉట్టిచేతులతో పంపేవాడు, మా వాడు అలా కాదు. వారి అనుమతితోనే ఒక పద్ధతి ప్రకారం అనుభవించి, సొంత కారులో ఇంటివద్ద దిగబెడతాడు. అంతటి సంస్కారవంతుని గురించి నీ లాంటి వాడా మాట్లాడేది అని మండిపడ్డాడు.


 ఎవరు ఎవరిని తిడుతున్నారో అర్ధం కావడం లేదు.
మల్లిగాడు లేచి నిలబడి గట్టిగా అరిచాడు. మళ్లీ నిశ్శబ్దంగా మారింది. మనం ఇలా పోరాడుకుంటే ఇక రౌడీలకు ప్రజా నాయకులకు తేడా ఏముంటుంది. మనం వీధిలో నడుస్తుంటే నలుగురు నమస్కారం చేస్తారు. అలాంటి గౌరవ ప్రదమైన రౌడీ వృత్తిలో ఉన్న మనం ప్రజా నాయకుల్లా తిట్టుకోవడం సిగ్గనిపించడం లేదూ! కనిపించని నాలుగో సింహం పోలీసు అయితే మనం కనిపించే మూడో సింహాం. అంటూ మల్లిగాడు కళ్లు తుడుచుకున్నాడు. వాతావరణం ఒక్కసారిగి ఉద్వేగంగా మారింది. రాజకీయ నాయకుల ప్రవర్తన నాకు ఆవేదన కలిగించింది. అందుకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాను. నాయకుల మాటల వల్ల రౌడీల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నాయకులు తమ మాటల తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రౌడీల సంఘం నాయకులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించి, నాయకులకు పంపించింది.
రాజకీయ సభలను నాయకుల కుటుంబ చరిత్రల పరిశోధనకే పరిమితం చేసి ప్రజల కోసం ప్రతి నియోజక వర్గ కేంద్రంలో ఒక భారీ సెల్ టవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఎవరైనా ఈ టవర్ ఎక్కి తమ సమస్యలను చెప్పుకుంటారు. పరిష్కరిస్తే సరి లేకపోతే ఆ టవర్ నుంచి దూకాలి. సెల్ టవర్లే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. అని మల్లిగాడు ప్రకటించగానే అంతా చప్పట్లు కొట్టారు. సెల్‌టవర్ ప్రజాస్వామ్యాన్ని తరువాత గ్రామ స్థాయికి విస్తరించాలని నిర్ణయించారు.

2 కామెంట్‌లు:

  1. మాంచి కత్తిలాంటి వ్యంగ్యం..మురళీగారు. రాజకీయనాయకులు కనిపెంచే రౌడీయిజం కనిపించే మూడోసింహంగా తయారయి రాజ్యాన్ని శాసిస్తోంది. చివరి పేరా ముందురాసిన విషయానికి సరిగ్గా అతకలేదనిపించింది...రాజకీయనాయకులు ధోరణిని మరికొంచెం ఎండగడితే గానీ, టపాలో డోసు సరిపోదేమో.

    రిప్లయితొలగించు
  2. సభా హక్కుల ఉల్లంఘన అని పిలిచి కేసు పెడతారేమో అనేది చూసుకొని జాగ్రత్తగా రాయక తప్పదండి ( తిట్టుకోవడానికి హక్కులేమిటో )

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం