16, మే 2012, బుధవారం

మంత్రాక్షరాలు..............వెన్నుపోటు..లక్షకోట్లు!

శ్రీరాముడంతటి వాడు వాలి ముందు నిలబడి యుద్ధం చేయలేకపోయాడు. వాలి ముందు నిలబడి ఎవరు పోరాడినా అతనిలోని సగం బలం వాలికి జమ అయ్యేది. బహుశా తన ఎదుట నిలబడిన వారిపై శక్తివంతమైన మంత్రమేదో వాలి ఉపయోగించే వారేమో! బహుశా ఎదుటి వ్యక్తిని ఇలా నీరుగారిపోయేట్టు చేసే మంత్రాక్షరం వాలికి తెలుసనే విషయం తెలిసే శ్రీరాముడు చెట్టు చాటు నుంచి యుద్ధం చేశాడు.


అందాల రాముడు సినిమాలో అల్లురామలింగయ్య హడావుడి చేస్తుంటే రాజబాబు తీతా అనగానే నీరుగారిపోతాడు. పట్టపగ్గాలు లేనట్టుగా ఎగిరిపడే అల్లురామలింగయ్య తీతా అని వినిపించగానే గాలి తీసిన బెలున్‌లా మారిపోయే సీన్ సినిమాలో బాగా పండింది. తాను తహసిల్దార్‌ను అంటూ అల్లురామలింగయ్య అధికారం చెలాయిస్తుంటారు, కానీ అతను తీసేసిన తహసిల్దారు అనే విషయం రాజబాబు ఒక్కరికే తెలుసు. తీతా అంటే తీసేసిన తహసిల్దారు అన్న మాట.


మాటల మంత్రాన్ని శత్రువును బలహీనపరచడానికి ఉపయోగించుకోవడం రామాయణం, మహాభారతంలోనూ కనిపిస్తుంది. మహాభారత సంగ్రామంలో ద్రోణాచార్యుడిని ఓడించడం అంత సులభం కాదని పాండవులకు తెలుసు. ఇంకేం ఈ మంత్రానే్న ఆశ్రయించారు. యుద్ధంలో అతని కుమారుడు అశ్వత్థామ మరణించాడు అనే మాట వింటే చాలు నీరుగారిపోతాడని, ధర్మరాజుతో ఆ అబద్ధం చెప్పిస్తారు. అశ్వత్థామ మరణించాడు అని గట్టిగా చెప్పి ఏనుగు అని మెల్లగా చెప్పడంతో ద్రోణుడు నీరుగారిపోతాడు.
ఇక మన నేటి రాజకీయాల్లోకి వస్తే వెన్నుపోటు, లక్ష కోట్లు ఈ రెండు మాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఈ మాట వినిపించని రాజకీయ చర్చ లేదు. ఈ మాట వినిపించని రోజు లేదు. లక్ష కోట్లు అనగానే కళ్లముందు జగన్, వెన్నుపోటు అనగానే బాబు కళ్లముందుంటారు. ఈ రెండు పదాలు రెండు పార్టీలకు పర్యాయ పదాలుగా మారిపోయాయి. వైఎస్‌ఆర్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడే ఫ్యాక్షనిస్టు అనే పదాన్ని ప్రయోగించి ఆయన్ను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారు. ఏ సైకాలజిస్టు సలహానో కానీ ఆ పదాన్ని ఆయన ఒక జోక్‌గా తీసుకుని నవ్వేవారు. తర్వాత ఆ పదం రాజకీయంగా ఎక్కువగా ఉపయోగపడలేదు. ఇప్పుడు లక్ష కోట్లను ఆశ్రయించారు. పిఎన్‌వి ప్రసాద్ అనే టిడిపి నాయకుడు ఒకాయన గంటకు ఎంతో నిమిషానికి ఎంతో లెక్క కట్టి లక్ష కోట్ల లెక్కతేల్చారు. బహుశా ఆయన లక్ష కోట్లకు ఆకర్షితుడైనట్టున్నారు. లెక్క పూర్తయ్యాక ఆయన టిడిపిని వీడి జగన్‌కు నమ్మిన బంటుగా మారారు. ఈ లక్ష కోట్లు ఎలా సంపాదించారో మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజాఆఫ్ కరప్షన్ అంటూ పుస్తకాలు రాస్తే, నేతలు ఢిల్లీలో విడుదల చేశారు. ఇప్పుడాయన జగన్ పార్టీలో చేరేందుకు మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు!


గరీబీ హఠావో అనే ఒక మంత్రాక్షరం కొన్ని దశాబ్దాల పాటు ఇందిరాగాంధీకి కోట్ల ఓట్ల వర్షం కురిపించింది. ఆత్మగౌరవం అనే పంచ్ డైలాగ్ ఎన్టీఆర్‌ను మన రాష్ట్రంలో ఇందిరాగాంధీని మించిన శక్తివంతునిగా మార్చింది. ఆయన అల్లుడి విషయానికి వస్తే వెన్నుపోటు అనే పదం ఒకప్పుడు ఆయన్ని ఒక మంచి నాయకుడిగా నిలబెట్టింది, చివరకు అదే పదం బాబును, బాబు వర్గీయులను నిర్వీర్యులుగా మారుస్తోంది. కాంగ్రెస్ నుంచి అప్పుడే వచ్చిన బాబు ప్రతిభ చూపించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు వ్యవహారం బాబులోని ప్రతిభా పాటవాలను పైకి తీసుకు వచ్చింది. కర్నాటకలో క్యాంపు నడపడం మొదలుకొని, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వరకు వెన్నుపోటుపై అలుపెరగని పోరాటం చేసి ఎన్టీఆర్ మళ్లీ సిఎం కావడంలో కీలక భూమిక పోషించారు. పదేళ్ల తరువాత అదే అనుభవంతో ఆయనే స్వయంగా వెన్నుపోటును నమ్ముకొని అధికారం దక్కించుకున్నారు. బాబుకు పార్టీ పగ్గాలు, అధికారం ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వస్తే, వెన్నుపోటు పదం మాత్రం నాదెండ్ల నుంచి వచ్చింది. ఆ పదానికి అంత కన్నా ముందు ఓనర్ నాదెండ్లనే. కొన్ని పదాలు అత్యంత శక్తివంతగా ఉన్నా వాటి జీవిత కాలం స్వల్పం. లక్ష్మీపార్వతి జమానా నడిచే కాలంలో దుష్టశక్తి అనే పదం చాలా బలంగా వినిపించేది. ఆ పదం ఆమె కొంప ముంచింది. ఆమె రాజకీయ శకం ముగియగానే ఆ పదం జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో లక్షకోట్లు, వెన్నుపోట్ల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది.


వచ్చే ఎన్నికల్లో లక్ష కోట్లు గెలుస్తాయా? వెన్నుపోటు విజయం సాధిస్తుందా? తెలుగు ఓటరును తొలుస్తున్న ప్రశ్న. సమాధానం కావాలంటే రెండేళ్లు ఆగాల్సిందే! ఈలోపు లక్ష కోట్లు, వెన్నుపోట్లు ను సినిమా టైటిల్స్ కోసం రిజిస్టర్ చేయించుకుంటే ఎలా ఉంటుంది

10 కామెంట్‌లు:

  1. ఒకరినొకరు ఎంత effective gaa character assassination చేసుకుంటే అదే వారి వారి పార్టీ విజయానికి తొలి మెట్ట్లు అనుకుంటూ, బురదను చల్లుకోవటం తప్ప ఏంటండి ఇది?
    దుష్టశక్తి భారి నుంచి వెన్నుపోటు పోడిచైనా పార్టీని కాపాడి, సమర్ధవంతంగా పాలించి, ఆ ప్రయాణంలో కొన్ని తప్పులు చేసి అధికారాన్ని పోగొట్టుకున్నాడు సదరు వెన్నుపోటు.
    ఇంక అధికారం నా చేతికొచ్చింది కదా అని ASSEMBLY లో నలుగురూ చూస్తున్నారని కూడా అలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతూ, (Oka bajaaru rowdy laagaa) లక్ష కోట్లు అడ్డం గా దోచేసుకుని, మళ్ళి అధికారం రాగానే, పేట్రేగిపోయిన లక్ష కోట్లు దేవుని బిడ్డ అయిపోయాడు.ఇక ఇంకా రాష్ట్రం లో మిగిలిపోయ్నినవన్నీ దోచుకోవాలని లక్ష కొట్లు వారసుడు రెడీ! అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని వెన్నుపోటూ చెయ్యని ప్రయత్నం లేదు, నగదు స్కీం అని, తెలంగాణ ఇస్తామని, tv ఇస్తామని, ఇలా అర్దం లేని వాగ్దానాలతో వెన్నుపోటు చేస్తున్న విశ్వప్రయత్నం.
    వీరిద్దరి బారి నుంచి జనాలని కాపాడే నాధుడే లేడా?
    మీ Titles రెండూ బాగున్నాయి సినిమాలకు. ముందే register చేసుకోండి. లేకపొతే ఎవరన్నా కొట్టెయ్యగలరు మీ టైటిల్స్. పోస్ట్ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. చంద్రబాబా సమర్ధవంతంగా పాలించింది? జనాలు నవ్వుతారు అని కూడా సిగ్గులేదు. అవినీతికి ,వెన్నుపోటుకి, కుల పక్షపాతానికి ,వేల కొలది రైతుల ఆత్మహత్యలకి కారణమయిన పరిపాలన కూడా ఒక పరిపాలనేనా? అది కూడా ఒక పాలనేనా? AC రూముల్లో కూర్చొని ప్రజల చేత రెండు సార్లు ఎన్నుకోబడిన ముఖ్య మంత్రిని బాజారు రౌడీ అనడం సంస్కారమేనా? డాన్సులేసుకునే వాళ్ళు పార్టీ లు పెడితే ఇలాగే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా అబిప్రాయాన్ని నేను వ్యక్తం చేసాను, మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయండి-అంతే కాని వ్యక్తిగత దూషణలు చెయ్యకండి. నేను అనుకున్నవన్నీ నిజాలు కావాలని లేదు, అందరు నాతో ఎకీభవించాలని లేదు.నేను రాజకీయనాయకుల గురించి కామెంట్ రాసాను. మీరు వ్యక్తిగతం గా AC రూములు , సంస్కారం లేదు, సిగ్గు లేదు అంటూ రాసారు. ఇది సంస్కారమా?

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
  3. అంతా బాగానే ఉంది కానీ , శ్రీరాముడు వాలిని చెట్టు చాటునుండి చంపడానికి కారణం, వాలి ఒక వానరం, అందునా అమిత బల సంపన్నుడని మదంతో ఉన్నాడు,ధర్మం తప్పి ప్రవర్తిస్తున్న వాడు,అందునా.. అది ఒక అడవి జంతువు, కనుక క్షత్రియుడైన రాముడు, ఒక మృగాన్ని ఎలా వేటాడాలో అలా వాలిని సంహరించాడు, కావున, "శ్రీరాముడంతటి వాడు వాలి ముందు నిలబడి యుద్ధం చేయలేకపోయాడు" అని అనడం సరికాదండి, ఒక్కసారి వాల్మీకి రామాయణాన్ని చదవగలరు, లేక చాగంటి వారి ప్రవచనాలని వినండి

    రిప్లయితొలగించండి
  4. శశి గారు ఇక్కడ రామున్ని అవమానించడం నా ఉద్దేశం కాదు .. ఇది వ్యంగ రచన . ఇక్కడ రామారావు కూడా మహా శక్తి సంపన్నుడు బాబు గారు ఆయన్ను నేరుగా ఎదుర్కోలేరు అందుకే వెనక నుంచి ... (ద. హా )

    రిప్లయితొలగించండి
  5. రెండు రెండే ! ఎవరు బెటరో.. తేల్చుకోలేక ప్రత్యాన్మయం కాన రాక ..హతవిదీ ..ఓటరు కి యెంత కష్టం.? తెలంగాణా అన్న కాకపోతిమి..ఆల్టర్నేట్ ఉండేది!!
    మంత్రాక్షరాలు..టైటిల్ సూపర్ మురళీ గారు.

    రిప్లయితొలగించండి
  6. ఎవరి అభిప్రాయాలు వారివి.
    రాజకీయం, కులం, మతం ఎలాంటి విశ్వాసాల పై నైనా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరి అభిప్రాయం వారిష్టం .. అభ్యంతరకర మయిన వాఖ్యలు లేకుండా అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటే సంతోషం

    రిప్లయితొలగించండి
  7. జలతారు వెన్నెల గారు , Truth Seeker garu, శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి గారు వనజవనమాలి గారు , శశి గారు ,స్పందించినందుకు ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం