9, మే 2012, బుధవారం

పాండవులు గెలిచింది కోవర్టులతో ... కౌరవులు ఓడింది కోవర్టులు లేక .. నారదుడే తొలి కోవర్టు

‘‘ఏరా పిల్లలూ! మీరు పెద్దయ్యాక ఏమవుతారు?’’ ఐదవ తరగతి పిల్లలను టీచర్ ప్రశ్నించింది. పిల్లలు ఉత్సాహంగా, ‘‘నేను డాక్టర్‌నవుతా? నేను ఇంజనీర్‌నవుతా?’’ అంటూ పిల్లలు ముద్దు ముద్దుగా చెబుతున్నారు. పింకు గట్టిగా నవ్వాడు. ‘‘సరే పెద్దయ్యాక నువ్వేమవుతావు?’’ అని టీచర్ పింకును అడిగింది. ‘‘కోవర్ట్‌నవుతా టీచర్ అని పింకు గర్వంగా చెప్పాడు. ‘‘వేలెడంత లేవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కోవర్ట్ అంటే తెలుసా? నీకు’’ అని టీచర్ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘తెలుసు టీచర్. రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. అంతా నన్ను బన్ను గ్యాంగ్ వాడినని అనుకుంటారు కదా? కానీ ఇప్పుడు చెబుతున్నాను. నేను బన్ను గ్యాంగ్‌లో ఉండి వాళ్లు మాట్లాడుకునే మాటలను ఎప్పటికప్పుడు ప్రితీష్ గ్యాంగ్‌కు చేరవేస్తాను. ఏనాటికైనా రాష్ట్రంలో నంబర్ వన్ కోవర్టును కావాలనేది నా టార్గెట్ ’’ అని పింకు చెప్పుకొచ్చాడు. బన్ను గ్యాంగ్ విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. క్లాస్ నుంచి బయటకు వచ్చాక, ఏరా మమ్మల్ని నమ్మించి మేం మాట్లాడుకునేవి వాళ్లకు చెబుతావా? అని పింకు చొక్కా పట్టుకున్నాడు. ‘‘ప్రితీష్ వాళ్లు నన్ను నమ్మాలని అందరి ముందు అలా చెప్పాను. నేను మీ కోవర్టునే ప్రామిస్ అని చెప్పాడు. బన్ను వాడి చొక్కా వదిలి సంతోషంగా షేక్‌హాండ్ ఇచ్చాడు. ‘‘నేనేరా కోవర్ట్’’ అని పాట పాడుకుంటూ ..
***


హనుమంతుడికి కూడా తన శక్తి తనకు తెలియదంటారు. కానీ కోవర్టుకు మాత్రం తన శక్తితో పాటు ఎదుటి వాడి బలహీనతలు కూడా తెలుస్తాయి. ఏ కాలంలో నైనా కోవర్టులకు తిరుగులేదు. రాష్ట్ర రాజకీయాల్లో కోవర్టులు పెరిగిపోయారని అంతా ఆశ్చర్యపోతుంటే అసలు ముఖ్యమంత్రే కోవర్టు అని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అందరినీ విస్మయపరిచారు. సినిమాల్లోని సస్పెన్స్ కన్నా ఒక్కోసారి జీవితంలోని సస్పెన్స్ ఎక్కువ విస్మయ పరుస్తుంది.


 మనం హీరో అనుకున్న వ్యక్తి ఏదో సమయంలో కరుడు గట్టిన విలన్ అని తేలవచ్చు. అమ్మాయి ఒడిలో తల పెట్టుకొని ప్రేమ కబుర్లు చెప్పినప్పుడు అచ్చం కమల్ హసన్‌లా కనిపించిన వాడు పెళ్లి మాటెత్తగానే ప్రకాశ్ రాజ్‌లా మారిపోవచ్చు. గుండెపోటు గుమ్మడి ఓ సినిమాలో గుండెలు తీసిన విలన్ అని సినిమా చివర్లో ఎన్టీఆర్ తేల్చేస్తారు. అప్పుడు ఎన్టీఆర్‌తో పాటు మనమూ విస్తుపోతాం. పాత సినిమాల్లో అయితే కనీసం విలన్ ఎవరూ చివర్లోనైనా తెలిసేది. ఇప్పుడు హీరోల వారసులు హీరోలు అని గుర్తించాలి తప్ప సినిమాలో కథను బట్టి ఎవరు హీరోనో? ఎవరు విలనో అస్సలు పోల్చుకోలేం. ఆది నుంచి దమ్ము వరకు జూనియర్ ఎన్టీఆర్ తన ఎదుట కనిపించిన వాడినల్లా తల నరికేస్తున్నాడు. మరప్పుడు అతన్ని మనం విలన్ అనుకోవాలి. అలా అనుకుంటే మీరు పాత కాలం మనుషులని తెలిసిపోతుంది. వందలాది మందిని ఆకారణంగా చంపేస్తేనేం ఆయన ఎన్టీఆర్ మనవడు. హీరో కాకుండా విలన్ ఎలా అవుతాడు. సినిమా కథేంటి అనేది అనవసరం. ఇంతకన్నా ఈజీగా హీరోను గుర్తు పట్టాలంటే మరో మార్గం ఉంది. తెరపైకి ఎవడు రాగానే ఈలల గోలతో అంతా గందరగోళంగా మారుతుందో, కాగితాలు విసిరేస్తారో వాడే హీరో. చిత్తుకాగితాలు ఏరుకునే వారంతా అనాధలు కాదు. వారిలో హీరోల అభిమానులు కూడా ఉంటారు అనే బరువైన డైలాగు ఇక్కడ ఎవరికైనా అవసరం అయితే వాడుకొవచ్చు.


కోవర్టు వృత్తికి మాత్రం మరణం లేదు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కోవర్టుల చరిత్ర లిఖించాల్సిన అవసరం ఉంది. తొలి కోవర్టు ఎవరు? ఇంకెవరు నారదుడు. నారాయణ నారాయణ అంటూ ఆయన అన్ని కాలాల్లోనూ ప్రధాన విలన్లకు అత్యంత సన్నిహితంగా మెదిలే వారు. హిరణ్యకశ్యపుడి చెవిలో మంతనాలు జరుపుతుంటే రాక్షస పక్షపాతి అనిపిస్తుంది. కానీ ఆయన దేవతల కోవర్టు. రాక్షస సంహారం కోసమే ఆయన నిత్యం వారి వెంట ఉండేవాడు. రావణున్ని శ్రీరాముడు వీరోచితంగా వధించాడు అని చెప్పుకుంటాం కానీ దానికి కారణం ఎవరు ఇంకెవరు విభీషణుడు అనే కోవర్టే కారణం కదా? దుర్యోధనుడి సైన్యంలో ఆయుధ సంపత్తి, వీరులు ఎంత మంది ఉన్నా సరైన కోవర్టులు లేక దెబ్బతిన్నాడు. రథం నడిపిన శల్యుడి నుంచి మహాభారత యుద్ధానికి కౌరవులను ప్రేరేపించిన శకుని మామ వరకు అంతా పాండవుల కోవర్టులే కదా? మహాభారతంలో దుర్యోధనుడు కోవర్టులను నమ్ముకున్న దాఖలా లేదు. దుర్యోధనుడు ఓడిపోయింది సైన్యం లేక కాదు కోవర్టులను నమ్ముకోక! 


జానపద సినిమాల్లో ఈ ద్రోహిని బంధించండి అని ముసలి రాజు చెప్పగానే రాజనాల వికట్టహాసం చేస్తాడు సైనికులంతా రాజునే బంధిస్తారు. తన సైన్యమంతా కోవర్టులుగా మారిపోయారని అప్పుడు కానీ ఆ రాజుకు తెలియదు. ఇలాంటి సినిమాలు మన ముఖ్యమంత్రి బాగానే చూసినట్టున్నారు. అందుకే కోవర్టులందరితో పాటు తానూ కోవర్టుగా మారిపోయి తన స్థానం పదిలపరచుకున్నారు. సినిమా హీరో అయినా పాపం ఎన్టీఆర్‌కు ఈ పరిజ్ఞానం లేక దెబ్బతిన్నారు. అల్లుడు గారిని బంధించండి అని హూంకరిస్తే తమ్ముళ్లంతా అన్నగారినే బంధించి అల్లుడికి జై కొట్టారు. అల్లుడిలా మామ కూడా కోవర్టులను ఆశ్రయించి ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండేవో?
నీతి .. కోవర్టు ను నువ్వు రక్షిస్తే .. కోవర్టు నిన్ను రక్షిస్తాడు 

16 కామెంట్‌లు:

 1. *అల్లుడు గారిని బంధించండి అని హూంకరిస్తే తమ్ముళ్లంతా అన్నగారినే బంధించి అల్లుడికి జై కొట్టారు.*

  Excellent.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు . పాపం అన్నగారు

   తొలగించండి
 2. చాలా చాలా బావుంది..!
  నారదుడే ఆదికోవర్టు....! సూపర్..!

  రిప్లయితొలగించండి
 3. చిత్తుకాగితాలు ఏరుకునే వారంతా అనాధలు కాదు. వారిలో హీరోల అభిమానులు కూడా ఉంటారు అనే బరువైన డైలాగు ఇక్కడ ఎవరికైనా అవసరం అయితే వాడుకొవచ్చు.
  నిర్మాతకి బాగా మ్యాచ్ అవుతుంది :)
  అన్న గారిని అర్ధం చేసుకోవడంలోనే తెలుగు తమ్ముళ్ళ ఫెయిల్ అయ్యి..
  ప్చ్ ..ఇప్పుడు వగచి ..లాభం లేదు .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వనజవనమాలి గారు అన్నగారిని వాళ్ళు అర్థం చేసుకోక పోవడం కాదండీ .. అల్లుడితో ఉండడమే లాభ సాటి బేరం అనుకున్నారు

   తొలగించండి
 4. కోవర్టో రక్షితి రక్షితః

  రిప్లయితొలగించండి
 5. హహ
  సూపర్! భలే రాసారండి!
  వినూత్నమైన పోస్ట్!

  రిప్లయితొలగించండి
 6. కోవర్టు మీద ఈ పోస్ట్ చాలా బాగుంది.
  అన్న గారు ముఖ్యమంత్రిగా ఉండడటం కన్నా.. అ పరిస్తితులలో అల్లుడుగారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి అంతో ఇంతో మేలు చేసారు లెండి. నారదడు కోవర్టు అయినా లోక కల్యాణానికి చాలా సార్లు దారి తీసాయి కదా ఆయన మోసిన మాటలు. అందుకని కోవర్టుల వలన లాభమే కాని నష్టాలు ఎక్కువ కనపడుట లేదు.. :))

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జలతారు వెన్నెల గారు మన దేశం పై ముస్లింలు దండయాత్రకు వచ్చినప్పుడు వారికి సహకరించి లోటు పాటులన్నీ వారికి చెప్పింది మన కోవర్టులే.. బ్రిటిష్ వారు వందల ఏళ్ళు మన దేశాన్ని పాలించ గలిగింది కోవర్టుల వల్లనే ...

   తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం