17, డిసెంబర్ 2012, సోమవారం

ఎన్టీఆర్‌ను పిండేస్తారా?

చెరుకు రసాన్ని పిండడం ఎప్పుడైనా చూశారా? ఎండా కాలంలో హైదరాబాద్‌లో చెరుకు రసం పిండే బండ్లు చాలానే కనిపిస్తాయి. ఈ రసాన్ని పిండేప్పుడు చూసే వాళ్లు ఇక అయిపోయింది రసం ఏమీ రాదు అది పిప్పి అనుకుంటున్న సమయంలో కూడా బండివాడు మరో రెండు మూడు సార్లు ఆ చెరుకు పిప్పిని యంత్రంలో పెట్టి రసాన్ని పిండేస్తాడు. ఆ పిప్పిలో ఒక్క చుక్క రసం కూడా మిగలలేదు అని తేలేంత వరకు వాడి కృషి ఆగదు. అది వాడి బతుకు పోరాటం.

 కానీ ఇప్పుడు ఎన్టీరామారావు పేరుతో వేరువేరు పార్టీల్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహం పేరుతో చేస్తున్న రాజకీయం చూస్తుంటే చెరుకు రసం పిండడం గుర్తుకొస్తోంది. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎవరు ప్రయత్నిస్తేనేం? ఒక తెలుగు నేత విగ్రహం పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారని సంతోషించాలి. సామాన్యులు చేసేది ఇదే కానీ ఆయన పేరుతో రాజకీయ ప్రయోజనం పొందేవాళ్లు సామాన్యులు కాదు కదా? అందుకే ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం చేస్తూ జనం అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్నారు. పార్టీలు, కులమతాలకతీతంగా ఎన్టీఆర్‌ను ఒక నటునిగా అభిమానించే వారు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. రాజకీయంగా ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు సైతం నటునిగా విపరీతంగా అభిమానిస్తారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా పిసిసి అధ్యక్షుడు మొదలుకొని ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు సైతం మేం ఎన్టీఆర్ అభిమానులం అని చెప్పుకునే వారు.


ఎన్టీఆర్‌ను దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత 1996 ప్రాంతంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి మహానాడులో చంద్రబాబు గురించి వివరిస్తూ ఇంగ్లీష్‌లో ఒక పరిచయ పత్రం విడుదల చేశారు. అందులో చంద్రబాబు మామగా ఎన్టీఆర్‌ను పరిచయం చేశారు. నిజానికి అప్పటి వరకు జాతీయ మీడియాలో సైతం చంద్రబాబుకు ఎన్టీఆర్ అల్లుడిగానే గుర్తింపు ఉండేది. ఆయన చివరి రోజుల్లో, మరణించిన తరువాత కుటుంబం చేతిలో సమస్యల పాలయ్యారు. చివరకు ఆయన మృత దేహం కోసం కూడా కుటుంబ సభ్యులు ఎల్‌బి స్టేడియంలో కీచులాడుకున్నారు. ఎన్టీఆర్ మరణించినప్పుడు ముంబైలో ఉన్న హరికృష్ణ విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేంత వరకు మృతదేహంపై లక్ష్మీపార్వతి వర్గీయులది పై చేయిగా ఉండగా, హరికృష్ణ ఎల్‌బి స్టేడియంకు వస్తూనే కర్ర పట్టుకొని రండిరా ఎవరు వస్తారో అని హూంకరించాక బాబు వర్గం ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ మరణించి రెండు దశాబ్దాలు కావస్తుండగా, మరోసారి ఆయన పేరుతో కుటుంబ సభ్యులు వీధిన పడి కీచులాడుకుంటున్నారు. గాడిద పళ్లు తోమావా? ఏం చేస్తున్నావు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబును ప్రశ్నిస్తే, బాలకృష్ణ అదే ప్రశ్న పురంధ్రీశ్వరికి వేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు క్రెడిట్ తనకు దక్కాలనే ప్రయత్నం కన్నా బాబుకు దక్కవద్దనే ప్రయత్నం పురంధ్రీశ్వరిది. 

ఇక టిడిపి సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీఆర్ బొమ్మను సైతం తీసేయించిన చంద్రబాబు ఇప్పుడు విగ్రహం క్రెడిట్ పురంధ్రీశ్వరికి దక్కితే తన పార్టీకి ఇబ్బంది అనేది ఆయన బాధ. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఇప్పుడు బాబు వైపు కొందరు పురంధ్రీశ్వరి వైపు, కొందరు తటస్థంగా ఉన్నారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఆయన అధికారికంగానే రెండో పెళ్లి చేసుకున్నారు. విగ్రహం విషయంలో భార్యగా తన అభిప్రాయం అవసరం లేదా? అని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీదతమ స్వార్థ రాజకీయాల కోసం ఆయన కుటుంబ సభ్యులే ఆయన్ని బజారుకీడుస్తూ అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నారు.

8 కామెంట్‌లు:

 1. ఎన్టీఆర్ మరణం చుట్టూ ఉన్న మిస్టరీ గురించీ, శవం కొరకు కొట్లాటల గురించీ, చనిపోయిన తరవాత తెలుగుదేశంలో వచ్చిన చీలికల గురించీ సామాన్యులకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యాసంలో మీరు కొన్ని రాశారు. ఇంకా comprehensive గా ఆ చరిత్ర రాస్తే బాగుండేది. వీలైతే, దయచేసి ఇంకో కొత్త టపా రూపంలో రాయగలరు.

  రిప్లయితొలగించు
 2. Avinash గారు ధన్యవాదాలు ఆ వ్యవహారం లో పాలు పంచుకున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొంత వరకు రాశారు .. నిజానికి తెర వెనుక, తెర బయట జరిగినవి ఆయనకు బాగా తెలుసు ..ఆయనా అందులో భాగ స్వామి కావడం వల్ల పూర్తిగా రాయలేదు ... బయటి వారి కన్నా పాత్రా దారులే పశ్చాత్తాపం తో పూర్తి సమాచారం తో రాస్తే బాగుంటుందని నా కోరిక

  రిప్లయితొలగించు
 3. super!! రాజకీయ నాయకులు తమ కడుపుకి తాము అన్నం తిన్నా అందులో కూడా ఏమైనా పొలిటికల్ మైలేజి వస్తుందేమోనని చూస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర లో పడుతున్న పాట్లు తెలియనివి కావు. ప్రతీ విషయం లో నూ అయనకే కీర్తి దక్కాలనే తాపత్రయం ఇప్పటిది కాదు.

  రిప్లయితొలగించు
 4. ఇంకా చెరుకు రసం ఎక్కడిది సార్, హైదరాబాద్ కొబ్బరి బొండాల మయమయిపోయింది!

  ఇక అసలు విషయానికొస్తే ఎన్టీఆర్ బతికినన్నాళ్ళు ఆయన వెన్నంటే ఉన్న డ్రామాబాజీ చనిపోయాక కూడా ఆయనను వదలడం లేదు. అదే చీప్ మెలోడ్రామాలు, అవే వెకిలి వేషాలు, అదే జుగుప్సాకరమయిన భాష :)

  రిప్లయితొలగించు
 5. ////ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా పిసిసి అధ్యక్షుడు మొదలుకొని ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు సైతం మేం ఎన్టీఆర్ అభిమానులం అని చెప్పుకునే వారు.///


  అబ్బో ఇది చెరుకు రసం పిండటం కాదే :) విగ్రం పెట్టిస్తానని, మళ్ళీ వివాదాస్పద ప్రచారం చేసి కాంగ్రెస్ మళ్ళీ పిండింది చెరుకురసం కాదే :)
  ఎవరో దారిన పొయ్యే కాంగ్రెస్ పిండుకొంటుంటే , మన సంగతేంటని తెలుగు దేశం కార్యలర్తలు వాళ్ళ నాయకులని చింతపండు పిండినట్లు పిండేయగలరు , గమనించాలి :)

  కాబట్టి అధ్యక్షా, దోషం తియ్యనైన చెరుకుదే కాని చెరుకురసం ప్రియులది కాదని మనవి :)

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం