8, ఫిబ్రవరి 2012, బుధవారం

జ్ఞాన శిక్షలు!....హిరోను కుక్కను చేసి పిల్లిలా వెంట తిప్పుకున్న విఠలాచార్య..... అత్తవారింటి కాపురం తో అల్లుడికి తత్వం బోధపడుతుంది

సినిమాకు హీరో ఊపిరి. మరి అలాంటి ఊపిరికి ఆగ్రహం వస్తే, సినిమా ఊపిరి ఆగిపోతుంది. అందుకే హీరోలకు కోపం రాకుండా వాళ్లను కంటికి రెప్పలా, ఇంటికి అల్లుడిలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇలానే పాత కాలంలో ఒక హీరోగారికి కోపం వచ్చింది. ఇంకేం ఆ సినిమా ఊపిరి ఆగిపోయినట్టే అనుకున్నారు. దర్శకుడు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇంటావిడ అలిగి బతిమిలాడడానికి ఇంకా మొగుడు రాలేదేమిటని ఎదురు చూసినట్టుగా ఆ హీరో తనను బుజ్జగించేందుకు దర్శకుడు, నిర్మాత, యూనిట్ మొత్తం కట్టకట్టుకుని వస్తారని అనుకున్నాడు.
 చాలా సేపు గడిచిపోయినా హీరో గారి అలకను పట్టించుకున్న వారు లేరు. పైగా సినిమా షూటింగ్‌ను ఒక్క నిమిషం కూడా ఆపలేదు. ఇదెలా సాధ్యమబ్బా అని ఆశ్చర్యపోయిన హీరో విషయం తెలుసుకుని లబోదిబోమంటూ ఇకపై ఎప్పుడూ అలగనని దర్శకుడికి రాయబారం పంపాడట! ఇది నిజంగా జరిగిందే. ఆ దర్శకుడు విఠలాచార్య. హీరో అలిగాడని తెలిసి ఆయన ఏ మాత్రం కంగారు పడకుండా హీరోను కుక్కను చేసినట్టు కథ మార్చేసి షూటింగ్ జరిపించారు. ఆయనే విఠలాచార్య. దయ్యాలను హీరోయిన్లుగా, కుక్కలు, నక్కలు, పాములుగా చేశారాయన. హీరోను కుక్కగా మార్చి, అందమైన హీరోయిన్ ఒళ్ళో కుక్క ఒదిగిపోయి తెగ నటించేస్తుంటే హీరో దారికి రాకుండా ఉంటాడా? హీరోయిన్ ఒళ్లో కుక్క కన్నా తానే బాగా నటించేస్తానని బతిమిలాడి మరీ దారికి వచ్చాడట హీరో. అందుకే బాబోయ్ విఠలాచార్యవి ఇదేం వింత శిక్షలు అని సినిమా వాళ్లు భయపడి, ఆయన ముందు పిల్లుల్లా ఉండేవారు.


 ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే అంటాడు రేలంగి ఓ సినిమాలో. వాడికేం వాడిని అల్లుడిలా చూసుకుంటారు అంటారు కానీ శిక్షల్లో అత్తగారింటికి వెళ్లడానికి మించిన శిక్ష ఉండదని చాటిచెప్పే పురాతన కథ ఒకటి ఉంది.
సంస్కృత మహాకవుల్లో భారవి ఒకరు. కిరాతార్జునీయం వంటి మహాకావ్యం రాసిన భారవికి సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. చిన్న వయసు నుండే అపారమైన పాండిత్యాన్ని ప్రదర్శించిన భారవిని అంతా మెచ్చుకుంటుంటే, తండ్రి మాత్రం వాడి మొఖం వాడికేం తెలుసు అనేవాడు. మహామహా పండితులను ఓడించాక, ఘన సన్మానం తర్వాత కూడా భారవికి తండ్రి నుండి అవే మాటలు వినిపించాయి. ఒకసారి భారవి కోపాన్ని అణచుకోలేక తనను అభినందించడానికి బదులు అవహేళన చేస్తున్నాడని తండ్రిని ఇక మట్టుపెట్టక తప్పదనుకుని అదే విషయం తల్లికి చెబుతాడు. తొందరపడకు విషయం తెలుసుకుంటానని చెప్పి తల్లి ఈ సంగతి భర్తకు చెబుతుంది. తండ్రి కుమారుడిని మెచ్చుకుంటే ఆయువు క్షీణమవుతుందని, ఆ కారణం చేతనే మెచ్చుకోవడం లేదని భార్యకు చెబుతాడు. అసలు విషయం తెలిసిన తరువాత భారవి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేయాలని తండ్రిని అడుగుతాడు. ఎందుకొచ్చాను, ఎన్ని రోజులు ఉంటాను అనేది చెప్పకుండా ఏడాది పాటు అత్తవారింటిలో ఉండి రమ్మని భారవిని పంపిస్తాడు. అల్లుడిని వారం పాటు బాగా చూసుకున్న అత్తామామ, బావ మరుదులు ఎంతకూ పోడేమిటని రెండు వారాల తరువాత ఇంటి పనులు చెప్పడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పొలం పనులు చెబుతారు. ఒక కూలీ మాదిరిగానే భారవి పొలంలో పని చేస్తే, వారి మాదిరిగానే అతనికి తిండి పెడాతారు. కలం పట్టుకోవలసిన ఆ చేతులు హలం దున్నుతాయి. భార్య కన్నీరు మున్నీరై ఏడుస్తుంది. అలా ఏడాది గడిచిన తరువాత అప్పుడు భారవి భార్యతో కలిసి ఇంటికి బయలు దేరుతాడు. తాను చదివిన ఎన్నో గ్రంధాలు నేర్పించని జీవిత పాఠాలను ఏడాది పాటు అత్తగారింటిలో గడిపిన కాలంలో నేర్చుకున్నాని భారవి చెబుతాడు. భారవి తండ్రి నిజంగానే జీవిత సత్యాలు భాగా తెలిసిన వాడు. తన కుమారుడికి చిత్రమైన శిక్ష వేసి, శిక్షతో అతను మరింత రాటుదేలిపోయేట్టు చేశాడు.


 ఒక్కోసారి శిక్షలు అద్భుతమైన జీవిత సత్యాలను బోధిస్తాయి. మార్క్‌ట్వైన్ సైతం అంతే కదా జైలు శిక్ష పడిన తరువాతనే అతనిలో ఒక అద్భుతమైన రచయిత బయటకు వచ్చారు. మన దేశ నాయకులు జైల్లోనే మంచి గ్రంథాలు రచించారు.
రాజు తప్పు చేయడు అని ఇంగ్లీష్ వాడు నమ్మినట్టు స్వాతంత్య్రం వచ్చాక అదే సూక్తిని ఐఎఎస్ బాబులు తప్పు చేయరు అని అనువదించుకున్నారు. తప్పు చేసినా అది రాజు చేశాడు కాబట్టి అది తప్పు కాదన్నమాట అందుకే రాజు తప్పు చేయడు అన్నారు. మరి తప్పు చేశారు కదయ్యా! ఆధారాలున్నాయి కదా? అని ప్రశ్నిస్తే, మమ్మల్ని బెదిరించి తప్పు చేయించారు, లేకపోతే మేం తప్పు చేయడం ఏమిటంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పాలించేది మంత్రులు మేమంతా నిమిత్తమాత్రులం అంటున్నారు. ఐఎఎస్‌లకే అన్నీ తెలుసు అని మొన్నటి వరకు గట్టిగా నమ్మిన వారు ఇద్దరు ముగ్గురు జైలుకెళ్లగానే మాకేం తెలుసు అంటున్నారు. ఏమీ తెలియదంటున్న ఐఎఎస్ బాబులు ఇప్పుడు జైలుకు వెళ్లి బోలెడు చదువుకుని, అన్నీ తెలుసుకుని వస్తే సరిపోతుంది. అధికారాంతమున చూడవలె అన్నట్టు శిక్షల భయంతో అటు నేతలు, ఇటు బాబులు మాకేమీ తెలియదంటే మాకేమీ తెలియదని అజ్ఞానంలో పోటీ పడుతున్నారు. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు కొందరికి శిక్షలతో జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానశిక్షలకు మించిన శిక్ష లేదు.

8 కామెంట్‌లు:

 1. నిజం ... హనుమంతుని ముందు కుప్పి గంతులు అన్నట్టు విఠలాచార్య ముందు వేశాలా ?

  రిప్లయితొలగించు
 2. మురళీ గారూ! నమస్తే. క్షీర సాగరాన్ని మథిస్తేనే వచ్చిన అమృతాన్నే మథించే మీకు అభినందనలు.
  ఈ క్రింది లింక్ తెరచి, చదివి, మీ బ్లాగు ద్వారా పాఠకులకందింప మనవి.
  http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html

  రిప్లయితొలగించు
 3. నైస్ పోస్ట్ అండీ.. ఫినిషింగ్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు..;)

  ఇంతకీ ఆ హీరో ఎవరూ? (చెవిలో చెప్పేయండీ)

  రిప్లయితొలగించు
 4. రాజ్ కుమార్ గారు నచ్చినందుకు థాంక్స్ . చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో చదివాను. వాళ్ళు పేరు ప్రస్తావించ లేదు. (ప్రస్తావించ లేదు అనే అనుకుంటున్నాను )

  రిప్లయితొలగించు
 5. చాలా బాగుందండీ! మీరు వ్రాసినదంతా చదివాక ఏంటో నాకు కూడా ఆ హీరో ఎవరో తెలుసుకోవాలనే ఉంది! అయినా బ్రతిమాలతారులే అని అర్థం లేకుండా అలిగితే ఇలానే ఉంటుంది. అచ్చికచ్చికా!

  రిప్లయితొలగించు
 6. ఐతే ఇలాంటి సైలెంట్ శిక్ష లేస్తే దెబ్బకు దారి కొస్తారన్నమాట :)

  రిప్లయితొలగించు
 7. @రసజ్న గారు నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా
  @మాలా కుమార్ గారు ఏమోనండి ఆరోజుల్లో ఇలాంటి శిక్షలతో మారారు. ఇప్పుడు హీరోలు కంటి చూపుతో చంపేస్తాము అంటున్న కాలం.

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం