12, ఫిబ్రవరి 2013, మంగళవారం

ద్వాపర యుగం అర్జునుడు .. కలియుగం అర్జున్ .. ఒక పిట్ట కన్ను


అర్జున్ -- కహానీ2

 



 అర్జు నా.. నీకేం కనిపిస్తుంది! అని ద్రోణుడు అడిగినప్పుడు, పిట్ట కన్ను తప్ప తనకేమీ కనిపించడం లేదని సమాధానమిచ్చాడు ద్వాపరయుగం నాటి అర్జునుడు. ప్రస్తుత కాలపు అర్జున్‌ను అతని మాస్టర్ ఇదే ప్రశ్న అడిగితే, సమాధానమేమీ చెప్పకపోయే వాడు. కారణం -ప్రశ్నలు కూడా వినిపించుకోలేనంతగా పనిలో లీనమవుతాడు. మన కథలో -అర్జున్ తీరు మొదటి నుంచీ అంతే. చదువు పూర్తికాగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లక్ష్యం తప్ప అతనికేమీ పట్టదు. పట్టించుకోడు... పట్టించుకోవాలనే ఆసక్తీ ఉండదు. తన బృందంలో అర్జున్ ఉండటం అదృష్టమని బృంద నాయకుడు చాలాసార్లు స్వయంగా అర్జున్‌తోనే చెప్పాడు. ఆ మాట అర్జున్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఉత్సాహం అతనికి అప్పగించిన పనిలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఆఫీసులో వాతావరణం ఉత్సాహంగా ఉంది.

కంపెనీకి నాలుగు ప్రాజెక్టులు వస్తేనే కళకళలాడుతుంది. ఉద్యోగుల పరిస్థితి బాగుంటుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేసినందుకు యాజమాన్యం కొందరికి ప్రమోషన్లు ఇచ్చింది. ఆ ప్రాజెక్టులో కీలక పాత్ర తనదే. జాబితాలో తొలి పేరు తనదే ఉండి తీరుతుంది అనుకున్న అర్జున్‌కు -మేనేజిమెంట్ నిర్ణయం ప్రకటించిన తరువాత అసలేం జరిగిందో అర్థం కాలేదు. బృంద నాయకుడిని యాజమాన్యం ఆకాశానికెత్తేసింది. తన పేరును ప్రస్తావించే వారే లేరు. ఎక్కడో పొరపాటు జరిగిందని అనుకున్నాడు అర్జున్. కాదు మోసం జరిగిందని గ్రహించాడు. మనసు అసంతృప్తితో రగిలిపోతోంది. కానీ ఎవరికీ చెప్పలేదు. విషయం తెలిసిన సీనియర్ ఒకరు భుజంపై చేయి వేసి పద.. క్యాంటిన్ వరకూ వెళ్లొద్దామని ఆప్యాయంగా పిలిచాడు. ఏమీ మాట్లడకుండా సీనియర్ వెంటే క్యాంటిన్‌కు వెళ్లాడు. అర్జునుడు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పే  కథ చిన్నప్పుడు  విన్నావా ? అని సీనియర్ ప్రశ్నిస్తే, వినడమే కాదు ఆ కథ నాపై తీవ్రమైన ప్రభావం చూపింది. లక్ష్యాన్ని తప్ప దేన్నీ పట్టించుకోవద్దనే జీవిత పాఠం నేర్పిన కథ అది అని అర్జున్ సమాధానమిచ్చాడు. అయినా అసందర్భంగా ఇప్పుడా విషయం ఎందుకు? అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు. 

అర్జున్ మనసు భావాన్ని అర్థం చేసుకున్న సీనియర్ ఈ విధంగా హితోపదేశం చేశాడు.  అర్జునుడు  పిట్ట కన్నుపై మాత్రమే గురిపెట్టి చుట్టుపక్కల ఉన్న దుర్యోధన బృందాన్ని పట్టించుకోలేదు. ద్వాపరకాలం కాబట్టి   దాని వల్ల అతనికి ఇబ్బందేమీ కలగలేదు .  కానీ ఇది కలికాలం. పిట్ట కన్నుపై మాత్రమే గురిపెడితే సరిపోదు. నువ్వు బాణం వేసేప్పుడు నీకాళ్ల కింద గొయ్యి తవ్వే వాళ్లు ఉంటారు.  పని చేస్తున్నది తానే అని నీ  విషయం   నువ్వే  చెప్పుకోవాలి. లేదంటే ఏ దుర్యోధనుడో దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఎవరికి వారే మార్కెటింగ్ చేసుకునే కలికాలమిది అన్నాడు సీనియర్
.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం