23, మే 2012, బుధవారం

జీతం-జీవితం-ఆత్మ సంతృప్తి!...జర్నలిస్టు లారా జీతం కోసం వద్దు ఆత్మ సంతృప్తి తో కోట్లు సంపాదించండి

‘‘నోబెల్ బహుమతుల్లో మన వాళ్లకు అన్యాయం జరుగుతోంది’’
‘‘నీకెందుకలా అనిపించింది. ’’
‘‘కొత్తవాటిని కనిపెట్టిన వారికే కాకుండా, పాత విషయాలను కొత్త కోణంలో పరిశోధన చేసిన వారికి ఈ అవార్డు ఇస్తే ఏటా మన వారికే దక్కుతుంది’’
‘‘ఒకటి రెండు పరిశోధనల గురించి చెప్పు’’
‘‘కొత్తవాటిని కనిపెట్టలేనప్పుడు పాత వాటిని కొత్త కోణంలో కనిపెట్టాలి. శ్రీరాముడు మంచి వాడని అంతా అంటారు కదా? కానే కాదు మన వాళ్లు పరిశోధన చేసి ఆయన మహా దుష్టుడని తేల్చేశారు. అంతేనా రావణుడు మహా జ్ఞాని, అని ఇంకా ఏవేవో కనిపెట్టారు.’’
‘‘ఇప్పుడు కనిపెట్టడం ఏమిటి? చాలా కాలం క్రితమే ఎన్టీరామారావు తన సినిమాల్లో దుర్యోధనుడ్ని హీరోగా, పాండవులు అతనికి అన్యాయం చేసినట్టు చూపించారు. అంత కన్నా చాలా ముందే రావణాసురుడి గొప్పతనం చూపించారు కదా?’’


‘‘అప్పుడు సినిమాల్లో చూపించారు ఇప్పుడు మేధావులు ఈ విషయాన్ని బహిరంగ చర్చల్లో నిరూపిస్తున్నారు. ఇలాంటి వారికి నోబెల్ బహుమతులు దక్కితే మరిన్ని అద్భుత విషయాలు బయట పడతాయి కదా?’’
‘‘ఎంత వరకు చదువుకున్నావేమిటి?’’
‘‘చదువు మీద ఎక్కువగా దృష్టి పెడితే ఎవడి దగ్గరో జీతగాడిగానే పని చేయాల్సి వస్తుంది! తక్కువగా దృష్టిపెడితే మనమే ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉంటామనే జ్ఞానం చిన్నప్పుడే సంపాదించా. అందుకే పెద్దగా చదువుకోలేదు’’


‘‘సత్యహరిశ్చంద్రుని సత్యవాక్కులో పెద్ద కుంభకోణం, దేవుళ్ల కుట్ర ఉందని నిరూపించాలనుకుంటున్నాను ఎలా ఉంటుందటావు?’’
‘‘ఏమిటో ఆ కుంభకోణం తెలుసు కోవచ్చా?’’
దేవుళ్లు తనను పరీక్షిస్తున్నారని, వాటికి తట్టుకొని నిలబడితే మళ్లీ తన రాజ్యం తనకు దక్కుతుందనే సమాచారం హరిశ్చంద్రునికి ముందే లీకైంది. అందుకే చివరకు రాజ్యాన్ని వదులుకున్నాడు, కాటికాపరిగా పని చేశాడు.’’
‘‘నమ్మలేకపోతున్నాను’’
‘‘సినిమాల్లో చివరకు హరిశ్చంద్రునికి రాజ్యం, రాజ్యలక్ష్మి దక్కుతుందని తెలిసి కూడా ప్రేక్షకులు ఆయన బాధలు చూసి కన్నీళ్లు పెట్టారా? లేదా? ప్రేక్షకులే అంతగా జీవించినప్పుడు హరిశ్చంద్రుడు అన్నీ తెలిసి పాత్రలో జీవించాడని నేనంటే నువ్వు కాదంటావా? ’’
‘‘ఏమో’’


‘‘సరే కానీ మీకు తెలిసిన వారున్నారు కదా? నన్ను ఏదైనా పత్రికలో చేర్పిస్తారా?’’
‘‘జర్నలిజంలోకే ఎందుకు రావాలనుకుంటున్నావు? ’’
దేన్నయినా పరిశోధించే అలవాటుంది. దీన్ని గురించి కూడా బాగా పరిశోధించి ‘ఆత్మ సంతృప్తి’తో ఎక్కడికో వెళ్లే అవకాశం ఉండడం వల్ల నాకు ఇదే బెటరనుకుంటున్నాను. ’’
‘‘ఆత్మ సంతృప్తి కోసం పని చేస్తే ఎక్కడికో ఎలా వెళతాం’’
‘‘మా గురువు గారు జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఆత్మ సంతృప్తి తప్ప ఆర్థిక తృప్తి లభించదు ఆలోచించుకో అని పెద్దలు సలహా ఇచ్చారు. ’’
‘‘జర్నలిజాన్ని గురువుగారు సమున్నత శిఖరాలకు తీసుకు వెళ్లారు. గతంలో జర్నలిస్టులు అంటే బీరు బాటల్‌కు కక్కుర్తి పడతారు అనే విమర్శ ఉండేది. మరిప్పుడు జర్నలిస్టు తలుచుకుంటే పవర్ ప్రాజెక్టులు, చానల్స్ పెట్టేస్తున్నారు. బీరు బాటిల్ నుంచి పవర్ ప్రాజెక్టుకు తీసుకు వెళ్లడం విలువలు పెంచడమే కదా?’’
అదృష్టం అనేది తలుపు తట్టే సమయాన్ని గ్రహించి తలుపులు తెరిచి ఉంచాలి. ఆ సమయంలో తలుపులు మూసి ఇప్పుడు తలుపులు తెరిస్తే వచ్చేది అదృష్టం కాదు దొంగలు. కాబట్టి ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలనే ఆలోచన మీ మనస్సులో మెదులుతుంది కదా తృంచి వేయండి’’
‘‘లేదు నాకు అలాంటి ఆలోచన ఏమీ రాలేదు’’
‘‘ఐనా అది అందరితో అయ్యే పని కాదు. అలా అయ్యేదుంటే ఎవరూ నీతి మంతులుగా మిగిలిపోరు. చెడిపోకుండా ఉండడం కష్టం, చెడిపోవడం చాలా కష్టం, చెడిపోయి కూడా నైతిక విలువల పాఠాలు చెప్పడం అన్నింటి కన్నా కష్టం. ఓ జర్నలిస్టు నాయకుల వద్ద టీ కూడా తాగడు ఆయనోసారి ఊరవతల పార్టీ సమావేశం జరుగుతుంటే గత్యంతరం లేని పరిస్థితిలో పార్టీ వారి సమావేశంలో భోజనం చేశానని పార్టీ అధ్యక్షునికి కొంత డబ్బు ఎంఓ చేశాడు. ఈ విషయం ఆపార్టీ అధ్యక్షుడే చెప్పాడు. ఆ జర్నలిస్టు ఒక్కసారి కూడా నైతిక విలువల గురించి చెప్పలేదు. కోట్లు, ఇంట్లో వాళ్లకు మెడికల్ సీటు పుణ్యానికి కొట్టేసిన వాళ్లు నైతిక విలువ గురించి అనర్గళంగా ఉపన్యసించేస్తారు.’’


‘‘ఇంత చెప్పిన వాడివి నువ్వు మీ గురువు వద్దనే చేరవచ్చు కదా?’’
‘‘ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. వృత్తి రహస్యాలు తెలుసుకున్నానని గురువు నన్ను రానివ్వడు.’’
‘‘చిన్న సందేహం నువ్వు నీతిగా ఉండమని చెబుతున్నావా? అవినీతికి పాల్పడమని చెబుతున్నావా?’’
‘‘యాక్టర్‌తో రాసలీలల గురించి ప్రపంచానికి తెలిసిన తరువాత కూడా నిత్యానంద స్వామి అంత ధైర్యంగా టీవిలో నైతిక విలువల గురించి బోధించడం, అభిమానులను అలరించడం సామాన్య విషయం కాదు. తమ్ముడిని అరెస్టు చేసిన కేసులో అరెస్టయిన కెఎ పాల్ స్టేషన్‌కు వెళుతూ గాడ్ బ్లెస్ యూ అంటూ పోలీసులను కూడా దీవించడం అందరి వల్ల కాదు’’
‘‘నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు’’
‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మరిన్ని సందేహాలు కలిగిస్తాయి’’

7 కామెంట్‌లు:

  1. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మరిన్ని సందేహాలు కలిగిస్తాయి
    బీరు బాటిల్ నుంచి పవర్ ప్రాజెక్టుకు తీసుకు వెళ్లడం విలువలు పెంచడమే కద
    నిజమేనండి.
    వెధవది కొత్తల్లొ తెలియపోయేఈ రహస్యాలు సగం జీవితం అయిపోయింది ఈ లోపు.

    రిప్లయితొలగించండి
  2. అవునండి రాజేంద్ర ప్రసాద్ గారు కొద్ది మంది మహాను బావులకు మాత్రమే ఉద్యోగం లో చేరగానే జర్నలిస్ట్ జీవితం లో ఆత్మ సంతృప్తి తప్ప , ఆర్ధిక సంతృప్తి ఉండదనే ఆర్ధిక రహస్యం చెబుతారు. మిగిలిన అందరికి మాత్రం వార్తలు ఎలా రాయాలి, ఎలా సేకరించాలి అంటూ జీవితానికి పనికి రాని వి చెబుతారు

    రిప్లయితొలగించండి
  3. ఈ సారి మథనం మరింత Tremendous గా జరిగింది, really ఎంతో లోతు నిండిన ఉదాహరణలను ఇచ్చారు, అనుభవం లోంచి పలికినట్లు.

    వ్యంగ్య రీతిలో సత్యాన్ని గూర్చిన spark తో బుద్ధిని వెలిగించటం,

    హాస్యస్ఫోరకం గా నిజదర్శనం చేయగలగటం

    సందర్భోచితంగా మాత్రమే కాదు సందర్భానికి సరిపడా (తగ్గట్టు) ఉపమానాలు ఉత్సుకతను ఇచ్చాయి.

    ఒక post లో విభిన్న కోణాలను నేను ఎంచి చూస్తున్నానా?
    లేక మీరే చొప్పించి రాశారా అనేది అర్థం కాని ప్రశ్న యే !

    ?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకో ఏమో గారు మీ స్పందనకు ధన్యవాదాలు . మీ ప్రోత్సాహం ఉత్సాహాన్నికలిగించింది . నిజంగా జరిగిన వ్యవహారాలు, వ్యక్తుల పేర్లు ఉదాహరించకుండా రాయాలి . అలా రాసినప్పుడు తెర వెనుక విషయం తెలిసిన వారికి ఇందులోని వ్యంగ్యం అర్థ మవుతుంది. రాద్దామా వద్దా అనుకున్నాను. జర్నలిజం ను అడ్డుగా పెట్టుకొని కోట్లు సంపాదించిన వారే ఇతరులకు విలువల గురించి చెబుతున్నారు .

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. యడ్యురప్ప డైరీలో జర్నలిస్టులకు 17 కోట్లు పంచాడని తెలిసినతరువాత చేస్తున్న పనులుమానుకొని జర్నలిశంలో ఆత్మసంత్రుప్తి వెతుక్కుందామని అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  6. tarakam garu యడ్యురప్ప తాతలు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం