19, డిసెంబర్ 2012, బుధవారం

నగదు బదిలీ అను రాజమాత .. యువరాజు , ఇద్దరు రాజకుమారుల కథ

‘‘అమ్మ ఎవరికైనా అమ్మే.. మా అమ్మ నిజంగా అందరికీ అమ్మ. ఎంత గొప్ప ఆలోచన. అమ్మ దేవత కాబట్టే ఇలాంటి ఆలోచన వచ్చింది మనుషులకైతే ఇలాంటి ఆలోచన వచ్చేదా? ’’అని పరాంకుశం కళ్లు తుడుచుకున్నాడు. 

‘‘అమ్మంటే ఎవరనుకున్నావు అమ్మంటే తల్లిరా..’’ అంటూ సూపర్ స్టార్ కృష్ణ స్టైల్‌లో శంకరం జోకాడు. ‘‘నేను సీరియస్‌గా చెబుతుంటే నీకు జోకా?’’ అని పరాంకుశం సీరియస్‌గా ప్రశ్నించాడు.

 ‘‘ఓహో తల్లిదండ్రులను గౌరవించాలని రజనీకాంత్ చెప్పిన మాట నీమీద ఇంతగా ప్రభావం చూపుతుందని అనుకోలేదురా!’’ అంటూ శంకరం సారీ చెప్పాడు. ‘‘రజనీకాంత్‌కేం సంబంధం?’’అని పరాంకుశం అడిగాడు. ‘‘మీ అమ్మను మీ అన్న ఇంటి నుంచి తెచ్చుకోవడానికి అస్సలు ఇష్టపడని నువ్వు మాతృమూర్తి గురించి మాట్లాడుతున్నావంటే రజనీకాంత్ సామాన్యుడు కాదు రా! నీలాం టి పాషాణ హృయదం గల వాడిని కూడా కరిగించాడంటే ’’ అంటూ శంకరం చెప్పుకుపోతూనే ఉంటే. ‘‘ మన మధ్యలో రజనీకాంత్ ఎందుకొచ్చాడు. అయినా అమ్మగొప్పది అంటూ నేను చెప్పింది మా అమ్మ గురించి కాదు సోనియమ్మ గురించి’’ అని పరాంకుశం చెప్పాడు. శంకర్ పిచ్చి చూపులు చూస్తుండడంతో ‘‘ఔను రా! నేను చెప్పింది సోనియమ్మ గురించి.. నగదు బదిలీ పథకం ఎంత అద్భుతమైంది. దీంతో దేశంలోని పేదరికం మొత్తం సమసిపోతుంది. అంబానీ ఖాతా అప్పలరాజు ఖాతా ఒకటే అవుతుంది. దేశంలోని ఖజానా నుంచి ఎవరి ఖాతాలోకి ఎంత అవసరం పడితే అంత నేరుగా జమ అవుతుంది. ఇంత గొప్ప పథకం తెచ్చిన సోనియాగాంధీ మునిమనవడిని కూడా మనను పాలించేంత వరకు వదిలిపెట్టేది లేదు’’ అని పరాంకుశం చెప్పాడు.


‘‘పిచ్చోడా! నగదు బదిలీ గురించి నువ్వు మరీ అతిగా ఊహిస్తున్నట్టుగా ఉంది. అయినా అమ్మ కన్నా ముందు మా యువరాజుకొచ్చిన ఐడియా కదా ఇది!’’అని శంకరం పలికాడు.


వీరి మాటలు వింటున్న కుటుంబరావు ‘‘రాజమాత కాదు... యువరాజు కాదు అసలు నగదు పుట్టుకతోనే నగదు బదిలీ పథకం అమలు జరుగుతూనే ఉంది. మనిషి జీవితంలో ఏ దశలో ఈ పథకం అమలు జరగడం లేదో చెప్పండి చూద్దాం అని చిలిపిగా నవ్వాడు.
పుట్టేముందు అస్పత్రిలో పోయాక స్మశాన వాటికలో సైతం నగదు బదిలీ వెంటాడుతూనే ఉంటుంది. బుడ్డోడిగా బొడ్డూడి భూమిపైకి వచ్చినప్పటి నుంచి కపాలమోక్షంతో పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు మనిషి జీవితంతో నగదు బదిలీ ముడిపడి ఉంది. నాన్న చేతిలో నుంచి నర్సు చేతిలోకి నగదు బదిలీ తరువాతే అమ్మ కడుపులో నుంచి శిశువు బయటకు వస్తుంది. నేతాశ్రీలైనా, ఓటరు శ్రీలైనా పుట్టినప్పుడు జరిగేది ఇదే! అంతేనా చివరకు పెళ్లి పేరుతో ఇద్దరు ఒకటి కావాలంటే కూడా ముందు నగదు బదిలీ జరగాల్సిందే. వేల సంవత్సరాల్లో సంస్కృతి సంప్రదాయాలు మారుతున్నాయి కానీ మారనిది నగదు బదిలీ ఒక్కటే. పూర్వం కన్యాశుల్కం పేరుతో వరుడి తరఫు వారు అమ్మాయి తరఫు వారికి నగదు బదిలీ చేశాక పెళ్లి జరిగేది. కన్యాశుల్కం పేరుతో అమ్మాయిలను అమ్ముకుంటారా? అంటూ ఎంతో మంది సంఘ సంస్కర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఉద్యమం ఫలించి, పుష్పించి వరుడి తరఫు వారు వధువుకు నగదు బదిలీ చేయడానికి బదులు వధువు తరఫు వారు వరుడికి నగదు బదిలీ చేసే సంస్కృతి మొదలైంది. అంటే ఇప్పుడు టీనోపాల్ యొక్క కొత్త పేరు రాణిపాల్ అని చెప్పుకున్నట్టు కన్యాశుల్కం పేరు వరకట్నంగా మారింది. 


హీరోకో, హీరోయిన్‌కు కష్టం వచ్చినప్పుడు ప్రకృతి స్తంభిస్తుంది అది సినిమా ధర్మం. నిజజీవితంలో మాత్రం నగదు బదిలీ లేకపోతే ప్రకృతి స్తంభించిపోతుంది. అనుమానం ఉంటే ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్లి నగదు బదిలీ లేకుం డా పని చేయించుకురా చూద్దాం. రిటైర్ అయ్యాక నువ్వు బతికున్నట్టుగా నీకు సర్ట్ఫికెట్ కావాలన్నా నగదు బదిలీ అమలు చేయాల్సిందే. లేకపోతే నీవు చాలా కాలం క్రితమే పోయావని నీ చేతిలోనే డెత్ సర్ట్ఫికెట్ పెట్టేస్తారు. బాబోయ్ నేను పోలేదు నిక్షేపంగా బతికే ఉన్నానని నువ్వు చెప్పినా నమ్మరు ఎందుకంటే ఇక్కడ సర్ట్ఫికెట్ ముఖ్యం కానీ మనిషి కాదు. అందుకే బాబ్బాబు నేను బతికే ఉన్నానని ఒక సర్ట్ఫికెట్ ఇవ్వవూ అంటూ రిటైర్ అయిన వాళ్లు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి నగదు బదిలీ పథకం అమలు చేస్తుంటారు. మనిషి బతికున్నంత వరకు నగదు బదిలీ వెంటాడుతూనే ఉంటుంది పోయాక, మన తరఫు వాళ్లు మన తరఫున నగదు బదిలీ చేయకపోతే స్మశానంలోకి ఎంట్రీ కూడా దక్కదు. మానవ సంబంధాలన్నీ నగదు బదిలీలే ’’ అని కుటుంబ రావు ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘అంటే నగదు బదిలీతో రాజమాత పార్టీ ఈసారి జయకేతనం ఎగురవేయడం ఖాయమా?’’ అని పరాంకుశం సంబరపడ్డాడు. 

పిచ్చోడా! మొన్నటి ఎన్నికల్లో తెలుగు బాబు కంప్యూటర్‌లో లెక్కలేసి ఆరోగ్యశ్రీ అంటే ఏటా 800 రూపాయల నగదు బదిలీనే కదా! మాకు అధికారం అప్పగించండి నెలకు రెండువేల నగదు బదిలీ చేస్తాం అన్నాడు. ఏమైంది. నమ్మకమైన నగదు బదిలీనే జనం నమ్ముకున్నారు. అన్ని పార్టీలు నగదు బదిలీని ఎప్పటి నుంచో అమలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం వాళ్లు మీడియా కోసం దాడులు చేస్తూ చిన్నా చితక నోట్ల కట్టలను పట్టుకుంటారు. సీజన్ ప్రారంభం అయ్యాక కూడా మన దేశంలో రైతులకు విత్తనాలు, ఎరువులు దొరకవు. కానీ ఎన్నికల సీజన్ ప్రారంభం కావడానికి ముందే నగదు బదిలీ కోసం నోట్ల పంపిణీ జరిగిపోతుంది. అందరికీ వాహనాలున్నాయి, అందరి వద్ద నగదు ఉంది. అదే అసలు చిక్కు. కాబట్టి ఎన్నికల్లో నగదు బదిలీతో పాటు ఇంకా ఏదో పని చేస్తుంది. అదేమిటనేదే రాజకీయ రహస్యం’’ అని కుటుంబ రావు మళ్లీ నవ్వాడు.

నగదు బదిలితో వోటరు ఎవరి మెడలో అధికార మాల వేయనున్నారు ?
దేశమంతా నగదు బదిలిఅమలు చేస్తున్న రాజమాతను  కరుణించి యువరాజుకు పట్టం కడతారా ?  జైలులు ఉన్న పెద్ద రాజు  గారి  రాజ కుమారుడి కోరిక తీరుస్తారా? మా నాన్న  తరువాత నేను అని క్యూ లో ఉన్న తెలుగు బాబు రాజకుమారుడి ఆశ నేరవేరుస్తారా ?  ఆమ్ ఆద్మీ మనుసులో ఏముందో ? 
కాలమే సమాధానం చెప్పాలి .

6 కామెంట్‌లు:

 1. వీరెవరు కాదండీ! జైల్లో ఉన్నాడు మా ఉద్ధారకుడు. నగదు బదిలీ అక్కడినుంచేనండి ఈ సారి, తప్పదండి.

  రిప్లయితొలగించు
 2. అవునండి కష్టే ఫలి గారు అలానే అనిపిస్తోంది కానీ ఏడాదిన్నర సమయం ఉంది.ఏ నిమిషానికి ఏమి జరుగునో .....

  రిప్లయితొలగించు
 3. చాల కరెక్ట్ గా చెప్పారండి.... నగదు బదిలీ లేనిదే ఇక్కడ బ్రతకలేం ... అందుకీ అందరు దాన్నే నమ్ముకున్నారు....

  రిప్లయితొలగించు
 4. కామెంటు పెట్టడానికి కూడా నగదు బదిలీలు జరుగుతున్నాయా?
  నా దాకా ఇంకా రాలేదు.ధర్మ ప్రభువులు దయ చూడాల......దహా.

  రిప్లయితొలగించు
 5. బులుసుసుబ్రహ్మణ్యం గారు ఇంకా ఇక్కడ నగదు అమలులోకి రాలేదు .. ఇంకా బార్టర్ సిస్టమే కొనసాగుతుంది .... అంటే ఇస్తినమ్మా వాయనం .. పుచ్చుకుంటి వాయనం (ద. హా )

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం