15, ఆగస్టు 2012, బుధవారం

మీకు ఆ వయసొచ్చిందా?... వృద్ధ నారీ పతివ్రత - వృద్ధ హీరో నేటి నేత

బ్యాక్‌గ్రౌండ్‌లో మంత్రోచ్ఛారణలు వినిపిస్తుండగా, డాన్‌గ్రీ తన కుమారుడితో పాటు మెట్లు దిగుతూ అందరికీ స్వాగతం పలికాడు. డాన్‌గ్రీ అంటే అతనెవరో చైనావాడో, జపాన్ వాడో అనుకునేరు. అతని వ్యాపారం అంతర్జాతీయం కానీ అతను మాత్రం పదహారణాల తెలుగు వాడు. అంతా డాన్ గిరి అనిపిలుస్తారు.

 ఒక వ్యక్తికి చదువు, డబ్బు పెరిగినప్పుడు పేరు పొట్టి దవుతుంది. నేర సామ్రాజ్యం విస్తరించుకున్న తర్వాత డాన్ గిరి కాస్తా స్టయల్‌గా డాన్‌గ్రీ అయ్యాడు. కోస్తాంధ్ర, సీమాంధ్ర, రాయలతెలంగాణ, సీమ తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి డాన్‌గ్రీ అనుచర గణం అక్కడికొచ్చింది. దొడ్డు శ్రీశైలం, బక్క శ్రీశైలం, పాత దాసు, సరికొత్త దాసు అంతా వరుసలో నిల్చున్నారు. తన షష్టిపూర్తి సందర్భంగా డాన్‌గ్రీ ఒక సంచలన ప్రకటన చేస్తాడనే సమాచారం ఉండడంతో అంతా వచ్చారు. డాన్ గ్రీ తన కొడుకు భుజంపై చేయి వేసి, ప్రపంచం కుగ్రామంగా మారిపోతోంది. ప్రపంచీకరణ తరువాత అన్ని రంగాల్లో మాదిరిగానే మన రంగంలోనూ మార్పు అనివార్యం అని నేను ముందే గ్రహించాను ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవడానికి మా అబ్బాయిని ప్రపంచ పర్యటనకు పంపాను. హాంకాంగ్ మాఫియా, ఆఫ్రికా నల్లమందు మాఫియా వరకు అంతర్జాతీయ వ్యవహారాలన్నింటిలో మా వాడు తగిన శిక్షణ పొందాడు.

 ఎక్కడి నుంచి వచ్చానో కానీ హైదరాబాద్ అభివృద్ధిలో నావంతు పాత్ర ఉంది. నాకు ప్రాంతీయ విభేదాలు లేవు. నేరం ఎక్కడుంటే అది నా ప్రాంతం అనుకుంటాను అంతే తప్ప సంకుచితంగా ఇది నా ప్రాంతం అది నీ ప్రాంతం అనే ప్రాంతీయ విభేదాలు, కులమతాల పట్టింపులు నాకు లేవు. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. వీధి రౌడీగా ఉన్నప్పుడు తగిలిన కత్తిపోట్లతో శరీరం బాగా అలిసిపోయింది. నా సామ్రాజ్యాన్ని యువరాజుకు అప్పగించి, ఇంత కాలం నన్ను ఆదరించిన ప్రజలకు ఏదో చేయాలనే నిర్ణయించుకున్నాను. నా షష్టిపూర్తి రోజే ఆ నిర్ణయం తీసుకోవాలని మీ అందరినీ పిలిపించాను అని చెప్పసాగాడు. రాష్ట్ర వ్యాప్తంగా డాన్‌గ్రీ ఉప న్యాసాన్ని లైవ్‌గా చూపిస్తున్నారు. అతనికి ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు, జనంలో, మీడియాలో మంచి క్రేజి ఉంది.


అంతర్జాతీయంగా నేర ప్రపంచంపై మంచి అవగాహన ఉన్న మా అబ్బాయి జూనియర్ డాంగ్రీనే మీ నాయకుడు. అని డాన్‌గ్రీ ప్రకటించగానే అంతా యువనేత జూనియర్ డాంగ్రీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. సార్ మీ జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు, ఇప్పుడు మీ అబ్బాయి జీవితాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన మీ త్యాగ జీవితం జాతి జనులకు ఆదర్శనీయం అని సన్నశ్రీశైలం చెమ్మగిల్లిన కనులను తుడుచుకున్నాడు. గుంటూరు బోసు, నెల్లూరు దాసు డాంగ్రీ కాళ్ల మీద పడిపోయారు. డాన్‌గ్రీ గద్గద స్వరంతో మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇంత కాలం నన్ను ఆదరించిన ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. 60 ఏళ్లు దాటిన హీరోలు తమ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలని నిర్ణయించుకున్నట్టుగానే, 60 ఏళ్లు దాటిన రాజకీయ నాయకులంతా రాజకీయాలను వదిలి, మరో రంగానికి వెళ్లి రాజకీయాల్లో మా లాంటి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. 60 ఏళ్లు దాటిన ఖైదీలందరినీ విడుదల చేసి, ఇంత కాలం తమను ఆదరించిన ప్రజలకు ఏదో రకంగా సేవ చేసుకునే అవకాశం వారికి కల్పించాలి. ఏ రంగంలో ఉన్నవారైనా 60 ఏళ్లు దాటిన వారు తమ తమ వృత్తులను వదిలిపెట్టి ప్రజలకు ఏదో మేలు చేయాలని నేను సమాజానికి పిలుపును ఇస్తున్నాను. అని డాన్‌గ్రీ ఆవేశంగా ముగించాడు.


***
లైవ్‌లో డాన్‌గ్రీ ఉపన్యాసం విన్నవాళ్లలో ఊహించని విధంగా స్పందన వచ్చింది ‘‘ లచ్చీ మనకు 60 ఏళ్లు దాటాయంటావా?’’తన బొచ్చేవైపు ఆప్యాయంగా చూస్తూ కోటిగాడు అడిగాడు. ‘‘ఏమో నండి ఈ లక్ష్మీనారాయణ ఆలయం ముందు 40 ఏళ్ల నుండి అడుక్కుంటున్నాం 60 దాటే ఉంటాయి’’ అని లచ్చి తెలిపింది. ‘‘ఈ ఆలయాన్ని చిన్నోడికి, శివాలయాన్ని పెద్దోడికి అప్పగించి మనం కూడా ఇంత కాలం మనను ఆదరించిన ప్రజల కోసం ఏమైనా చేద్దాం’’ అని కోటిగాడు ప్రకటించాడు. రూపాయికి కిలో బెండకాయలు ఇస్తేనే ప్రజలు అధికారం అప్పగించారు. ఒక పూటకు సరిపోయే బెండకాయలిచ్చినందుకు గెలిపించిన వారు జీవిత కాలానికి ఉపయోగపడే పుణ్యాన్ని ఒక్క రూపాయికే ఇచ్చిన మనను కాకుంటే ఇంకెవరిని ఆదరిస్తారు?’’ అని కోటిగాడు ధీమాగా పలికాడు.
***
పెద్దాపురం బేబీ కళ్లు తుడుచుకుంటూ సమాజ ఉద్దరణలో నా వంతు పాత్ర పోషిస్తాను. జూనియర్ బేబీకి బాధ్యతలు అప్పగించి ఇంత కాలం నన్ను ఆదరించిన ప్రజలకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను అని కస్టమర్ల సాక్షిగా ప్రమాణం చేసింది.
***
వా... వా.... అని కామన్‌మెన్ కన్నీళ్లను ఆపుకోలేక గుక్కపట్టి ఏడవ సాగాడు. ఎందుకేడుస్తున్నావు ఏమైంది అంటూ దారిన పోయే దానయ్యలంతా ఆగి అతన్ని ఓదార్చారు. ఈ కామన్ మ్యాన్‌కు ఏదైనా చేయాలని హీరోలు, బేబీలు, డాన్‌గ్రీలు తమ తమ రంగం వదిలిపెట్టి వస్తుంటే ఇవి ఆనందంతో రాల్చిన ఆనంద బాష్పాలు బాబూ ఆనంద భాష్పాలు... అని కామన్‌మెన్ కళ్లు తుడుచుకున్నాడు. ఆ మాటలు దారినపోయే దానయ్యలకు సైతం కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాయి.
ముక్తాయింపు. వృద్ధ నారీ పతివ్రత నాటి సామెత - వృద్ధ హీరో రాజకీయ నేత నేటి సామెత.

6 కామెంట్‌లు:

  1. :) అందరికీ అంటే డాన్ లకి, బిచ్చగాళ్ళకి, పెద్దాపురం బేబీలకి దార్లు బానే ఉన్నాయి.. ఎటొచ్చి కామన్ మెన్ కే ఏదారి కనపడట్లేదు.. ఇప్పుడే కనపడడం లేదంటే ఆ వయసొచ్చాక ఇక గుడ్డివాళ్ళేగా..

    మీరు సూపరండీ బాగా చెప్పారు..

    రిప్లయితొలగించండి
  2. @ kastephaleగారు @ప్రేరణ గారు @కుమ్మెత చంద్రశేఖర్ గారు @రమణి రాచపూడి గారు ధన్యవాదాలు .. ఆ మధ్య ఏదో రాష్ట్రం లో మద్యపాన ప్రియులు ఒక పార్టీ పెట్టారు . మన ఓట్లు మనమే వేసుకుందాం. మన మద్యం పాలసీ మనమే నిర్నయించుకుదాం . అని నినాదం ఇచ్చారు . అందరినీ చూశాక మన ఓట్లు మనమే వేసుకుందాం అని కామన్ మ్యాన్ పార్టీ పెట్టు కుంటాదేమో చూడాలి

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుదండి.ఈ రోజుల్లో పెన్షన్ వస్తున్న ప్రతీవాడూ మహాపండితుడే!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం