26, డిసెంబర్ 2012, బుధవారం

ఏడ్చి సాధిద్దాం రా!

అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి సగం తెలుసుకున్నాడట! సగం కాదు ఇప్పటి పిల్లలు శిశువులుగానే ఎన్నో తెలుసుకుంటున్నారు. ఏడవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఈ మధ్య పాశ్చాత్య శాస్తవ్రేత్తలు కనిపెట్టేశారు. వాళ్లకీ విషయం ఇప్పుడు తెలిసిందేమో కానీ మన పిల్లలకు ఇది పుట్టగానే తెలుసు. ఏడ్చి సాధించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. మనిషి పుట్టగానే గురువు లేకుండా తల్లి ఒడిలోనే నేర్చుకునే తొలి విద్య ఏడుపే. తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే ఈ కళను ప్రదర్శించకపోతే డాక్టర్లు కూడా ఆందోళన పడతారు. ఆ తరువాత కూడా ఏం కావలసినా ఏడ్చి సాధించుకోవచ్చునని పిల్లలు పదే పదే నిరూపిస్తూనే ఉంటారు.
ఓసారి దగ్గరి బంధువు ఎవరో చనిపోతే రేలంగి అంతిమ యాత్రలో పాల్గొని ఏడుపు ఆపుకోలేకపోయారట! ఆయన ఏడుపు చూసి రేలంగి భలే నటిస్తున్నాడు అంటూ దారిలో ఉన్నవాళ్లు అనుకోవడం వినిపించిందని ఒక సందర్భంలో రేలంగి ప్రస్తావించారు. హాస్యనటుల ఏడుపు కూడా నవ్వులాటగానే ఉంటుందని ఆయన ఆవేదన చెందారు. రేలంగి కాలంలో హాస్యనటులకే పరిస్థితి అలా ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం నటులు, నాయకులది అదే పరిస్థితి. ఈ మధ్య ఒక నాయకుడు బీడికార్మికుల కష్టాలు చూసి మీరు ఒక్కో బీడీ చుట్టడానికి ఇంత కష్టపడతారా? అని కెమెరాల సాక్షిగా, మీడియా సమక్షంలో ఏడ్చేశారు. ఎవరు అధికారంలో ఉన్నప్పుడైనా బీడీలను చేతితోనే చుడతారు, వారి కష్టాలు అలానే ఉంటాయి కదా? మరి ఏడుపు ఎందుకు? అని ప్రశ్నిస్తే, ఎవరి గోలవారిది, ఎవరి ఏడుపు వారిది మీకెందుకు అని అని కొందరు సెలవిచ్చారు.
కలర్స్ చానల్స్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌లో ఒక నటి పదే పదే ఏడుస్తుంటే బిగ్‌బాస్ బాలివుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ మీ ఏడుపు నిజమైన ఏడుపా? నటనలో భాగమా? అని ప్రశ్నించేశారు. నిజానికి ఈ ప్రశ్న ఆమెకు ఏడుపు తెప్పించాలి కానీ తమాయించుకుని ఏడుపు నిజమే అని నవ్వుముఖం పెట్టి చెప్పింది.
ఏడుపు అంటే నాకు గిట్టదు ఎపుడూ నవ్వుతూ ఉండాలి అంటూ నలుపుతెలుపు సినిమాలో హీరో హీరోయిన్‌కు పాటతో షరతు విధిస్తాడు. పాట వింటే నవ్వుతూ ఉండడం అంటే హీరోకు ఎంత ఇష్టమో అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏమంటే ఏడుపుతో ఎంతటి హీరోలనైనా జీరోలను చేయవచ్చు అనే విషయం అతనికి తెలుసు అందుకే మురిపెంగానే పాడుతూ ఏడుపు వద్దంటాడు.


మా కాలంలో అయితేనా అంటూ కుటుంబరావులు తమ అనుభవాలు చెబుతుంటారు. మా కాలంలో భార్యలు ఏడ్చి సాధించేవారు, ఈ కాలంలో ఏడిపించి సాధిస్తున్నారని వాపోయాడు. ఏడ్చే పాత్ర మారింది కానీ ఏడుపు శక్తి మాత్రం తగ్గలేదన్నమాట! నిజజీవితంలో భర్తయినా, భార్యయినా పెళ్లి తరువాత ఏడిస్తే ఇప్పుడు హీరోయిన్లు మాత్రం సినిమాల్లో పెళ్లికి ముందే ఏడ్చేస్తున్నారు. జీడిపాకం కోసం పిల్లాడు ఏడ్చినట్టుగా నన్ను ప్రేమించు ప్రేమించు అంటూ హీరో కోసం హీరోయిన్ ఏడ్చేస్తోంది.


ఏడుపు ఎంత శక్తివంతమైందో కనిపెట్టిన తొలి పురాణ మహిళ కైకేయి. శ్రీరాముడి పట్ట్భాషేకానికి ఆయోధ్య నగరం ముస్తాయి అయిన సమయంలో ఏడుపు అనే ఆయుధంతో కైకేయి అంతా తలక్రిందులు చేయగలిగింది. ధశరథుడు గతంలో ఇచ్చిన వరాలు గుర్తు చేస్తే, సరే కోరుకో అంటే ఆమె చెప్పిన వరాల జాబితా విని థశరథునికి దిమ్మతిరిగి పోతుంది. శ్రీరాముడిని 14 ఏళ్ల పాటు వనవాసానికి పంపి, తన కుమారుడు భరతునికి పట్ట్భాషేకం చేయాలంటుంది. చివరకు ఆమె ఏడుపు అనే అస్త్రాన్ని ప్రయోగించే సరికి ఆమె డిమాండ్లను అంగీకరించక తప్పలేదు. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం అంటూ రకరకాల శక్తివంతమైన ఆయుధాల గురించి రామాయణం, మహాభారతం, పురాణాల్లో చెప్పారు కానీ నిజానికి వీటికన్నా శక్తివంతమైన ఆయుధం ఏడుపే. పురాణాల్లోని శక్తివంతమైన ఆయుధాలన్నీ శత్రువును దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కానీ ఏడుపును మాత్రం సొంత మనుషులపై ప్రయోగించి కోరుకున్నది సాధించుకోవచ్చు.


నవ్వుల్లో అనేక రకాలున్నట్టే ఏడుపులోనూ అనేక రకాలుంటాయి. కొన్ని ఏడుపులు కనిపిస్తాయి కొన్ని ఏడుపులు అస్సలు కనిపించవు. ఎదుటి వాడికి ఆధికారం ఉంది నాకు లేదు అనేది ప్రతిపక్షం ఏడుపు. అధికారంలో ఉన్న నన్ను చూసి ఓర్వలేక దించేయాలని చూస్తున్నారనేది అధికారిక ఏడుపు. రాజకీయాల్లో ఏడుపులు, ఓదార్పులు సర్వసాధారణం. కొందరు నవ్వలేక ఏడుస్తుంటే, మరి కొందరు ఏడ్వలేక నవ్వుతుంటారు. ఈ రెండింటిలో ఏదో ఒక రూపంలో ఏడుపు ఉంటుంది.


ఆ రోజుల్లో సినిమాల్లో రాజబాబు, రమాప్రభ కళ్ల నుంచి నీరుకారేంతగా నవ్వాల్సిందే. ఇక శారద ఉంటే సినిమాలోనే కాదు ఇంటికొచ్చి సినిమా కథ తలుచుకుని కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. ఆ రోజుల్లో శారద చాలెంజ్ చేయలేదు కానీ శారద నటించిన శారద సినిమా చూసి మనసులోనైనా ఎడవని వారు లేరు. నవ్వించిన రాజబాబు, రమాప్రభల పరిస్థితి చివరకు అభిమానులను ఏడిపించే విధంగా మారింది. రమాప్రభ ప్రస్తుత పరిస్థితి అభిమానులను ఏడిపించే విధంగా ఉంది. ఇక ఏడుపు నటనతో శిఖరాగ్రాలకు చేరుకున్న ఊర్వశి శారద రాజకీయాల్లో చేరి ఎంపిగా ఎదిగి, మంచి స్థితిలో నిలిచారు. నవ్వించిన నటి పరిస్థితి ఏడిపించే విధంగా, ఏడిపించిన నటి పరిస్థితి సంతోషించే విధంగా ఉండడం కాల మహిమ.
నాయకుల ఏడుపునకు కరిగిపోయి అధికారం అప్పగిస్తే, ఐదేళ్లపాటు ఏడిపించి కక్ష తీర్చుకుంటారు అందుకే నాయకుల ఏడుపు పట్టించుకోవడం లేదని జనం అంటున్నారు.

4 కామెంట్‌లు:

 1. "కొందరు నవ్వలేక ఏడుస్తుంటే, మరి కొందరు ఏడ్వలేక నవ్వుతుంటారు. ఈ రెండింటిలో ఏదో ఒక రూపంలో ఏడుపు ఉంటుంది."


  నిజం గుర్తు చేసారు బాగుందండీ.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వనజ వనమాలి గారు ధన్యవాదాలు ... ఎక్కువ మది జీవితం ఇదే అనుకుంటా

   తొలగించు
 2. ఏడ్పుతో భలే నవ్వించారు!
  ద్రౌపది ఏడ్పుతో కురుక్షేత్రం, కైకేయి ఏడ్పుతో రామాయణం!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. స్పందన గారు బాగుంది మీ స్పందన.. ఈ పాయింట్ తట్టలేదు .. రెండు ఏడ్పులు రెండు పురాణాలూ అయ్యాయి

   తొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం